ముగుస్తున్న సమాంతర చరిత్ర | Sakshi Guest Column On Naxalism history ending | Sakshi
Sakshi News home page

ముగుస్తున్న సమాంతర చరిత్ర

Mar 25 2026 12:23 AM | Updated on Mar 25 2026 12:23 AM

Sakshi Guest Column On Naxalism history ending

మార్చి 31తో నక్సలిజమైతే ‘అంతమవుతున్నది’ గానీ, అందుకు కారణమైన సమస్యలను అంతం చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు ఏమి చర్యలు తీసుకోగలవో చూడాలి.

విశ్లేషణ

దేశంలో ‘నక్సలిజం అంతానికి’ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించిన ఆపరేషన్‌ కగార్‌ గడువు మరికొద్ది రోజులలో మార్చి 31న ముగియనున్నది. మరునాడు ఏప్రిల్‌ 1 నుంచి దేశంలో ఎక్కడా నక్స లైట్లు గానీ, నక్సలిజం గానీ జాడలేని పరిస్థితి ఏర్పడుతుందా అన్న ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి గానీ, గత 59 సంవత్సరాలుగా మనం చూస్తున్న తరహా ఉద్యమం మాత్రం ముగింపునకు వస్తున్నదనటంలో సందేహం లేదు. ఇంత పెద్ద సంఖ్యలో నక్సలైట్లు చనిపోవడం లేదా నాయకులతో సహా లొంగిపోవటం జరుగుతున్న ప్పుడు, ఉద్యమం ఇప్పటివలె ఇంకా కొనసాగగలదని భావించటం నిర్హేతుకమవుతుంది.

అరవై ఏళ్ల పోరాటం
భారతదేశం 1947లో స్వతంత్రాన్ని సాధించుకోగా, తర్వాత 20 సంవత్సరాలకే 1967లో నక్సలిజానికి బీజాలు పడ్డాయి. అప్పటి నుంచి దేశ చరిత్రకు సమాంతరంగా నక్సలిజం చరిత్ర దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాగింది. ఇది సాధారణమైన విషయం కాదు. ఒక నియంతృత్వ వ్యవస్థలో రైతాంగం, ఆదివాసీలు, పేదలు ఇంత సుదీర్ఘమైన విప్లవోద్యమాన్ని సాగించి ఉంటే అది వేరు. కానీ, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఇట్లా ఎందుకు జరిగిందన్నది జాగ్రత్తగా, నిర్వికారంగా అర్థం చేసుకోవలసిన విషయం.

అనేక శతాబ్దాల పాటు రాచరిక ఫ్యూడల్‌ వ్యవస్థలలో, తర్వాత బ్రిటిష్‌ వలస పాలనలో తీవ్రమైన పీడనకు గురైన ఇండియా వ్యవ సాయిక దేశం. పీడనకు గురైన ప్రజలలో అత్యధికులు రైతులు, కౌలు దార్లు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడిన వివిధ వృత్తులవారు, ఆదివాసీలు. దేశ స్వాతంత్య్రం కోసం ఉద్య మించిన కాంగ్రెస్‌ తదితర పార్టీల నాయకత్వాలు ఈ సమస్యను మొదటి నుంచి గుర్తించాయి. గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత చేపట్టిన మొట్టమొదటి ప్రజా ఉద్యమం రైతాంగం కోసమే. అది, బిహార్‌లోని చంపారన్‌లో 1917లో నీలిమందు రైతుల సమస్యలపై. ఆయన తన ప్రథమ శిష్యునిగా ప్రకటించిన వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ ఆ మరుసటి సంవ త్సరమే గుజరాత్‌లోని ఖేడా ప్రాంతంలో మహత్తరమైన రైతాంగ పోరాటం నడిపారు.

ఈ నేపథ్యంలోకి వెళ్లటం ఎందుకంటే, నక్సలైట్లు ఏ పేద రైతాంగం కోసమైతే పశ్చిమ బెంగాల్‌లోని సిలిగుడిలో 1967లో సాయుధ ఉద్యమం ఆరంభించారో, అంతకు సరిగా 50 సంవత్స రాల ముందు, కాంగ్రెస్‌ నాయకత్వం అదే రైతుల కోసం ఉద్యమించింది. మరొక విధంగా చెప్పాలంటే, దేశ స్వాతంత్య్రానికి 30 సంవత్సరాల క్రితం అన్నమాట. అంతే కాదు– చంపారన్, ఖేడా రైతుల సమస్యల పరిష్కారంతో వారు దేశ రైతాంగాన్ని మరవలేదు. వారి విషయమై ఏఐసీసీ సమావేశాలలో తీర్మానాలు చేస్తూ పోయారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి మహజర్లు సమర్పించారు. గవర్న మెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్, 1935 ప్రకారం ఎన్నికలు జరిగి రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలు ఏర్పడినపుడు రైతాంగ అనుకూల చర్యలు తీసుకున్నారు.

