సంతోషపు లెక్కల్లో పాశ్చాత్యుల పొరపాటు | Sakshi Guest Column On USA Donald Trump perspective on India, China | Sakshi
Sakshi News home page

సంతోషపు లెక్కల్లో పాశ్చాత్యుల పొరపాటు

May 11 2026 12:09 AM | Updated on May 11 2026 12:09 AM

Sakshi Guest Column On USA Donald Trump perspective on India, China

అభిప్రాయం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ లేదా చైనాలను ‘నరక కూపాలు’ అని పిలిచినప్పుడు అందరికీ కోపం రావడం సహజం. కానీ ఒక శాస్త్రవేత్తగా నాకు అది కేవలం అమర్యాదగా మాత్రమే అనిపించలేదు, ఇదొక కొలమాన లోపం అనిపించింది. వాషింగ్టన్‌ ఇప్పటికీ 1950ల నాటి పాత ఆలోచనలతోనే ప్రపంచాన్ని చూస్తోంది. తాను ఎంత విద్యుత్తును వాడుతున్నాను అనే దానినే గొప్పగా భావిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసలైన తృప్తిని అర్థం చేసుకోవడంలో పొరబడుతోంది. నేను 1982లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నుండి పీహెచ్‌డీ పూర్తి చేసి జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీకి వెళ్ళాను. కొన్ని దశాబ్దాలుగా నేను జీవితంలోని రెండు వేర్వేరు ‘ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌‘ను గమనిస్తున్నాను. వాషింగ్టన్‌ చూసే కోణం కేవలం ఆర్థిక గణాంకాల చుట్టూనే తిరుగుతుంది తప్ప, మనిషి అనుభవాన్ని నిర్దేశించే అసలైన విషయాలను పట్టించుకోదు. ప్రపంచాన్ని ‘ఆనందపు సామర్థ్యం’ అనే కోణం నుండి చూస్తే, ఆనందం అనేది డబ్బు (జీడీపీ) వల్ల మాత్రమే రాదని అర్థమవుతుంది. అది ఒక సామాజిక నిర్మాణం. ఈ కోణంలో చూసి నప్పుడు, బయటకు ‘నరక కూపం’లా కనిపించే దేశాలే మనిషి సంతోషంగా ఉండటానికి అనువైన ప్రదేశాలుగా కనిపిస్తాయి.

ప్రమాణాల్లో తేడా 
నెల్లూరు జిల్లాలోని అల్లూరు మా స్వగ్రామం. 1980లో బెంగళూరులో నా పీహెచ్‌డీ స్టైపెండ్‌ నెలకు ‘50 డాలర్లు’(400 రూపాయలు). అమెరికా లెక్కల ప్రకారం ఇది పేదరికం. కానీ అప్పట్లో వాస్తవం వేరేలా ఉండేది. నా గది అద్దె 4 డాలర్లు, మరో 16 డాలర్లతో రోజుకు నాలుగు పూటలా మంచి భోజనం దొరికేది. వైద్యం అందరికీ అందుబాటులో ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా, నా సొంత పనుల కోసం నేను ఎప్పుడూ శారీరక శ్రమ చేయలేదు. మధ్యతరగతి జీవితాల్లో పనివారు అనే వ్యవస్థ తక్కువ ఖర్చుతో కూడిన, ఒక ముఖ్యమైన భాగం. నేను అమెరికా వెళ్ళాక ఒక వింత పరిస్థితి చూశాను. చికెన్, గుడ్లు, కూల్‌ డ్రింక్స్‌ వంటివి చాలా చౌకగా దొరికేవి. కానీ నా ‘జీవన ప్రమాణం‘లో ఒక లోటు వచ్చింది. నా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవడం వల్ల నేను ఒక కూలీలా మారిపోయాను. వంట, ఇల్లు ఊడ్వడం, బట్టలు ఉతకడం వంటి పనులకు మనుషులు దొరకరు, దొరికినా చాలా ఖరీదు. భారత్‌లో మధ్యతరగతి మనిషి మేధస్సు ఇటువంటి పనుల నుండి విముక్తి పొంది ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో సంపద ఉండవచ్చు కానీ, అక్కడ ‘సమయం, సామాజిక లోటు’ ఎక్కువ.

2026 నాటికి, ఒక సగటు అమెరికన్‌ ఒక భారతీయుడి కంటే 12 రెట్లు ఎక్కువ కరెంటు వాడుతున్నాడు. ఇంత కరెంటు వాడినంత మాత్రాన 12 రెట్లు ఎక్కువ ఆనందం వస్తుందా? నేను 1986లో కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు ఒక విషయం చూసి ఆశ్చర్యపోయాను. నా అపార్ట్‌మెంట్‌ మేనేజర్, ఒక మైలు దూరంలో మంచి షాపు ఉన్నా కూడా, ఐదు మైళ్ల దూరంలో ఉన్న ‘మరింత శుభ్రమైన‘ షాపుకు నన్ను కారులో తీసుకెళ్లాడు. అమెరికాలో పెట్రోల్, కరెంటు చౌకగా దొరుకుతాయి కాబట్టి, ఆనందాన్ని ఇవ్వని చిన్న చిన్న సౌకర్యాల కోసం వాటిని వృథా చేస్తారు. కానీ ఇండియాలో మనం సామీ ప్యతకు, సమాజానికి విలువ ఇస్తాం. మనకు సంతోషం మన దగ్గర్లోనే దొరుకుతుంది. తక్కువ వనరులను వాడుతూ ఎక్కువ ఆనందాన్ని పొందడంలో భారతీయులు ముందున్నారు.

వలసల వెనుక అసలు నిజం
వలసల మీద విమర్శలు చేసేవారు ఒక విషయం మర్చి పోతున్నారు: గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్‌ వంటి దిగ్గజాలను నడిపిస్తున్నది ఈ దేశాల మేధావులే. అమెరికా తన బయోమెడికల్‌ రంగం కోసం, టెక్నాలజీ కోసం ఈ దేశాల శాస్త్రవేత్తలపై ఆధార పడుతోంది. ఇవేమీ ‘లూప్‌హోల్‌’ వలసలు కాదు. ఇది వ్యూహాత్మక వనరుల సముపార్జన. వై2కే సంక్షోభ సమయంలో, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు కుప్పకూలకుండా కాపాడుకోవడానికి అమెరికాకు భారతీయ ప్రతిభావంతులే అక్కరకొచ్చారు. అలాంటప్పుడు వాటిని ‘నరక కూపాలు’ అనడం అమెరికా తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడమే అవుతుంది.

అమెరికా నేర్చుకోవాల్సింది ఎంతో!
సైన్స్‌ పరంగా చూస్తే, నిరంతరం సౌకర్యాల మధ్య ఉండటం వల్ల అమెరికన్లలో ‘హెడోనిక్‌ నంబ్‌నెస్‌‘ (ఆనందాన్ని ఫీల్‌ అవ్వలేని తనం) ఏర్పడుతోంది. ఏసీలు, కార్లు ఎప్పుడూ అందుబాటులో ఉండటం వల్ల వాటి వల్ల వచ్చే కిక్‌ (డోపమైన్, సెరోటోనిన్‌) తగ్గిపోతుంది. కానీ వనరులు తక్కువగా ఉన్న చోట ఆనందం ఎక్కువగా ఉంటుంది. 25 షర్టులు ఉన్నవాడికి 26వ షర్టు వల్ల వచ్చే ఆనందం కంటే, 5 షర్టులు ఉన్నవాడికి 6వ షర్టు వల్ల వచ్చే ఉత్సాహం చాలా ఎక్కువ. అలాగే అమెరికన్‌ మధ్యతరగతి మనిషి భారీ ‘ఆందోళన పన్ను‘ (యాంగై్జటీ ట్యాక్స్‌) కడుతున్నాడు. లక్ష డాలర్ల జీతం వచ్చినా, ఇన్సూరెన్స్‌ బిల్లులు, ఇతర సేవల కోసం అది ఖర్చయిపోయి చేతిలో ఏమీ మిగలదు. ఇండియాలో మనకు కుటుంబం అనే భావోద్వేగ అండ ఉంటుంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఖరీదైన వ్యవస్థల కంటే, పక్కనే ఉండే కుటుంబ సభ్యులు మనకు ధైర్యాన్ని ఇస్తారు.

ప్రపంచాన్ని కేవలం ఒకే కోణం నుండి చూడటం ఆపాలి. ఇల్లు ఎంత పెద్దది, ఎంత వాడుతున్నాం అనే లెక్కలతో చూస్తే భారత్, చైనాలు పేదవిగా కనిపించవచ్చు. కానీ వాటి దగ్గర లెక్కించలేని సంపద ఉంది– అదే ఆపదలను తట్టుకునే శక్తి, సామాజిక ఐక్యత.
ఏ దేశాన్నయినా తక్కువ చేసి చూసే ముందు, సంతోషం అనేది ఆయా దేశాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. ఈ దేశాల నుండి పాశ్చాత్య దేశాలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాషింగ్టన్‌ ప్రపంచానికి నాయకత్వం వహించాలనుకుంటే, ముందు ఈ అహంకారాన్ని విడిచిపెట్టి, ప్రపంచం నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

మేడా పరమేశ్వర రెడ్డి
వ్యాసకర్త రిటైర్డ్‌ ఇండియన్‌ అమెరికన్‌ శాస్త్రవేత్త; రెడ్డి సెంటర్‌ ఫర్‌ క్రిటికల్‌ అండ్‌ ఇంటిగ్రేటెడ్‌ థింకింగ్‌ డైరెక్టర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement