విశ్లేషణ
సుమారు ఆరు దశాబ్దాల పాటు అవిచ్ఛి న్నంగా సాగిన ద్రవిడ పార్టీల రాజకీయ పరంపరను భంగపరచటం వరకు విజయ్ ప్రతిభ, ప్రభావం కనిపిస్తున్నవే. భవిష్యత్తు వైపు చూసినపుడు ఒక ప్రశ్న ముందుకు వస్తున్నది. తమిళనాడులో సమ సమాజ భావనలు, సంక్షేమ రాజ్య భావనలు దేశ స్వాతంత్య్రానికన్నా ముప్పయి సంవత్సరాల ముందు నుంచే వ్యవస్థీకృత రూపంలో ఏర్పడ్డాయి. అవి కొనసాగుతూనే బలమైన తమిళ జాతీయవాదం కూడా ఇంచుమించు అప్పటినుంచే రూపు తీసుకుంది. ఈ నేపథ్యంలో అధికారం స్వీకరించిన విజయ్– సమ సమాజం, సంక్షేమం, తమిళ జాతీయవాదం అనే మూడు అంశాలలో చూపగల తేడా ఏమైనా ఉండవచ్చునా?
సారాంశంలో ద్రవిడవాదమే!
ఇందుకు సమాధానం విజయ్ నాయకత్వాన తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పాలనలో మాత్రమే లభించగలదని వేరే చెప్పనక్కర లేదు. తమిళ సమాజంలో ఈ భావనలు విడదీయలేని అంశాలు. క్రీస్తు పూర్వం నుంచి గల తమ భాషా సాహిత్యాలు, మధ్య యుగాల నాటి వైభవోపేత రాజ్యాలు, వాటి పాలనలు అందుకు తోడై తమిళ జాతి, సంస్కృతులను తీర్చిదిద్దాయి. స్వాతంత్య్రానంతరం రాజకీయ క్రమంలో ద్రవిడ పదం వాడుకలోకి వచ్చి, ఉత్తరాది అనే ఒక ‘ప్రత్యర్థి’ని సృష్టించి ధిక్కారంగా నిలిచింది. ఇపుడు విజయ్ పార్టీ పేరును, చెదురుమదురు వ్యాఖ్యలను, పార్టీ మేనిఫెస్టోను, 10వ తేదీన ప్రమాణ స్వీకారం సందర్భంగా కనిపించిన దానిని బట్టి, గతంకన్న తేడాలు ఏమైనా ఉన్నాయనిపిస్తున్నదా? డీఎంకే, అన్నాడీఎంకే అనే రెండు ‘ద్రవిడ’ పార్టీలు ఓడినందున, ద్రవిడ వాదం ఇక ముగిసిపోయిందని, విజయ్ ఆ వాదనకు ముగింపు పలికారనే వ్యాఖ్యలు వెంటనే మొదలయ్యాయి. అవి తొందరపాటు మాటలనాలి. విజయ్ పార్టీ పేరులో ద్రవిడ అనే పదం లేకున్నా తమిళ అనే పదం ఉంది. అక్కడి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రపంచంలో ద్రవిడ–తమిళ పర్యాయ భావనలు. ఒకటి లేక రెండవ దాని మనుగడ లేదు.
ద్రవిడ వాదానికి ప్రాణప్రదమైన అంశాలు వేటినీ విజయ్ వదలలేదు. తన ఆరాధ్యులలో పెరియార్ రామస్వామిని చేర్చారు. ద్రవిడ భావజాలంలో సమసమాజం, సంక్షేమం మొదటి నుంచి ఉన్నవి గనుక, అందుకు స్వాతంత్య్రానంతర కాలంలో ప్రధాన ప్రతి నిధి అయిన అంబేడ్కర్‌ను స్వీకరించారు. తమ చరిత్రలో సమాజం కోసం పాటుపడిన ఇద్దరు మహిళలు వేలు నాచ్చియార్, అంజలై అమ్మాళ్‌లను ప్రముఖంగా నిలిపారు. దీనంతటి అర్థమేమిటో వేరే చెప్పనక్కర లేదు. పైగా, సంక్షేమ సంబంధమైన పలు అంశాలను మేనిఫెస్టోలో చేర్చిన ఆయన, ఆ విషయాలలో ‘ఎంత మాత్రం రాజీ పడబో’మని ప్రమాణ స్వీకార సందర్భంగా ప్రకటించారు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఆకలిదప్పుల బాధ తెలుసునని ముక్తాయించారు. సారాంశంలో ఇదంతా ద్రవిడవాదమే.
సుపరిపాలన అందేనా?
ఇది చాలదనుకుంటే, పెరియార్ రాజకీయ వైఖరిని, ద్రవిడ వాద రాజకీయ సంప్రదాయాన్ని విజయ్ స్పష్టంగానే కొనసాగిస్తు న్నారనుకోవాలి. నిజానికి డీఎంకే లోగడ (1999–2003) కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ భాగస్వామి కాగా, అన్నాడీఎంకే గురించి చెప్ప నక్కర లేదు. విజయ్ రాగల కాలంలో ఏమి చేసేదీ చెప్పలేముగానీ, ప్రచార సమయంలో మాత్రం బీజేపీ తన ‘సైద్ధాంతిక ప్రత్యర్థి’ అని ప్రకటించారు. సెక్యులరిజ విధానాన్ని నొక్కి చెప్పారు. ఇదంతా ఆధునిక పరిస్థితులకు వర్తించే పెరియారిజమే అవుతుంది. తన ప్రభుత్వం బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతుపై ఆధారపడి ఉన్నందుకు మాత్రమే విజయ్ ఇట్లా మాట్లాడుతున్నారనలేము. ఆయన మౌలిక విధానమే అదయినట్లు ఎన్నికల ప్రచారంలోనేగాక, రెండేళ్ల ముందు పార్టీని స్థాపించినప్పటినుంచే అర్థమైంది.
పరిపాలనకు సంబంధించి విజయ్ చేసిన సూత్రీకరణలు
రెండున్నాయి. ఒకటి సమర్థమైన సుపరిపాలన, రెండు అన్ని వర్గాలకు మేలు కలిగే సంక్షేమం. ఈ రెండూ ద్రవిడ పార్టీల విధానాలలో ఉన్నవే. ఆచరణకు వచ్చే సరికి సుపరిపాలన క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. అవినీతి పెచ్చు పెరిగింది. డీఎంకే అయినా, అన్నాడీఎంకే అయినా. అన్ని వర్గాల మేలన్నది దళితులకు అంతగా వర్తించలేదన్న విమర్శ చాలా కాలం నుంచే ఉంది. విడుదలై చిరుతగళ్ కచ్చి (వీసీకే) కొంత కాలంగా డీఎంకే కూటమిలో ఉన్నా, ఇపుడు విజ య్‌కు మద్దతు ప్రకటించినా ఆ పార్టీ మూలాలు ఈ విమర్శలోనే ఉన్నాయి. అటువంటి వివక్ష తమ పాలనలో ఉండబోదన్నది కొత్త ముఖ్యమంత్రి ఇస్తున్న హామీ. ఈ వివక్షల మూలాలు తమిళ గ్రామీణ వ్యవసాయిక వ్యవస్థలో, కుల వ్యవస్థలో ఉన్నందున, ఈ సమస్యను గ్రామీణ నిర్మాణాలలో గానీ, పట్టణాలు కేంద్రంగా నడిచే ఆధునిక ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ వ్యవస్థలలో గానీ విజయ్ ఏ విధంగా సరిదిద్దవచ్చునన్నది ఆయన శ్రద్ధపై, చతురతపై ఆధార పడుతుంది.
అసలు సవాళ్లు హామీలే!
సుపరిపాలనకు గత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్‌ను (1954–63) విజయ్ చూపటంలో ధైర్యం ఉంది. ప్రశంసించదగ్గదే గానీ, ద్రవిడ ఉద్యమం అట్లుండగా సంక్షేమ విధానాలకు పేరుబడిన అణ్ణాదురైను ముందుకు తేకపోవటం ఆశ్చర్యకరం. పార్టీ ఏదైనా కామరాజ్ వలెనే అణ్ణాదురై తమిళనాడు చరిత్రలో మార్గదర్శ కుడయ్యారు. అక్కడ ఫెడరలిజాన్ని స్థిరపరచి దీర్ఘకాలికం చేసింది కూడా ఆయనే. ప్రగతిశీలం కాదనుకున్న అంశాలపై తన గురువు పెరియార్‌తో విభేదించి సాగారు. తర్వాత డీఎంకే చీలి అన్నాడీఎంకే ఏర్పడినా రెండు పార్టీలకూ ఆరాధ్యుడయ్యారన్నది విజయ్‌కు తెలియదనుకోలేము.
మౌలిక సూత్రాలపై, సిద్ధాంతాలపై ఎంతమాత్రం రాజీపడబోనని, రాజకీయాల మౌలిక బలమే అదని ఆలోచింపజేసే విధంగా ప్రకటించిన తమిళ జెన్–జీ తార విజయ్‌కు పెద్ద పరీక్ష మాత్రం మేనిఫెస్టోలోని ఆర్థిక సంబంధమైన హామీల అమలులో ఎదురు కానున్నది. ఆ హామీలలో ఎన్నికలలో గెలిచేందుకు అవసరమైన పోటాపోటీ పాప్యులిజం తక్కువ లేదు. వాటి అమలుకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని గ్రహించినందువల్ల మొదటి రోజునే గత ప్రభుత్వం మిగిల్చిన రుణభారమంటూ మాట్లాడి, హామీలు క్రమక్రమంగా తప్పక అమలు చేయగలమనీ, తనను నమ్మాలనీ ప్రజలను కోరారు. అదే విషయమై మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక హెచ్చరిక బాణాన్ని కూడా వెంటనే వదిలారు మరి.
ఈ నిర్వచనాలు, సాధకబాధకాలు ఎట్లున్నా, ద్రవిడ వాదాన్ని లేదా తమిళవాదాన్ని వర్తమాన కాలానికి అవసరమనుకున్న రీతిలో మెరుగులు దిద్ది గత పరిపాలనలకు తన పాలనకు గల తేడా ఏమిటో విజయ్ నిరూపించగలరని ఆశించాలి.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


