శాంతి వీచికలు..?! | Donald Trump claims US has held talks with Iran | Sakshi
Sakshi News home page

శాంతి వీచికలు..?!

Mar 24 2026 4:20 AM | Updated on Mar 24 2026 7:55 AM

Donald Trump claims US has held talks with Iran

ఇరాన్‌పై దాడులకు 5 రోజుల విరామం: ట్రంప్‌

ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నామన్న అమెరికా అధ్యక్షుడు

 ‘ముఖ్య నేత’తో విట్కాఫ్, కుష్నర్‌ చర్చిస్తున్నట్టు వెల్లడి 

అలాంటిదేమీ లేదని తోసిపుచి్చన ఇరాన్‌

తమ హెచ్చరికలకు భయపడే ట్రంప్‌ దిగొచ్చారని వ్యాఖ్య

అమెరికా తమతో నేరుగానే చర్చించాలని స్పష్టీకరణ

‘‘పశ్చిమాసియాలో కల్లోలానికి పూర్తిగా తెర దించే దిశగా ఇరాన్, అమెరికా నడుమ రెండు రోజులుగా ఫలప్రదంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ఎంతో లోతుగా, సవివరంగా జరుగుతున్న ఈ నిర్మాణాత్మక చర్చలు వారమంతా కొనసాగుతాయి. తద్వారా సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నా. అందుకే ఇరాన్‌ విద్యుత్కేంద్రాలు, చమురు వ్యవస్థలపై ఐదు రోజుల పాటు ఎలాంటి దాడులూ చేయొద్దని మా యుద్ధ విభాగాన్ని ఆదేశించా. అయితే ఈ విరామం చర్చలు ఏ మేరకు ఫలప్రదమవుతాయనే దానికి లోబడి ఉంటుంది’’ 
– ట్రూత్‌సోషల్‌ పోస్టులో అధ్యక్షుడు ట్రంప్‌  

దుబాయ్‌: మూడు వారాలకు పైగా కొనసాగుతున్న పశ్చిమాసియా కల్లోలానికి తెర దించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. అవి ఈ వారమంతా కొనసాగుతాయని ప్రకటించారు. సోమవారం ట్రూత్‌సోషల్‌లో ఈ మేరకు పోస్టు చేశారు. 

చర్చల నేపథ్యంలో ఇరాన్‌లోని కీలక విద్యుత్కేంద్రాలు, చమురు వ్యవస్థలపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపేయనున్నట్టు ప్రకటించారు. హార్మూజ్‌ జలసంధిని 48 గంటల్లో తెరవని పక్షంలో ఇరాన్‌ చమురు, విద్యుత్‌ వ్యవస్థలపై భారీగా విరుచుకుపడతామని ఆదివారం ట్రంప్‌ అలి్టమేటం జారీ చేయడం తెలిసిందే. అదే జరిగితే హార్మూజ్‌ను పూర్తిగా మూసేయడమే గాక గల్ఫ్‌లోని అమెరికా, ఇజ్రాయెల్‌ స్థావరాలు, మౌలిక సదుపాయాలు, ఐటీ సెంటర్లు, నీటి శుద్ధి కేంద్రాలు తదితరాలన్నింటినీ సర్వనాశనం చేస్తామని ఇరాన్‌ బెదిరింపులకు దిగింది. 

ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గిస్తూ ట్రంప్‌ నుంచి ‘చర్చల ప్రకటన’వెలువడింది. అయితే దాన్ని ఇరాన్‌ ఖండించడం విశేషం. అమెరికాతో అలాంటి చర్చలేవీ జరగడం లేదని ఇరాన్‌ విదేశాంగశాఖ పేర్కొంది. బహుశా అంతర్జాతీయంగా చుక్కలనంటుతున్న చమురు ధరలను తగ్గించేందుకు, తదుపరి యుద్ధ వ్యూహాల అమలుకు సమయం తీసుకునేందుకే ట్రంప్‌ ఇలాంటి ప్రకటన చేసి ఉంటారంటూ అనుమానాలు వెలిబుచ్చింది. ‘‘యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికాయే. కనుక ఆ దేశమే నేరుగా మాతో చర్చలకు రావాలి’’అంటూ డిమాండ్‌ చేసింది.

 కానీ ఆ తర్వాత ట్రంప్‌ ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడుతూ ఇరాన్‌ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. చర్చలు కొనసాగుతున్నట్టు పునరుద్ఘాటించారు. ‘‘ఇరాన్‌ అగ్ర నాయకత్వం తుడిచిపెట్టుకుపోయినా పరిణతి, గౌరవాదరాలున్న పలువురు నేతలు ఆ దేశంలో ఉన్నారు. అలాంటి ఒక ఇరాన్‌ నాయకునితో అమెరికా దూతలు చర్చలు జరుపుతున్నారు’’అని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియా ప్రత్యేక దూత స్టీవ్‌ విట్కాఫ్, తన అల్లుడు జరేద్‌ కుష్నర్‌ ఓ ఇరాన్‌ నేతతో ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా చర్చించినట్టు వివరించారు. 

ఆ నేత ఎవరన్నది వెల్లడించకపోయినా, సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ అయితే కాదని స్పష్టం చేశారు. మొజ్తబా పేరిట అప్పుడప్పుడూ ప్రకటనలు రావడమే తప్ప ఆయన బతికున్నదీ లేనిదీ కూడా అనుమానమేనన్నారు. ఇరాన్‌కు కూడా ఒక ఒప్పందానికి రావాలనే ఉందని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. ‘‘చర్చలు మంగళవారం కూడా కొనసాగుతాయి. అవి ఫలిస్తే త్వరలోనే çహార్మూజ్‌ తెరుచుకుంటుంది. చమురు ధరలు ఒక్కసారిగా దిగొస్తాయి. అంతేకాదు, ఇరాన్‌ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికా స్వా«దీనం చేసుకుంటుంది కూడా’’అని ఆశాభావం వెలిబుచ్చారు. చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్‌పై క్షిపణులు, బాంబుల వర్షాన్ని కొనసాగిస్తామని ట్రంప్‌ హెచ్చరించడం విశేషం. 

అమెరికా, ఇరాన్‌ చర్చలకు రెండు రోజులుగా టర్కీ, ఈజిప్‌్ట, పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు ఆక్సియోస్‌ వార్తా సంస్థ పేర్కొంది. అటు విట్కాఫ్, కుష్నర్‌తో, ఇటు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీలతో మూడు దేశాల విదేశాంగ మంత్రులు విడివిడిగా మంతనాలు జరుపుతున్నట్టు వెల్లడించింది. టర్కీ విదేశాంగ మంత్రితో తాను చర్చలు జరిపినట్టు అరాఘ్చీ ధ్రువీకరించారు. కరడుగట్టిన మతవాదిగా పేరుబడ్డ ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మహమ్మద్‌ బఘేర్‌ గలీబాఫ్‌తో కూడా విట్కాఫ్, కుష్నర్‌ చర్చలు జరిపినట్టు వార్తలు వెలువడుతుండటం విశేషం. ఇజ్రాయెల్‌ మీడియా కూడా వీటిని ధ్రువీకరించింది. మరోవైపు, ఇరాన్‌ హెచ్చరికల కారణంగానే ట్రంప్‌ దిగొచ్చారంటూ ఆ దేశ అధికారిక వార్తా సంస్థ పేర్కొంది. ట్రంప్‌ తాజా ప్రకటనతో చమురు ధరలు కాస్త దిగొచ్చాయి. 

యథావిధిగా దాడులు 
ట్రంప్‌ ప్రకటనతో నిమిత్తం లేకుండా ఇజ్రాయెల్‌ మాత్రం ఇరాన్‌పై దాడుల పరంపరను కొనసాగించింది. ఆయన ప్రకటన వెలువడ్డ నిమిషాల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా పలు నగరాలపై సోమవారం క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్‌లోని మౌలిక వ్యవస్థలపై భారీ స్థాయిలో మరిన్ని దాడులు చేస్తామని ప్రకటించింది. అటు లెబనాన్‌లోని హెజ్బొల్లా లక్ష్యాలపై కూడా దాడులను కొనసాగించింది. ఆ దేశంలో మృతుల సంఖ్య దాదాపు 1,100కు చేరింది. లెబనాన్‌లో తీర ప్రాంత నగరమైన నఖోరాలో తమ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడి జరిగినట్టు ఐరాస శాంతి పరిరక్షణ దళం (యునిఫిల్‌) పేర్కొంది. ఇరాన్‌ కూడా తీవ్ర స్థాయిలో ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌ దేశాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. పలు డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు యూఏఈ పేర్కొంది.   

Advertisement
 
Advertisement
Advertisement