విశాల ప్రయోజనమే విజయ రహస్యం | Sakshi Guest Column On | Sakshi
Sakshi News home page

విశాల ప్రయోజనమే విజయ రహస్యం

Apr 21 2026 12:09 AM | Updated on Apr 21 2026 12:09 AM

Sakshi Guest Column On

విశ్వగురు

జీవితానికి ఒక ప్రయోజనం అంటూ ఉండాలని ఇటువంటి సందర్భాల్లో చాలామంది చెబుతారు. నేనూ అదే కోవలో మీరొక లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలో చెప్పబోవడం లేదు. సహస్రాబ్దిలో పుట్టిన వారిగా, ఏం చేయాలో మీకు సహజసిద్ధంగానే తెలుసు. కానీ, మన కంటూ ఒక ప్రయోజనం ఉంటే సరిపోదు. అమెరికా మాజీ అధ్య క్షుడు జాన్‌ ఎఫ్‌. కెనడీ ఒకసారి ‘నాసా’ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు. అక్కడ ఒకతను చీపురు పట్టుకుని వెళుతూండటం చూసి, ఏం చేస్తున్నావని అడిగారు. ‘‘స్వామీ, చంద్రుని మీద ఓ మనిషి కాలుమోపేందుకు సహాయపడుతున్నాను’’ అని జవాబిచ్చాడు. మనం చేస్తున్న పని ఏదైనా కానివ్వండి. విస్తృత ప్రయోజనం కోసం పాటుపడుతున్నామనే అటువంటి భావన చాలా అవసరం. 

అనుసంధానంలో ఆనందం
ఫేస్‌బుక్‌ ప్రారంభించిన రోజు నాకు గుర్తుంది. హార్వర్డ్‌ కమ్యూనిటీ నంతటినీ అనుసంధానపరచగలగడం ఉత్తేజదాయకంగా ఉందనీ, ఏదో ఒక రోజు ఎవరో ఒకరు మొత్తం ప్రపంచానికి వారధి కల్పిస్తారనీ ఒక మిత్రునితో చెప్పాను. ఆ ఎవరో ఒక వ్యక్తి మనమే ఎందుకు కాకూడదనే ఆలోచనే నాకు రాలేదు. దాని గురించి మనకు ఏమీ తెలియదు కదా! వనరులు పుష్కలంగా ఉన్న పెద్ద టెక్నాలజీ కంపెనీలు ఆ పని చూసుకుంటాయి అనిపించింది. కానీ, ప్రజలందరూ ఒకరితో ఒకరు కనెక్ట్‌ అవ్వాలని కోరుకుంటున్నారని మాత్రం నాకు నిస్సందేహంగా తెలుసు. ఆ దిశగా మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చాం. 

మీకూ అటువంటి లక్ష్యాలు ఏవో ఉంటాయి. ప్రపంచంలో మార్పు తేవాలని ఉంటుంది. ఎవరో తెస్తారని అనుకుంటారు. కానీ, ఎవరూ తీసుకురారు. మీరే ఆ పని చేయాలి. అలా మీకొక లక్ష్యం నిర్దేశించుకోవడమే కాదు, ఇతరులకూ ఒక ప్రయోజనాన్ని కల్పించ గలగాలి. ఒక కంపెనీని నిర్మించాలని నేను కోరుకోలేదు. ఒక ప్రభా వాన్ని కనబరచాలని అనుకున్నా. కంపెనీ పెట్టిన రెండు మూడేళ్ళ తర్వాత, దాన్ని కొనడానికి కొన్ని పెద్ద కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ, నేను అమ్మాలని అనుకోలేదు. మరింత మందిని అనుసంధానపరచగలమా అనే ఆలోచిస్తూ వచ్చాను. కంపెనీలో ప్రతి ఒక్కరూ అమ్మేయడమే మంచిదనే భావించారు. అమ్మకూడదనే నిర్ణయానికి వచ్చినందుకు జీవితాంతం బాధపడతావు అంటూ ఒక సలహాదారు నన్ను హెచ్చ రించారు కూడా. 

మనుషుల స్వభావం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, నా నిర్ణయం నచ్చక, మేనేజ్‌మెంట్‌ బృందంలోని దాదాపు ప్రతి ఒక్కరూ కంపెనీ నుంచి నిష్క్రమించారు. అది నేను ఎదుర్కొన్న కష్టకాలం. నా నిర్ణయంలో పొరపాటు ఉందేమోనని కూడా ఒక దశలో అనిపించింది. కొన్నేళ్ళ గడిచాక, ఒక విస్తృత ప్రయోజనం అంటూ లేకపోతే అటువంటి పరిస్థితులే తలెత్తుతాయని అర్థమైంది. ఆ విశాల ప్రయో జనాన్ని కల్పించాల్సిన బాధ్యత మనదే. అపుడు అందరం కలసి కట్టుగా ముందుకు సాగగలం. 

ఊడిపడదు అద్భుతం
ఈ జీవితంలో తమకంటూ ఒక లక్ష్యం ఉందని ప్రతి ఒక్కరూ భావించే విధంగా ప్రపంచాన్ని తీర్చిదిద్దుకునేందుకు అనుసరించ వలసిన మూడు మార్గాల గురించి చెబుతాను. ఒకటి – అర్థవంత మైన భారీ ప్రాజెక్టులను కలసికట్టుగా చేపట్టాలి. రెండు – లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించేందుకు అనువైన విధంగా సమానత్వ భావనను పునర్నిర్వచించాలి. మూడు – ప్రపంచ వ్యాప్తంగా సమాజాలను నిర్మించుకోవాలి. టెక్నాలజీల వల్ల కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతున్నా అంతకుమించిన ఉద్యోగాలను సృష్టించుకోగలిగిన సామర్థ్యం మన కుంది. ప్రతి తరం నిర్వర్తించవలసిన కర్తవ్యాలుంటాయి. చంద్రు నిపై ఒక మనిషి కాలుమోపేందుకు, ఆ గచ్చు ఊడ్చే పనివాడితో సహా మూడు లక్షల మందికి పైగా పనిచేశారు. పోలియో సోకకుండా టీకాలు వేయడంలో లక్షలాది మంది కార్యక్తలు శ్రమించారు. ఆన కట్టలు నిర్మించడంలోనూ ఎంతో మంది శ్రామికుల కృషి ఉంది. 

ఐడియాలు ఎప్పుడూ పూర్తిరూపం సంతరించుకుని రావు. మొదటే అన్నీ తెలియవలసిన పని లేదు. దేనికైనా సరే శ్రీకారం చుట్టడం ముఖ్యం. ప్రజలను అనుసంధానపరచడం గురించి పూర్తిగా మొదటే తెలిసి ఉంటే, నేను ఫేస్‌ బుక్‌ను ప్రారంభించి ఉండేవాడిని కానేమో. క్రమంగా ఒక్కొక్క విషయం తెలుస్తూ వస్తుంది. హఠాత్తుగా అద్భుతాన్ని సృష్టించలేమని గుర్తించాలి. ఆద ర్శాలు నిలుపుకోవడం మంచిదే. కానీ, ఆ విషయంలో, మనల్ని ఎదుటి వారు ఎగతాళి చేసినా, ధైర్యంగా తట్టుకోగలగాలి. ఒక సంక్లిష్ట సమస్య పరిష్కారానికి నడుం బిగించినపుడు, దాని ఆనుపానులు తెలుసుకోకుండా దిగావంటూ నిందించే వారు ఎప్పుడూ ఉంటారు. మనం చొరవ చూపడం గిట్టనివారు ఉంటారు. ఏ విషయంలోనైనా మనల్ని వెనక్కి లాగేవారు ఉంటారు. వారి మాయలో మనం పడకూడదు. 

ఒకరి కోసం అందరం
మన తల్లితండ్రులు, తాత ముత్తాతల మాదిరిగా జీవితాంతం స్థిరమైన ఉద్యోగాలు చేసే రోజులు గతించాయి. ఇపుడు వ్యవస్థాపక సామర్థ్య సంస్కృతి విస్తరిస్తోంది. అయితే, కొత్త ఆలోచనలు అనేకం ఆచరణలో పెట్టి చూసేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పుడే ఆ సంస్కృతి వర్ధిల్లుతుంది. ఫేస్‌బుక్‌కు ముందు నేను గేమ్‌లు, చాట్‌ సిస్టంలు, స్టడీ టూల్స్, మ్యూజిక్‌ ప్లేయర్లు నిర్మించాను. హ్యారీ ప్యాటర్‌ ప్రచురణకు నోచుకోకముందు జె.కె. రౌలింగ్‌ రచనలు 12 సార్లు తిరస్కరణకు గురయ్యాయి. విఫలమైనా ఫరవాలేదనుకునే స్వాతంత్య్రం ఉన్నప్పుడే గొప్ప విజయాలు సిద్ధిస్తాయి. ఒక వ్యక్తి తన ఆలోచనను అమలులోపెట్టి, దాన్ని ఒక గొప్ప సంస్థగా మలచే స్వాతంత్య్రం లేనప్పుడు, నష్టపోయేది ఆ ఒక్క వ్యక్తి కాదు, అందరూనని గుర్తించాలి. గొప్ప ఐడియా తట్టినంత మాత్రాన లేదా కష్టపడి పనిచేసినంత మాత్రాన సఫలం కాలేక పోవచ్చని మనకు తెలుసు. ఆవగింజంత అదృష్టం కూడా కలసి రావాలి. 

నిరంతరం మారిపోతున్న టెక్నాలజీ వల్ల మనం ఎప్పటి కప్పుడు కొత్తవాటిని నేర్చుకోవడం కూడా నిరంతర ప్రక్రియగా మారాలి. సమాన అవకాశ భావనను ప్రోత్సహించేందుకు నేను, నా భార్య ప్రిసిల్లా మా సంపదలో కొంత భాగాన్ని వెచ్చించే ఏర్పాటు చేశాం. చాన్‌ జుకెర్‌బర్గ్‌ ఇనీషియేటివ్‌ ప్రారంభించాం. అందరూ నగదు సహాయాన్నే అందించాలన్న రూలు లేదు. ఎదుటివారు బాగుపడటానికి తమ సమయాన్ని కూడా కొంత వెచ్చించవచ్చు. పేదరికాన్ని, వ్యాధులను అంతమొందించగలిగిన శక్తి నేటి తరానికి ఉంది. ఏ ఒక్క దేశమో పోరాడినంతమాత్రాన వాతావరణ మార్పును అరికట్టలేం. మహమ్మారులను నివారించలేం. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రపంచవ్యాప్త పరిష్కారాలు అవసరం. మనం ఒంటరివారం కాదు. ఒక విస్తృత ప్రయోజనానికి పాటుపడుతున్నామనే భావన రావాలి. ‘మన ముందు తరాలను ఆశీర్వదించిన, దైవిక శక్తి ఏదైతే ఉందో, అది మాకు ధైర్యం సమ కూర్చడానికి సహాయపడుగాక! ఈ జీవితాన్ని ఒక వరప్రసాదంగా మేం తీర్చిదిద్దుకునేటట్లు చేయుగాక!’ అనే ప్రార్థనతో మీ వద్ద సెలవు తీసుకుంటాను. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement