సమష్టిగా నారీశక్తిని బలోపేతం చేద్దాం! | Sakshi Guest Column On women empowerment by Narendra Modi | Sakshi
Sakshi News home page

సమష్టిగా నారీశక్తిని బలోపేతం చేద్దాం!

Apr 9 2026 12:06 AM | Updated on Apr 9 2026 12:07 AM

Sakshi Guest Column On women empowerment by Narendra Modi

సందర్భం

మరికొన్ని రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో పండగ వాతావ రణంతో సందడి మొదలు కాబో తున్నది. అస్సాం ప్రజలు రొంగాలి బిహు జరుపుకొంటే, ఒడిశా ప్రజలు మహా బిషుబ పాన సంక్రాంతి నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్‌లో పొయిలా బైశాఖ్‌ బెంగాలీల నూతన సంవత్సరానికి నాంది పలికితే, కేరళలో సంబరంగా విషు పండగ నిర్వహిస్తారు. తమిళనాడులో పుత్తాండు పర్వదినాన్ని, పంజాబ్‌ సహా ఉత్తర భారతంలోని ఇతర ప్రాంతాల్లో బైశాఖీ వేడుకను చేసుకుంటారు. ఇవన్నీ ఆశాభావాన్నీ, సానుకూల దృక్పథాన్నీ పెంపొందిస్తాయి. దేశ విదేశాల్లో ఈ వేడుకలను నిర్వహించుకొనే వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్ర ఉత్సవాలు అందరి జీవితాల్లోనూ ఆనందాన్నీ, సౌభాగ్యాన్నీ తీసుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను.

ఏప్రిల్‌ 11 నుంచి మహాత్మా ఫూలే 200 జయంత్యుత్సవాలను మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ నెల 14న జయంతి సందర్భంగా డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు యావత్‌ భారతదేశం నివాళి అర్పిస్తుంది. ఈ ప్రత్యేక సందర్భాలే కాకుండా, మన హృద యాలూ, ఆలోచనలూ పునర్నవీకరణ స్ఫూర్తితో నిండిన వేళ... మన దేశం మరో చారిత్రక విజయం ముంగిట నిలబడింది. ప్రజాస్వామ్య పునాదులను మరింత పటిష్ఠం చేసుకోవడానికీ, సమానత్వం, సమ్మి ళితత్వం దిశగా మన సమష్టి నిబద్ధతను పునరుద్ఘాటించడానికీ లభించిన గొప్ప అవకాశమిది.

ప్రత్యేకమైన సందర్భం
మహిళల రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లే ముఖ్యమైన బిల్లుపై చర్చించేందుకు, ఆమోదించేందుకు ఏప్రిల్‌ 16న పార్లమెంటు సమా వేశం కానుంది. దీనిని ఓ శాసనపరమైన కార్యక్రమంగా పేర్కొంటే ఈ బిల్లు ప్రాధాన్యాన్ని తగ్గించినట్టే అవుతుంది. భారత్‌లోని కోట్లాది మహిళల ఆకాంక్షలకు ఇది ప్రతిబింబం. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే సమాజం పురోగమిస్తుందనే మన సుదీర్ఘ నాగరికతా స్ఫూర్తికి ఇది నిదర్శనం. దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే. ఈ దేశానికి వారు అందిస్తున్న సేవలు అపారమైనవి, అమూల్యమైనవి. ప్రతి రంగంలోనూ మహిళలు సాధిస్తున్న అద్భుతమైన విజయాలకు నేడు భారత్‌ కేంద్రంగా మారింది. శాస్త్ర, సాంకేతిక రంగాల నుంచి ఔత్సాహిక పారిశ్రామిక రంగం వరకు, క్రీడల నుంచి రక్షణ బలగాల వరకు, సంగీతం నుంచి కళల వరకు దేశాభివృద్ధిలో మహిళలే అగ్రగామిగా ఉన్నారు. కొన్నేళ్లుగా చేసిన ప్రయత్నాలు స్త్రీ సాధికారత దిశగా అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. చదువుకునేందుకు పెరిగిన అవకాశాలు, మెరుగైన ఆరోగ్య సేవలు, విస్తరించిన ఆర్థిక సమ్మిళితత్వం, అందుబాటులోకి వచ్చిన ప్రాథమిక అవసరాలు... ఆర్థిక, సామాజిక కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని విస్తృతం చేశాయి. 

అయినప్పటికీ, సమాజంలో మహిళలు పోషిస్తున్న పాత్రకు అనుగుణంగా రాజకీయ రంగంలో, శాసనసభల్లో వారికి ప్రాతి నిధ్యం లభించలేదు. ఇది దురదృష్టకరం. పరిపాలనలో, నిర్ణయాధి కారంలో మహిళలు భాగస్వాములైతే... వారిదైన ఆలోచనలనూ, అనుభవాలనూ జోడించడం ద్వారా ప్రజోపయోగ చర్చలు, పాలనా సామర్థ్యం మరింత మెరుగవుతాయి. రానున్న అంటే... 2029లో లోక్‌సభ, వివిధ రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరిగే నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం అనివార్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకు దక్కా ల్సిన ప్రాధాన్యాన్ని అందించేందుకు గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చాయి. కమిటీలు ఏర్పాటయ్యాయి. ముసా యిదా బిల్లులను ప్రవేశపెట్టారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చ లేదు. అయినప్పటికీ... చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగా లన్న అంశంలో విస్తృత ఏకాభిప్రాయం వ్యక్తం అయింది. ఈ ఏకాభి ప్రాయ స్ఫూర్తితోనే 2023 సెప్టెంబరులో ‘నారీ శక్తి వందన్‌ అధి’ని యవ్‌ును పార్లమెంటు ఆమోదించింది. నా జీవితంలోని అత్యంత ప్రత్యేకమైన సందర్భాల్లో ఒకటిగా నేను దీనిని భావిస్తాను.

ఏకతాటి పైకి రావాల్సిన సమయం
మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఈ అవకాశం మన రాజ్యాంగ స్ఫూర్తిలో ప్రతిధ్వనిస్తోంది. ఆచరణాత్మక రూపంలో సమానత్వానికి ప్రాతినిధ్యం ఉన్న సమాజాన్ని నిర్మించాలని మన రాజ్యాంగ నిర్మా తలు ఆకాంక్షించారు. ఈ ఆకాంక్షలను నెరవేర్చడంలో భాగంగా చేపడుతున్న ప్రయత్నాల్లో ప్రధానం... శాసన వ్యవస్థల్లో మహిళల పాత్రను బలోపేతం చేయడం. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రతి పౌరునికీ సమాన భాగస్వామ్యాన్ని అందించే సమాజాన్ని నిర్మించడంలో మా చిత్తశుద్ధిని ఇది ప్రతిబింబిస్తుంది. మహిళల ప్రాతినిధ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి జాప్యం జరిగినా... ప్రజాస్వామ్య సమ్మిళితత్వాన్నీ, ప్రజాస్వామ్య స్ఫూర్తినీ మనం వాయిదా వేసినట్లే! శాసన వ్యవస్థల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని దశాబ్దాల కిందటే గుర్తించారు. ఇప్పుడు గనుక దీనిని వాయిదా వేస్తే... మనం గుర్తించిన, సరిదిద్దగలిగిన అసమతౌల్యాన్ని మరింత పెంచడమే అవుతుంది. నిర్దిష్ట లక్ష్యంతో, ఆత్మవిశ్వాసంతో భారత్‌ ముందుకు సాగు తున్న ఈ తరుణంలో ప్రజలు, ముఖ్యంగా జనాభాలో సగభాగంగా ఉన్నవారి ఆకాంక్షలను మన శాసన వ్యవస్థలు ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది. సకాలంలో చేపట్టే చర్యలు దీర్ఘకాలంగా నెరవేరని వాగ్దానాలను నెరవేర్చడమే కాకుండా ప్రగతి వేగాన్ని సైతం కొనసా గిస్తాయి. మన ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రాతినిధ్యం కల్పించే దిగా తీర్చిదిద్దేందుకు ఇది నిజంగా చరిత్రాత్మక అవకాశం.

ఇది ఏ ఒక్క ప్రభుత్వానికో, పార్టీకో లేదా వ్యక్తికో సంబంధించిన అంశం కాదు. దీనిని సాకారం చేసుకునే దిశగా దేశమంతా ఏకతాటి పైకి రావాల్సిన సమయం. మన నారీశక్తికి మనం అందించాల్సింది ఇదే. అందుకే మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లభించే ఆమో దంలో విస్తృత ఏకాభిప్రాయం వ్యక్తం కావాలి. మన కోసం కాకుండా భవిష్యత్‌ తరాల కోసం పనిచేయాలనే స్ఫూర్తిని ఇలాంటి అవకా శాలు మనకు అందిస్తాయి. మార్పులను స్వీకరిస్తూ, మరింత సమ్మిళి తత్వాన్ని సాధించడంలోనే అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి దాగి ఉందన్న సంగతిని గుర్తు చేస్తున్నాయి. చరిత్రాత్మకమైన ఈ పార్లమెంటు సమావేశం సమీపిస్తున్న నేపథ్యంలో... భారతీయ మహిళల కోసం చేపడుతున్న ఈ ముఖ్య మైన కార్యక్రమానికి మద్దతు అందించాలని పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అత్యున్నత ప్రజా స్వామ్య విలువల కోసం కలిసి నడుద్దాం. జాతీయ ప్రయోజనాల విషయంలో విభేదాలను పక్కన పెట్టి, ఐక్యంగా వ్యవహరించ గలదని భారత్‌ ఎల్లప్పుడూ రుజువు చేస్తూనే ఉంది. ఇది అలాంటి సందర్భమే! రాజ్యాంగ విలువలను బలోపేతం చేద్దాం. దేశ ప్రగతి కోసం నారీశక్తికి సాధికారత కల్పిద్దాం. 

నరేంద్ర మోదీ
భారత ప్రధాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement