గత కొద్ది వారాలుగా మారణహోమం సృష్టించిన పశ్చిమాసియా యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐదు రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించారు. కాగా ప్రస్తుతం మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని దానికి వేదిక పాకిస్థాన్ కానుందని రాయిటర్స్ కథనం పేర్కొంది.
ఇరాన్- అమెరికా యుద్ధం ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలో నెట్టేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభంతో అనేక రంగాలు ప్రభావితమయ్యాయి. సప్లై చైన్ దెబ్బతిని ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో ట్రంప్‌కు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు నిన్న (సోమవారం) సీజ్ ఫైర్ ప్రకటించి చర్చలు జరుపతున్నామని ప్రకటించారు.
అయితే ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదిక అయ్యే అవకాశం ఉందని రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేలా తెరవెనుక పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయంది. అమెరికా తరపున ప్రతినిధులుగా ఆదేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యవహారించనున్నారని, ఇరాన్ తరపున ఆ దేశ కీలక అధికారులు పాల్గొననున్నారని పేర్కొంది. మధ్యవర్తులుగా ఇస్లాం దేశాలైన పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ పాల్గొననున్నాయని రాయిటర్స్ ప్రచురించింది.
కాగా ఇది వరకే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్‌తో ఫోన్లో మాట్లాడి, శాంతి పునరుద్ధరణకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ విధంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇరాన్ స్పీకర్ ప్రస్తుతం చర్చలు ఏమి లేవని తమపై దాడి చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్నారు. ఈ నేపథ్యంలో ఏమవుతుందో వేచి చూడాలి.


