కీవ్: పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా దాడులకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను 5 రోజులు వాయిదా వేసినట్టు ట్రంప్ తెలిపారు. ఇరాన్‌తో చర్చలు జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరో బాంబు పేల్చారు. ఇరాన్‌కు రష్యా గూఢచర్య సమాచారాన్ని అందిస్తోందని చెప్పుకొచ్చారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా ఇరాన్ యుద్ధంపై స్పందించారు. ఈ సందర్బంగా జెలెన్ స్కీ వీడియోలో మాట్లాడుతూ.. అమెరికాతో యుద్ధం సమయంలో రష్యా వారికి సహకరించింది. ఇరాన్ ప్రభుత్వానికి రష్యా గూఢచర్య సహాయాన్ని కొనసాగిస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇది ఒక విధ్వంసకర చర్యగా స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని తప్పక ఆపాలి. ఎందుకంటే ఇది మరింత అస్థిరతకు దారితీసే అవకాశం ఉంది. యుద్ధం అనేక దేశాల్లో ఇంధన పరిస్థితిని గణనీయంగా క్లిష్టతరం చేస్తోంది. ఇరాన్ ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి, మరింత కచ్చితంగా దాడులు చేయడానికి, రష్యా చేస్తున్న సహాయం యుద్ధాన్ని మరింత పొడిగిస్తోంది. యుద్ధం కారణంగా మార్కెట్లు ఇప్పటికే ప్రతికూలంగా స్పందిస్తున్నాయి’ అంటూ ఆయన తన పోస్టులో వెల్లడించారు.
There is growing evidence that the Russians continue to provide the Iranian regime with intelligence support. This is clearly destructive activity, and it must be stopped, as it only leads to further destabilization. All decent states are interested in guaranteeing security and… pic.twitter.com/tg1WwPnb6n
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 23, 2026
ఇరాన్‌తో రష్యా మంత్రి ఫోన్..
మరోవైపు.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దురాక్రమణ కారణంగా పర్షియన్ గల్ఫ్‌లో నెలకొన్న క్షీణత గురించి మంత్రులు చర్చించారు. ఈ సంఘర్షణ కాస్పియన్ ప్రాంతంలోకి ప్రమాదకరంగా విస్తరించడంపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు.
అంతకుముందు ట్రంప్.. ఇరాన్‌తో చర్చల గురించి ప్రస్తావించారు. చర్చలు చాలా వరకు కొనసాగాయి. వారు (ఇరాన్) ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఎంతగానో కోరుకుంటున్నారు. మేము కూడా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఆశిస్తున్నాము. మేము ఈరోజు బహుశా ఫోన్ ద్వారా సమావేశమవుతాము. ఎందుకంటే వారు ఉన్న దేశం నుంచి బయటకు రావడం వారికి చాలా కష్టంగా ఉంది. అయితే అతి త్వరలో మేమందరం ప్రత్యక్షంగా కలుస్తాము. మేము దీనిని ఐదు రోజుల పాటు పరిశీలిస్తాము. అది ఎలా జరుగుతుందో చూద్దాం.
ఒకవేళ అంతా సజావుగా సాగితే మేము దీనిని పరిష్కరిస్తాము. లేదంటే మా దాడులను యధావిధిగా కొనసాగిస్తాము. మార్కెట్లో సాధ్యమైనంత ఎక్కువ చమురు ఉండేలా చూడటమే నా ఉద్దేశం. సముద్రంలో చమురుతో నిండుగా ఉన్న నౌకలు ఉన్నాయి. ఆ చమురును అక్కడే నిల్వ ఉంచడం కంటే అది మార్కెట్లోకి చేరడమే నాకు ఇష్టం. ఇరాన్‌కు లభించే ఏ చిన్న మొత్తపు డబ్బు కూడా ఈ యుద్ధంలో ఎటువంటి మార్పునూ తీసుకురాదు అంటూ వ్యాఖ్యలు చేశారు.


