రామ... రామ... రామనారాయణ! | Sakshi Guest Column On Srirama Navami At Bhadrachalam Temple | Sakshi
Sakshi News home page

రామ... రామ... రామనారాయణ!

Mar 27 2026 12:35 AM | Updated on Mar 27 2026 12:35 AM

Sakshi Guest Column On Srirama Navami At Bhadrachalam Temple

భద్రాచల క్షేత్రంలో ఉన్న రామచంద్ర స్వామిని సీతారాముడు, రామనారాయణుడు, లక్ష్మీనారాయణుడని అంటే సమస్య ఏమిటి?

అభిప్రాయం

‘దక్షిణ అయోధ్య’ భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చినవారు అని కొందరు
సందేహాలు లేవనెత్తుతున్నారు. దశరథ రాముడా, వైకుంఠ రాముడా అన్న ప్రశ్నకు సమాధానం భద్రాచల క్షేత్ర విశిష్టత తెలుసుకుంటే అర్థమవుతుంది. భక్తి మాత్రమే ఉన్నవాళ్లు భద్రాచలానికి వచ్చి శ్రీసీతారామచంద్రుడికి నిశ్చింతగా మొక్కు తీర్చుకుంటున్నారు. వాళ్లకేమీ సమస్య లేదు. కానీ ఇది వాక్‌ స్వేచ్ఛకు సంబంధించినది. రామనారా యణుడని పూజించే హక్కుకు సంబంధించినది.  

భద్రమహర్షి కథ
నమ్మకానికి రుజువులుండవు. భద్రాచల క్షేత్ర మహత్యంలో భద్ర మహర్షి తపస్సు కథ ఉంది. రామరావణ యుద్ధం ముగించి, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం తరువాత అనేక సంవ త్సరాలు తపస్సు చేసిన భద్ర మహర్షికి శ్రీరామచంద్రుడు శంఖ చక్రాలతో దర్శనమిచ్చాడు. ఆ స్వామిని వైకుంఠ రాముడని, మోక్ష రాముడని, చతుర్భుజుడైన ‘రామనారాయణు’డని క్షేత్ర మహా త్మ్యాలు వివరిస్తున్నాయి. భద్రమహర్షి తానే ‘అచలం’ అంటే కొండగా నిలిచి ఉన్నాడనీ, అందుకే భద్రాచల క్షేత్రానికి ఎంతో విశిష్టత వచ్చిందనీ అంటారు. శ్రీరాముడు ఎప్పుడైనా తాను దశర థుడి కొడుకునే అని అంటాడే కానీ, నేను వైకుంఠ నివాసిని అని రామాయణంలో చెప్పుకోలేదు. మానవులు, కోతుల చేతిలోనే రావ ణుడి మృత్యువు ఉందని భాగవతంలో కనిపిస్తుంది. రాముడు మనిషే కనుక రామాయణంలో రాముడికి శంఖ చక్రాలు ఉండవు. చతుర్భుజాలు ఉండవు. భద్రాచలం కథ కలియుగ కథ.

భద్రమహర్షి తపస్సు చేసి నాకు రాముడే కావాలనీ, విష్ణువెవరో నాకు తెలియదనీ అంటాడు. ఆనాటి శంఖ చక్రాలు, నాలుగు భుజాలు అట్లాగే ఉంచేసుకుని రాముడి రూపాన్ని స్వీకరిస్తాడని భద్రాచల క్షేత్ర కథలో ఉంది. భద్రాచలంలో ఉన్న స్వామి అయోధ్య రాముడు కాదంటున్నారు. అయోధ్య రాముడిది వశిష్ట గోత్రం అవు తుంది. అయోధ్య రాముడే అని అనుకున్నా వారివారి ఇష్టం. 

సీతా ‘మహాలక్ష్మి’
భద్రాచల క్షేత్రంలో రామచంద్ర స్వామిని నారాయణుడిగా భావించి సుప్రభాత సేవ నుంచి రాత్రి శయనోత్సవం దాకా షోడశో పచారాలతో పూజిస్తున్నారు. ఇక్కడ రామనారాయణుడని సంప్ర దాయం. కవులు తమ కావ్యాలు, భజన గీతాలలో రామనారాయణ అని అన్నారు. చట్టాలు, పూర్వనిర్ణయాలు (కోర్టు నిర్ణయాలు), కస్టమ్‌ అనే మూడు సూత్రాల ద్వారా శాసనం వస్తూ ఉంటుంది. కస్టమ్‌ అంటే కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగిస్తున్నారని రుజు వులు వస్తే, సంప్రదాయం చట్టంతో సమానమవుతుంది. భద్రా చలంలో మూలమూర్తి రామచంద్ర స్వామికి ముందు ఆంజనే యుడు కాకుండా ఎదురుగా గరుడ ఆళ్వార్‌ ఉంటాడు. అదే భద్రా చల స్వామి నారాయణ స్వరూపుడనడానికి ఆధారం అంటారు.

ఆంజనేయుడి రూపాన్ని ఆలయం ఎదుట దూరంగా ప్రతిష్ఠించారు. భద్రాచలంలో సీతారామ కల్యాణం చాలా సుప్రసిద్ధమైందని తెలుసు. మిగతా కార్యక్రమాలకు సంవత్సరం దాకా అనేకానేక విశేష ఉత్సవాలు ఉంటాయి. చిలుకు ద్వాదశి రోజున స్వామికి మోహిని అవతారంలో అలంకారం చేస్తారు. అది మరి ఏ ఇతర రామా లయాల్లో లేదు. నరక చతుర్దశి ఉత్సవం, కృష్ణాష్టమి ఉత్సవం, వైకుంఠ ఏకాదశి ధనుర్‌ మాసంలో రాపత్తు (రాత్రి), పగల్పత్తు (పగలు) ప్రతిరోజు కూడా ఒక విశేష అలంకరణతో స్వామి వారికి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 

భద్రాచల క్షేత్ర చరిత్ర అని 1971వ సంవత్సరంలో దేవస్థానం ప్రచురించిన చోట ఇక్కడ సీతా మహాలక్ష్మి అని వర్ణించారు. భద్రా చలం కల్యాణంలో జనక దశరథుల ప్రసక్తి ఉండదు. ఎన్నో ఏళ్లుగా తాళపత్ర గ్రంథాలలో భక్త రామదాసు, నరసింహదాసు ప్రస్తావించిన అంశాలు చదువుకోవచ్చు. అదే ఆనవాయితి ఉందన్న తరువాత ఇతర వాదాలు నిలబడవు. సీతారాములను లక్ష్మీనారాయణులుగా భావించి ఉత్సవాలు జరిపించవలసింది అనే శాసనాలు చెక్కారు. 

అచ్యుత గోత్రం
భద్రాచలంలో సుమారుగా 80 ఏళ్ళు ఉన్న ఒక విశ్రాంత అర్చక స్వామి ఎన్నో కల్యాణాలు ప్రత్యక్షంగా జరిపించారు. 1950 నుంచి ఇప్పటివరకు వారికి ఊహ తెలిసిన దగ్గర నుంచి అక్కడ ఉన్న రామచంద్రస్వామి కల్యాణ ప్రక్రియలో అచ్యుత గోత్రమే చెప్తారని  స్పష్టంగా తెలియజేస్తున్నారు. భద్రాచల క్షేత్రంలో ఎప్పుడూ కొత్తగా గోత్ర ప్రవరలు మార్చలేదనీ, ఎన్నో ఏళ్ల తరబడి అక్కడ ఉన్న పరంపర అదే చెబుతోందనీ వృద్ధ పురోహితులు వివరిస్తున్నారు.

ప్రతి క్షేత్రానికి ప్రవరలు విడిగా ఉంటాయి. తిరుమల వేంక టేశ్వర కల్యాణ ప్రక్రియలో గోత్ర ప్రవరలు, కొండ దిగువన పద్మా వతి అమ్మవారి క్షేత్రంలో జరిగే కల్యాణ ప్రక్రియలో చెప్పే గోత్ర ప్రవరలు వైవిధ్యంగా ఉంటాయి. దానికి జవాబు ‘సంప్రదాయమే’. క్షేత్ర సంప్రదాయాన్ని, క్షేత్ర పరంపరను అనుసరించి అక్కడ చేసే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. రామచంద్రుడు సూర్యవంశానికి చెందినవాడు. వారిది కాశ్యప గోత్రం. రాముడు క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మాన్ని అనుసరించి వారి ఆచార్యుడి గోత్రాన్ని అంటే వశిష్ఠులవారి గోత్రాన్ని కూడా చెప్పవచ్చును. కానీ వైకుంఠ రాముడు, నారాయణుడు అనుకుని అచ్యుత గోత్రమే అంటారు.

పురుషోత్తముడు, సృష్టి ఆది నుంచి ఉన్న శక్తి శ్రీరాముడనీ, శ్రీకృష్ణుడనీ విభిన్న అవతారాలుగా ఉండటం వల్ల, ఆయా కుల గోత్రాలు, ప్రవరలు చెప్పుకునే అవకాశం ఉంది. భద్రాచల క్షేత్రంలో ఉన్న రామచంద్ర స్వామిని సీతారాముడు, రామ నారాయణుడు, లక్ష్మీనారాయణుడని అంటే సమస్య ఏమిటి? ‘ఇది తప్పు అది ఒప్పు’ అని ఎవరు తేల్చగలరు? అసలు స్వరూపమే లేని పరమా త్ముడనే వేదాంతాన్ని భాగవతంలో, భగవద్గీతలో కూడా వివరిస్తారు కదా! పరాశక్తి అనీ పరమాత్ముడనీ – అవన్నీ రూపాలే అనీ వినడం లేదా? అలాంటప్పుడు భద్రాద్రి రాముడిని రామనారాయ ణుడన్నా, అనంతుడన్నా, రామబ్రహ్మం అనుకున్నా వివాదాలు ఉంటాయా?

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement