విజేతను నిర్ణయించేది 'విజయ్‌ ఫ్యాక్టర్‌!' | Sakshi Guest Column On TVK Vijay Factor In Tamil Nadu Politics | Sakshi
Sakshi News home page

విజేతను నిర్ణయించేది 'విజయ్‌ ఫ్యాక్టర్‌!'

Apr 22 2026 12:41 AM | Updated on Apr 22 2026 12:41 AM

Sakshi Guest Column On TVK Vijay Factor In Tamil Nadu Politics

సందర్భం

ఏప్రిల్‌ 23న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో సినీ నటుడు హీరో విజయ్‌ నిర్ణాయక అంశం కాబోతున్నారు. సీట్ల సంఖ్య ఎలా ఉన్నా, ఓట్ల చీలికలో విజయ్‌ ప్రభావం వల్ల విపక్ష ఏఐడీఎంకే–బీజేపీ కూటమి కన్నా పాలక డీఎంకే–కాంగ్రెస్‌ కూటమికే మేలు జరిగే సూచనలున్నాయి.  ఢిల్లీ పెత్తనం వర్సెస్‌ ‘తమిళ ప్రైడ్‌’ తుది ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశముంది. విపక్షాల్లో అనైక్యత లాభించి, తండ్రి కరుణానిధి సాధించలేని ఘనత – డీఎంకేను వరుసగా రెండోసారి గెలిపించడం తనయుడు స్టాలిన్‌ సాధించనూవచ్చు!

తమిళనాట ద్రవిడ పార్టీల రాజకీయాలది ఆరు దశాబ్దాల చరిత్ర! 1967 తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదు. రాష్ట్రంలో తమకంటూ సొంతంగా బలం, బలగం లేకపోయినా... డీఎంకే మద్దతు కాంగ్రెస్‌కు, ఏఐడీఎంకే మద్దతు బీజేపీకి ఢిల్లీలో కావాలి. అందుకే ఆ రెండు ప్రధాన స్రవంతి జాతీయ పార్టీలు ద్రవిడ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని, అల్ప భాగస్వాములు (తోక పార్టీలు)గా పోరాడుతున్నాయి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ ప్రాంతీయ శక్తులు భాగం పంచుకుంటాయి తప్ప, రాష్ట్ర అధికారంలో మాత్రం జాతీయ పార్టీలకు ఎప్పుడూ భాగమి వ్వవు. ఒక పరిమితిని (8 నుంచి 10 శాతం ఓటు వాటా) మించి ఆయా పార్టీలను రాష్ట్రంలో ఎదగనీయవు. 

ఈసారి విశేషమేమంటే, సినీ కెరటం విజయ్, అన్ని స్థానాల నుంచి బరిలోకి దిగి ఈ రెండు కూటములకు గట్టి సవాల్‌ విసురు తున్నారు. గ్రామీణ, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల యువతలో విజయ్‌ అంటే ఎంతో క్రేజ్‌ ఉంది. పాలక ‘లౌకిక ప్రగతిశీల కూటమి’లో డీఎంకే, కాంగ్రెస్‌లతో పాటు డీఎండీకే, వీసీకే తదితర ప్రాంతీయ పార్టీలు, కమ్యూనిస్టులు భాగస్వాములుగా ఉన్నారు. వీరి మధ్య సయోధ్య, సీట్ల సర్దుబాటు ఒకింత సామరస్యంగా జరిగింది. ‘ప్రభుత్వ వ్యతిరేకత’ బలపడనీయకుండా గట్టి సంకేతం ప్రజాక్షేత్రంలోకి పంపగలిగారు. విపక్ష ఎన్డీయే కూటమి భాగస్వా ముల మధ్య సఖ్యత గొప్పగా లేదు. కూటమిలో ఆధిపత్యానికి మొదట కొంత యత్నించిన బీజేపీ, చివరకు విధిలేని పరిస్థితుల్లో పొత్తుల్లో ఏఐడీఎంకే ఆధిపత్యానికే తగ్గింది. 

గణాంకాలు చెప్పేవి అర్ధ సత్యాలే!
రాజకీయాలు అంకగణితం కాదు, 2+2 నాలుగవటం లెక్కల్లోనే తప్ప రాజకీయాల్లో అవాలని లేదు. 2+2 ఆరు అవొచ్చు, జీరో అవొచ్చు. 234 స్థానాలున్న అసెంబ్లీలో అధికారానికి 118 సీట్లు కావాలి. ఈసారి ఏ ఒక్క పార్టీకి ఆ సంఖ్య దక్కకపోవచ్చు. 2021 ఎన్నికల్లో డీఎంకే నేతృత్వపు ఎస్పీయే కూటమి 45.3 శాతం ఓటు వాటాతో 159 స్థానాలు గెలిచింది. అంతకు ముందు స్టాలిన్‌ మేయర్‌గా చేసిన చెన్నై మహానగర్‌ పరిధిలోని 22 అసెంబ్లీ స్థానాల్లో ఏఐడీఎంకేకు ఒక సీటు కూడా రాలేదు. ఎన్డీయే కూటమి 39.7 శాతం ఓటు వాటాతో 75 స్థానాలు నెగ్గింది. 2016 ఎన్నికల్లో జయ లలిత గెలుపు తర్వాత మరే ఎన్నికల్లోనూ ఏఐడీఎంకేకు ఆధిపత్యమే దక్కలేదు. అదే యేడు చివర్లో జయలలిత మరణం తర్వాత... పళనిస్వామి, పన్నీరు సెల్వమ్‌ల మధ్య వివాదాలతో పార్టీ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికలు (38/39), తర్వాతి అసెంబ్లీ (2021) ఎన్నికలు (159/234), అటు తర్వాత మూడేళ్లకు జరిగిన 2024 లోక్‌సభ (39/39), స్థానిక సంస్థల ఎన్నికలు, 2021–2026 మధ్య దాదాపు అన్ని ఉపఎన్నికలు... ఇలా అన్నిటా డీఎంకే మిత్రులు గెలుస్తూ వస్తున్నారు. 

రాష్ట్రంలో చివరి పెద్దపోరు 2024 లోక్‌సభ ఎన్నికల్లో, 221 అసెంబ్లీ సెగ్మెంట్లలో డీఎంకే కూటమికి ఆధిక్యత లభిస్తే ఏఐడీఎంకేకు 10 చోట్ల, పీఎంకేకు 3 చోట్ల ఆధిక్యత దక్కింది. ఆ ఎన్నికల్లో బీజేపీ, ఏఐడీఎంకేలు విడిగా పోటీ చేశాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పీఎంకేకు 3 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత లభించింది తప్ప బీజేపీకి ఒకచోట కూడా ఆధిక్యత రాలేదు. గణాంకాల పరంగా చూసినపుడు డీఎంకే కూటమి బలంగా కనిపిస్తోంది. 1984లో ఎంజీ రామచంద్రన్, 2016లో జయలలిత తప్ప వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని గెలిపించుకొని, తిరిగి ముఖ్యమంత్రి అయినవారు లేరు. కరుణానిధికి అదెప్పుడూ సాధ్యపడలేదు. స్టాలిన్‌ మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి అయితే తండ్రిని మించి రికార్డు నెలకొల్పినట్టే!

ఢిల్లీ వర్సెస్‌ తమిళ గాలి
ప్రాంతీయ, భాష, సాంస్కృతిక, రాజకీయ అస్తిత్వ భావో ద్వేగాల రాష్ట్రం తమిళనాడు. అవి రగిలినపుడు, జనం ఎటువైపు మళ్లినా ఉప్పెనలా ఎగిసిపడతారని ప్రచారం. జాతీయ పార్టీలు, జాతీయ అంశాల ప్రభావం నామమాత్రమే! స్టాలిన్‌ నెమ్మదిగా రాజకీయ పోరాటాన్ని ఢిల్లీ పెత్తనం వర్సెస్‌ తమిళ గౌరవం కిందకు మార్చే యత్నం చేస్తున్నారు. త్రిభాషా సూత్రం, బీజేపీయేతర ప్రభుత్వాలపై గవర్నర్ల ద్వారా దొడ్డిదారి పెత్తనం, నిధుల కేటాయింపులో వివక్ష, నియోజకవర్గాల పునర్విభజనలో ప్రాతినిధ్య తగ్గింపు ప్రమాదం... ఇలా పలు అంశాలతో ప్రచారం చేస్తున్నారు.

