దౌత్యమా... ఇంకా దాదాగిరీయేనా? | Sakshi Guest Column On USA Donald Trump, Israel Iran War Issue | Sakshi
Sakshi News home page

దౌత్యమా... ఇంకా దాదాగిరీయేనా?

Apr 30 2026 12:36 AM | Updated on Apr 30 2026 12:36 AM

Sakshi Guest Column On USA Donald Trump, Israel Iran War Issue

అభిప్రాయం

మొదటి విడత చర్చలు ఏప్రిల్‌ 12న విఫలమై, రెండవ విడతకు ముహూర్తమైనా కుదరని స్థితిలో, తాను దౌత్యానికి మారదలచుకున్నారా లేక దాదాగిరీ పద్ధతిలోనే కొనసాగుతారా అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తేల్చుకోవలసి ఉంది. లేదంటే ఇరాన్‌తో మళ్ళీ చర్చలు గానీ, సమస్య పరిష్యారం గానీ జరిగే సూచనలు లేవు. రెండవ విడత కోసం పాకిస్తాన్‌ ప్రయత్నిస్తుండగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఇస్లామాబాద్‌కు ఏప్రిల్‌ 24, 25వ తేదీలలో వెళ్ళి చర్చల పునరారంభానికి తమ షరతులేమిటో చెప్పి తిరిగిపోవటం, తమ ప్రతినిధుల ప్రయాణాన్ని ట్రంప్‌ అకస్మాత్తుగా రద్దు చేయటాన్ని బట్టి అర్థమవుతున్నది ఇదే. అరాగ్చీ ప్రతిపాదించిన షరతులేమిటో అధికారికంగా వెల్లడి కాలేదు గానీ, అవి గతానికన్నా భిన్నంగా ఉండే అవకాశం తక్కువ. అసలు విషయం అది కాదు. ఇరాన్‌కు సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్‌ల లక్ష్యాలు మారటమన్నది మౌలిక ప్రశ్న. ఒకసారి అది తేలితే ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో రాజీలు కుదరటం సాధ్యమవుతుంది. 

మొదట్నుంచీ అదే వైఖరి
ఈ మాట అనటం ఎందుకంటే, ఇరాన్‌ పట్ల దౌత్యానికి బదులు దాదాగిరీ వైఖరిని తన మొదటి విడతలోనే (2017–21) ప్రదర్శించిన ట్రంప్, ఈ రెండవ విడతలోనూ అదే పని చేస్తున్నారు. ఇరాన్‌తో చర్చలు ఒక కొలిక్కి వస్తుండగానే ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలిసి దాడులు ఆరంభించటం మొదలుకొని, మొదటి విడత చర్చల వైఫల్యం మీదుగా ఈ రెండవ విడత చర్చల అనిశ్చితి వరకు తను చూపుతున్నది ఆసాంతం దాదాగిరీయే. తమ అసమానమైన ఆర్థిక, సైనిక శక్తులు మినహా ఆయన నోటి నుంచి మరొక మాట వినిపించదు. వాటిని ఉపయోగించి ఇరాన్‌ సహా ఎవరినైనా సర్వనాశనం చేయగలమంటారు. ఇందులో దౌత్య విధివిధానాలు ఆవగింజంతయినా కనిపిస్తున్నాయా?

ట్రంప్‌లో దౌత్య నీతి లక్షణాలుంటే, యురేనియం శుద్ధి విషయమై  ఇరాన్, అమెరికాల మధ్య (రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో కలిపి) 2015లో కుదిరిన ఒప్పందం సజావుగా సాగుతుండగా 2018లో దానిని అకస్మాత్తుగా రద్దు చేసేవారు కాదు. ఇరాన్‌పై యుద్ధానికి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ఎంత ఒత్తిడి చేసినా బుష్, ఒబామా, బైడెన్‌లు నిరాకరించిన స్థితిలో, తాను దాడులకు సిద్ధమయ్యేవారు కాదు.  పరిష్కారం లభించవచ్చుననుకున్న ప్రతి దశలోనూ ఆ అవకాశాలను ఇజ్రాయెల్‌ భంగపరుస్తుండగా మౌనం వహించేవారు కాదు. వాస్తవానికి దాదాగిరీ లక్షణాన్ని ఆయన చూపుతున్నది ఇరాన్‌ విషయంలోనే కాదు. రెండవసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి పనామా కాలువ, కెనడా, గ్రీన్‌ల్యాండ్, వెనిజులా విషయమై చేసిందేమిటో తెలిసిందే. యుద్ధాలు ఆపే ప్రతిజ్ఞలు చేసిన మనిషి, 9 యుద్ధాలు ఆపానంటూ ఇప్పటికి కొత్తగా 8 సైనిక దాడులు సాగించారు. టారిఫ్‌లు, బలవంతపు వాణిజ్య ఒప్పందాల అరాచకం సరేసరి.
 
