నాటో కూటమి కథ కంచికేనా? | Sakshi Guest Column On NATO Alliance | Sakshi
Sakshi News home page

నాటో కూటమి కథ కంచికేనా?

Apr 17 2026 12:18 AM | Updated on Apr 17 2026 12:18 AM

Sakshi Guest Column On NATO Alliance

విశ్లేషణ

ఇరాన్‌ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక కూటమి ‘నాటో’లో అంతర్యుద్ధానికి కారణమవటం ప్రపంచ జియో పొలిటికల్‌ చదరంగాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నది. తమ దేశాల నౌకా బలగాలను హార్మూజ్‌ జలసంధి వద్ద మోహరింప చేయాలన్న యూఎస్‌ అధ్య క్షుడి విజ్ఞప్తిని నాటో దేశాలు  తిరస్కరించాయి. తమ దేశాలలోని సైనిక స్థావరా లను వినియోగించటానికి అంగీకరించ లేదు. ఈ యుద్ధం మా (నాటో) యుద్ధం కాదని తేల్చి చెప్పాయి. అమెరికా అధ్యక్షుడు నాటో కూటమిని ‘కాగితపు పులి’గా అభి వర్ణిస్తూ యూఎస్‌ఏ దాన్నుండి వైదొలుగుతుందని బెదిరించాడు. ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ని (ఇరాన్‌ యుద్ధాన్ని) సమర్థించని, యూఎస్‌ఏకు సహాయపడని మిత్ర దేశాలను యూఎస్‌ఏ రక్షించ బోదని ఆ దేశ రక్షణ మంత్రి పీటర్‌ హెగ్‌సెత్‌ హెచ్చరించాడు. ఐరో పాను రక్షించటానికి మాత్రమే నాటో కూటమి ఏర్పడలేదనీ, యూఎస్‌ ఏను సమర్థించటం కూడా నాటో ప్రధాన విధి అనీ యూఎస్‌ఏ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మార్కో రూబియో అభిప్రాయ పడ్డాడు.

ప్రపంచాన్ని శాసించిన శక్తి
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1949లో పన్నెండు దేశాలతో ఆవిర్భవించిన నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) కూటమి ఇటీవల స్వీడన్‌ చేరికతో 32 దేశాలకు విస్తరించింది. సోవియట్‌ రష్యాను అడ్డుకోవటానికి యూఎస్‌ఏ నాయ కత్వంలో ఏర్పడిన ఈ సైనిక–రాజకీయ కూటమి గత 75 ఏళ్లలో ప్రపంచ రాజకీయాలను శాసించిందనటంలో సందేహం లేదు. ఈ 32 సభ్య దేశాలలో ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా దానిని మొత్తం కూటమి మీద దాడిగా పరిగణిస్తుంది. 32 సభ్య దేశాలే కాకుండా, 40 ఇతర దేశాలతో కూడా ఈ కూటమి సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలను చేసుకున్నది. సోవియట్‌ రష్యాను నిలువరించటానికి స్థాపించబడిన ‘నాటో కూటమి’ని సోవియట్‌ విచ్ఛిన్నం తరువాత కొనసాగించాల్సిన ఆవశ్యకత లేదు. రష్యా బలహీనంగా ఉండటాన్ని ఆసరాగా చేసు కొని ఈ కూటమి సోవియట్‌ ప్రాబల్య ప్రాంతాలలోనికి విస్తరించింది. ఇదే ఉక్రెయిన్‌ యుద్ధానికి దారి తీసింది. నాటో సభ్య దేశాలలో యూఎస్‌ఏ నాయకత్వంలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేశారు. ఈ స్థావరాలలో అత్యాధునిక యుద్ధ విమానాలు, శత్రు క్షిపణులను ఎదుర్కొనే మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ను, అమెరికన్‌ సైనికులను మోహరించి ఆ యా దేశాలకు యూఎస్‌ఏ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. సైనిక, గూఢచర్య సమాచారాన్ని, సైబర్‌ సమాచారాన్ని పంచుకోవటమే కాకుండా మిలిటరీ డ్రిల్స్‌ నిర్వహిస్తూ ఈ దేశాలపై సోవియట్‌ యూనియన్‌ (రష్యా), ఇతర శత్రు దేశాలు కన్నెత్తి చూడకుండా కాపాడుతున్నది.

యూఎస్‌ఏ నీడన ఐరోపా
1990వ దశకం నుండి క్రమంగా నాటో దేశాలలో అలసత్వం ప్రవేశించింది. తమ దేశాల సైనిక, రక్షణ బాధ్యతను పూర్తిగా యూఎస్‌ఏ పైన తోసివేశాయి. తమ రక్షణ ఖర్చులను తగ్గించి, పూర్తిగా సంక్షేమం, అభివృద్ధిపైన దృష్టి పెట్టాయి. జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాలకు రష్యా ముప్పుగా కనప డటం ఆగిపోయింది. నాటో కూటమి ఒప్పందం ప్రకారం ప్రతి సభ్య దేశం తన జీడీపీలో కనీసం 2 శాతం రక్షణ రంగంపై ఖర్చు చేయా లనే నిబంధనను ఖాతరు చేయలేదు. మొత్తం రక్షణ వ్యయంలో 65 శాతం యూఎస్‌ఏ భరిస్తోంది. ఇదే సమయంలో ఈ ఐరోపా దేశాలు తమ తయారీ రంగాన్ని దాదాపుగా చైనాకు అవుట్‌సోర్సింగ్‌ చేశాయి. మానవ వనరుల కొరతను ఎదుర్కోవటానికి సిరియా, జోర్డాన్, లెబనాన్, ఈజిప్టు, మొరాకో, అల్జీరియా వంటి దేశాల నుండి చౌక శ్రామికుల వలసలను ప్రోత్సహించాయి. ఇంధన అవసరాలకు రష్యా నుండి చౌకగా వచ్చే గ్యాస్‌ దిగుమతులపై ఆధారపడ్డాయి. స్థూలంగా పరిశీలిస్తే జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్‌ మొదలగు ఐరోపా దేశాలు గత నాలుగు దశాబ్దా లలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎగుమతి–దిగుమతి వ్యాపారం, విలాస వస్తువుల తయారీ వంటి రంగాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నాయి. తక్కువ ఖర్చుతో ఉన్నత జీవన ప్రమాణాలను అను భవిస్తున్నాయి.

ట్రంప్‌ 2025లో అధికారంలోకి రాగానే ‘అమెరికా ఫస్ట్‌’ నినా దాన్ని అందుకొన్నాడు. నాటో రక్షణ వ్యయంలో కూటమి దేశాలు తమ వంతు వాటాను భరించాల్సిందేనని మెలిక పెట్టాడు. ఐరోపా దేశాల రక్షణ బాధ్యతను మోస్తున్నందుకు ప్రతిఫలంగా ఇరాన్‌ యుద్ధంలో మద్దతు ఇవ్వాలని పట్టుబడుతున్నాడు. అమెరికా కోణంలో ఆలోచిస్తే ఈ వాదన సహేతుకంగానే కనిపిస్తుంది. ఇరాన్‌ యుద్ధం తమ యుద్ధం కాదనేది యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల వాదన. ఇదే కోణంలో ఆలోచిస్తే ఉక్రెయిన్‌ యుద్ధం కూడా యూఎస్‌ఏ యుద్ధం కాదు. ఉక్రెయిన్‌ నాటో సభ్య దేశం కూడా కాదు. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాను ఎదుర్కొంటున్నది యూఎస్‌ఏ సైనిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, యూఎస్‌ఏ ఆర్థిక సహాయమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

మాటలతో మారిన తీరు
2003 ఇరాక్‌ యుద్ధంలో కూడా నాటో దేశాలు పాల్గొనటం విషయంలో ఇదేరకమైన భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయిన ప్పటికీ యూకే, స్పెయిన్, ఇటలీ, పోలండ్‌ తమ సైనికులను యూఎస్‌ఏకు మద్దతుగా పంపించాయి. ప్రస్తుత ఇరాన్‌ యుద్ధం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధాన్ని ప్రారంభించేముందు నాటో దేశాలతో చర్చించలేదు. గ్రీన్‌ల్యాండ్‌ విషయంలో ఐరోపా దేశాలను ట్రంప్‌ బేఖాతరు చేశాడు. వ్యక్తిగతంగా ఫ్రాన్స్, జర్మనీ, యూకే దేశాధినేతలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. వలసలను ప్రోత్సహిస్తూ ఐరోపా దేశాలు తమ నాగరికతను నాశనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యా నించాడు. ఉక్రెయిన్‌కు సహాయం అందించటంలో యూరోపియన్‌ యూనియన్‌కు అడ్డుగా వ్యవహరించిన హంగరీ దేశాధినేత విక్టర్‌ ఓబ్రామ్‌ను  సమర్థించాడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓబ్రా మ్‌కు యూఎస్‌ ఉపాధ్యక్షుడు వాన్స్‌ బహిరంగంగా మద్దతు పలి కాడు. అయితే ఈ ఎన్నికల్లో 16 ఏళ్లుగా హంగరీని పాలిస్తున్న ఓబ్రామ్‌ ఓడిపోయాడు. ఓబ్రామ్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కూడా సన్నిహితుడు. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా వైపు హంగరీ మొగ్గు చూపింది. పుతిన్‌ పరంగా ట్రంప్‌ మెతక వైఖరిని కొనసాగిస్తున్నాడు. ఇది ఐరోపా దేశాలకు మింగుడుపడటం లేదు. 

రష్యా నుండి చౌకగా లభించే గ్యాస్‌ దిగుమతులు ఆగిపోవటంతో ఐరోపా దేశాలు ఖతర్, యూఏఈ, సౌదీ నుండి ఎల్‌ఎన్‌జీ దిగుమతులపై ఆధారపడుతున్నాయి. అందువలన హార్మూజ్‌ జల సంధి కేంద్రంగా జరుగుతున్న ఇరాన్‌ యుద్ధం కొనసాగటం వాటికి ఇష్టం లేదు. ఈ యుద్ధం కేవలం యూఎస్‌ఏ–ఇరాన్‌ మధ్య కాదు. ఇజ్రాయెల్‌ చేరికతో యుద్ధానికి ‘మతం రంగు’  అలుముకోవటం ఖాయం. ఫ్రాన్స్‌లో 6.7 మిలియన్ల ముస్లిం జనాభా ఉంది. మొత్తం జనాభాలో సుమారు 10 శాతం. జర్మనీలో సుమారుగా 5.7 శాతం (4.7 మిలియన్లు) ముస్లిం జనాభా ఉన్నది. ఈ యుద్ధంలో భాగస్వా ములయితే తమ దేశాలలోని ముస్లిం పౌరుల మద్దతు ప్రమాదంలో పడుతుంది. నాటో దేశాలు మారుతున్న పరిణామాల నేపథ్యంలో తమ రక్షణ బడ్జెట్‌లను పెంచి, సైనిక సామర్థ్యం వైపు దృష్టి పెడుతు న్నాయి. ఐరోపా దేశాల మధ్య సైనిక సంబంధాలను పటిష్ఠం చేయాలని చూస్తున్నాయి. పారిశ్రామిక రంగాన్ని పునరుజ్జీవనం చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భారత్, చైనాలతో సన్నిహిత సంబంధాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి.

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

Advertisement
 
Advertisement
Advertisement