తమిళ సమాజం మీద మొదటి, రెండో తరం నాయకులంత పలుకుబడి, ప్రభావం కలిగిన నేత కాదు స్టాలిన్‌. అయినా ఈతరంలో స్టాలిన్‌కు దీటుగా నిలువగలిగే నాయకులు లేరు. మొదటి తరంలో రాజాజీ, కామరాజ్‌ నాడార్, అన్నాదురై లాంటి హేమాహేమీలుంటే, తర్వాతి తరంలో సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత ఒక వెలుగు వెలిగారు. సినీ
రంగం నుంచి కమల్‌హాసన్, విజయ్‌కాంత్‌ (దివంగత), సీమాన్‌... ఇలా కొందరు ప్రయత్నించినా నిలదొక్కుకున్నది లేదు. కానీ, హీరో విజయ్‌ భిన్నంగా కనిపిస్తున్నారు. గత సంవత్సరం కరూర్‌ ర్యాలీ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన తర్వాత పెద్ద ర్యాలీలు, సభల్ని విజయ్‌ నిరాకరిస్తున్నారు కానీ, లోలోపల యువ తలో ఆసక్తి రేపుతున్నారు. తమిళ ఓటర్లలో 40 శాతం మంది 40 ఏళ్లలోపు వారే! రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ యువత విజయ్‌ వైపు మొగ్గితే ఎన్నికల సమీకరణాలే మారొచ్చు.

తమిళ ఆకాంక్షలే ప్రతిఫలిస్తాయి!
‘ఎన్నికల ఉచితాల’కు పేరుబడ్డ తమిళనాడులో వాటికి, నగదు బదిలీలకు మించి అదనంగా తమిళ ప్రజలు ఏదో కోరుకుంటు న్నారని ఈ ఎన్నికల సరళి చెబుతోంది. స్టాలిన్‌ను వెంటనే గద్దె దించేయాలన్నంత కోపం మూకుమ్మడిగా తమిళ ప్రజల్లో లేదు కనుక ‘విజయ్‌’ ఫ్యాక్టర్‌ విపక్షాలకు ఉపయోగపడకపోవచ్చు. దించేయాలన్నంత వ్యతిరేకత ఉంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయ్‌ చేసిన ప్రచారమంతా డీఎంకేని ఓడించగలిగే ప్రధాన ప్రతిపక్షం ఏఐడీఎంకే–బీజేపీ కూటమి ఖాతాలో చేరేది. కానీ, 2009 ఏపీ ఎన్నికల్లో ‘చిరంజీవి’ (ప్రజారాజ్యం), జయప్రకాశ్‌ నారాయణ (లోక్‌సత్తా) ఫ్యాక్టర్‌ పాలకపక్షం కాంగ్రెస్‌కు లాభించి డా‘‘ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసినట్టు ఇక్కడ కూడా విజయ్‌ కారకం స్టాలిన్‌కే లాభం చేకూర్చవచ్చు. కాంగ్రెస్‌ రాష్ట్రంలో బీజేపీ కన్నా మెరుగ్గా ఏం లేకపోయినా ప్రధాని మోదీ సానుకూలత ఎంతో కొంత తగ్గి, రాహుల్‌ ప్రజాదరణ పెరిగినట్టు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. మహిళల ఓట్లు ఈసారి మూకుమ్మడిగా ఒక వైపు వెళ్లే పరిస్థితి లేదు. ఇలా అనేక అంశాలతో పాటు ‘విజయ్‌ ఫ్యాక్టర్‌ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విజేతను తేల్చనుంది.


దిలీప్‌ రెడ్డి
వ్యాసకర్త పొలిటికల్‌ ఎనలిస్ట్,పీపుల్స్‌ పల్స్‌ రిసెర్చి సంస్థ డైరెక్టర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement