ఫ్లాష్‌బ్యాక్‌ తిరగేస్తే! | KSR Comment: CBN, Pawan, Lokesh Podupu Dramalu | Sakshi
Sakshi News home page

ఫ్లాష్‌బ్యాక్‌ తిరగేస్తే!

May 18 2026 1:55 PM | Updated on May 18 2026 2:07 PM

KSR Comment: CBN, Pawan, Lokesh Podupu Dramalu

దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ ప్రముఖులంతా పొదుపు మంత్రం పఠిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ ధరలపై రేట్లు భారీగా పెంచేశారు. ధరల దెబ్బకు ప్రజలు ఎలాగూ ఆయిల్ వినియోగం తగ్గించుకోక తప్పదు. అలాంటప్పుడు ప్రభుత్వాల దుబారా ఖర్చుల మాటేమిటి?.. 

మోదీ చెప్పిన ఎనిమిది, తొమ్మిది సూత్రాలతో పరిస్థితి మారదన్నది స్పష్టం. ఆయన బంగారం కొనవద్దన్నారు. మరి... ఈ రంగంపై ఆధారపడ్డ ఐదున్నర కోట్ల మంది జీవనోపాధి మాటేమిటి అని బంగారం పరిశ్రమ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ వెంటనే కేంద్రం బంగారం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచేసింది. దీంతో ఇది కొంత మెరుగేమోననే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక పొదుపు మంత్రం పఠించారు.  ప్రభుత్వపరంగా వాహనాల వాడకం తగ్గించుకోవడం ఆరంభించారు. మంచిదే.  కానీ ఇప్పటివరకూ దుబారా చేసినట్టు ప్రభుత్వమే ఒప్పుకున్నట్లు అయ్యింది. 

ఇక ఏపీలోనైనా ఈ వాహనాల వినియోగం అట్టహాసంగా ఉంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,  కీలక మంత్రి లోకేశ్‌లు హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలు వాడినట్లుగా దేశంలో మరే రాష్ట్రంలో వాడరని  చెబుతున్నారు. సీఎం ఒక్కరికే ఉన్న ఈ వెసలుబాటు ఇప్పుడు డిప్యూటీలకు, మంత్రులకు కూడా ఎలా సాధ్యమవుతోందో తెలియదు. మంత్రివర్గ సమావేశంలో పొదుపుపై సూత్రాలు చెప్పిన కాసేపటికి లోకేశ్‌ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లారట. ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్‌లు  పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర విమర్శలు గుప్పించే వారు. ఆ ధరలకు ఆనాటి ముఖ్యమంత్రి జగనే  కారణమని ఆరోపించే వారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిళ్లపై ఉన్న పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్‌ యువగళం పాదయాత్ర  సందర్భంలో కర్ణాటకలోని ఒక పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి, అక్కడి ధరకు, ఏపీలో ఉన్న ధరకు తేడాను చెప్పి విమర్శలు గుప్పించారు. అది జరిగి రెండేళ్లు దాటుతున్నా, అధికారంలో ఉన్న వీరెవరూ  ఆ ఊసే ఎత్తడం లేదు. 

ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధర ఏపీలోనే. పెట్రోల్ రేటు రూ.113 కాగా.. డీజిల్‌ ధర రూ.99 లకు చేరింది. తమిళనాడు సుమారు రూ.9, కర్ణాటక కన్నా సుమారు రూ.ఏడు ఎక్కువ. ఇప్పుడైనా రాష్ట్ర పన్నులను తగ్గించి ఆయిల్ ధరలను నియంత్రించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ విషయానికి వస్తే, రెండు  లేదా మూడు వాహనాలు, సీఎం కాన్వాయిలలో సరిపోతే, ఇంతకాలం ఎందుకు అన్ని వాహనాలు వాడారన్నదానికి జవాబు దొరకదు. 

ప్రతి శుక్రవారం ‘నో వెహికిల్ డే’ పాటించాలని, మంత్రుల విదేశీ పర్యటనలు తగ్గించాలని, ప్రత్యేక విమనాలు అదుపు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారట. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సెక్యూరిటీ పేరుతో ఎక్కువ వాహనాలను వాడడం ఫాషన్ అయిందని అన్నారు. ఈ మాట ఈ రెండేళ్లలో ఏనాడైనా అన్నారా? అధికారులకు హెచ్చరిక చేసి తన కాన్వాయిలో ఇంతకాలం  వాహన శ్రేణిని తగ్గించారా అంటే అదేమీ లేదు. చంద్రబాబు  చెప్పడానికి, చేయడానికి ఉన్న తేడాను పలువురు గుర్తు చేసుకున్నారు. 

అవసరమైతే సచివాలయానికి సైకిళ్లపై రావాలని చంద్రబాబు సూచించారట. విజయవాడ, లేదా గుంటూరు, మంగళగిరి  ప్రాంతాలలో నివసిస్తున్న  మంత్రులు, సిబ్బంది సైకిళ్లపై రావాలంటే ఎన్ని గంటల సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. అది అసలు ఆచరణ సాధ్యమేనా? ఏదో ప్రజల కోసం ఇలాంటి డైలాగులు చెబుతుంటారు. వర్క్ ఫ్రం  హోం గురించి కూడా ఆలోచిస్తున్నారు. 

ఢిల్లీ వంటి రాజధాని నగరాలలో ఇది సాధ్యమేమో కాని, గ్రామీణ ప్రాంతం అధికంగా ఉండే ఏపీలో అది ఎంత ఉపయోగమో చెప్పలేం. ఎన్నికల ప్రచారంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకోసం వర్క్ ఫ్రం హోమ్  స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, ఇళ్ల  వద్దనే ఉండి పని చేసుకోవచ్చని చంద్రబాబు విపరీత ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ మాటే ఆయన నుంచి వినిపించడం లేదు.  కేవలం ప్రభుత్వ  వాహనాల వినియోగం తగ్గించడం వల్ల  ఆదా అయ్యే చమురు వ్యయం మరీ ఎక్కువేమీ కాదు. అదే ఏపీ సర్కార్  కనుక ఆయిల్ పై ఉన్న  పన్నులు తగ్గిస్తే ఐదున్నర కోట్ల మంది ప్రజలకు ఉపయోగం జరుగుతుంది.  అప్పుడు ప్రభుత్వాన్ని కూడా  అభినందిస్తారు.అలా చేయకపోతే ప్రభుత్వం చెబుతున్న పొదుపు ఒకరకంగా సముద్రంలో నీటి బొట్టు వంటిదే అనుకోవాలి. 

కేవలం చమురులోనే అధిక వ్యయం అవుతోందా? అంటే కాదనే చెప్పాలి.  ప్రభుత్వ పరంగా సాగే ఇతర దుబారా వ్యయం  ఇంతా అంతా కాదు.దాని గురించి మాత్రం ప్రభుత్వ పెద్దలు ఎవరూ మాట్లాడడం లేదు. అంతదాకా ఎందుకు ముఖ్యమంత్రి నివసిస్తున్న ఉండవల్లి నివాసానికి, ఢిల్లీలోని నివాసానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నది వార్తలు  వచ్చాయి కదా!. 

తాజాగా ఢిల్లీలోని ఇంటి కోసం రూ.6.5 కోట్లు వ్యయం చేయడానికి జీవో ఇచ్చారు.  కొద్ది రోజుల క్రితమే మంత్రులు సింగపూర్ టూర్ చేసి వచ్చారు. అదంతా వృథా వ్యయమని విపక్ష  వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈ నెలాఖరున మరో మంత్రి కొల్లు  రవీంద్ర విదేశీ పర్యటన పెట్టుకున్నారు. ఇక అన్నిటికి మించి అమరావతి పేరుతో జరుగుతున్న దుబారా ఉంటోందన్నది సర్వత్రా వ్యక్తం అవుతున్న అబిప్రాయం. అమరావతికి ప్రభుత్వ డబ్బు రూపాయి ఖర్చు చేయనవసరం  లేదని చంద్రబాబు  పదే,పదే చెప్పేవారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రభుత్వమే బడ్జెట్లో ఆరు వేల కోట్లు కేటాయించింది. అంతేకాక సుమారు రూ.47 వేల కోట్ల అప్పులు చేశారు. వాటిలో అత్యధిక భాగం డాలర్ల రూపంలోనే ప్రపంచ బ్యాంక్,  ఏడీబీ వంటి సంస్థలు ఇస్తున్నాయి. వడ్డీతో సహా డాలర్ల రూపంలో చెల్లించాల్సి ఉండవచ్చు. అప్పుడు ఈ వ్యయం ఎంత అవుతుందో ఊహించుకోవచ్చు. పోనీ ఆయా కాంట్రాక్ట్ పనులనైనా పొదుపుగా చేస్తున్నారా అంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటికి కొత్త  భవనాల కోసం మళ్లీ వేల కోట్లు వ్యయం చేయబోతున్నారు. అందరికి అందుబాటులో ఉన్న గన్నవరం వద్ద విమానాశ్రయాన్ని కాదని ఎక్కడో మారుమూల మరో 4600 ఎకరాలలో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తారట. ఇందుకోసం తొలిదశలో  రూ.3400 కోట్లు ఖర్చు పెడతారట. రాజధాని పేరుతో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు వెచ్చిస్తున్నారంటే ఏమనుకోవాలి? కేవలం భవనాల అద్దాల కోసం రూ.2540 కోట్లు  వ్యయం చేయడమా అని అంతా నోరు వెళ్లబెడుతున్నారు. 

అమరావతి నిర్మాణాలలో  భారీ అవినీతి ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఔటర్‌ రింగ్ రోడ్డు పేరుతో 140 మీటర్ల వెడల్పు రోడ్డు వేస్తారట. దీనికి పాతికవేల కోట్ల వ్యయం అవుతుందని చెబుతున్నారు. రెండో దశ భూ సేకరణ అంటేనే  పెద్ద స్కామ్ అని టీడీపీ మద్దతుదారైన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నారు.దానికి ప్రభుత్వం నుంచి సమాధానమే రావడం లేదు.ఈ నేపథ్యంలో  ఏదో పబ్లిసిటీ కోసం పొదుపు చర్యలు కాకుండా కాంక్రీట్ గా అమరావతి పేరుతో సాగుతున్న  దుబారాను  అరికట్టే రీతిలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే అంతా స్వాగతిస్తారు. మరి ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతుందా?అంటే అనుమానమే!. 

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
 
Advertisement
Advertisement