కెప్టెన్ స్మిత్, సుమారు 1500 మంది మరణానికి కారణమైన 'మునగని ఓడ' టైటానిక్
టైమ్ మిషన్
20వ శతాబ్దంలో అలల మీద తేలియాడిన ఓ అద్భుత మహా నగరం ఏదైనా ఉందంటే అది ‘టైటానిక్’ అనడం అతిశయోక్తి కాదు. బెల్ఫాస్ట్ నగరంలోని ‘హార్లాండ్ అండ్ ఊల్ఫ్’ సంస్థ ఈ ఓడను నిర్మించింది. 882.5 అడుగుల పొడవు, 92.5 అడుగుల వెడల్పు, 52,000 టన్నులను మించిన బరువున్న ఈ ఓడ మాన వుడు అప్పటివరకూ సాధించిన సాంకేతిక అతిశయానికి ప్రతీక! ఓడ లోపల ఉన్న సౌకర్యాలు అప్పట్లో మరే ఇతర ఓడలోనూ లేవు. మొదటి తరగతి ప్రయాణికుల కోసం స్విమ్మింగ్ పూల్, జిమ్, లైబ్రరీ, నాలుగు ఎలివేటర్లు ఏర్పాటు చేశారు. మూడవ తరగతిలో ఉన్న వారికి కూడా ఇతర ఓడల కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించారు. దీనిని తయారు చేసిన ఇంజనీర్లు 16 వాటర్ టైట్ కంపార్ట్‌మెంట్లను నిర్మించారు. వీటిలో నాలుగు గదులు పూర్తిగా నీటితో నిండిపోయినా ఓడ మునిగిపోదని వారు బలంగా నమ్మారు. అందుకే దీనిని ‘మునగని ఓడ’ అన్నారు.
మొదటి ప్రయాణం
1912 ఏప్రిల్ 10న ఇంగ్లాండ్‌లోని ‘సౌతాంప్టన్’ నుంచి వేలాది మంది కలలను మోసుకుంటూ టైటానిక్ అమెరికాలోని న్యూయార్కుకు తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఖరీ దైన ఈ ట్రిప్‌ను ‘మిలియనీర్స్ స్పెషల్’ అని పిలిచారు. ఎడ్వర్డ్ జె. స్మిత్ ఈ ఓడకు కెప్టెన్. సుమారు 2,200 మంది ప్రయాణికులు, సిబ్బందితో టైటానిక్ అట్లాంటిక్ అలల మీద ముందుకు సాగింది. ప్రయాణం సజావుగా సాగుతున్న సమయంలోనే రేడియో ఆపరేటర్లకు ఇతర ఓడల నుంచి మంచుకొండలకు సంబంధించిన హెచ్చరికలు రాసాగాయి. ఏప్రిల్ 14న అనేకసార్లు ఈ సమాచారం అందింది. ఓడ వేగాన్ని మాత్రం తగ్గించలేదు. కెప్టెన్ స్మిత్ ఓడ దిశను కొద్దిగా మార్చినప్పటికీ, గంటకు 22 నాట్ల వేగంతో ప్రయా ణాన్ని సాగించారు. ఆ రాత్రి సముద్రం ప్రశాంతంగా ఉంది. అలలు లేకపోవడంతో మంచుకొండలను గుర్తించడం కష్టమైంది.
రాత్రి 11:40 సమయంలో ఓడ ముందు ఒక భారీ మంచు కొండ ఉన్నట్లు గమనించారు. వెంటనే ఓడను పక్కకు తిప్పే ప్రయత్నం చేశారు, ఇంజిన్లను ఆపేశారు. కానీ అప్పటికే జరగా ల్సిన నష్టం జరిగిపోయింది. ఓడ కుడి భాగం ఆ మంచుకొండకు గట్టిగా తగిలింది. ఓడ కింద భాగంలో రంధ్రాలు పడ్డాయి. ఐదు గదుల్లోకి నీరు చేరడం మొదలైంది. ఓడ డిజైనర్ థామస్ ఆండ్రూస్ పరిస్థితిని గమనించి, మునగడం ఖాయమని తేల్చారు. కెప్టెన్ స్మిత్ వెంటనే ఆపద సంకేతాలను పంపమని ఆదేశించాడు. దగ్గరలో ఉన్న ‘కార్పాతియా’ ఓడ ఈ సంకేతాలను అందు కుంది. అది టైటానిక్‌కు 58 మైళ్ల దూరంలో ఉంది. అక్కడికి చేరుకోవడానికి కనీసం నాలుగు గంటలు పడుతుంది. మరోవైపు టైటానిక్‌లో లైఫ్ బోట్ల సంఖ్య తక్కువగా ఉంది. ఉన్న 20 బోట్లలో 1,178 మందే ప్రయాణించే అవకాశం ఉంది. ఏప్రిల్ 15 తెల్ల వారుజామున 2:00 గంటలకు ఓడ ముందు భాగం పూర్తిగా మునిగిపోయింది. వెనుక భాగం గాలిలోకి లేచింది. భారీ ఒత్తిడి వల్ల ఓడ రెండు ముక్కలుగా విరిగింది. 2:20 నిమిషాలకు పూర్తిగా అట్లాంటిక్ మహాసముద్రం అడుగు భాగంలోకి చేరుకుంది.
ఈ సంఘటన నౌకాయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రతి ఓడలో ప్రయాణికులందరికీ సరిపోయే లైఫ్ బోట్లు ఉండాలనీ, రేడియో నిరంతరం పనిచేయాలనీ కొత్త నిబంధనలు తెచ్చారు. మంచుకొండలను గమనించడానికి ‘ఇంటర్నేషనల్ ఐస్ పాట్రోల్’ సంస్థను ఏర్పాటు చేశారు. మునిగిపోయిన 73 ఏళ్ల తర్వాత, 1985లో రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలోని బృందం టైటానిక్ శిథిలాలను కనుగొంది. సముద్రం లోపల 12,500 అడుగుల లోతులో ఓడ రెండు ముక్కలుగా పడి ఉంది. రాబోయే కొన్నేళ్లలో ఆ ఓడ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జేమ్స్ కామెరూన్ తీసిన ‘టైటానిక్’ సినిమా, ఇతర డాక్యుమెంటరీలు ఈ ఓడను ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిపి ఉంచాయి.
కెప్టెన్ స్మిత్