ఇందులోనూ గమనించదగ్గ విశేషం ఒకటున్నది. తన పులి చారలు, కోరలను అనునిత్యం ప్రదర్శించి ప్రపంచాన్ని భయపెట్టజూసే ఆయనలో ‘కాగితం పులి’ లక్షణాలు కూడా ఉన్నాయి. అది, బలహీనుల ముందు విజృంభించి బలవంతుల ఎదుట తగ్గి ఉండటం. పనామా, వెనిజులా విషయంలో జరిగింది ఒకటైతే, తనను ధిక్కరించిన కెనడా, గ్రీన్‌ల్యాండ్‌ (యూరప్‌), బ్రెజిల్, దక్షిణాఫ్రికాల సంగతి వేరయ్యింది. ఉక్రెయిన్‌ యుద్ధంపై రష్యాను లొంగదీయలేక తానే రాజీకి ప్రయత్నిస్తున్నారు. చైనా మాట అయితే చెప్పనక్కరలేదు. ఇరాన్‌ ప్రతిఘటనలు మరొక దృష్టాంతం.

పరిష్కారానికి రాజమార్గం
కొంత లోతుకి వెళ్ళినట్లయితే, ట్రంప్‌ ద్వారా ప్రదర్శితమవుతున్న ఈ లక్షణాలన్నీ అమెరికా సామ్రాజ్యవాదం క్రమంగా బలహీనపడుతూ... దానికి స్లో–మోషన్‌ సంకేతాల వంటివి. అమెరికన్‌ నాయకత్వపు ‘నాటో’ కూటమిలోనే పెరుగుతున్న భిన్నాభిప్రాయాలు, కనీసం ఇరాన్‌ దిగ్బంధానికైనా ఏ ఒక్కరూ కలిసి రాకపోవటం, మరొక స్థాయిలో బహుళ ధ్రువ ప్రపంచ ఆకాంక్షలు విస్తరిస్తుండటం ఈ మార్పులను ప్రతిఫలిస్తున్నాయి. ఈ పలు విధాలైన పరిణామాల దశలో ఇరాన్‌ ఒక హీరోలా లేచి నిలుచున్నది. అందువల్ల అమెరికా అధ్యక్షుడు వాస్తవాలను కనీసం ఇప్పటికైనా గుర్తించి, ఇజ్రాయెల్‌ ప్రభావం నుంచి బయటపడి, దౌత్యమార్గం వైపు మళ్లటం మంచిదవుతుంది. 

తమ సార్వభౌమతను, హక్కులను కాపాడుకునేందుకు ఇరాన్‌ చూపుతున్న దృఢ సంకల్పం, ప్రతిఘటన సాధారణమైనవి కావు. మనం స్వయంగా చూసినంతవరకు వియత్నాం(1955–75), అఫ్గానిస్తాన్‌(2001–21) తర్వాత, 1953 నుంచి మొదలై నేటికీ సాగుతున్న ఇరాన్‌ పోరాటం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. యురేనియం శుద్ధి తదితర అంశాలపై చర్చలు సానుకూలంగా జరుగుతుండగానే అకస్మాత్తుగా దాడులు జరిపి ఇరాన్‌ రాజకీయ, సైనిక నాయకత్వాలను నిర్మూలించటం నుంచి మొదలు కొని, ఇరాన్‌ రేవులను దిగ్బంధించటం వరకు గల క్రమం అంతా చూపుతున్నది అమెరికా దౌత్య నీతినా లేక బస్తీ రౌడీ లక్షణాలనా? 

ఇరాన్‌ రెండవ విడత చర్చలకు నిరాకరించటమే సరైనదని భావించక తప్పదు. విదేశాంగ మంత్రి అరాగ్చీ ఇస్లామాబాద్‌లో 25వ తేదీన మరోమారు అన్నమాట: అమెరికాకు విశ్వసనీయత లేకుండా పోయిందనీ, అది కుదిరేవరకు తాము చర్చలకు వెళ్లబోమనీ, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమనీ. ఆ తర్వాత ఒమాన్, రష్యా సందర్శనల వెనుక ఆయన తెహ్రాన్‌కు తిరిగి వెళ్ళి అన్ని పరిస్థితులను సమీక్షించుకున్నపుడు, వైఖరి అంటూ మార్చుకోవలసింది స్వదేశంలోనూ విశ్వసనీయతను కోల్పోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రమే అని అర్థమవుతుంది. సమస్య పరిష్కారానికి రాజమార్గం ఎదుటనే ఉంది. అది అంతర్జాతీయ నిబంధనల మేరకు అణుశుద్ధికి ఇరాన్‌కు గల హక్కులకు అడ్డుచెప్పకపోవటం, పాలస్తీనా సృష్టిని అంగీకరించటం, గ్రేటర్‌ ఇజ్రాయెల్‌ పథకాన్ని రద్దు చేయటం!

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement
 
Advertisement
Advertisement