టిక్కెట్లు ఇవ్వకుండా నిద్రపోయిన వైనం రైల్వే ఉద్యోగిపై వేటు
తమిళనాడు: ప్రయాణికులకు టిక్కెట్ ఇవ్వకుండా నిద్రపోయిన ఓ ఉద్యోగి సస్పెండ్‌కు గురయ్యాడు. విద్యుత్ రైళ్ల సర్వసు ఉదయం 3.30కు మొదలైన అర్ధరాత్రి 12 గంటల వరకు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 3.36 గంటలకు పార్కు స్టేషన్‌లో బయల్దేరాల్సిన ఎలక్ట్రిక్ రైలులో వెళ్లేందుకు ప్రయాణికులు టికెట్ కౌంటర్‌కు రాగా అక్కడ ఉద్యోగి గాఢ నిద్రలో ఉండటం గమనించి, అద్దం తట్టిలేపారు. తర్వాత అతను ప్లాట్‌ఫాం 2కి వెళ్లాలని, రైలు బయలుదేరబోతోందని చెప్పాడు.
తన నిద్రకు భంగం కలిగించారని చిర్రెత్తుకొచ్చిన ఆ ఉద్యోగి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడు. దిక్కున్న చోట చెప్పుకోండని దూషించాడు. ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి ఆ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ అయి రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో రైల్వే అధికారులు సీసీటీవీ కెమెరాల వీడియో రికార్డింగ్‌ను పరిశీలించారు. విధి నిర్వహణలో నిద్రపోవడంతోపాటు ప్రయాణికుడితో అనుచితంగా వ్యవహరించాడని గుర్తించారు. రైల్వే ఉద్యోగిని సస్పెండ్ చేశారు.


