జీవిత సాఫల్యానికి 'మూడు పాఠాలు' | Sakshi Guest Column On Rishi Sunak | Sakshi
Sakshi News home page

జీవిత సాఫల్యానికి 'మూడు పాఠాలు'

May 4 2026 12:18 AM | Updated on May 4 2026 12:18 AM

Sakshi Guest Column On Rishi Sunak

రిషి సునాక్‌ బ్రిటన్‌కు మొదటి బ్రిటిష్‌ ఏషియన్‌ ప్రధాని. బ్రిటన్‌ కడచిన 200 ఏళ్ళలో అంతటి పిన్న వయస్కుడైన ప్రధానిని చూడలేదు. అక్షతా మూర్తి ఇన్ఫోసిస్‌ స్థాపకుడు ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి కుమార్తె. వ్యాపారంలో, సేవా కార్యక్రమాల్లో దక్షురాలిగా నిరూపించుకున్నారు. రిషి–అక్షత అమెరికాలోని ‘స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’లో కలిసి చదువుకున్నారు. అక్కడే ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నారు. వారిద్దరూ అదే యూనివర్సిటీ 2025 బ్యాచ్‌ గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి చేసిన ‘మూడు పాఠాల’ ప్రసంగ సంక్షిప్త పాఠం:

విశ్వగురు

రిషి సునాక్‌: నేను ప్రాథమికంగా సంఖ్యల మనిషిని. గణితం, గణాంకాలు, కోడింగ్‌ ఉపయోగించి ఫైనాన్స్‌ రంగంలో పెట్టుబడి వ్యూహాలు రూపొందించే నిపుణుడిని. అది మా మామగారు ‘ఇన్ఫోసిస్‌’ నారాయణ మూర్తితో నా అనుబంధం బలపడటానికి సహాయపడింది. ‘‘మేం దేవునిపై విశ్వాసం ఉంచాం. డేటాను ఒక చోటికి చేర్చడమే మిగిలిన వారందరి కర్తవ్యం’’ అన్నదే ఆయన నమ్మే మంత్రం. నాదీ అదే బాట. డేటా, దాని విశ్లేషణ పట్ల నాకు అపారమైన గౌరవం. స్టాన్‌ఫోర్డ్‌ విడిచిపెట్టాక, నేను నిర్వహించిన ప్రతి పాత్రలోనూ అది నన్ను విజయుడిని చేసింది. డేటా, దాని ననుసరించి తీసుకునే డెసిషన్లు నాకు చాలా ఉపకరించాయి.

1. అంతరాత్మ చెప్పినట్లు కూడా నడుచుకోండి!
నేను ఇక్కడ నేర్చుకున్న టెక్నిక్కులు, పదిహేనేళ్ళ తర్వాత, ఎస్‌.ఐ.ఆర్‌. మోడళ్ళను అర్థం చేసుకోవడంలో సాయపడ్డాయి. ఎస్‌ అంటే సస్కెప్టిబుల్‌. వ్యాధికి ఇంకా లోనుకానివారు. దాని బారినపడటానికి అవకాశం ఉన్నవారు. ఐ అంటే ఇన్‌ఫెకు‡్ష్యవస్‌. వ్యాధి బారినపడి, దాన్ని ఇతరులకు వ్యాపింపజేసే స్థితిలో ఉన్నవారు. ఆర్‌ అంటే రికవర్డ్‌/రిమూవ్డ్‌. వ్యాధి నుంచి కోలుకుని, శాశ్వత రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసుకున్నవారు. వారు మరోసారి వ్యాధికి లోనయ్యే అవకాశం లేదు. వ్యాధితో మరణించినవారు కూడా ఇదే వర్గంలోకి వస్తారు. మహమ్మారులు ప్రబలినపుడు జనాభాను ఈ మూడు వర్గాలుగా విభజించి వ్యాధి వ్యాప్తికి ఉన్న అవకాశంపై లెక్కలు కడుతూంటారు. కోవిడ్‌ కారణంగా నెలల తరబడి లాక్‌డౌన్‌లతో బాధపడ్డాక, 2021లో ఒమిక్రాన్‌ అంటూ కోవిడ్‌లో కొత్త రకం మొదలైంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఆ వైరస్, బ్రిటన్‌లో విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. నేను అపుడు బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నాను. ఆ సమయంలో, అమెరికా పర్యటనలో ఉన్నాను. ఆందోళన కనబరుస్తూ, హఠాత్తుగా వచ్చిన ఫోన్‌ కాల్‌తో,  పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని బ్రిటన్‌కు వెళ్లిపోయాను. మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలంటూ ఒత్తిడి వస్తోంది. 

డేటా పట్ల సరైన అవగాహన ఉన్నవాడిని కనుక సరిపోయింది. లేకపోతే, నేనూ అదే రకమైన అభిప్రాయాన్ని బలపరచేవాడినేమో. దక్షిణాఫ్రికాలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాల్సిన అవసరాన్ని డేటా సూచించింది. అది నాలో ప్రశ్నలను రేపింది. ‘కానీ’ ఏమైనా అయితే అనే సందేహమూ  తొలుస్తోంది. డేటా సరైన పరిష్కారాన్ని సూచిస్తుందని నమ్మేవాడినే కానీ, నేను ఇక్కడ చదువుకుంటున్న రోజుల్లోనే, డేటా అన్ని వైపుల పరిస్థితిని చూపలేదని ఆషా(అక్షత) నేను గ్రహించేటట్లు చేసింది. లాక్‌డౌన్‌ విధిస్తే తీవ్ర పర్యవసానాలుంటాయి. నాడు 2021 డిసెంబర్‌లో ఎటూ తేల్చుకోలేని స్థితి. అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే 50 శాతం మంచిదనిపిస్తుంది. వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం 50 శాతం మంచిదనిపిస్తుంది. కేవలం డేటా విశ్లేషణపైనే ఆధారపడి నిర్ణయాలు తీసుకునే పక్షంలో ఆ పని ఎవరైనా చేయగలరు. నాయకుని బల్ల దాకా రానక్కరలేదు. కనుక, డేటాతోపాటు అంతఃకరణపైన కూడా ఆధారపడాలి. 

అంతరాత్మ ప్రబోధాన్ని కూడా వినాలి. రెండింటిని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. అక్షతా మూర్తి: రెండవ పాఠం ఆదర్శవాదంతో కనే పెద్ద పెద్ద కలలకు, ఆచరణవాదంతో వేసే చిన్న చిన్న అడుగులకు సంబంధించినది. దీన్ని నేను రిషి నుంచి నేర్చుకున్నాను. నేను ధనికులకు–పేదలకు మధ్య అగాధం ఎక్కువగా ఉన్న దేశంలో పెరిగాను. నా తల్లితండ్రులు విస్తృతమైన మార్పు తీసుకురావాలనే స్ఫూర్తిని అందించారు. స్టాన్‌ఫోర్డ్‌లో విధిగా రాయవలసిన మొదటి వ్యాసంలో విద్య, ప్రభావం, సేవల గురించే ఎక్కువ చెప్పాను. మిగిలినవాటన్నింటికన్నా ఆదర్శమే సర్వోత్తమమైనదనే అభిప్రాయం ఉండేది. దానికోసం ఏం చేయదలచుకున్నావు అనే ప్రశ్న రిషి నుంచి ఎదురైంది. 

వాస్తవికతతో ముడిపెట్టని ఆదర్శాల వల్ల ప్రయోజనం శూన్యమని రిషి అభిప్రాయం. బాహ్య ప్రపంచంలో దైనందిన జీవితంలో స్పష్టంగా కనిపించే చిన్ని అడుగుల ద్వారానే పెద్ద స్థాయిలో రూపాంతరీకరణ సాధ్యమవుతుందని రిషి నుంచి నేర్చుకున్నాను. ఆదర్శాలను వల్లిస్తే సరిపోదు. ఆ దిశగా చిన్న అడుగులైనా వేయడం ప్రారంభించామా లేదా అన్నదే ముఖ్యం.

2. ఆచరణాత్మక దృక్పథమూ అవసరమే!
జీవితాలను మార్చాలన్నా, సామాజిక చేతనను పెంచాలన్నా చదువు ద్వారానే సాధ్యమని మా ఇద్దరి అభిప్రాయం. బ్రిటన్‌ ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఉన్నపుడు, ‘లెసన్స్‌ ఎట్‌ 10’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అది బ్రిటన్‌ నలుచెరగులా యువతను విద్యావంతులను చేసి, వారిలో స్ఫూర్తిని నింపేందుకు చేపట్టిన కార్యక్రమం. రిషి, నేను కలసి ‘రిచ్‌మండ్‌ ప్రాజెక్టు’ను కూడా ప్రారంభించాం. గణితాన్ని చూసి బెదిరిపోకుండా యువతలో ధైర్యం నింపడం, వారిలోని సంఖ్యా పరిజ్ఞాన పాటవాలకు మెరుగులు దిద్దడం, ఫైనాన్షియల్‌ అక్షరాస్యతను పెంపొందించడం ఆ కార్యక్రమం లక్ష్యం.  ఆచరణాత్మక దృక్పథం నేను ఒకప్పుడు అమాయంగా భావించినట్లుగా, అది ఆదర్శవాదానికి వ్యతిరేకమైనది కాదు. అది ఆదర్శానికి తోటి భాగస్వామి లాంటిది. పెద్ద పెద్ద కలలను సాకారం చేసుకునేందుకు ఆ రెండూ అవసరమే. 

రిషి సునాక్‌: ఫలితం గురించి ఎక్కువగా ఆందోళన చెందకపోవడం మేం నేర్చుకున్న ముఖ్యమైన మూడవ పాఠం. ఈ భావనను సంస్కృతంలో ‘ధర్మం’గా పిలుస్తారు. మనం చేసే పనుల నుంచి ఫలితాలను ఆశించకుండా  మన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం. నాయకత్వం వహిస్తున్నప్పుడు విజయాలు, వైఫల్యాలు రెండింటినీ చవి చూడవలసి వస్తుంది. ఆ మాటకొస్తే, మనం ఏ రంగంలో ఉన్నా దూషణ భూషణలను ఎదుర్కోవలసి వస్తుంది. నిర్లిప్తంగా ఎవరి పని వారు చేసుకుపోవాలని నేను చెప్పడం లేదు. విమర్శల పట్ల భయంతో కాక, నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాననే భావనతో ఏ పనైనా చేయాలి. 

3. విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి!
ఆషా నేనూ కలసి గడ్డు కాలాన్ని ఎదుర్కోవడంలో ఈ విద్యుక్త ధర్మ భావన ఎంతో సహాయపడింది. కన్సర్వేటివ్‌ పార్టీ నాయకునిగా, ప్రధాన మంత్రిగా తిరిగి పరిణమించే ప్రయత్నంలో 2022 వేసవిలో నేను విఫలమయ్యాను. ఎంతో శ్రమపడ్డ తర్వాత కూడా ఫలితం అనుకూలంగా రాకపోవడం బాధ పెట్టింది. కానీ, తర్వాత, అదీ మంచికే అనిపించింది. ఒక సాధారణ పార్లమెంట్‌ సభ్యునిగా చేయవలసిన పనులపై మరింత దృష్టి పెట్టగలిగాను. ఒక  భర్తగా, తండ్రిగా కుటుంబానికి మనుపటికన్నా ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగాను. 

ఆరు వారాలు గడిచాక, నాకన్నా, ముందు ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాజీనామా చేశారు. పౌండ్‌ విలువ వేగంగా పతనమవడం ప్రారంభించింది. ద్రవ్యోల్బణం 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయికి చేరుకుంది. పరిస్థితులను చక్కదిద్దడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ, క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడే దేశానికి సహాయపడటం ధర్మమని ఆషా గుర్తు చేసింది. రెండు రోజుల తర్వాత, ప్రధాని నయ్యాను. 

ప్రజాహిత రంగంలోనే కాదు ఎక్కడైనా సరే, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించేందుకు ముందుకు రావాలి. అంతకుముందున్న పరిస్థితులను లెక్కలోకి తీసుకోకూడదు. అహంకారానికి తావు ఇవ్వకూడదు. జీవితాన్ని సఫలం చేసుకునేందుకు అదొక్కటే మార్గం. మనం సాధ్యమని భావిస్తున్న దానికన్నా ఎక్కువగా సాధించడానికి అది తోడ్పడుతుంది. 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో కాపురముండిన మొదటి స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్లం మేమే. కానీ, ఒక ముఖ్యమైన సమయంలో, ఒక ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తించిన చివరివాళ్ళం మేమే కాకూడదని మా ఇద్దరి కోరిక.

Advertisement
 
Advertisement
Advertisement