బయో–ఆర్థిక వ్యవస్థపై లేని గొప్పలు | Sakshi Guest Column On Bio Economy | Sakshi
Sakshi News home page

బయో–ఆర్థిక వ్యవస్థపై లేని గొప్పలు

Apr 20 2026 12:04 AM | Updated on Apr 20 2026 12:04 AM

Sakshi Guest Column On Bio Economy

విశ్లేషణ

బయోటెక్నాలజీ శాఖ (డీబీటీ) ఇటీవల భారతీయ బయో–ఆర్థిక వ్యవస్థ పదవ వార్షిక నివేదకను విడుదల చేసింది. భారత్‌ బయో ఆర్థిక వ్యవస్థ 2014లో ఉన్న సుమారు 10 బిలియన్‌ డాలర్ల నుంచి 2025 నాటికి 195 బిలియన్‌ డాలర్లకు పైగా పెరిగిందని శాస్త్ర–సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌  ప్రక టించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం బయో టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు, గత దశాబ్దంలో అద్భుతమైన ప్రగతిని సాధించి ఉండాలి. ఈ నివేదిక ప్రకారం, 2024లో 167 బిలియన్‌ డాలర్లుగా ఉన్న భార తీయ బయో ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2025లో సుమారు 195 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. డీబీటీ వల్ల వెలుగు చూసిన నవీక రణలు, బయోటెక్నాలజీ పరిశోధన–అభివద్ధి విభాగం (ఆర్‌ అండ్‌ డీ) వల్ల గడచిన పదేళ్ళలో భారతదేశపు బయో ఆర్థిక వ్యవస్థ అసా ధారణమైన వేగంతో దూసుకు వెళ్లిందనే అభిప్రాయాన్ని ఈ నివేదిక కలుగజేసింది. 

అన్నింటినీ లెక్కల్లో కలిపేసి...
లోతుల్లోకి వెళితే అసలు వాస్తవాలు బయటపడతాయి. పద్దు లలో, నిర్వచనాల్లో చేసిన తెలివైన మార్పుల వల్ల సంఖ్యలు నాటకీ యంగా పెరిగాయేగానీ ఆర్‌ అండ్‌ డీ చేసిన కృషి వల్ల కాదు. గతంలో లెక్కలోకి తీసుకోని లేదా పాక్షికంగా మాత్రమే చేర్చు కున్న మొత్తం ఉప రంగాలన్నింటినీ కలిపేసుకోవడం వృద్ధిలో ప్రధాన భాగానికి కారణమని తేలుతుంది. బయోటెక్‌ ఆధారిత వ్యాక్సీన్లు, ఫార్మాస్యూటికల్స్‌తో పాటు బీరు, డిటర్జెంట్ల నుంచి... ఇంధనంలో ఎథనాల్‌ కలపడం వరకు పెక్కు ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు, సేవల విలువను ఆ సంఖ్యలకు జోడించడం వృద్ధికి అసలు కారణం. నిజానికి, 195 బిలియన్‌ డాలర్ల విలువలో సుమారు సగ భాగం బయో–పారిశ్రామిక వస్తూత్పత్తి (ఆల్కహాలిక్‌ పానీయాలు 25 బిలియన్‌ డాలర్లు), పశు గ్రాసం (23 బిలియన్‌ డాలర్లు), ఇంధనంలో ఎథనాల్‌ను మిళితం చేయడం (12 బిలియన్‌ డాలర్లు), ఆహారం–పాడి పరిశ్రమ ఉత్పత్తుల (8 బిలియన్‌ డాలర్లు) నుంచి చేకూరినవని తేలుతుంది. కణాలు, ప్రొటీన్లు, కణజాలాల నుంచి తయారు చేసిన ఔషధాలు లేదా వైద్య ఉత్పత్తులు, వైద్య సాధనాలు, వ్యాధి నిర్ధారణ, టీకాలతో కూడిన బయో–ఫార్మా విలువ 64 బిలియన్‌ డాలర్లుగా ఉంటుంది. 

పెరుగు బయోటెక్నాలజీ ఉత్పత్తి?
పాడి పరిశ్రమ ఉత్పత్తులను కూడా కలుపుకోవడం గమనిస్తే చాలు, బయో ఆర్థిక వ్యవస్థ గణనలోని డొల్లతనం ప్రస్ఫుట మవుతుంది. పులియడం వల్లనే పెరుగు తయారవుతుంది. పాల లోని లాక్టోస్‌ను ల్యాక్టిక్‌ యాసిడ్‌ బ్యాక్టీరియా ల్యాక్టిక్‌ యాసిడ్‌గా మార్చి, కేజిన్‌ ప్రొటీన్లు గడ్డకట్టడానికి సాయపడుతుంది. పులియ బెట్టిన డెయిరీ పదార్థాల ఉత్పత్తి బయోటెక్నాలజీ వినియోగానికి సంకేతమని చెబుతున్నారు. విలువను జోడించేందుకు, పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఆ ప్రక్రియ సాయ పడుతోంది కనుక దాన్నీ తమ వృద్ధి విజయగాథలో భాగం చేసుకుంటాం అంటున్నారు. ప్రభుత్వ నివేదిక ప్రకారం, పెరుగు కూడా బయోటెక్నాలజీ ఉత్పత్తి కిందనే లెక్కన్న మాట! సజీవ సూక్ష్మ జీవులైన స్టార్టర్‌ కల్చర్లను ఉపయోగించి పాలను పులియబెట్టి సృష్టి స్తున్నది కనుక, పెరుగు బయో–పారిశ్రామిక ఉత్పత్తి కింద లెక్క. 

బయో సర్వీసుల విభాగాన్ని (25 బిలియన్‌ డాలర్లు) చేర్చడం కూడా బయో ఆర్థిక వ్యవస్థ చూపిన తళుకు బెళుకు సంఖ్యలకు మరో కారణం. ఇవేవీ కీలకమైన ఆర్‌ అండ్‌ డీ సర్వీసుల కిందకు రావు.  ఫార్మాస్యూటికల్‌ కంపెనీలకు క్లినికల్‌ అధ్యయనాలు, వాటి సంబంధిత సేవల కిందకు వస్తాయి. బహుళజాతి జీవ శాస్త్రాల సంస్థలకు ఔట్‌ సోర్సింగ్‌ సేవల కిందకు వస్తాయి. జీవ శాస్త్రాలకు సంబంధించిన సుమారు 150 గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) హైదరాబాద్, బెంగళూరుల్లోనే ఉన్నాయి. ఈ యూనిట్లు వాటికి మాతృసంస్థలకు చెందిన వివిధ (పరిశోధన, రెగ్యులేటరీ, ఎనలటిక్స్, ఎంటర్‌ప్రైజ్‌) పనులను చక్కబెడతాయి. ఇక్కడ మాతృసంస్థలంటే, ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, మెడికల్‌ సాధనాల కంపెనీలన్న మాట. బయో ఆర్థిక వ్యవస్థ విలువను గణించడంలో మొత్తం జీసీసీలను లెక్కలోకి తీసుకున్నారు. చోద్యం ఏమిటంటే, సాఫ్ట్‌వేర్‌ సర్వీసులకు చెందిన పరిశ్రమ సంస్థ ‘నాస్‌కామ్‌’ విడుదల చేసిన డేటా కూడా టెక్నాలజీ ఔట్‌ సోర్సింగ్‌లో భాగంగా అవే జీసీసీలను పరిగణనలోకి తీసుకోవడం!

బలహీనతలు కప్పిపుచ్చుకునేందుకే!
బయో ఆర్థిక వ్యవస్థ నివేదికను తయారుచేసే కసరత్తును మొదట్లో బయోటెక్నాలజీ నేతృత్వ సంస్థల సంఘం నిర్వహించేది. అది 2016లో దాన్ని మొదలుపెట్టింది. ఆ పరిశ్రమకు సంబంధించి పన్నుల్లో రాయితీలు గట్రా రాబట్టే లాబీయింగ్‌ గ్రూపుగా అది పని చేసేది. తర్వాత, ఆ బాధ్యతను బయోటెక్నాలజీ శాఖ తలకెత్తుకుంది. కాగా, ఆకర్షణీయమైన సంఖ్యలను సమర్పించే పని మూడేళ్ళ క్రితమే మొదలైంది. బయో–పారిశ్రామిక రంగాన్ని చేరుస్తూ, బయో ఆర్థిక వ్యవస్థ నిర్వచనంలో 2023లో మార్పు తెచ్చారు. ఆ నిర్వచనం, పూర్వం నుంచి అమలులోకి వచ్చే విధంగా, 2020, 2021, 2022 సంవత్సరాల సంఖ్యలను సవరించారు. 

డీబీటీ రూపుదిద్దుకునేందుకు పదేళ్ళకు ముందే, అంటే 1986లోనే, దేశీయ పరిజ్ఞానంతో ఎంజైములను తయారు చేసే సంస్థను కిరణ్‌ మజుందార్‌ షా నెలకొల్పారు. ఆల్కహాలిక్‌ పానీయాలు, సబ్బులు, డిటర్జెంట్లు, పశుగ్రాసం, పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులు, ఇతర ప్రోబయోటిక్స్, టెక్స్‌టైల్స్, తోలు పరిశ్రమ... ఇలా చెబుతూ వెళితే చాలా వాటి తయారీలో పారిశ్రామిక ఎంజై ములను ఉపయోగిస్తారు. పారిశ్రామిక బయోటెక్నాలజీ వాణిజ్య వినియోగం చాలా ఏళ్ళుగా సాగుతోంది. దాన్ని వినియోగించుకుంటున్న ప్రైవేటు సంస్థలకు డీబీటీ ఆర్‌ అండ్‌ డీ ఫలితాలు నామమాత్రంగా పనికొచ్చాయని చెప్పవచ్చు. 

కొన్ని సంస్థలకు ఏ విధంగానూ ఉపకరించిందీ లేదు. డీబీటీ ఒక విధంగా ‘క్రెడిట్‌ చోరీ’కి ప్రయత్నిస్తోంది. గొప్పగా చెప్పుకుంటున్న సంఖ్యలు బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే తోడ్పడుతున్నాయి. బయోటెక్నాలజీ రంగం ఆ సంఖ్యలు సూచిస్తున్నంతగా పరిణతి చెందలేదు. ప్రభుత్వం 2025 ఏడాదికి సాధించిన ప్రగతికి సంబంధించి చెప్పిన సంఖ్యలో దాదాపు సగ భాగం బయో–పారిశ్రామిక విభాగం చలవేనని చెప్పాలి. అది ఇంధనంలో ఎథనాల్‌ మిళితం చేయడం వల్ల ఒనగూడిన హంగు.

చైనా బయోటెక్నాలజీ రంగం 300 బిలియన్ల డాలర్లకు పైగా విలువతో వర్ధిల్లుతోంది. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏరుకొచ్చిన సంఖ్యలపై ఆధారపడే బదులు భారతదేశపు బయోటెక్నాలజీ ఆర్‌ అండ్‌ డీ – నవీకరణ రంగం సాధించిన ప్రగతి, అది వాణిజ్య పరంగా ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ, ఆర్‌ అండ్‌ డీకి మార్కెట్లకు మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరిస్తూ ఒక నివేదికను ప్రచురిస్తే సముచితంగా ఉంటుంది.

దినేశ్‌ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement