గుర్రం లాగిన రైలుబండి | Sakshi Guest Column On Horse drawn train carriage | Sakshi
Sakshi News home page

గుర్రం లాగిన రైలుబండి

Mar 25 2026 1:33 AM | Updated on Mar 25 2026 1:33 AM

Sakshi Guest Column On Horse drawn train carriage

బ్రిటన్‌లోని ద మౌంట్‌ : ప్రపంచంలోనే తొలి రైల్వే స్టేషన్‌

టైమ్‌ మిషన్‌

గంటకు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్‌ రైళ్లు, విలాసవంతమైన ఓరియంట్‌ ఎక్స్‌ప్రెస్‌ లేదా మంచు కొండల గుండా సాగే ట్రాన్స్‌–సైబీరియన్‌ రైళ్ల గురించి గొప్పగా చెప్పుకొంటాం. కానీ కోట్లాది మంది సామాన్యుల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన ఈ రైలు ప్రయాణ విప్లవం ఎక్కడ మొదలైందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. సరిగ్గా 219 సంవత్స రాల క్రితం (1807 మార్చి 25) తేదీన బ్రిటన్‌ సౌత్‌ వేల్స్‌లోని ఒక చిన్న సముద్ర తీర గ్రామంలో, కేవలం ఒక గుర్రం లాగే బండితో డబ్బులు చెల్లించి చేసే రైలు ప్రయాణ చరిత్ర ప్రారంభమయ్యింది. 

ఆ రోజుల్లో రైల్వే పట్టాలు కేవలం బొగ్గు, సున్నపురాయి వంటి ముడి సరుకులను రవాణా చేయడానికి మాత్రమే వాడే వారు. మంబుల్స్‌ గ్రామంలోని గనుల నుంచి బొగ్గును స్వాన్సీ ఓడరేవుకు చేరవేసేందుకు 1804 లోనే పట్టాలు వేశారు. అయితే ఆ పట్టాలపై వెళ్లే సరుకు బండ్లను చూసి పిల్లలు సరదాగా వాటిపై ఎక్కి సవారీ చేసేవారు. ఆ దృశ్యాన్ని చూసిన ‘బెంజమిన్‌ ఫ్రెంచ్‌’ అనే వ్యాపారవేత్తకు మనుషులను కూడా పట్టాలపై రవాణా చేయాలనే ఆలోచన వచ్చింది. 12 సీట్లు ఉన్న ఒక గుర్రపు బండిని సిద్ధం చేశాడు. అది స్వాన్సీలోని ‘ద మౌంట్‌’ నుండి ‘ఆయిస్టర్‌ మౌత్‌’ వరకూ ఐదు మైళ్ల దూరం ప్రయాణించేది. దీనికి రెండు షిల్లింగుల వరకు ఛార్జీ వసూలు చేసేవారు. ‘ద మౌంట్‌’ ప్రపంచంలోనే తొలి రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందింది. అక్కడ ప్లాట్‌ ఫారమ్‌ లేకపోవడంతో ప్రయాణికులు పట్టాల పక్కనే ఉన్న ఒక మట్టి దిబ్బ మీద నుంచి బండిలోకి ఎక్కేవారు.

ఇంతింతై...
ప్రపంచంలోనే అత్యధిక రకాల శక్తి వనరులను వాడిన రైల్వేగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గుర్రంతో మొదలైన ఈ రైలు ప్రయాణం, క్రమంగా ఆవిరి యంత్రాలు, గాలి (సెయిల్‌), డీజిల్, గ్యాసోలిన్, చివరకు విద్యుత్‌ శక్తి వరకు వినియోగించుకుంటూ ఎదిగింది. మొత్తం ఆరు రకాల ఇంధనాలను వాడిన రైళ్లు పరుగులిడిన ఏకైక రైలు మార్గమిది. 1877లో ఆవిరి యంత్రాలు వచ్చిన తరువాత ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఒకే సారి 15 బోగీలతో సుమారు 1,300 మందిని ఇది తీసుకెళ్లేది. 

1928లో ఈ లైన్‌ను విద్యుదీకరించారు. ఆ సమయంలో బ్రిటన్ లోనే అతిపెద్దవైన డబుల్‌ డెక్కర్‌ ఎలక్ట్రిక్‌ ట్రామ్‌ కార్లను ఇక్కడ ప్రవేశపెట్టారు. ఒక్కో రైలులో 212 మంది వరకు కూర్చునే అవ కాశం ఉండేది. 1940వ దశకంలో ఏడాదికి దాదాపు 50 లక్షల మంది ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణించారంటే దీనికి ఆదరణ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

ఈ రైలు ప్రయాణం కేవలం ఒక రవాణా సౌకర్యం మాత్రమే కాదు, అది ప్రజల జీవితాల్లో ఒక తీపి జ్ఞాపకం. అప్పటి ప్రయా ణికులు ఆ రైలు సీట్లు మెత్తని చర్మంతో ఉండేవనీ, పట్టాలపై వెళ్తున్నప్పుడు ఆ బండి చేసే శబ్దం ఎంతో దూరం వరకు వినిపించేదనీ గుర్తు చేసుకుంటారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం తరువాత పరిస్థితులు మారిపోయాయి. చమురు నియంత్రణలు తొలగిపోవడంతో కార్లు, బస్సుల వాడకం పెరిగింది. పాతబడిన పట్టాల మరమ్మతులకు భారీగా ఖర్చు అవుతుందని భావించిన అధికారులు, దీనిని మూసివేయాలని నిర్ణయించారు.

చివరకు 1960 జనవరి 5వ తేదీన ఈ చారిత్రక రైలు తన చివరి ప్రయాణాన్ని సాగించింది. ఆ రాత్రి వేలాది మంది ప్రజలు విచారంతో రోడ్ల మీదకు వచ్చారు. తమ ప్రియమైన రైలుకు వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియల తరహాలో నల్లటి బట్టలు ధరించి, ఒక ఖాళీ శవపేటికను మోస్తూ పాటలు పాడారు.

నేడు స్వాన్సీలో అక్కడక్కడా కొన్ని శిథిలాలు తప్ప ఈ చారిత్రక రైలుకు సంబంధించిన ఆనవాళ్లు పెద్దగా లేవు. కానీ, ఈ రైలు ప్రయాణం చరిత్రలో ఎప్పటికీ ఒక అద్భుత అధ్యాయంగానే నిలిచిపోతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement