యూఏఈ నిష్క్రమణతో మనకేంటి? | Sakshi Guest Column On UAE exit from OPEC | Sakshi
Sakshi News home page

యూఏఈ నిష్క్రమణతో మనకేంటి?

May 8 2026 12:22 AM | Updated on May 8 2026 12:22 AM

Sakshi Guest Column On UAE exit from OPEC

విశ్లేషణ

పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్‌) నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వైదొలగడం వెనుక సుదీర్ఘ ఒడుదుడుకుల చరిత్ర ఉంది. అబు ధాబీ నిర్ణయంపై మన దేశంలో సంతోషం వెల్లివిరియడం అపరిణతిని సూచిస్తోంది. అబు ధాబీ ఒక అమీరాత్‌గా ‘ఒపెక్‌’లో 1967లో చేరింది. యూఏఈ 1971లో ఏర్పడింది. ‘ఒపెక్‌’ కార్టెల్‌లో చేరిన ఆది నుంచీ అది నిర్ణయించే ఉత్పత్తి పరిమితికి యూఏఈ కట్టుబడిన దాఖలాలు లేవు. దుబాయ్‌ 1970లలో నేటిలా టూరిస్టు కేంద్రంగా ఏమీ లేదు. యూఏఈకి దుబాయ్‌ పెట్రోలియం కంపెనీ ముఖ్య ఆదాయ వనరుగా ఉండేది. యూఏఈపై ‘ఒపెక్‌’ విధించిన కోటాలకు కట్టుబడి ఉండేందుకు అది తిరస్కరించేది.  కనుక, యూఏఈ ‘ఒపెక్‌’ లోపల ఉన్నా బయట ఉన్నా కార్టెల్‌కు వచ్చిన తేడా ఏమీ లేదు. ఇది భారతదేశపు చమురు విధాన నిర్ణేతలు గుర్తించడం ముఖ్యం. ర్యాంకింగులు, ఉత్పత్తి శాతాల పరామితులకు ప్రాధాన్యం లేదు. కనుక, ‘ఒపెక్‌’ నుంచి వైదొలగాలని యూఏఈ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఆ కార్టెల్‌ బలహీనపడుతుందనుకోవడం భ్రమ.

ధరలేం పడిపోవు!
యూఏఈకి చెందిన మొదటి పెట్రోలియం–ఇంధన వనరుల మంత్రి మానా సయీద్‌ అల్‌ ఓతైబా 1982లో వియన్నాలో ‘ఒపెక్‌’ 63వ మంత్రుల స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించి తిరిగి వచ్చాక, ఈ వ్యాసకర్తను, దుబాయ్‌ కేంద్రంగా పనిచేస్తున్న మరో ఇద్దరు జర్నలిస్టులను పిచ్చాపాటీగా మాట్లాడేందుకు పిలిపించారు. వియన్నా సమావేశం గురించి అడిగినపుడు, అది ఏదైనా ఫలితాన్ని ఇస్తుందని తాను అనుకోవడం లేదని పెదవి విరిచారు. ‘ఒపెక్‌’ సమావేశం నుంచి తెచ్చిన వాటిలో రెండు కాగితాలను బయటకు తీశారు. రెండు కాగితాల్లోనూ వట్టి గీతలతో(డూడుల్స్‌) వేసిన బొమ్మలున్నాయి. ఓతైబా చిన్న వయసులోనే అంటే 25 ఏళ్లకే మంత్రి అయ్యారు. మంత్రి కాకముందు నుంచే ఆయనకు అలా బొమ్మలేసే, కవిత్వం రాసే అలవాటు ఉంది. ‘ఒపెక్‌’ సమావేశాలకు హాజరైనా, వక్తలు చెప్పేది నిరాసక్తంగా ఉన్నప్పుడు ఆయన తన వ్యాపకాన్ని కొనసాగించారన్నమాట!

‘ఒపెక్‌’ చాలా సార్లు చీలికలను ఎదుర్కొంది. ‘ఒపెక్‌’ తన సభ్య దేశాల చమురు ఉత్పత్తిపై పరిమితి విధించేందుకు 1986లో జరిపిన మంత్రుల స్థాయి సమావేశాలన్నీ వివాదాస్పదంగానే ముగిశాయి. జెనీవాలో జరిగిన సమావేశం నుంచి ఓతైబా వాకౌట్‌ కూడా చేశారు. ‘ఒపెక్‌’లోని అభిప్రాయ భేదాల వల్ల ఆ ఏడాది (1985లో) చమురు ధరలు పీపాకు 24.51 డాలర్ల నుంచి 9.25 డాలర్లకు తగ్గాయని అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిర్వహిస్తున్న రికార్డులు వెల్లడిస్తున్నాయి. కానీ, ‘ఒపెక్‌’ దుకాణం ఏమీ మూత పడలేదు. కనుక, ఇపుడు యూఏఈ వైదొలగడాన్ని కార్టెల్‌కు దెబ్బగా అభివర్ణించలేం. చమురుకు సరైన ప్రత్యామ్నాయాలు వాడుకలోకి వచ్చే రోజు వస్తే తప్పించి, కేవలం ‘ఒపెక్‌’లో విభేదాల వల్ల, చమురు ధరలు మళ్ళీ పీపాకు 9.25 డాలర్లకు పడిపోతాయని భావించడంకన్నా నిర్హేతుకమైనది మరొకటి ఉండదు. 

వాళ్ల ప్రయోజనాలే వాళ్లకు ముఖ్యం
యూఏఈతో స్నేహ సంబంధాల వల్ల భారత్‌ చమురు నిల్వలను పెద్ద యెత్తున పక్కన పెట్టుకుంటుందనే అభిప్రాయాన్ని ఇటీవల కలిగించారు. అబుధాబీ తన ఇంధన విధానాలను భారత దేశానికి అనువుగా రూపొందించుకుంటుందనే అభిప్రాయాల బూజు ఏమైనా ఉంటే దులిపేసుకోవడం మంచిది. అది దాని ప్రయోజనాలను కాపాడుకునే విధంగా విధానాలను రూపొందించు కుంటుంది. అబు ధాబీ ఇందన సంస్థల రంగం ఏకశిలా సదృశం కాదను కునే విషయంలోనూ భారత్‌లో అవగాహన అంతంతే. అది 1970 మధ్య నుంచే ఏకశిలా సదృశంగా లేదు. అప్పట్లో పెట్రోలియం మంత్రిత్వ శాఖను, అబు ధాబీ నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (అడ్నాక్‌)ని వేరు చేశారు. చమురు, ఇంధన వాయు కలాపాలకు ‘అడ్నాక్‌’ బాధ్యత వహిస్తే, చమురు విధానాలను మంత్రిత్వ శాఖ నిర్ణయించేది. ఇపుడు సుల్తాన్‌ అల్‌ జబేర్‌ గ్రూప్‌ సి.ఇ.ఓ.గాను, ‘అడ్నాక్‌’ మేనేజింగ్‌ డైరెక్టర్‌గాను రెండు బాధ్యతలనూ నిర్వహిస్తున్నారు. అల్‌ జబేర్‌తో భారత్‌ చర్చలు జరుపుతున్న మాట వాస్తవమేగానీ, ‘ఒపెక్‌’ నుంచి వైదొలగిన యూఏఈ నుంచి తాను కచ్చితంగా ఏమి ఆశిస్తు న్నదన్న విషయంలో భారతదేశానికి స్పష్టత అవసరం. 

యూఏఈ–సౌదీ కవల సోదరులు
అమెరికా–ఇరాన్‌ మధ్య సైనిక ప్రతిష్టంభన ముగిసేవరకు, ఒపెక్‌కు యూఏఈ గుడ్‌ బై చెప్పినంత మాత్రాన, భారత్‌ వంటి అధిక ఇంధన వినియోగ దేశాలకు కలిగే మార్పులు ఏమీ ఉండవు. సైనిక ప్రతిష్టంభన వల్ల హార్మూజ్‌ గుండా ముడి చమురు రవాణా తక్కువగా ఉంది. హార్మూజ్‌ జలసంధితో పని లేకుండా, యూఏఈ చమురు ఎగుమతి చేయాలంటే, దాని అమీరాత్‌లలో ఒకటైన ఫుజైరాహ్‌ నుంచి మాత్రమే సాధ్యమవుతుంది. కానీ, ఫుజైరాహ్‌ రేవుకు ఉన్న పైపు లైనులు రోజుకు 1.8 మిలియన్ల పీపాల చము రును మాత్రమే నిర్వహించగలవు. దానిలో ఎంత మొత్తాన్ని యూఏఈ మనకు విక్రయిస్తుంది? యూఏఈ నుంచి చమురు కొంటున్నది మనం ఒక్కళ్ళమే కాదుగా! యూఏఈ మీద పెట్టుకున్న ఆశలలో భారత్‌ ఈ కీలక పరిమితిని లెక్కలోకి తీసుకుందా? అంతిమంగా, అమీరాత్‌లు, సౌదీలు ‘సోదరులు’. భారతీయులు, చైనీయులు, జపానీయులు వారికి ‘స్నేహితులు’ మాత్రమే. యూఏఈ, సౌదీ అరేబియాల మధ్య తగవులు ఉన్నా అవి కవలల వంటివి. యూఏఈ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, వాటి తాజా వార్షిక చమురేతర వాణిజ్యం మొత్తం 41.3 బిలియన్ల డాలర్లుగా ఉంది. సౌదీకి యూఏఈ రెండవ పెద్ద ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి దారు. యూఏఈలో సౌదీ పెట్టుబడులు 4.3 బిలియన్ల డాలర్ల మేరకు ఉన్నాయి. ఒకప్పుడు మూడు గల్ఫ్‌ దేశాలు ఖతర్‌ బహి ష్కరణకు ఊహించని రీతిలో ముగింపు పలికినట్టే... యూఏఈ –సౌదీ మధ్య విభేదాలు కూడా ఏదో దశలో సమసిపోతాయి. భారత్‌ తన విధానాల రూపకల్పనలో ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

కె.పి. నాయర్‌
వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల నిపుణుడు
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement