సంజయ్‌ మల్హోత్రా (ఆర్బీఐ గవర్నర్‌) రాయని డైరీ | Rayani Diary of RBI Governor Sanjay Malhotra | Sakshi
Sakshi News home page

సంజయ్‌ మల్హోత్రా (ఆర్బీఐ గవర్నర్‌) రాయని డైరీ

May 17 2026 12:40 AM | Updated on May 17 2026 12:40 AM

Rayani Diary of RBI Governor Sanjay Malhotra

మాధవ్‌ శింగరాజు

మనసు ప్రశాంతంగా లేదు. అలాగని అశాంతి గానూ లేదు. ఉప్పునీటి ఉపరితలం మీద ఒలికిపోయి తేలుతున్న చమురు తెట్టులా ఉంది. సెంట్రల్‌ ఆఫీస్‌ బిల్డింగ్‌ 18వ అంతస్తు నుండి అరేబియా సముద్రాన్ని చూస్తూ పనిచేయటం ఎప్పటిలా ఇవాళ నన్ను ఆహ్లాదపరచటం లేదు! ఏదో ఒకటి మాత్రమే చేయగల మానసిక స్థితిలో ఉన్నాను. సముద్రాన్ని షట్‌డౌన్‌ చేసేసి లాప్‌టాప్‌లో సర్ఫింగ్‌ చేయటమా? లేక, లాప్‌టాప్‌ను స్కూబా ట్యాంక్‌లా వీపున తగిలించుకుని సముద్రంలోకి దూకేయటమా? ఏదో ఒకటే! కవాస్జీ పటేల్‌ రోడ్‌లోని ‘టమ్‌ టమ్‌ టీ పాయింట్‌’ నుండి తరచూ నేను అడిగి తెప్పించుకునే ఘాటైన రాజస్థానీ టీ... టేబుల్‌ మీద చిక్కగా చల్లబడి ఉంది. మీగడను పక్కకు ఊది, టీని కొద్దిగా చప్పరించాను. కొత్తగా ఉంది! కొత్తగా ఉన్నా బాగుంది. 

కాలం అనుకూలంగా లేనప్పుడు కాలానికి అనుకూలంగా మారటంలోనే మనిషి బాగోగులు ఉంటాయి. దేశానికి ఇప్పుడు పొదుపు కాలం. ప్రధాని ఇచ్చిన పిలుపు కాలం. చల్లబడిన టీని వదిలేసి వేడిగా ఇంకో కప్పును తెప్పించుకోవటానికి మనస్కరించని కాలం. ప్యాంటు జేబులోంచి పర్సు తీసి చూశాను. ఒక అరలో కొన్ని నోట్లు. ఇంకో అరలో బంగారు కడ్డీలు. మిగతా అరల్లో ఫారిన్‌ బాండ్లు, యూరోలు, పౌండ్లు. హుండీని నిండకుండానే పగలగొట్టి నట్లుగా పర్సును టేబుల్‌ మీద బోర్లించి మొత్తం ఉన్నదెంతో లెక్క చూశాను. 66 లక్షల 3 వేల 990 కోట్ల రూపాయలు. 145 కోట్ల మందికి పైగా కుటుంబ సభ్యులున్న ఇంటిని నెట్టుకు రావటానికి దాచుకుంటూ వచ్చిన ద్రవ్యం. 

మూడు నెలల క్రితం వరకూ పర్సు బరువుగా ఉండేది. ఇంటికి బలంగా ఉండేది. అందులో 69 లక్షల 84 వేల 640 కోట్ల రూపాయలు ఉండేవి! అదేమీ చిన్న మొత్తం కాదు. ఆ డబ్బుతో 10,000 టన్నుల బంగారం కొనొచ్చు. ఐదుగురు ఎలాన్‌ మస్క్‌లు లేదా ఆరుగురు జెఫ్‌ బెజోస్‌ల దగ్గర ఉండే మొత్తం సంపదను కలిపినా నా పర్సులో ఉన్న దానికంటే తక్కువే అవుతుంది! కానీ, దాచిన గుడ్ల కోసం ఏ కాలసర్పమో పొంచి ఉంటుంది. పర్సులో ఉన్న డబ్బులో 4 లక్షల కోట్లను ఈ రెండు నెలల్లోనే హార్మూజ్‌ జలసంధి మింగేసింది! ప్రధాని చెప్పినట్లు ఎంత పొదుపు చేసినా, మిగిలిన డబ్బుతో ఇంకొక పదకొండు నెలలు మాత్రమే హుండీపై బండి నడుస్తుంది. ఆ తర్వాత?! సముద్రమంత పొదుపైనా అది ఆదాయమూ కాదు, ఆస్తీ కాదు. మార్కెట్‌ జీవనదుల్లోంచి నిరంతరం డబ్బు ప్రవాహాలు వచ్చి కలుస్తుండాలి. 

ప్రధానికి ఓట్లు తగ్గకూడదు. ఆర్బీఐకి ధరలు పెరగకూడదు. ప్రధాని తన కంఠహారం తీసి ప్రజల్లోకి విసురుతారు; ఆర్బీఐ దానిని మధ్యలోనే ఒడుపుగా పట్టేసి, తిరిగి కోశాగారంలో బాధ్యతగా పెట్టేయాలి. ప్రధానికి ప్రజలు హ్యాపీగా ఉండటం కావాలి. ఆర్బీఐకి దేశం ధీమాగా ఉండటం కావాలి. మంచి చెడ్డలు చూసే ఆర్బీఐ, ప్రధానికి మంచీ చెడూ చెప్పకూడదా? ప్రధాని ఏదైనా చేసేముందు ఆర్బీఐ చెవిలో ఒక మాట వేయకూడదా? ప్రధాని నెహ్రూకి, ఆర్బీఐ గవర్నర్‌ బెనెగల్‌ రామారావుకి ఇక్కడే పడింది. ప్రధాని మన్మోహన్‌కి, ఆర్బీఐ గవర్నర్‌ సుబ్బారావుకి ఇలాగే పడింది. ప్రధాని మోదీకి, ఆర్బీఐ గవర్నర్లు రఘురామ్‌ రాజన్‌కి, ఉర్జిత్‌ పటేల్‌కి, శక్తికాంత దాస్‌కి కూడా ఇందుకే పడింది. 

ఇప్పుడీ నడి సముద్రంలో నా వంతు! రాజీనామా లేఖను సమర్పిస్తే నౌక నుంచి నేనొక్కడినే నా స్వార్థం నేను చూసుకుని లైఫ్‌బోట్‌లోకి దూకేయటం అవుతుందా?! మెల్లిగా సీట్లోంచి లేచి, గాజు అద్దాల్లోంచి దూరంగా ఆకాశమూ, అరేబియా సముద్రమూ కలుస్తున్న చోటును చూస్తూ నిలబడ్డాను. ట్రంప్‌ యుద్ధ తంత్రం, మోదీ పొదుపు మంత్రం భూమ్యాకాశాల్లా కలిసిపోయిన క్షితిజ రేఖ నాకు అక్కడ కనిపించింది!  

Advertisement
 
Advertisement
Advertisement