విశ్లేషణ
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, అమెరికాలోని యూదు లాబీల ఒత్తిడి నుంచి అధ్యక్షుడు ట్రంప్ బయట పడలేకపోయి నట్లయితే, ఇరాన్‌తో పదాతి సేనల యుద్ధం తప్పక పోయేటట్లే కనిపిస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28తో ఆరంభించి దాదాపు అయిదు వారాలుగా సాగిస్తున్న వైమానిక, నౌకా, క్షిపణి యుద్ధం ఇరాన్‌ను తీవ్రంగానే నష్టపర చినా, సమీప భవిష్యత్తులో ఓడించగల సూచనలు లేకపోవటంతో, కనీసం పదాతి యుద్ధంతోనైనా ఆ పని చేయగలమా అనే మీమాంసలో ట్రంప్ ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇరాన్ ప్రతిఘటనతో తమకు, ఇజ్రాయెల్‌కు, గల్ఫ్ రాజ్యాలకు, ప్రపంచ ఇంధన వ్యవస్థకు కలుగుతున్న నష్టాలు, అమెరికన్ ప్రజ లతో పాటు తన ‘మాగా’ మద్దతుదారులలో ఎదురవుతున్న వ్యతిరేక తలు కూడా ఆయనపై ఒత్తిడిని పెంచుతున్నట్లు తోస్తున్నది.
స్వభావమే సమస్య
అయినప్పటికీ ఏమీ చెప్పలేని స్థితి. అందుకు కారణం నెతన్యాహూ ఒత్తిడి అన్నది సరేసరి కాగా, స్వయంగా ట్రంప్ స్వభావం ఒక పెద్ద సమస్య అవుతున్నది. ఇరాన్‌ను తుదముట్టించాలన్నది తన ‘40 సంవత్సరాల కల’ అని, అందుకు తగిన అవ కాశం ఇప్పుడు వచ్చిందని నెతన్యాహూ అంటూ, అది నెరవేర్చగల నాయకుడు అమెరికన్ చరిత్రలో మొదటిసారిగా ఆవిర్భవించాడని చెప్తున్నారు. ఇరాన్‌పై ఈ తరహా యుద్ధం సాగించాలన్న ఒత్తిడులు ఒబామా, బైడెన్ కాలాలలోనూ వచ్చినా, వారు ఆంక్షలతో సరిపెట్టి యుద్ధానికి నిరాకరించారు.
అణుశక్తి విషయమై చర్చల ద్వారా ఒప్పందం జరిగింది (2015) కూడా అప్పుడే. ఆ ఒప్పందాన్ని ఎటువంటి కారణం లేకుండా రద్దు చేసిన ట్రంప్, రెండవసారి అధ్యక్షుడైనప్పటినుంచి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో కనిపిస్తు న్నదే. ఆయనను నెతన్యాహూ అంతగా పొగడటం అందువల్లనే. ఒక్క ఇరాన్ విషయంలోనే కాదు, అనేక ఇతర అంశాలలోనూ ట్రంప్ మొదటినుంచి గత 14 మాసాలుగా ప్రవర్తిస్తున్న తీరు ఇదే విధంగా ఉంది. ఆయన ‘స్వభావం’ అనే మాట ఉపయోగించవలసి రావటం అందువల్లనే.
ప్రస్తుతం గడువులు, షరతులు, చర్చలు అనే ప్రహసనం మరొకసారి సాగుతున్నది. ఇరాన్ లొంగుబాటుకు 48 గంటల గడు వన్నారు. ఆ సమయం పూర్తి కావస్తుండగా అయిదు రోజులన్నారు. అది ముగియకముందే పది రోజులకు పెంచారు. అది ఏప్రిల్ 6న గడవనున్నది. ఈలోగానే 15 షరతులతో ఒక రాజీ ప్రతిపాదన అమె రికా నుంచి వచ్చింది. అందుకు మారుగ ఇరాన్ 5 షరతులన్నది. ఆ రెండింటిలో ఏదీ రాజీకి వీలయ్యేది కాదని ఎవరైనా వెంటనే చెప్ప గలరు.
అసలు అణుశుద్ధి కార్యక్రమాన్నే పూర్తిగా ఆపివేయాలనీ, క్షిపణుల సామర్థ్యం, సంఖ్య తాము చెప్పినట్లే ఉండాలనీ, (ఇరాన్) అనుబంధ మిలిటెంట్ సంస్థలకు మద్దతు పూర్తిగా నిలిపి వేయాలనీ, హార్ముజ్‌పై సార్వభౌమాధికారం వదలుకోవాలనీ షరతులు విధిస్తే అందుకు ఇరాన్ అంగీకరించగలదా? అదే విధంగా గల్ఫ్‌లోని సైనిక స్థావరాలన్నీ ఖాళీ చేసి పోవాలన్న ఇరాన్ షరతు అమెరికాకు సమ్మతం కాగలదా? కనుక అది కాలక్షేపపు వ్యవహారం మాత్రమే. ఆ మాట తెలిసి కూడా అమెరికా అధ్యక్షుడు, చాలా షరతులను ఇరాన్ అంగీకరించి వేసిందని ఈ 30వ తేదీన మరొకమారు ప్రకటించారు.
గెలిచే యుద్ధమేనా?
ఎంతో వెనుకకు పోనక్కర లేదు. అమెరికా, ఇరాన్ మూడవ విడత చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వంతో ఫిబ్రవరి 26న జరిగాయి. పరస్పర అంగీకారం దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు ఒమన్‌తో పాటు అమెరికన్ ప్రతినిధులు ప్రకటించారు. తర్వాతి విడత చర్చలు మార్చి 2న జరగవలసి ఉంది. కానీ అకస్మాత్తుగా ఆ మధ్యలోనే ఇజ్రాయెల్, దాని వెనువెంట అమెరికా కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఏ ఇరాన్ నాయకుని అనుమతితో చర్చలు జరుగుతుండెనో అదే నాయకుడిని కుటుంబంతో సహా ప్రాణాలు తీశాయి. చర్చలు ఒక పక్క జరుపుతూనే మధ్యలో దాడులు చేయటం ట్రంప్‌కు అది రెండవసారి.
అందుకే చర్చల నాటకాన్ని ఇరాన్ మాత్రమే కాదు, ఎవరూ నమ్మటం లేదు. అమెరికన్లు కూడా. నాలుగు వారాల వైమానిక యుద్ధం ట్రంప్ లక్ష్యాలను సాధించలేక పోయినప్పుడు పదాతి యుద్ధంతో అది జరిగేది కాదని అమెరికన్ రిటైర్డ్ జనరల్స్, యుద్ధ విషయాల చరిత్రకారులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. అందుకు వారు గట్టి కారణాలు కూడా చెప్తున్నారు. లిబియా, ఇరాక్, అఫ్గాని స్తాన్‌లకు, ఇరాన్‌కు చాలా తేడాలున్నాయి. వాటికి భిన్నంగా ఇక్కడ విశాలమైన దేశం, పెద్ద జనాభా, బలమైన ప్రభుత్వం, భారీ సైన్యం, సైనిక సంపత్తి ఉన్నాయి. ఇరాన్ అనుసరిస్తున్న యుద్ధ వ్యూహం భిన్నమైనది. ఇరాన్‌లో అధిక భాగం పర్వతాలమయం.
వారి ఆయుధ నిల్వలు కొండల అడుగున చాలా లోతైన బంకర్లలో ఉన్నందునే అమెరికన్ బంకర్ బస్టర్లు సైతం వాటిని ఛేదించలేక పోతున్నాయి. వీటన్నింటికీ అదనంగా, ఇరానియన్ ప్రభుత్వం, ప్రజలు కూడా తమ అస్తిత్వాన్ని ఏ విధంగానైనా కాపాడుకుని తీరాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. అక్కడి ప్రజలు ప్రజాస్వా మికంగా ఎన్నుకున్న మొసాదెగ్ ప్రభుత్వాన్ని అమెరికా, బ్రిటన్ కలిసి 1953లో కూలదోసినప్పటి నుంచి గల 72 సంవత్సరాల చేదు అనుభవాల దృష్ట్యా పాశ్చాత్య దేశాలను, ఇజ్రాయెల్‌ను ఎంత మాత్రం నమ్మరన్నది ఆ నిపుణులు చెప్తున్నమాట.
కపట నీతి
అందువల్ల, అమెరికా అధ్యక్షుడు గత 12 రోజులలో మూడు సార్లు మార్చిన గడువులుగానీ, చర్చల కోసమంటున్న షరతులు గానీ, ఇస్లామాబాద్‌లో జరుగుతాయనే మధ్యవర్తిత్వాలు గానీ ప్రహసనం తప్ప మరొకటి కాదు. అయినా, ఇరాన్‌పై యుద్ధాన్నిఇంకా తీవ్రం చేయండంటూ ట్రంప్‌కు మూడు రోజుల క్రితం చెప్పిన సౌదీ అరేబియా, అంతలోనే ఈజిప్టు, టర్కీలతో కలిసి పాకిస్తాన్‌కు మధ్యవర్తి ప్రతినిధులను పంపటం కపట నీతికి పరాకాష్ఠ వంటిది. ఇటువంటి రాజీలేవీ కుదిరేవి కాదని ఒమన్ దౌత్య వైఫల్యంతో గ్రహించలేనిదేమీ కాదు పాకిస్తాన్. అయినప్పటికీ చొరవ తీసుకోవటంలో తమ ఆలోచనలేవో తమకుండవచ్చుగానీ, అది జరిగే కార్యం కాదని అందరికీ తెలుసు. అంతకన్న ముఖ్యంగా, దానిని జరగనివ్వరాదని ఇజ్రాయెలీ ప్రధానికి తెలుసు. వీటన్నింటికి ఇరాన్‌పై అరబ్ షేఖ్‌లకు చిరకాలంగా గల వ్యతిరేకత పనిచేస్తున్నది.
అందువల్ల, వెనిజులాతో చర్చలు చర్చలంటూ సైన్యాలను మోహరించి అకస్మాత్తుగా దాడి చేసినట్లు, ఇరాన్‌తో చర్చలు చర్చలంటూ సైన్యాలను సమీకరించి ఉన్నట్లుండి యుద్ధం మొదలు పెట్టినట్లు, ఇప్పుడు మళ్లీ ఒకవైపు రాజీ ప్రతిపాదనలు ప్రకటించి ఇస్లామాబాద్‌లో చర్చలంటూనే పదాతి సేనలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అకస్మాత్తుగా ట్రంప్ 30వ తేదీన తన బ్రాండ్ మాట ఒకటి ప్రకటించారు. తనకు ఇరాన్ చమురు కావాలట. అందుకు ఖర్గ్ దీవిని ఆక్రమించుకుని హార్మూజ్‌ను తెరిపిస్తారట. కార్యసాధన తర్వాతగానీ ఇరాన్ నుంచి వెనుకకు మళ్లరట. ఒకవేళ రాగల రోజు లలో వైమానిక దాడులు, భూతల యుద్ధం జమిలిగా సాగితే ఏమి జరగవచ్చునన్నది అంచనా వేయలేము.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


