యుద్ధంతో కృత్రిమ మేధకు ముప్పేనా? | Iran Attack Qatar Ras laffan Helium Supply Impact | Sakshi
Sakshi News home page

యుద్ధంతో కృత్రిమ మేధకు ముప్పేనా?

Mar 24 2026 9:25 AM | Updated on Mar 24 2026 9:25 AM

Iran Attack Qatar Ras laffan Helium Supply Impact

ఖతార్‌లోని రాస్‌ లఫాన్‌ ప్లాంట్‌పై ఇరాన్‌ జరిపిన దాడి ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ప్లాంట్‌ మూత పడటం వల్ల కేవలం ఇంధన సరఫరానే కాదు, ఆధునిక సాంకేతిక తకు వెన్నెముక వంటి ‘హీలియం’ లభ్యత కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే హీలియంలో మూడో వంతు ఇక్కడి నుంచే వస్తోంది. కృత్రిమ మేధ, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో వాడే సెమీకండక్టర్‌ చిప్స్‌ తయారీలో హీలియం అత్యంత కీలకం. సిలికాన్‌ చిప్స్‌ను హై–ఎనర్జీ ప్లాస్మా లేదా కాంతి ద్వారా రూపొందించే ప్రక్రియలో (ఎచింగ్, లితోగ్రఫీ) విపరీతమైన వేడి పుడుతుంది. ఆ వేడిని తక్షణమే చల్లబరిచి, చిప్స్‌ ఆకారం దెబ్బతినకుండా కాపాడటానికి హీలియం వాయువును ఉపయోగిస్తారు. 

సాధారణంగా చిప్‌ తయారీదారులు తాము వాడే హీలియంలో 60–80 శాతాన్ని రీసైకిల్‌ చేస్తారు. అలాగే 2–3 నెలలకు సరిపడా నిల్వలను ఉంచుకుంటారు. అయితే 2026 మధ్య నాటికి ఖతార్‌లో హీలియం ఉత్పత్తి పునఃప్రారంభం కాకపోతే అనేక చిప్‌ తయారీ కంపెనీలు దెబ్బతింటాయి. ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెందిన శామ్‌ సంగ్, ఎస్కే హైనిక్స్‌ సంస్థలు తమకు కావాల్సిన హీలియంలో 65 శాతాన్ని ఖతార్‌ నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. అడ్వా న్స్‌డ్‌ చిప్స్‌ తయారీలో ఏకఛత్రాధిపత్యాన్ని కలిగి ఉన్న తైవాన్‌కు చెందిన టీఎస్‌ఎంసీపై మరీ తీవ్రంగా కాకపోయినా... ఒక మోస్తరుగా ప్రభావం ఉంటుంది. మొత్తంగా ఈ కంపెనీలు  తమకు కావలసిన హీలియంలో 35 నుంచి 40 శాతం వరకు ఖతార్‌ నుంచే కొంటున్నాయి. ప్రస్తుతానికి హీలియానికి ప్రత్యామ్నాయం ఏదీఅందుబాటులో లేదు.

చిప్‌ తయారీతో పాటు డేటా సెంటర్లలో వాడే భారీ హార్డ్‌ డిస్క్‌లకు (10 టీబీ పైబడినవి) హీలియం అవసరం. దీనికి ఉన్న తక్కువ సాంద్రత కారణంగా డిస్కులు వేగంగా తిరుగుతాయి. విద్యుత్‌ వినియోగాన్ని 20 శాతం వరకూ తగ్గించి ఎక్కువ డిస్కులను తక్కువ స్పేస్‌లో ప్యాక్‌ చేయడానికి హీలియం దోహదం చేస్తుంది. దీని సరఫరా తగ్గితే సీగేట్, డబ్ల్యూడీసీ, తోషిబా వంటి సంస్థలు తమ ఉత్పత్తిని తగ్గించక తప్పదు. ఒక్క మార్చి నెలలోనే డాటాసెంటర్లలో సాధారణంగా ఉపయోగించే 18–24 టీబీ హార్డ్‌ డ్రైవ్‌ల ధరలు ఇప్పటికే 20–30 శాతం పెరిగాయి, తాజా పరిణామాలతో ఇవి మరింత భారమయ్యే అవకాశం ఉంది.

ఎన్నో ఏళ్ల నుంచి పశ్చిమాసియాను అమెరికా కేవలం వినియో గదారులకూ, వ్యాపారాలకు ఒక ఇంధన కేంద్రంగానే చూసింది. కానీ నేడు అది చిప్‌ పరిశ్రమకు ఊపిరితిత్తుల వంటిదిగా మారింది. ప్రస్తుత పరిస్థితి పైకి కనిపిస్తున్నంత తేలికగా ఏమీ లేదు.  ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతలే నడిపిస్తున్నాయి. ఈ సాంకేతికతలతో అత్యధిక అంతర్జాతీయ పెట్టు బడులు ముడివడి ఉన్నాయి. అందుకే ఏఐ  రంగం కుంటుపడితే, ప్రపంచ ఆర్థిక నిర్మాణం మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉంది. 
– అనింద్యో చక్రవర్తి సీనియర్‌ జర్నలిస్టు, ఆర్థికాంశాల నిపుణులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement