తీర ప్రజలకు 'కారిడార్‌' ముప్పు | Sakshi Guest Column On Corridor threat to coastal people in AP | Sakshi
Sakshi News home page

తీర ప్రజలకు 'కారిడార్‌' ముప్పు

Apr 12 2026 5:25 AM | Updated on Apr 12 2026 5:25 AM

Sakshi Guest Column On Corridor threat to coastal people in AP

ఒక పని తలపెట్టినప్పుడు దాని పర్యవసానాలు చూడాలి. మంచీచెడూ ఆలోచించాలి. విచక్షణ ఉండాలి. మరికాస్త సంయమనం పాటించాలి. వ్యక్తులకైనా, ప్రభుత్వాలకైనా, సంస్థకైనా ఇది లోపించినప్పుడు ఆ వ్యవస్థలోని సమూ హాలు అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. కార్పొరేట్ల దోపిడీకి చట్టబద్ధత కల్పించే విధాన నిర్ణయాలు తీసుకోవడంతో నివారించ వీల్లేని ప్రమాదాన్ని విజనరీ ప్రభుత్వాలు తెచ్చిపెడుతున్నాయి. బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ తవ్వకాలకు ఏపీ ‘డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌’ అనుసరించే విధానం రాబోయే కాలంలో పెను ముప్పు కాబోతుందని పర్యావరణ నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సముద్రం లోపల ఖనిజాలు, లోహాలు; సముద్ర తీర ఇసుకలో ఉన్న ఖనిజ తవ్వకాలకు ప్రయత్నాలు జరుగు తున్నాయి. అడవిలోని ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో ఆటంకంగా ఉన్న ఆదివాసీ చట్టాలను బలహీనం చేస్తున్న ప్రభుత్వాల వ్యవహారం తెలిసిందే. ఇప్పుడు అదేవిధంగా విలువైన ఖనిజం ఎక్కడున్నా కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో ‘డబుల్‌ ఇంజన్లు’ వెళ్తున్నాయి. సముద్ర గర్భంలోని అపార ఖనిజ, లోహాలను వెలికితీసే ప్రణాళిక రూపొందించి, సముద్రంలో ఖనిజాలు గుర్తించడానికి ‘డీప్‌ ఓషన్‌ మిషన్‌’ కింద 4వేల కోట్లు పైగా కేంద్రం కేటాయించింది. 

జాతీయ భద్రతా మండలి సచివాలయం... సర్వే ఆఫ్‌ ఇండియా తాజా లెక్కల ప్రకారం 11,098 కిలోమీటర్ల భారత సముద్రతీరంలో ఖనిజ తవ్వకాలకు ప్రణాళిక తయారు చేసింది. భారత సముద్ర తీరంలో అత్యధిక పరిమాణంలో మైనింగ్‌ ప్రాసెసింగ్, పరిశోధన, తయారీలకు ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ప్రత్యేక ‘రేర్‌ ఎర్త్‌ కారిడార్‌’గా ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఖనిజ తవ్వకాలకు ముందుకొచ్చే కార్పొరేట్లకు పెట్టుబడి ప్రోత్సాహం, భారీ రాయితీలు ఇచ్చేందుకు 2026–27 బడ్జెట్‌లో రూ. 7,280 కోట్లు కేటాయించింది. 

ఖనిజ దిగుమతిపై చైనాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలు వెతకడం అమెరికా ప్రారంభించింది. సొంత ఉత్పత్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, భారత్‌  నుంచి ఎగుమతి చేసుకోవడం సురక్షితమని అమెరికా భావిస్తోంది. అమెరికా మాట కాదని చెప్పలేని కేంద్ర పాలకులు, వారికి అంగుదారునిగా తయారైన ఏపీలోని కూటమి ప్రభుత్వం అమెరికాకు ప్రయోజనం చేకూర్చేలా ఖనిజ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తున్నాయి. అందుకనే  రేర్‌ ఎర్త్‌ కారిడార్‌ పల్లవిని డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఎత్తుకుంది.

రాష్ట్ర పరిధిలోని హక్కులను బలహీనం చేసి, ఆధిపత్యం పెంచుకునే కేంద్ర దుశ్చర్యలపై చంద్రబాబు ప్రభుత్వం మాట్లాడడం లేదు. శాంతిభద్రతలు, సహజ వనరులు, ఖనిజాలు, మారిటైమ్, పట్టణ విధానం, భూ చట్టాలు, వ్యవసాయం వంటివి రాష్ట్ర పరిధిలో ఉన్నప్ప టికీ, నేరుగా కేంద్రం జోక్యం చేసుకొని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల దోపిడీకి అనుకూలమైన చట్టాలను కేంద్రం చేస్తోంది.

బీచ్‌శాండ్‌ అపారం
సర్వే ఆఫ్‌ ఇండియా తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని తీర ప్రాంతంలో బీచ్‌శాండ్‌ నిల్వలు 241 మిలియన్‌ టన్నులకు పైగా ఉన్నాయి. దేశంలోని బీచ్‌శాండ్‌ నిల్వలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది. ప్రపంచంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగ వృద్ధికి ప్రాధాన్యం పెరుగుతుందన్న నేపథ్యంలో 2030 నాటికి రేర్‌ ఎర్త్‌ పర్మినెంట్‌ మ్యాగ్నెట్‌ల వినియోగం రెట్టింపు అవుతుందని అంచనా. రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సముద్రతీరంలో మోనజైట్‌ నిల్వలు 35 శాతం ఉన్నాయి. సాంద్రత కల్గిన సముద్ర ఇసుకలో లభ్యమైన ఇల్మనైట్, జిర్కాన్, మోనజైట్, గార్నెట్, రూటైల్‌ వంటి ఖనిజం నుంచి వచ్చే థోరియం, యురేనియం, టైటానియం వంటి వాటిని విమానయాన, రక్షణ, గ్రీన్‌ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రికల్‌ వాహనాలు, విండ్‌ టర్బైన్లలో వినియోగించడంతో ప్రపంచంలో ఈ ఖనిజాలకు డిమాండ్‌ పెరిగింది. 

రాష్ట్రంలో అత్యంత నాణ్యమైన ఖనిజం 40 వేల ఎకరాలలో ఉన్నట్లు ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎమ్డీసీ) గుర్తించింది. సెమీ కండక్టర్ల పరిశ్రమల కోసం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం, శ్రీకాకుళం జిల్లా గార మండలాల తీరంలోని 2,500 ఎకరాల్లో ఖనిజ తవ్వకాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బీచ్‌శాండ్‌ ఖనిజ తవ్వకాలు, ప్రాసెసింగ్‌ను ఓ కార్పొరేట్‌ కంపెనీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సముద్రతీర ఇసుకలోని ఖనిజం ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వకూడదన్న  కోర్టు తీర్పులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సముద్ర ఇసుకలో దొరికే అరుదైన ఖనిజాలు కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. 

పొంచి ఉన్న ప్రమాదాలు
బీచ్‌శాండ్‌ ప్రాసెసింగ్‌ క్రమంలో వచ్చే శబ్దాలు, ప్రకంపనలు, సముద్రంలో విడిచిపెట్టే ఇంధనాలు, రసాయ నాలతో మత్స్య సంపద భారీగా దెబ్బతినడంతో పాటు జీవ, మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  ఇసుక దిబ్బలు కోతకు గురైతే సమీప నివాసిత ప్రాంతాల్లోకి ఉప్పునీరు ప్రవేశించి తాగునీటి సమస్య రానుంది. నిర్మాణాలు తొందరగా దెబ్బతింటాయి. సముద్ర తీరంలో ఔషధ, రసాయన పరిశ్రమలు విడిచిపెడుతున్న వ్యర్థాలతో చేపల ఉత్పత్తి తగ్గడంతో మత్స్యకారుల జీవనోపాధి తగ్గింది. 

ఇసుక తవ్వకాలతో ఉన్న కొద్దిపాటి ఉపాధి కూడా మత్స్యకారులకు లేకుండాపోతుంది. మోనజైట్‌ ఖనిజం నుంచి వెలువడే థోరియంతో చర్మ, క్యాన్సర్, ఊపిరి తిత్తుల వ్యాధులకు గురయ్యేవారి సంఖ్య పెరుగుతుంది. ఇన్ని అనర్థాలు, నష్టాలు, దుష్ప్రభావాలున్నా, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఇవన్నీ సాధారణ ప్రజలు అనుభవించాలన్నట్లు ప్రభుత్వాల తీరుంది. బీచ్‌శాండ్‌ మైనింగ్‌ ముప్పును ముందుగా గుర్తించి నిలువరించకపోతే జీవా వరణానికి ముప్పు తప్పదు.
– గుల్ల కాంతారావు ‘ సీనియర్‌ జర్నలిస్టు 

Advertisement
 
Advertisement
Advertisement