ఎందుకు తలెత్తినట్టు?
స్వాతంత్య్రం తర్వాత ఇదే ధోరణి కొనసాగిస్తూ నెహ్రూ ప్రభుత్వం అనేక వ్యవసాయ సంస్కరణలను ప్రవేశ పెట్టింది.  భూమిపై యాజమాన్యం సాగుచేసే రైతులకు మాత్రమే ఉండాలని, ఎవరెంత సాగు చేయగలిగితే అంతమాత్రమే లభించాలన్న గాంధీజీ సూచనల స్ఫూర్తితో భూపరిమితి చట్టాలు, జమీందారీ రద్దు, భూపంపిణీలు, కౌల్దారీ చట్టాల వంటివి చేశారు. రైతులకు ఉప యోగపడే సహకార చట్టాలు, పంచాయతీ రాజ్‌లను కూడా అమ లుకు తెచ్చారు. రుణ పరపతి విధానం ప్రవేశ పెట్టారు.

విషయం ఏమంటే, 1947 కన్న ముందటి వ్యవసాయ రంగ పరిస్థితులను అంతగా అర్థం చేసుకుని, ఆ తర్వాత ఇన్నిన్ని చర్యలు తీసుకున్నప్పుడు, 20 సంవత్సరాలు గడిచేసరికి పేద రైతాంగం, రైతు కూలీల కేంద్రంగా నక్సలైట్‌ ఉద్యమం అసలు తలెత్తి ఉండ కూడదు. అదంతా ఎందుకు జరిగిందన్న ప్రశ్నకు కనిపించే ఏకైక సమాధానం, పైన పేర్కొన్న వేర్వేరు ప్రభుత్వ చర్యలలో కొన్ని అరకొరగా అమలుకాగా, కొన్ని అసలు కాకపోవటం. 

నిజమైన ఆధిపత్యం చాలావరకు పెద్దవారి చేతులలోనే మిగిలి పోవటం. రాచ కుటుంబాల వారు, జమీందారీ తరగతులు, ఇతర ప్రాబల్య వర్గాలు కాంగ్రెస్‌లో చేరి, అధికారుల సహాయంతో రకరకాల యుక్తుల ద్వారా భూసంస్కరణలతో పాటు నెహ్రూ ప్రభుత్వపు అనేక సంస్క రణలను వీలైనంత బలహీనపరచారు. 1964లో ఆయన మరణం తర్వాత ఇక వారికి ఏ అడ్డూ అదుపూ లేకపోయింది. మరొక మూడేళ్లు గడిచేసరికి నక్సల్‌బరీకి అంకురార్పణ జరిగింది.

‘అభివృద్ధి’కి ఇక అడ్డేమిటి?
1917 నుంచి ఆరంభించి 1950ల వరకు కాంగ్రెస్‌ పార్టీ రైతాంగం పట్ల, ఆదివాసీల పట్ల చూపిన శ్రద్ధ మేరకు కార్యాచరణ జరిగి ఉంటే, స్వతంత్ర భారతదేశ చరిత్రకు సమాంతరంగా నక్సలైట్‌ ఉద్యమ చరిత్ర అంటూ ఒకటి ఉండేదే కాదు. దానిని ‘అంతం’ చేయవలసిన అవసరమంటూ ఇపుడు ఏర్పడేది కాదు. మొదట అనుకున్నట్లు మొత్తానికి ఉద్యమమైతే ఇక ముగిసి పోతు న్నది. అందుకు ఒక ముఖ్య కారణం ప్రభుత్వాల అణచివేత. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల సమన్వయంతో గతంలో లేనంత తీవ్ర మైన చర్యలు తీసుకుంటుండవచ్చు. కానీ, గత ప్రభుత్వాల చర్యలు తక్కువేమీ కాదు. రెండవ ముఖ్య కారణం ఉద్యమంలోని అనేక లోపాలు. సైద్ధాంతిక అవగాహనలో, దాని అన్వయంలో, వ్యూహ రచనలో, వ్యవస్థల నిర్మాణంలో, ఆచరణలో... ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా అనేక లోపాలు కొనసాగినపుడు ఎంతటి ఉద్యమ మైనా క్రమంగా విఫలం కాక తప్పదు.

విచారకరం ఏమంటే, కాంగ్రెస్‌కు 1917 నుంచి గణనీయమైన స్పృహ ఉండి, 1947 నుంచి ఎన్నో చర్యలు తీసుకుని, 1967 నుంచి తీవ్ర స్థాయిలో నక్సలైట్‌ ఉద్యమం జరిగిన తర్వాత కూడా, దేశం 2027 ముంగిట ఉండగా, రైతులూ, ఆదివాసీల స్థితిగతులు అసలు మెరుగుపడలేదనలేము. కానీ, మెరుగుపడవలసింది ఇంకా చాలా ఉందన్నది వాస్తవం. వారిలో గల అసంతృప్తి కూడా తక్కువ కాదు. అందువల్ల, నక్సలిజమైతే ‘అంతమవుతున్నది’ గానీ, అందుకు కార ణమైన సమస్యలను కూడా అంతం చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఏమి చర్యలు తీసుకోగలవో వేచి చూడవలసి ఉంది. 

నక్స లైట్లను ఇంతకాలం అభివృద్ధికి అడ్డుపడుతున్న శక్తులుగా నిందించిన మీదట, ఇక అటువంటి అడ్డులనేది లేకుండా ఈ నెల 31తో తొలగి పోతున్నందున, రైతులు, కౌలుదార్లు, కూలీలు, వృత్తి పనులవారు, ఆదివాసీలు, నిరుద్యోగులు తదితర వర్గాల సమస్యలను శీఘ్రగతిన తొలగించి అభివృద్ధి పరచేందుకు ఇపుడు మార్గం పూర్తిగా సుగమ మవుతున్నది. ఆ పని చేయనున్నారా?

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement