breaking news
Telangana
-
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 19-26)
-
ఎన్నికల వేళ ఆయుధాల డిపాజిట్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక నేపథ్యంలో అనుమతి పొందిన ఆయుధాలను లైసెన్స్‌దారులు తమ సమీప ఠాణాల్లో అప్పగిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం వెపన్ లైసెన్స్ హోల్డర్లు తమ ఆయుధాలను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు వెపన్ లైసెన్స్‌దారులకు గత రెండు నెలల నుంచే ఆయా పోలీస్స్టేషన్ల అధికారులు సమాచారం ఇచ్చారు. వాటిని ఠాణాల్లో గానీ, గుర్తింపు పొందిన సంబంధిత ఆయుధ విక్రయ కేంద్రాల్లో గానీ డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పించారు. శాంతి భద్రతలు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే దిశగా ఎన్నికల సమయంలో తుపాకులను డిపాజిట్ చేయాలనే నిబంధనే ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో దీని పరిధి కిందికి వచ్చే పోలీస్ స్టేషన్లలో లైసెన్స్‌దారులు గత కొద్ది రోజుల నుంచి వాటిని అప్పగిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధి కిందికి పంజగుట్ట, మధురానగర్, బోరబండ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టోలిచౌకి, గోల్కొండ, సనత్‌నగర్ తదితర పోలీస్స్టేషన్లు వస్తాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలోని ఎనిమిది ఠాణాల పరిధిలో 234 లైసెన్స్డ్ తుపాకులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం లైసెన్స్డ్ తుపాకులు తెప్పించుకుని పోలీస్స్టేషన్లలో డిపాజిట్ చేయిస్తున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, రియల్టర్లు ఈ ఆయుధాలను కలిగి ఉన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో తుపాకులు ఉన్నవారు బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉండడంతో ఎన్నికలు అయ్యే వరకు పోలీసులు వాటిని డిపాజిట్ చేసుకోవాలని ఎన్నికల సంఘం నిబంధనలు తెలియజేస్తున్నాయి. ఆయుధ లైసెన్స్ ఉన్నవారి వివరాలను నేషనల్ డేటా బేస్ ఆఫ్ ఆర్మ్స్ లైసెన్స్ వెబ్సైట్లో పొందుపరచడమే కాకుండా లైసెన్స్ కలిగిన ప్రతిఒక్కరికీ ఐడీ నెంబర్ కేటాయించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 234 మంది లైసెన్స్‌దారులకు నోటీసులు జారీ చేసి వారి నుంచి తుపాకులను డిపాజిట్ చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 80 శాతం ఆయుధాలు డిపాజిట్ చేయడం జరిగింది.క్రిమినల్ కేసులు నమోదైతే లైసెన్స్ రద్దు.. ఆయుధ లైసెన్స్ కలిగిన వ్యక్తులపై ఏదైనా సందర్భంలో క్రిమినల్ కేసులు నమోదైతే వారికి ఆయుధ లైసెన్స్‌ను రద్దు చేయనున్నారు. అంతేకాకుండా ఆయుధాన్ని అనవసరంగా ఉపయోగించినా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. అనుమతి పొందిన ప్రాంతం కంటే ఇతర ప్రాంతాల్లో ఆయుధం సంచరించినా లైసెన్స్‌ను రద్దు చేస్తారు. -
ప్రయాణికుల నిలువు దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ వాహనాలు బీసీ బంద్‌ను భారీగా సొమ్ము చేసుకున్నాయి. దీపావళి వేడుకలు, వరుస సెలువుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు బయలుదేరిన నగరవాసుల పైన దారిదోపిడీకి పాల్పడ్డాయి. సాధారణ రోజుల్లో విధించే చార్జీలపైన రెట్టింపు వసూలు చేశాయి. బంద్ సందర్భంగా సిటీబస్సులతో పాటు దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు సైతం నిలిచిపోయాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి. మహాత్మాగాం«దీ, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సులను కూడా నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అప్పటికే బస్స్టేషన్లకు చేరుకున్న ప్రయాణికులు ఏదో ఒకవిధంగా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. దీంతో క్యాబ్‌లు, టాటాఏస్‌లు, మ్యాక్సీక్యాబ్‌లు, తదితర వాహనదారులు అడ్డగోలుగా దోచుకున్నాయి. గత్యంతరం లేకపోవడంతో ఎక్కువ చార్జీలను చెల్లించి వెళ్లాల్సి వచి్చంది. బీసీ బంద్ దృష్ట్యా హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే సుమారు 3500 బస్సులు స్తంభించాయి. మరోవైపు నగరంలోని 25 డిపోల్లో మరో 2850 కి పైగా సిటీ బస్సులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి. వీకెండ్ కావడంతో వివిధ అవసరాల నిమిత్తం ఇంటి నుంచి బయటికి వచ్చిన జనాన్ని ఆటోవాలాలు దోచుకున్నారు.సెవెన్ సీటర్ ఆటోలు, శేర్ ఆటోల్లో సైతం రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. ఇష్టారాజ్యంగా వసూళ్లు... ఓలా, ఉబెర్, ర్యాపిడీ వంటి సంస్థలతో అనుసంధానమయ్యే క్యాబ్ డ్రైవర్లు తమ వాహనాలను బంద్ దృష్ట్యా జిల్లాలకు మళ్లించారు. మరోవైపు పలు ఐటీ సంస్థలకు వాహనాలను నడిపే ట్రావెల్ ఏజెంట్లు సైతం దీపావళి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు రోడ్డెక్కాయి. ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్, ఆరాంఘర్, బీఎన్‌రెడ్డినగర్, తదితర ప్రాంతాల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించాయి. ప్రయాణికుల రద్దీకనుగుణంగా వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ క్యాబ్‌లు బారులు తీరాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి హన్మకొండ వరకు ఆర్టీసీ లగ్జరీ బస్సుల్లో రూ.250 నుంచి రూ.300 వరకు చార్జీ ఉంటుంది. సాధారణ రోజుల్లో ఈ రూట్లో రాకపోకలు సాగించే క్యాబ్‌లు సైతం ఈ చార్జీలను వసూలు చేస్తాయి. కానీ బంద్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని క్యాబ్‌వాలాలు రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేయడం గమనార్హం. ఎల్బీనగర్ నుంచి విజయవాడ, ఖమ్మం, సూర్యాపేట్, నల్లగొండ, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం ఇదేవిధంగా క్యాబ్‌వాలాల దారిదోపిడీకి గురయ్యారు. మెట్రోలు ఫుల్... బీసీబంద్ దృష్ట్యా మెట్రో రైళ్లు కిక్కిరిశాయి. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–ఎంజీబీఎస్ రూట్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు మెట్రోలను ఆశ్రయించారు. మరోవైపు ఆటోరిక్షాలకు సైతం డిమాండ్ పెరిగింది. ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటోల్లోనూ చార్జీలు అమాంతంగా పెరిగాయి.బంద్ కారణంగా ఆసుపత్రులకు వెళ్లే వారు, అత్యవసర పనులపైన బయటకు వెళ్లిన వాళ్లు పెద్ద మొత్తంలోసమరి్పంచుకోవాల్సి వచి్చంది. బంద్‌లో పలువురు నేతలుబీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు మద్దతుగా అన్ని పారీ్టలు, ప్రజాసంఘాలు, బీసీ సంఘాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రజారవాణా స్తంభించినప్పటికీ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. సీపీఎం, సీపీఐ, సీసీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, తదితర వామపక్ష పారీ్టలు, ప్రజా సంఘాలు, తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం, తదితరులు నారాయణగూడ వైఎంసీఏ నుంచి కాచిగూడ చౌరస్తా, కోఠీ , సుల్తాన్ బజార్, రామకోఠీ, బొగ్గులకుంట మీదుగా అబిడ్స్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతి సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క, సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ , సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్, తెలంగాణ జన సమితి నాయకులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సీపీఐఎల్ ఎల్ మాస్ లైన్ హన్మే‹Ù, గదేగోని రవి, తదితరులు పాల్గొన్నారు. -
పరువు హత్య.. కోడలి ప్రాణం తీసిన మామ
సాక్షి, దహెగాం: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని తండ్రి కక్ష పెంచుకున్నాడు. కోడలితో కలిసి అత్తారింటి వద్దే కొడుకు ఉండడాన్ని జీర్ణించుకోలేక కోడలిని హతమార్చాలని పన్నాగం పన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిండు గర్భిణి అని కూడా చూడకుండా గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తలాండి శ్రావణి (22), శివార్ల శేఖర్ ప్రేమించుకుని గతేడాది కులాంతర వివాహం చేసుకున్నారు. శేఖర్ తండ్రి సత్తయ్య అప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్నాడు. భార్య శ్రావణి ఉరఫ్ రాణితో కలిసి శేఖర్ అత్తారింటి వద్దే ఉంటున్నాడు. శనివారం శేఖర్ తన అత్తామామలు చెన్నయ్య, అనూషతో కలిసి వంట చెరుకు తీసుకురావడానికి గ్రామ సమీపంలోని అడవికి వెళ్లాడు. గర్భిణి అయిన శ్రావణి ఇంట్లో ఒంటరిగా ఉంది. సత్తయ్య గొడ్డలితో ఇంట్లోకి చొరబడి శ్రావణిపై దాడి చేశాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నంలో బయటకు పరుగులు తీసినా వెంబడించి దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సత్తయ్య పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
మూలవిరాట్టును వీడియో తీయడమా?
సాక్షి, హైదరాబాద్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి మూలవిరాట్టు దర్శనం విషయంలో అధికారులు చేసిన ప్రకటన వివాదాస్పదమవుతోంది. ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నందున పనులు పూర్తయ్యే వరకు ప్రధాన ఆలయంలో దర్శనాలను నిలిపివేయాలని ఇప్పటికే నిర్ణయించారు. అప్పటి వరకు సమీపంలోని భీమేశ్వరాలయంలోని మూర్తినే సాధారణ భక్తులు దర్శించుకుని పూజాధికాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై కొందరు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజన్న దర్శన భాగ్యాన్ని కల్పించకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రధాన దేవాలయ మూలవిరాట్టు దర్శనాన్ని ఎల్ఈడీ తెరల ద్వారా కల్పించాలని నిర్ణయించినట్లు దేవాదాయశాఖ ఇటీవల ప్రకటించింది.ఇప్పుడు ఈ విషయంపై అర్చకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారత్‌లోని ప్రధాన దేవాలయాల్లో స్వామి, అమ్మవారి మూలవిరాట్టు చుట్టూ విద్యుత్తు కాంతులు కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కేవలం నూనె దీపం వెలుగులోనే దేవుళ్ల దర్శనాలుంటాయి. మూల విరాట్టు వీడియోలు, ఫొటోలు తీయడం కూడా నిషేధం. ఎల్ఈడీ తెరలపై స్వామి వారి దర్శనం కల్పించాలంటే కచ్చితంగా వీడియో తీయాలి. స్వామివారి మూలవిరాట్టుపై విద్యుత్తు కాంతి ప్రసరించడం, వీడియో తీయడం... ఇలా రెండు అపచారాలకు కారణమవుతుందని అర్చకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫొటోలు, వీడియో తీయరాదని హెచ్చరిక బోర్డులు పెట్టే దేవాదాయశాఖనే దానిని ఎలా ఉల్లంఘిస్తుందని ప్రశ్నిస్తున్నారు. దీంతో దేవాదాయ శాఖ అయోమయానికి గురవుతోంది. శృంగేరీ స్వామి సూచనల మేరకు... శృంగేరి దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం జగద్గురు శంకరాచార్య శ్రీ విదుశేఖర భారతి స్వామి ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఆయన ఆదివారం రాత్రి వేములవాడకు చేరుకోనున్నారు. విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి తగు సూచనలు తీసుకుని ఆ మేరకే చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ అధికారులు నిర్ణయించారు. ఆయన నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించవని భావిస్తున్నారు. దేవాలయాల్లో దర్శనాలు, వైదిక కార్యక్రమాలన్నీ శాస్త్రబద్ధంగానే కొనసాగాల్సి ఉంటుందని ప్రముఖ పౌరాణికులు బాచంపల్లి సంతోష కుమారశాస్త్రి పేర్కొన్నారు. -
మీ ఆలోచనలే.. దుష్ట చతుష్టయం
అసమాన నాయకత్వ ప్రతిభ కనబరిచే టీమ్ లీడర్లు బయటి నుంచి ఎదురయ్యే సవాళ్ల వల్ల కాకుండా.. తమ అపరిమితమైన ఆత్మవిశ్వాసం వల్ల విఫలమవుతుంటారని ‘హార్వర్డ్ బిజినెస్ రివ్యూ’ (హెచ్.బీ.ఆర్.) తాజా సంచికలోని ఒక వ్యాసం విశ్లేషించింది. ఇందులో ముఖ్యంగా కొన్ని లక్షణాలు.. ఇటు నాయకులు / లీడర్లు / బాస్‌లకే కాదు.. ఇంటిని నడిపే ఇంటి యజమానులకూ వర్తిస్తాయి అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.‘ఇనుమును ఏదీ నాశనం చేయలేదు.. దాని తుప్పు తప్ప. అలాగే ఒక మనిషి పురోగతిని ఆపేసేది తన మనస్తత్వమే తప్ప బయటి వ్యక్తులో, అంశాలో కాదు’– రతన్ టాటాప్రతి పనిలో నేనుండాలితమ ముద్ర కనిపించాలి అనే తాపత్రయంతో ప్రతి పనిలో ‘నేనుండాలి’ అని అనుకుంటారు చాలామంది.దుష్ఫలితం: అలసట, నిస్సత్తువ పెరుగుతాయి. టీమ్‌లో చొరవ లోపిస్తుంది. ‘అన్నీ ఆయన చూసుకుంటాడులే’ అనే ధోరణి కిందివారిలో పెరిగిపోతుంది. సృజనాత్మకంగా ఆలోచించడం మానేస్తారు. పిల్లలు పెద్దయ్యాక కూడా చాలామంది తల్లిదండ్రులు వాళ్లను స్వతంత్రంగా పనిచేయనివ్వరు.ఇలా మార్చుకొని చూడండి: ‘నేను ఏదైనా చేయగలను. కానీ ప్రతి పనీ నేనే చేయాల్సిన అవసరం లేదు’ అనే ధోరణి మంచిది. అప్పుడు అందరికీ పనిచేసే అవకాశం వస్తుంది. వినూత్నంగా ఆలోచిస్తారు. నాయకుడు అంటే నడిపించాలి కానీ ప్రతి స్థాయిలో ప్రతి పనీ తానే చేయాల్సిన అవసరం లేదు.సంస్థల్లోని నాయకులు లేదా ఇంటికి యజమానిలో అజ్ఞాతంగా ఉండే ఆధిపత్య భావనలు వారి పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేసి, వారి అభివృద్ధికి ఆటంకంగా మారతాయి. మొదట బలాలుగా కనిపించిన ఈ భావనలు క్రమేణా బలహీనతలుగా మారతాయి. బాహ్య అడ్డంకుల్లా ఇవి పైకి కనిపించవు. ఎవరికి వారు వీటిని గుర్తించి, సానుకూలంగా మలుచుకుంటే వైఫల్యాలను నివారించవచ్చు. ఎందుకంటే.. నిజమైన నాయకత్వ పురోగతి అంతర్గతంగా ప్రారంభమవుతుంది. ఏమిటీ భావనలు.. వీటి దుష్ఫలితాలేంటి.. వీటిని ఎలా అధిగమించాలి?వెంటనే పని పూర్తి చేసేయాలిప్రాధాన్యతలతో సంబంధం లేకుండా.. ప్రతి పనినీ తక్షణమే పూర్తి చేయాలి, వెంటనే ఫలితాలు కనిపించాలి అనే ధోరణితో చాలామంది ఉంటారు.దుష్ఫలితం: పిల్లలకు అన్ని అంశాల్లోనూ ఇలాగే చెప్పడం వల్ల వారికి ప్రాధాన్యతలు తెలియవు. బృందం విషయానికొస్తే.. ప్రతి పనిలోనూ ‘ఎమర్జెన్సీ’ పరిస్థితి ఏర్పడి తప్పులు జరగొచ్చు.ఇలా మార్చుకొని చూడండి: ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి’ అన్నట్టు అవసరమైన పనిపై ముందు దృష్టి పెడతాను అనుకోవాలి. ప్రాధాన్యతలు గుర్తించడమే సగం విజయం. పిల్లలు కూడా రోజువారీ చేసే పనుల్లో ఎక్కువ ఫలితం ఇచ్చే పనికి అధిక ప్రాధాన్యత.. తక్కువ ఫలితం ఇచ్చే దానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుంటారు. దానికి తగ్గట్టుగా సమయం, ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు వినియోగిస్తారు.నేను తప్పులు చెయ్యకూడదుపనిలో కచ్చితత్వం కోసం తపన పడుతూ ఇలా ఆలోచిస్తుంటారు. దుష్ఫలితం: వినూత్న విధానాలను ప్రయత్నించే ధైర్యం చేయలేకపోవడం, అతి జాగ్రత్త, ఎప్పుడూ ఫలితంపైనే అధిక శ్రద్ధ.ఇలా మార్చుకొని చూడండి: ‘తప్పులు జరగకుండా చూడటం కాదు, సరిగ్గా పని జరిగేటట్లు చూడాలి’ అనే ధోరణి ఏర్పరచుకోవాలి. ఇది కింది వాళ్లను మూస ధోరణిలో కాకుండా కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఫలితంపై శ్రద్ధ కాకుండా.. పనిని సరిగ్గా చేయడం అలవాటవుతుంది.అందరూ నాలాగే పని చెయ్యాలిఇంట్లో లేదా ఆఫీసులో అందరూ తమలాగే ఆలోచించాలని, పనిచేయాలని.. ఆలోచిస్తారు, ఆశిస్తారు.దుష్ఫలితం: వ్యక్తిగత సామర్థ్యాలలోని వ్యత్యాసాలు గుర్తించరు. ఎవరి సామర్థ్యానికి, పనిచేసే ఒడుపునకు తగ్గట్టు వారిని స్వేచ్ఛగా పనిచేయనివ్వరు. ముఖ్యంగా పిల్లల విషయంలో వారి వయసును కూడా ఒక్కోసారి మర్చిపోయి వారిపై ఒత్తిడి పెంచుతుంటారు.ఇలా మార్చుకొని చూడండి: ‘నాలా అందరూ ఆలోచించలేకపోవచ్చు, పనిచేయలేకపోవచ్చు’ అనే వాస్తవాన్ని గుర్తించండి. వారి వారి సామర్థ్యాలు, తెలివితేటలకు అనుగుణంగా పనిచేసే వాతావరణం కల్పించండి. ముఖ్యంగా ఇది పిల్లల మానసిక వికాసానికి దోహదపడుతుంది. -
‘సాక్షి’పై పథకం ప్రకారమే కుట్ర..
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ దినపత్రికపై పథకం ప్రకారమే ఏపీలోని కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. ఆయన శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఇలాంటి కుట్ర లు ఈ ఒక్కసారే కాదు.. ప్రతిసారీ ఏదో విధంగా వేధిస్తూనే ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్య విలువలను హరిస్తున్నారు.అందుకు ఉదాహరణ ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసులు పెట్టడమే’ అని పేర్కొన్నారు. దీన్ని తాము సీరియస్‌గా పరిగణిస్తున్నామని, ఏదో సాకుతో కేసులు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇ లాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. ‘సాక్షి’కి, జర్నలిస్టులకు బాసటగా నిలబడతామని అంటూ, రాజ్యాంగంపై చంద్రబాబుకు ఏ మాత్రం గౌరవం, విశ్వాసం ఉన్నా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలి ఏపీ కూటమి ప్రభుత్వంపై వార్తలు రాస్తోందని సాక్షి పత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం సరైంది కాదని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ఒక ప్రకటనలో ఖండించారు. తక్షణమే కేసులను ఉపసంహరించుకో వాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా కు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడం సరికాదన్నారు. వార్తలు, కథనాలు, ప్రసారాలపై అభ్యంతరాలుంటే ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలని, అలా కాకుండా ‘సాక్షి’పై పదేపదే కేసులు పెట్టడం దారుణమని ఆయన అన్నారు. ఎడిటర్‌కు నోటీసులు.. మీడియా స్వేచ్ఛను హరించడమే.. ప్రచురితం చేసిన వార్తా కథనాలకు సంబంధించి ఆధారాలు వెల్లడించాలంటూ ఎడిటర్‌పై పోలీసులు ఒత్తిడి చేయడం, నోటీసులు జారీచేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(హెచ్ 143) ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎడిటర్ ధనంజయరెడ్డికి పలుమార్లు నోటీసులు జారీ చేయడం, ప్రచురితమైన వార్తలకు సంబంధించి సోర్స్‌ను బహిర్గతపరచాలని హుకుం జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి చర్యల్ని జర్నలిస్టు సంఘాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. -
మన భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్, క్లోరైడ్, నైట్రేట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూగర్భ జలాల్లో పరిమితులకి మించి ఫ్లోరైడ్, క్లోరైడ్, నైట్రేట్‌తోపాటు ఇతర రసాయన మూలకాలున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల పరిశీ లన కోసం బావుల నుంచి 2024లో వానాకాలానికి ముందు 412, వర్షాల తర్వా త 375 నీటి నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని రీజనల్ కెమికల్ ల్యాబొరేటరీలో పరీక్షించి ఈ మేరకు ఓ నివేదికను రూపొందించింది. చాలా జిల్లాల్లోని భూగర్భ జలాల్లో మనుషుల ఆరోగ్యానికి హానికరమైన మూలకాలు న్నట్టు ఈ పరీక్షల్లో తేలింది. రాష్ట్రంలోని భూగర్భ జలాలు ప్రధానంగా క్యాల్షియం బైకార్బొనేట్ రసాయన పదార్థాన్ని అధిక మోతాదులో ఉన్నట్టు తేలింది. అధిక మోతాదులో క్యాల్షియం తీసుకుంటే మూత్రపిండాలు, మూత్రా శయంలో రాళ్లు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని కేంద్రం తెలిపింది. 19% జలాల్లో మోతాదుకి మించి ఫ్లోరైడ్బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల ప్రకారం లీటర్ నీళ్లలో మిల్లిగ్రామ్ కంటే తక్కువగా ఫ్లోరైడ్ ఉంటేనే తాగడానికి అత్యంత సురక్షితమైన నీటిగా పరిగణిస్తారు. వర్షాలకి ముందు తీసిన 252 నమూనాలు (61.2శాతం), వర్షాకాలం తర్వాత తీసిన 252 నమూనాలు(67.2శాతం) ఈ పరిమితికి లోబడే ఉన్నాయి. లీటర్ నీళ్లలో 1.01–1.5 మిల్లీగ్రామ్ ఫ్లోరైడ్ ఉంటే అనుమతించదగినదిగా భావిస్తారు. వర్షాకాలానికి ముందు తీసిన 79 నమూనాలు (19.2శాతం), వర్షాకాలం తర్వాత తీసిన 50 నమూనాలు (13.3శాతం) ఈ మేరకు అనుమతించదగిన స్థాయిల్లో ఫ్లోరైడ్‌ను కలిగి ఉన్నట్టు తేలింది. వర్షాకాలానికి ముందు తీసిన 81 నమూనాలు(19.7శాతం), వర్షాకాలం తర్వాత తీసిన 73 నమూనాలు(19.5శాతం) అనుమతించదగిన స్థాయికి మించి ఫ్లోరైడ్‌ను కలిగి ఉన్నట్టు నిర్థారణ జరిగింది. తాగునీళ్లలో అధిక మోతాదులో ఫ్లోరైడ్ ఉంటే మనుషులను ఎముకుల గూళ్లుగా మార్చే ఫ్లోరోసిస్ అనే వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది. దంతాల సమస్యలూ ఉత్పన్నమవుతాయి.ఫ్లోరైడ్ నల్లగొండలోనే అత్యధికం..నల్లగొండ జిల్లాలో వర్షాలకి ముందు తీసిన భూగర్భ జలాల నమూనాల్లో అత్యధికంగా లీటర్‌కి 5.84 మి.గ్రా. ఫ్లోరైడ్ ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలోనే అత్యధిక పరిమాణంలో ఫ్లోరైడ్ కలిగి ఉన్న జిల్లా ఇదే. అయితే, వర్షాల తర్వాత 3.55 మి.గ్రా.కు తగ్గింది. ఇతర జిల్లాల్లో చూస్తే.. వర్షాలకి ముందు యాదాద్రి భువనగిరిలో 4.42, వర్షాల తర్వాత 2.69.. వరంగల్‌లో వర్షాలకి ముందు 2.48, వర్షాల తర్వాత 5.59, హన్మకొండలో వర్షాలకి ముందు 4.34, వర్షాల తర్వాత 2.34, ఆదిలాబాద్‌లో వర్షాలకి ముందు 3, వర్షాల తర్వాత 5.5 మి.గ్రా. ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. రాష్ట్రంలో పరిమితికి మించి ఫ్లోరైడ్ కలిగిన జిల్లాలు 2017లో 26 ఉండగా, 2024లో 24కి తగ్గాయి.గద్వాలలో అత్యధికంగా క్లోరైడ్బీఐఎస్ ప్రమాణాల ప్రకారం లీటర్‌కి 250 మిల్లీగ్రామ్ క్లోరైడ్ కలిగిన జలాలను సరక్షితమైనవిగా పరిగణిస్తారు. ప్రత్యామ్నాయ తాగునీటి సదుపాయం లేని ప్రాంతాల్లో లీటర్‌కి 1000 మి.గ్రా. వరకు ఫ్లోరైడ్‌ను అనుమతిస్తారు. క్లోరైడ్ పరిమాణం అంతకు మించితే నీళ్లు తాగడానికి పనికిరావు. వర్షాకాలానికి ముందు జరిపిన పరీక్షల్లో రాష్ట్రంలో జోగులాంబ గద్వాల జిల్లాలో లీటర్ భూగర్భజలాల్లో ఏకంగా 7657 మి.గ్రా. క్లోరైడ్ ఉన్నట్టు తేలింది. ఇతర జిల్లాల్లో పరిశీలిస్తే నల్లగొండలో 2947, భువనగిరిలో 884, సంగారెడ్డిలో 869, రంగారెడ్డిలో 794, మెదక్‌లో 716, ఖమ్మంలో 714, నాగర్‌కర్నూల్‌లో 554 మి.గ్రా. క్లోరైడ్ ఉన్నట్టు నిర్థారణ జరిగింది. గుండె, మూత్రపిండాలు, అజీర్ణం వంటి రోగాలతో బాధపడే వారికి మోతాదుకి మించిన క్లోరైడ్ ప్రమాదకరం.జూపల్లిలో నైట్రేట్ తీవ్రత అధికం..బీఐఎస్ ప్రమాణాల ప్రకారం గరిష్టంగా లీటర్‌కి 45మి.గ్రా. నైట్రేట్ కలిగి ఉన్న జలాలనే తాగడానికి సురక్షితంగా పరిగణిస్తారు. అధిక మోతాదులో నైట్రేడ్ కలిగి ఉన్న తాగునీటితో నవజాత శిశువుల్లో మెథెమోగ్లోబినెమియా అనే రక్త రుగ్మత, పెద్దల్లో ఉదరకోశ క్యాన్సర్లతోపాటు కేంద్ర నాడి వ్యవస్థపై తీవ్ర దుష్రభావం చూపుతుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని జూపల్లిలో అత్యధికంగా వర్షాలకి ముందు లీటర్‌కి 249.6 మి.గ్రా.లు, వర్షాల తర్వాత లీటర్‌కి 533.2 మి.గ్రా. నైట్రేట్ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన నమూనాల్లో 34.7శాతం మోతాదుకి మించి నైట్రేట్‌ను కలిగి ఉన్నట్టు వెల్లడైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మినహా అన్ని జిల్లాల్లోని భూగర్భ జలాలు మోతాదుకి మించి నైట్రేట్‌ను కలిగి ఉన్నాయి. -
ఉద్యోగులే మా వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ నేతలు పైశాచికానందంలో మునిగితేలుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. కలుషి తాహారం, రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనలు జరిగిన వెంటనే అక్కడ వాలిపోయి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ఘటనలు జరగకుండా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల కృషి వల్లే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అన్నారు. శనివారం శిల్పకలావేదికలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అథితిగా హాజరై గ్రూప్–2 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం కొత్తగా ఉద్యోగాలు పొందినవారిని ఉద్దేశించి మాట్లాడారు.నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండాలిఅమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని సీఎం విమర్శించారు. ‘వాళ్ల (గత పాలకులు) కుటుంబంలో ఖాళీగా ఉన్నవారికి ఉద్యోగాలు (పదవులు) ఇచ్చారు. కరీంనగర్ ఎంపీగా ఓడిన వ్యక్తికి రెండు నెలల్లో, నిజామాబాద్ ఎంపీగా ఒడిన బిడ్డకు రోజుల వ్యవధిలోనే కొలువులు ఇచ్చారు. కానీ, రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్న వాళ్లను నిలువునా ముంచారు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగాల భర్తీని వేగవంతం చేశాం. ఏడాదిలోపే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రూప్స్ ఉద్యోగాలను కూడా అవరోహణ క్రమంలో భర్తీ చేస్తున్నాం. మొన్న గ్రూప్–1, ఈరోజు గ్రూప్–2, త్వరలో గ్రూప్–3.. ఇలా భర్తీ చేస్తున్నాం. ఉద్యోగాలు సాధించిన వారిని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నాం. నిరుద్యోగుల జీవితాల్లో చీకటి రోజులు పోయి వెలుగు నిండాలి. ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాంటి వ్యవస్థ మాకు లేదు.. మీరే మా వ్యవస్థ. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్లు. మీ బాధ్యతలను సమర్ధంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ–2047 విజన్‌కు అనుగుణంగా పనిచేయాలి. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలపాలి. రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. వారిపట్ల నిర్లక్ష్యం వహిస్తే మీ నెలవారీ జీతం నుంచి 10 నుంచి 15 శాతం కోతపెట్టి ఒకటోతేదీన వారి ఖాతాల్లో జమచేస్తాం. గత పాలకులు దోపిడీ చేసిన సొమ్మును పంచుకోవడంలో లొల్లి జరుగుతోంది. ఆ విషయాన్ని వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ సెంటిమెంట్‌ను రాజేసి అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. అలాంటి వారిపట్ల అధికారులంతా జాగ్రత్తగ ఉండాలి. ప్రమాదాలు, ఫుడ్ పాయిజన్‌తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి’అని సీఎం సూచించారు.మానవ వనరులను ఖాళీగా ఉండనీయం: భట్టిరాష్ట్రంలోని మానవ వనరులను వృధాగా ఉంచలేమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బడికన్నా వెళ్లాలి... లేదా ఉద్యోగమన్నా చేయాలి అని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు బడికి రావాలని, వచ్చిన ప్రతిబిడ్డ ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని నైపుణ్యాలు పొందాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఒకే రోజు 783 మందికి గ్రూప్– 2 నియామక పత్రాలు అందించడం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, అద్దంకి దయాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అటవీ x రెవెన్యూ
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ–అటవీశాఖల మధ్య నెలకొన్న సరిహద్దుల పంచాయితీ ఎంతకీ కొలిక్కి రావడం లేదు. ఈ రెండు శాఖల మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న భూవివాదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు భూముల సంయుక్త సర్వే చేపడతామని చెబుతున్నా, అది ఆచరణలోకి రావడం లేదు. ముందుగా ఏవి అటవీ భూములు, ఏవి రెవెన్యూ భూములు అన్న దానిపై స్పష్టత సాధించే విషయంలోనే అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం. అటవీభూమి 60 లక్షల ఎకరాల్లో... తెలంగాణలో 60.64 లక్షల ఎకరాల మేర తమ శాఖ భూములు ఉన్నట్టుగా రికార్డుల్లో ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇందులో 49.80 లక్షల ఎకరాల భూముల్లో ఎలాంటి వివాదాలు లేకపోగా, రికార్డుల పరంగా క్లియర్‌గా ఉన్నాయంటున్నారు. గతంలోనే సిద్ధం చేసిన లెక్కల ప్రకారం..ప్ర«దానంగా పదిన్నర లక్షల ఎకరాల పరిధిలో అటవీ, రెవెన్యూశాఖల మధ్య సరిహద్దు వివాదాలు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీటిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం కోసం సంబంధిత శాఖలు ఎదురుచూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాం నాటి గణాంకాలను బట్టి చూస్తే... » మహబూబాబాద్ జిల్లాలో 3.44 లక్షల ఎకరాలుండగా, అందులో అత్యధికంగా 2.89 లక్షల ఎకరాలు వివాదాల్లో ఉన్నట్టు తెలిసింది. » వరంగల్ రూరల్ జిల్లాలో 38 వేల ఎకరాలుండగా, వాటిలో 26వేల ఎకరాల్లో భూ వివాదాలున్నాయి. » కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 5.29 లక్షల ఎకరాలుండగా, వివాదాల్లో 1.86 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 4.33 లక్షల ఎకరాలకుగాను 1.50 లక్షల ఎకరాల్లో వివాదాలు, వికారాబాద్ జిల్లాలో 1.08 లక్షల ఎకరాలకుగాను 42 వేల ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 3.16 లక్షల ఎకరాలకుగాను 70 వేల ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో 1.42 లక్షల ఎకరాలుండగా వాటిలో 35 వేల ఎకరాల దాకా, నల్లగొండ జిల్లాలో 52 వేల ఎకరాలకుగాను 13 వేల ఎకరాలు భూ వివాదాల్లో ఉన్నట్టుగా తెలిసింది. » అటవీశాఖకు చెందిన ఎలాంటి వివాదాలకు తావులేని భూమిగా గుర్తించిన 49.80 లక్షల ఎకరాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎల్‌ఆర్‌ఎంఎస్–నోషనల్ ఖాతా మార్కింగ్)లో మెజారిటీ భూములు రికార్డుకాగా, కొంతమేర నోషనల్ ఖాతా మార్కింగ్ చేపట్టాల్సి ఉంది. పక్కాగా స్థిరీకరణకు సర్కార్ దృష్టి రెండేళ్ల కాలంలో పోడు సమస్యతోపాటు, వివాదాలున్న అటవీ భూముల సమస్యను కూడా పరిష్కరించే దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేదనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ భూమిని, రెవెన్యూ రికార్డులతో సరిచూసుకొని ఇకపై పక్కాగా స్థిరీకరించుకోవాలని, భవిష్యత్‌లో ఎలాంటి ఆక్రమణలకు తావు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో అటవీ అధికారులు పనిచేసేలా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్టుగా తెలిసింది. అటవీ భూముల సరిహద్దులు లెక్క తేల్చి, సరిహద్దుల గుర్తింపు, కంచె లేదా కందకాల ఏర్పాటు ద్వారా భవిష్యత్ ఆక్రమణలు అడ్డుకోవచ్చునని అటవీ అధికారులు సూచిస్తున్నారు. రెవెన్యూ శాఖ అ«దీనంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూములపై తాజాగా అన్ని జిల్లా స్థాయిల్లో ఇటీవల సర్వే ప్రారంభమైంది. అయినా, ఇంకా పూర్తి స్పష్టత రాకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. రెండు శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెడితేనే ఇది పరిష్కారమయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.లెక్కల రికార్డులేవి? » అటవీ, రెవెన్యూ రికార్డుల్లో ఆయా శాఖలకు సంబంధించి ఎంత భూములున్నాయన్న దానిపైనా ఇంకా పూర్తి స్పష్టత లభించలేదని అధికార వర్గాల సమాచారం. కొన్నేళ్లుగా ఈ భూముల పంచాయితీకి తెరదించాలని తాము చూస్తున్నా, రెవెన్యూశాఖ పెద్దగా స్పందించడం లేదని అటవీశాఖ అధికారులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఏ శాఖకు ఆ శాఖ వేర్వేరుగా రికార్డులను నిర్వహించడంతోపాటు, వాటి నమోదు కూడా సరిగా చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో అటవీ భూముల సర్వే చేయకపోవడం, రెండు శాఖలు ఆయా జిల్లాల్లో తమ భూమి అంటే తమ భూమి అని రికార్డులకు ఎక్కించడం వల్ల ఎదురైన వివాదాల పరిష్కారానికి సామరస్యంగా చర్యలు చేపట్టాలనే అభిప్రాయంతో వారున్నారు. -
రోడ్ల విస్తరణకు రూ.868 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్లను వెడల్పు చేయటంతోపాటు పటిష్టపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్)నుంచి రూ.868 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 34 రోడ్లను వెడల్పు చేయటంతోపాటు అవసరమైనచోట వంతెనలు నిర్మించనున్నారు. ఈ మేరకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ రోడ్లు భవనాల శాఖ ఉత్తర్వు జారీ చేసింది. పెట్రోల్, డీజిల్ వసూలు చేస్తున్న సెస్‌లో రాష్ట్రాల వాటాగా కేంద్రం సీఆర్ఐఎఫ్కు జమచేసి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజా విడతలకు సంబంధించి ఈ మొత్తం మంజూరైంది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఆయా పనులు చేసి యూసీలు సమర్పిస్తే, అంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఈ పనులకు సంబంధించి త్వరలో టెండర్లు పిలవనున్నారు. చాలాకాలంగా రాష్ట్రంలో రోడ్లను వెడల్పు చేయకపోవటంతో పలు ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోని కీలక రోడ్లను ఈ నిధులతో మెరుగుపరచనున్నారు. చేపట్టనున్న పనులు ఇవే.. » హైదరాబాద్–కరీంనగర్ రోడ్డు నుంచి కరీంనగర్–కామారెడ్డి రోడ్డును అనుసంధానిస్తూ రూ.77 కోట్లతో భారీ వంతెన నిర్మించనున్నారు. మధ్యలో మానేరు బ్యాక్ వాటర్ ముంపు వల్ల ఈ రెండు రోడ్ల అనుసంధానం లేదు. రాజీవ్ రహదారి మీదుగా కామారెడ్డి వెళ్లాలంటే కరీంనగర్ పట్టణంలోకి వెళ్లి మళ్లాల్సి వస్తోంది. దీంతో బావాపేట–ఖాజీపేట– పోతూరు–గుండ్లపల్లి మీదుగా వంతెనను నిర్మించి రెండు రోడ్లను అనుసంధానించనున్నారు. » మహబూబ్‌నగర్–నల్లగొండ రోడ్డును 13.2 కి.మీ. మేర రూ.50 కోట్ల వ్యయంతో మెరుగుపరచనున్నారు. కనగల్ కూడలి నుంచి నాగార్జునసాగర్ కూడలి వరకు ఈ పనులు జరుగుతాయి. » మంథని–రామగుండం రోడ్డును రూ.21 కోట్లతో 13.1 కి.మీ. మేర అభివృద్ధి చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ రోడ్డు నుంచి దెద్రా గ్రామం వరకు 20 కి.మీ. మేర కొత్త రోడ్డును రూ.30 కోట్లతో నిర్మించనున్నారు. మంచిర్యాల జిల్లా టేకుమట్ల సమీపంలో, కుందారం ఎస్సీ కాలనీ సమీపంలో, నక్కలపల్లి పవనూర్ రోడ్డు మీద కిష్టాపూర్ గ్రామం సమీపంలో... మూడు హైలెవల్ వంతెనలకు రూ.20 కోట్లు కేటాయించారు. » జగిత్యాల జిల్లాలోని మ్యాకవెంకయ్యపల్లి–పత్తిపాక మధ్య ఎల్లాపూర్ మీదుగా 11.5 కి.మీ. మేర రూ.20 కోట్లతో రోడ్డును వెడల్పు చేయనున్నారు. » మొయినాబాద్–సురంగల్–శ్రీరామ్‌నగర్–వెంకటాపూర్ ల మీదుగా చందానగర్ టూ కవేలిగూడ రోడ్డును 14 కి.మీ. రోడ్డును రూ.30 కోట్లతో వెడల్పు చేయనున్నారు. » కరీంనగర్, నల్లగొండ, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం,హనుమకొండ, వనపర్తి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో 34 రోడ్లను వెడల్పు చేస్తూ అవసరమైన చోట్ల వంతెనలు నిర్మించనున్నారు. » కొడంగల్ పట్టణంలోని లహోటీ కాలనీ పార్క్ నుంచి వినాయక చౌరస్తా, శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయం మీదుగా బాపల్లి తండా జంక్షన్ వరకు రూ.60 కోట్లతో రోడ్డు విస్తరణకు పరిపాలన అనుమతులు ఇస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) కింద ఈ పనులు చేపడుతారు. -
ఎత్తులు.. పై ఎత్తులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దండకారణ్యంలో పట్టు నిలుపుకొనేందుకు ఓ వైపు మావోయిస్టులు.. మరోవైపు భద్రతా దళాలు గడిచిన పదిహేనేళ్లుగా వ్యూహ ప్రతివ్యూహాలను అమలు చేశారు. చివరికి అపరిమితమైన వనరులు కలిగిన భద్రతా దళాల ధాటికి దండకారణ్యంలో మావోలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఎదురైంది. ఇదే చివరకు భారీ లొంగుబాట్లకు దారి తీసిందన్న చర్చ జరుగుతోంది.రంగంలోకి పారా మిలిటరీ..దండకారణ్యంలో 1980లో అడుగుపెట్టిన మావోయిస్టులు ఇరవై ఏళ్లకు పైగా అక్కడ తిరుగులేని శక్తిగా మారారు. మరో పదేళ్లకు ఆ పార్టీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి 12 కంపెనీలు వచ్చి చేరాయి. సాంస్కృతిక విభాగమైన చేతన నాట్యమండలి సభ్యుల సంఖ్య 7 వేలు దాటింది. దండకారణ్యంలో ప్రబల శక్తిగా నానాటికి విస్తరిస్తున్న మావోయిస్టులకు అడ్డుకట్ట వేసేందుకు ముందుగా సల్వాజుడుం, ఆ తర్వాత ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను 2009లో ప్రభుత్వం ప్రారంభించింది. సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ పోలీస్, బీఎస్ఎఫ్ తదితర దళాలను రంగంలోకి దించింది. దీంతో మావోయిస్టులే లక్ష్యంగా భద్రతా దళాల కూంబింగ్ పెరిగింది. ఎదురు కాల్పుల్లో ఆ పార్టీ సభ్యులు నష్టపోవడం పెరిగింది.పారా మిలిటరీని ఎదుర్కొనేలా..వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లను సమీక్షించిన ‘దాదా’లు నాలుగు కిలోమీటర్ల నడక వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారు. తమ బస (క్యాంప్) సమాచారం పోలీసులు/భద్రతా దళాలకు చేరాక వారు తమను చుట్టుముట్టేందుకు ఎంత సమయం పడుతుంది, ఈ దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఎంత సమయం అవసరం, తప్పించుకున్న తర్వాత చెల్లాచెదురైన దళాలు 24 నుంచి 72 గంటల్లోగా ఎక్కడ, ఎలా కలుసుకుంటే మంచిదనే అంశాలపై అధ్యయనం చేశారు. గ్రామం లేదా రోడ్ పాయింట్ (పోలీసులు వాహనాలు వచ్చే స్థలం) నుంచి కనీసం నాలుగు కిలోమీటర్ల పాటు అడవిలో నడిస్తే తప్ప చేరుకోలేనంత దట్టమైన అడవిలోనే క్యాంపులు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అంతేకాక తమ వద్దకు వచ్చే భద్రతా దళాలపై అంబూష్లు చేసే వ్యూహాలు నేర్చుకున్నారు. దీనికి తోడు రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ల యుద్ధరీతులను అధ్యయనం చేశాక.. వేగంగా బంకర్లు, బూబీట్రాప్స్ నిర్మించడంపై దళాలకు శిక్షణ ఇచ్చారు. దీంతో యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌కు వెళ్లిన బలగాలు అనేకసార్లు మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకున్నాయి.కట్టుదిట్టం చేసినప్పటికీ..ఆపరేషన్ గ్రీన్‌హంట్ చేపట్టి పదేళ్లు దాటినా సానుకూల ఫలితం రాకపోవడంతో 2017లో ఆపరేషన్ సమాధాన్ (ఎస్ – స్మార్ట్ లీడర్షిప్, ఏ – అగ్రెసివ్ స్ట్రాటెజీ, ఎం – మోటివేషన్ అండ్ ట్రైనింగ్, ఏ – యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డీ– డ్యాష్‌బోర్డ్ బేస్డ్ కీ రిజల్ట్ ఏరియా, హెచ్ – హర్నెస్టింగ్ టెక్నాలజీ, ఏ – యాక్షన్ ప్లాన్) తెరపైకి వచ్చింది. మావోయిస్టుల ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టడం, వారి స్థావరాలను కచ్చితంగా కనుక్కోవడం, ఔషధాలు అందకుండా చూడటం, కొత్త రిక్రూట్మెంట్లు తగ్గించే పనిపై ప్రభుత్వం, బలగాలు దృష్టి సారించాయి. ఆఖరికి వాయుమార్గాన దాడులకు సైతం తెర తీశారు. ఎన్ని చేసినా 2021 ఏప్రిల్‌లో తెర్రం దగ్గర జరిగిన దాడిలో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోవడం భద్రతా దళాలకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. అంతేకాక మావోలను ఎదుర్కొనేందుకు మరో కొత్త వ్యూహం భద్రతా దళాలకు అవసరం పడింది.4 కిలోమీటర్ల ప్రణాళికమావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రతీ నాలుగు కిలోమీటర్లకు ఒక పారామిలిటరీ క్యాంప్ ఏర్పాటు చేసే ప్రణాళికకు 2019లో శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం అడవిలో క్యాంప్ ఏర్పాటుచేసి 24 గంటలూ జవాన్లు అక్కడే ఉంటారు. ఆ క్యాంప్ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో నిత్యం కూంబింగ్ చేస్తారు. అలా మావోలను మరింతగా అడవి లోపలికి నెట్టేస్తారు. నెల వ్యవధిలోనే ఆ ప్రాంతంపై పట్టు సాధించి అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరాన మరో కొత్త క్యాంప్ ఏర్పాటు చేస్తారు. క్యాంపుతో పాటే భారీ వాహనాలు తిరిగేలా తాత్కాలిక రోడ్లు, మొబైల్ టవర్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు. ఇలా రెండేళ్లలోనే 300కి పైగా క్యాంపులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ప్రాంతంపై పట్టున్న డీఆర్జీ దళాలు ప్రభుత్వ అమ్ముల పొదిలో వచ్చి చేరాయి. దండకారణ్యంలో పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయనే నమ్మకం రాగానే 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. దళాల కదలికలపై మానవ, సాంకేతిక నిఘాతో కచ్చితమైన దాడులు చేయడం మొదలైంది. అప్పటి నుంచి ప్రతీ ఎన్కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టం చేస్తూ వచ్చింది. చివరకు ఆ పార్టీలో ఓ వర్గం సాయుధ పోరాటానికి సెలవు ప్రకటించి లొంగుబాటుకు సిద్ధం కావాల్సి వచ్చింది. -
కుంగుబాటు.. మహిళల్లోనే అధికం
సాక్షి, హైదరాబాద్: కుంగుబాటు, మానసిక ఒత్తిడి సమస్యలు పురుషుల కంటే మహిళల్లో రెండురెట్లు అధికంగా ఉన్నాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం తేల్చింది. స్త్రీలలో ఉండే వేలాది ప్రత్యేకమైన జన్యు వైవిధ్యాలే ఇందుకు కారణమని గుర్తించారు. ఈ ప్రత్యేక జన్యు నిర్మాణం మహిళలను సామాజిక, పర్యావరణ ఒత్తిళ్లకు అధికంగా ప్రభావితం చేస్తోంది. ఇటీవల నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ‘సెక్స్–్రస్టాటిఫైడ్ జీనోమ్–వైడ్ అసోసియేషన్ మెటా–అనాలిసిస్ ఆఫ్ మేజర్ డిప్రెసివ్ డిజార్డర్’అనే పరిశోధన పత్రంలో ఈ అంశం వెల్లడైంది. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ (ఎండీడీ)తో ముడిపడి ఉన్న ఏడు వేల కంటే ఎక్కువ జన్యు వైవిధ్యాలు పురుషుల్లో ఉంటే.. అందుకు అదనంగా మహిళలు ఆరు వేల జన్యు వైవిధ్యాలను కలిగి ఉన్నారని తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా కుంగుబాటు (డిప్రె షన్)తో బాధపడుతున్న 1.3 లక్షల మంది మహిళలు, 65 వేల మంది పురుషుల జన్యు డేటాను పరిశోధకులు విశ్లేషించారు. అలాగే డిప్రెషన్లో లేని 2.9 లక్షల మందికి చెందిన జన్యు డేటాను కూడా విశ్లేషించారు. ఈ సర్వేలో ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్, యూకే, యూఎస్‌లకు చెందినవారు అధికంగా పాల్గొన్నారు. ఏమిటీ జన్యు వైవిధ్యాలు? » జన్యు వైవిధ్యం అంటే కేవలం డీఎన్ఏ క్రమంలో మార్పు. వీటిలో కొన్ని వైవిధ్యాలు అంత ప్రమాదకరం కాదు. మరికొన్ని కుంగుబాటు, నిరాశతో సహా అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ వైవిధ్యాలు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా రావొచ్చు లేదా ఆకస్మికంగా సంభవించవచ్చు. మహిళల్లో ఈ వైవిధ్యాలు మెదడు అభివృద్ధి, హార్మోన్లు, జీవక్రియ వంటి ప్రక్రియలతో సంకర్షణ చెందుతాయి. దీనివల్ల వారు కుంగుబాటుతోపాటు ఇతర రుగ్మతలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కుంగుబాటుతో బరువు పెరుగుదల, నిద్రలేమి.. » కుంగుబాటు, ఒత్తిడితో బాధపడుతున్న మహిళలు బరువు పెరగటం, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు ఎదుర్కొంటారని సర్వేలో పేర్కొన్నారు.» మహిళల నిరాశ లక్షణానికి జన్యు మార్పులు కారణమని పరిశోధకులు కనుగొన్నారు. » దీనికి విరుద్ధంగా నిరాశతో బాధపడుతున్న పురుషులు తరచుగా కోపం, దూకుడు ప్రదర్శిస్తారు » డిప్రెషన్–లింక్డ్ డీఎన్ఏ తేడాలు వారసత్వంగా రావచ్చు లేదా ఆకస్మికంగా సంభవించవచ్చు.» ఇవి పుట్టుకతో వచ్చే డీఎన్ఏ తేడాలు అని పరిశోధకులు చెప్పారు. » ఈ పరిశోధన ఫలితాలు కుంగుబాటు నిర్ధారణ, చికిత్సకు లింగ నిర్దిష్ట విధానాల అవసరాన్ని నొక్కిచెబుతున్నాయి. » ఉదాహరణకు మహిళలకు జీవక్రియ మార్గాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మంచి చికిత్స అందించవచ్చు » పురుషులకు వారి ప్రవర్తన లేదా న్యూరోకాగ్నిటివ్ నమూనాలపై దృష్టి పెట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. -
గులాబీ సైన్యమంతా ఇక్కడే!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ ప్రచారపర్వంలో సర్వశక్తులూ ఒడ్డుతోంది. నియోజకవర్గం పరిధిలోని ప్రతీ ఓటరును కలవడం లక్ష్యంగా ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా మరోవైపు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు సుమారు 60 మంది క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొంటున్నారు. స్థానిక కేడర్‌తో సమన్వయంజూబ్లీహిల్స్ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు డివిజన్లలో సంపూర్ణంగా, మరో మూడు డివిజన్లలో పాక్షికంగా విస్తరించి ఉంది. యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, షేక్‌పేట, బోరబండ డివిజన్లు పూర్తిగా, శ్రీనగర్ కాలనీ, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ డివిజన్లు పాక్షికంగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. డివిజన్ వారీగా ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించారు. వీరు స్థానిక నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. బయటి నియోజకవర్గాల నుంచి వచ్చిన 60 మంది ముఖ్యనేతలకు మూడు లేదా నాలుగు పోలింగ్ బూత్‌ల పరిధిలో ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ముఖ్యనేత తమతోపాటు వచ్చిన అనుచరులతో కలిసి తమకు కేటాయించిన బూత్‌లలో ప్రచారం చేస్తున్నారు. అలాగే, బయటి నుంచి సుమారు వేయి మంది జెడ్పీటీసీ, ఎంపీపీ స్థాయి నేతలు ప్రచారానికి తరలివచ్చినట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బూత్‌ల వారీగా ముఖాముఖి సమావేశం నిర్వహించి ఇన్‌చార్జీలకు ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. భారీగా నకిలీ ఓటర్లు నమోదయ్యారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఓటరు జాబితాను వడపోస్తూ అసలైన ఓటర్లను చేరుకోవాలని భావిస్తోంది.సాదాసీదాగా నామినేషన్నగరంలో నెలకొన్న ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి నామినేషన్ కార్యక్రమాన్ని సాదాసీదాగా సాగేలా బీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే మూడు సెట్లు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఈ నెల 19న మరో సెట్ దాఖలు చేయనున్నారు. 19న భారీ ర్యాలీ నిర్వహించాలని భావించినా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రద్దు చేసుకున్నట్లు తెలిసింది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కేటీఆర్, హరీశ్‌రావు రోడ్ షోలు, హాల్ మీటింగ్స్‌లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
‘సిక్’ లీవ్ అని చెప్పేద్దామా?
సాక్షి, హైదరాబాద్: భారతీయుల్లో వర్క్–లైఫ్ బ్యాలెన్స్ సమస్యలు అధికంగా బయటపడుతున్నాయి. దాదాపు 75 శాతం మంది వృత్తి నిపుణులు మానసిక ఆరోగ్యం సరిచేసుకునే విషయంలో వెనుకబడుతున్నారు. ఇటీవల నిర్వహించిన నౌక్రీ పల్స్ 2025 సర్వేలో పాల్గొన్నవారిలో నలుగురు ఇండియన్లలో ముగ్గురు సెలవుకు మానసిక ఆరోగ్య కారణాలను వెల్లడించడానికి ఇష్టపడటం లేదని తేలింది. పనిలో మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో... పేలవమైన పని–జీవిత సమతుల్యతలో 39%తో భారత్ వృత్తి నిపుణులు ముందువరసల్లో నిలుస్తున్నారు. దాదాపు 80 పరిశ్రమలలో 19,650 మంది వృత్తి నిపుణులపై ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో... 30 శాతం కంటే ఎక్కువ మంది నిపుణులు మానసిక ఆరోగ్య కారణాల వల్ల సెలవు తీసుకోవడానికి సంసిద్ధంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే డిజైన్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఇది అధికంగానే ఉన్నట్టుగా తెలిసింది. ఈ విషయంలో ఫ్రెషర్లు, కెరీర్ ప్రారంభంలో ఉన్న నిపుణులు (0–5 సంవత్సరాల పని అనుభవం) ఎక్కువగా సంకోచిస్తారు.ఉద్యోగులు వెనుకాడడానికి కారణాలు... » మానసిక ఆరోగ్యం సరిగాలేని కారణంగా సెలవు తీసుకుంటే తమను అసమర్థులుగా చూస్తారని 31 శాతం మంది ఉద్యోగులు భయపడుతున్నారు » తమ విషయంలో సహోద్యోగులు ఏమని ఆలోచిస్తారోననే ఆందోళనతో 27% మంది ఉన్నారు » సెలవు తీసుకునేందుకు తాము సాకులు వెతుకుతున్నామని 21% మంది ఆందోళన చెందుతున్నారు » ఇది కెరీర్ వృద్ధిని ప్రభావితం చేస్తుందని 21% మంది నమ్ముతున్నారు వాస్తవాలకు బదులు సెలవుకు చెబుతున్న కారణాలు... » తమ మానసిక ఆందోళనలతో తలెత్తిన పరిస్థితిని 45% జనరల్ సిక్ లీవ్‌గా పరిగణన» 28% ఇతర కారణాలు » 19% సెలవులకు దూరం» 9% ఇతర కారణాలు చూపుతున్నారు... -
ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల బురిడీ!
సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. తాజాగా వారి ఉచ్చులో టీడీపీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పడ్డారు. ఫేక్ ఐడీలతో బెదిరించి భారీ స్థాయిలో దోచుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైనట్లు వెబ్ మీడియా ద్వారా తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. ముంబై సైబర్‌క్రైమ్ అధికారులుగా నటించిన మోసగాళ్లు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌ను మనుషుల అక్రమ రవాణా, మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామంటూ బెదిరించి ఆయన నుంచి డబ్బులు గుంజారు. ప్రొవిజనల్ బెయిల్ పేరుతో రూ.1.07 కోట్లను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉంటున్న ఎమ్మెల్యే పుట్టాకు అక్టోబరు 10 ఉదయం 7.30 గంటలకు ఫోన్ కాల్ వచి్చంది. ఫోన్ చేసిన వ్యక్తి తను ముంబై సైబర్ క్రైమ్ విభాగం అధికారిగా పరిచయం చేసుకున్నారు. ఆపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, 17 ఫిర్యాదులు కూడా అందాయని చెప్పాడు. ఆధార్, సిమ్‌కార్డు వాడి నకిలీ బ్యాంకు ఖాతా కూడా తెరిచారని, ముంబైలో కొనుగోలు చేసిన సిమ్ కార్డు ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు చెప్పాడు. కొద్ది నిమిషాలకు మరో వ్యక్తి వాట్సాప్ వీడియా కాల్లోకి వచ్చాడు. తాను సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అధికారి అని చెప్పి నకిలీ అరెస్టు వారెంట్, సీబీఐ అకౌంట్ ఫ్రీజ్ ఆర్డర్ చూపించి నమ్మించినట్లు సమాచారం. ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యే తన ఖాతాకు ఎక్కడి నుంచి డబ్బులు వచి్చందని అవతలి వ్యక్తిని ప్రశ్నించారు. కెనరా బ్యాంకు ఖాతాలో రూ.3 కోట్లు డిపాజిట్ అయ్యాయని, వాటిని తిరిగి ఇచ్చేలా సహకరించకపోతే అరెస్టు చేస్తామని మోసగాళ్లు బెదిరించినట్లు తెలుస్తోంది. అనంతరం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అక్టోబర్ 15లోపు రూ.1.07 కోట్లు సైబర్ మోసగాళ్ల అకౌంట్‌కు పంపించినట్లు సమాచారం. కాగా, మరో రూ.60లక్షలు పంపిస్తే కోర్టు క్లియరెన్స్ సర్టిఫికెట్ పంపిస్తామని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే, గురువారం రాత్రి హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
పత్తి కొనుగోలు మరింత లేటు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి పంట సేకరణ వేగవంతమైనప్పటికీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇంకా కొనుగోళ్లు ప్రారంభించలేదు. దళారీ వ్యవస్థను, జిన్నింగ్ మిల్లుల అక్రమ దందాను నిరోధించేందుకు సీసీఐ తెచ్చిన కొత్త నిబంధనలతో తలెత్తిన వివాదంతో మిల్లర్లు ఈనెల మొదటి వారందాకా పత్తి కొనుగోళ్ల టెండర్లలో పాల్గొనలేదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చొరవతో జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు కొనుగోళ్లకు ముందుకొచ్చినప్పటికీ మిల్లులను నోటిఫై చేసే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో దీపావళి మరుసటి రోజు నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ చెబుతున్నప్పటికీ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే పత్తికి పెద్ద మార్కెట్ అయిన వరంగల్ జిల్లాలోని ఎనుమాముల పత్తి లోడ్లతో నిండిపోయింది. వచ్చిన పత్తిని జిన్నింగ్ మిల్లుల ఏజెంట్లు, దళారీలు తక్కువ ధరకే కొంటున్నారు. పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 ఉండగా, రూ. 6వేల లోపే కొంటున్నారు. సీసీఐ కొనుగోళ్లు ఆలస్యమయ్యే కొద్దీ రైతులు దళారులను ఆశ్రయించడం పెరుగుతోంది.ఎల్–1, ఎల్–2 మిల్లుల ఎంపిక తరువాతే...పత్తి జిన్నింగ్ కోసం సీసీఐ విడుదల చేసిన టెండర్లో లింట్ శాతం, ఎల్–1, ఎల్–2 కింద మిల్లుల కేటాయింపు, అలాట్మెంట్ స్లాట్ బుకింగ్, ఏరియా మ్యాపింగ్ కోసం ఉన్న నిబంధనలను మిల్లర్లు తొలుత వ్యతిరేకించారు. దాంతో రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినా, పాల్గొనలేదు. ఈనెల 6న మంత్రి మిల్లర్లతో సమావేశమై భరోసా ఇవ్వడంతో మిల్లులు టెండర్లు దాఖలు చేశాయి. రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని 343 మిల్లులకు పత్తిని జిన్నింగ్ చేసే సామర్థ్యం ఉండగా, ఇప్పటివరకు 22 జిల్లాల కలెక్టర్లు 220 మిల్లులను నోటిఫై చేశారు. మిగతా 8 జిల్లాల్లో నోటిఫై కావాల్సి ఉంది. మిల్లులను నోటిఫై చేశాక ఎల్–1, ఎల్–2 కింద ఎంపిక చేయాల్సి ఉంది. ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా రైతులు తాము విక్రయించాల్సిన పత్తి కోసం స్లాట్ బుక్ చేసుకుంటే, ముందుగా ఎల్–1 కింద మిల్లులకు పత్తిని కేటాయిస్తారు. ఎల్–1లోని మిల్లుల కెపాసిటీకి తగినంత పత్తిని పంపాక, ఎల్–2 మిల్లులకు పంపిస్తారు. వర్షాలతో దెబ్బతిన్న పంటరాష్ట్రంలో రెండు నెలలుగా కురుస్తున్న అకాల వర్షాలతో చాలాచోట్ల పత్తి పంట దెబ్బతింది. పత్తి చేన్లలో నీరు నిలిచి దిగుబడిపై ప్రభావం చూపినట్లు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మొదటి విడత పికింగ్ (ఏరిన) పత్తిని రైతులు తమ వద్ద నిల్వ చేశారు. రాష్ట్రంలో ఈసారి 46 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 28.29 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. అయితే వర్షాల కారణంగా దెబ్బతినడంతో అది 25 లక్షల మెట్రిక్ టన్నుల లోపే ఉండొచ్చని భావిస్తున్నారు. గత ఏడాది 44.73 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయగా, 21 లక్షల మెట్రిక్ టన్నుల మేర పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది.క్వింటాల్‌కు రూ.1,300 నష్టంకేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 8 శాతం తేమ ఉన్న పత్తికి రూ.8,110 చెల్లించి సీసీఐ కొను గోలు చేస్తోంది. ప్రస్తుతం అదే క్వాలి టీ ఉన్న పత్తికి ప్రైవేటు వ్యాపారులు రూ.6,800 చెల్లిస్తున్నారు. అంటే క్వింటాల్‌కు రూ.1,300 వరకు నష్టపోతున్నాం. – రవి, పత్తి రైతు చౌళ్లపల్లి,అత్మకూరు మండలం, హనుమకొండ జిల్లా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలిసీసీఐ లేకపోవడం వల్ల పత్తి నాణ్యత ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర చెల్లించడం లేదు. సీసీఐ ఉంటే క్వింటాకు రూ.వేయి అదనంగా వస్తుంది. అందువల్ల వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి.– పల్లెశ్యాం, పత్తి రైతు తోగరు రామయ్యపల్లె, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా యాప్‌లో నమోదు చేసుకోవాలిపత్తి రైతులు తమ పంట వివరాలను మండల వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేయించుకోవాలి. తాత్కాలి కంగా నమోదు ప్రక్రియ పూర్తయితే మరోసారి నమోదు చేసే అవకాశా ల్లేవు. యాప్‌లో నమోదు చేసుకోకుంటే కొనుగోళ్ల సమ యంలో ఇబ్బందులు తప్పవు. – ఉప్పుల శ్రీనివాస్, ఆర్‌జేడీఎం, వరంగల్ -
ఇక 20% టెక్ సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యాసంస్థల్లో ఆధునిక సాంకేతికతపై బోధన పెంచుతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో అన్ని స్థాయిల్లోనూ 20 శాతం మేర కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ టెక్నాలజీ సిలబస్‌తో కూడిన బోధనాంశాలు ఉంటాయని చెప్పారు. కాలానుగుణంగా నైపుణ్యాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మండలి పురోగతిపై బాలకిష్టారెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లా డారు. తెలంగాణ ఉన్నత విద్యా సంస్థలను ప్రపంచశ్రేణి విద్యాసంస్థలతో అనుసంధానించేందుకు రోడ్‌మ్యాప్ రూపొందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రీజనల్ అకడమిక్, ఇన్నోవేషన్ క్లస్టర్లను కొత్తగా తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఏఐ ఆధారిత పాలనా వ్యవస్థను విస్తరిస్తామని తెలిపారు. ఓపెన్–యాక్సెస్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంలను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన వివరించారు. ‘తెలంగాణ రైజింగ్–2047’లక్ష్యాలతో ముందుకెళ్తామని.. డ్యూయల్ డిగ్రీ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.డీమ్డ్, ప్రైవేటు వర్సిటీల కట్టడిరాష్ట్రంలోని డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీల ఫీజుల నియంత్రణ చేపట్టాలని అన్ని వర్గాలు కోరుతున్నందున ఈ అంశాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని బాలకిష్టారెడ్డి తెలిపారు. ప్రస్తుతం వర్సిటీల్లో పరిశోధనల స్థాయి తగ్గిందని.. వాటిని తిరిగి పెంచేందుకు అధ్యాపకులకు అవార్డులు ఇవ్వాలనే ఆలోచన ఉందన్నారు. డీగ్రీ కోర్సుల్లో ఇకపై గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని సిలబస్ తయారు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కాలేజీ ‘న్యాక్’అక్రెడిటేషన్ పొందేందుకు కృషి చేస్తామని.. ‘న్యాక్’కు దరఖాస్తు చేసే కాలేజీలకు రూ. లక్ష ప్రోత్సాహకం ఇస్తామని బాలకిష్టారెడ్డి అన్నారు.అందుబాటులో ఆంగ్ల విద్యవిద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఆంగ్ల విద్యపై పట్టు సాధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. దీనికోసం సరళమైన భాషలో పీడీఎఫ్, ఆడియోతో కూడిన ఆన్లైన్ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. ‘అవసరం ఉన్న వారి వద్దకు ఆంగ్ల విద్య’అనే పేరుతో దీనిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ కౌన్సిల్ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ఈ మెటీరియల్ ఉచితంగా పొందొచ్చని సూచించారు. విలేకరుల సమావేశంలో మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు. -
మూసీ.. మూసేసి..
సాక్షి, హైదరాబాద్: మూసీనదిని మూసేసి అడ్డంగా నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దృష్టి పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నార్సింగి ఎగ్జిట్ సమీపంలోని మంచిరేవులలో శ్రీ ఆదిత్య హోమ్స్ నిర్మించిన వాంటేజ్ వెంచర్‌పై సమగ్ర విచారణ జరుపుతోంది. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం ఈ సంస్థ మూసీ నదీ గర్భంలో దాదాపు మూడు ఎకరాలు కబ్జా చేసినట్లు గుర్తించింది. ఈ వ్యవహారంపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ఓఆర్ఆర్లో భూమి పోవడంతో.. శ్రీ ఆదిత్య హోమ్స్ సంస్థ మంచిరేవులలో వెంచర్ నిర్మించడానికి గతంలో దాదాపు పది ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అయితే, అందులోని ఆరు ఎకరాలను ఓఆర్ఆర్, సర్వీసు రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించింది. కానీ, రికార్డుల్లో మాత్రం రెండు ఎకరాలను మాత్రమే సేకరించినట్లు చూపారు. ఇక్కడే భూ యజమాని తెలివిగా ఆలోచించి పక్కనే ఉన్న మూసీపై కన్నేశాడు. భూసేకరణలో రెండు ఎకరాలు మాత్రమే పోయినట్లు చూపించి మూసీ నదీగర్భంలోకి చొరబడి ఏకంగా మూడు ఎకరాలను ఆక్రమించాడు. దీనిపై వివిధ విభాగాల నుంచి ఎన్ఓసీలు.. హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకున్న శ్రీ ఆదిత్య సంస్థ వాంటేజ్ నిర్మాణాన్ని చేపట్టింది. అంతకు ముందే మూసీ నదిలో ఓ రిటైనింగ్ వాల్ నిర్మించింది. అది వివాదాస్పదం కావడంతో హెచ్ఎండీఏ వాంటేజ్ నిర్మాణానికి అనుమతులను రద్దు చేసింది. దీంతో రిటైనింగ్ వాల్‌ను కూల్చేసిన శ్రీ ఆదిత్య సంస్థ.. అనుమతుల రద్దును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లింది. న్యాయస్థానం నుంచి అనుకూలంగా ఆదేశాలు పొంది యధేచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తోంది. ఈ కబ్జాపై కొన్నేళ్లుగా ఫిర్యాదులు అందుతున్నా.. ఏ అధికారి కూడా వాంటేజ్ జోలికి వెళ్లలేదు. కొన్ని నెలలుగా ఈ నిర్మాణంపై ప్రజాప్రతినిధులతో పాటు స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. మ్యాప్స్‌తో కీలక ఆధారాలు హైడ్రా బృందాలు వాంటేజ్ వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపాయి. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోలు, విలేజ్ క్రెడెస్టియల్ మ్యాప్స్‌తోపాటు గూగుల్ హిస్టారికల్ శాటిలైట్ ఇమేజెస్‌ను అధ్యయనం చేసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్నారెస్సీ) రూపొందించిన డిజిటల్ ఎలివేషన్ మోడల్ (డీఈఎం) మ్యాప్స్‌తో మూసీ పరీవాహక ప్రాంతాన్ని సరిచూశారు. దీంతో శ్రీ ఆదిత్య హోమ్స్ సంస్థ వాంటేజ్ కోసం మూసీలో మూడు ఎకరాలు కబ్జా చేసినట్లు తేలింది. దీనిపై మరికొన్ని ఆ«ధారాలు సేకరించిన తర్వాత ఆ సంస్థకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయంపై రంగనాథ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఉస్మాన్‌సాగర్ నుంచి ఇటీవల దిగువకు వదిలిన నీరు దాని సామర్థ్యంలో పావు వంతు మాత్రమే. ఆ వెంచర్ చేసిన కబ్జా కారణంగా ఆ నీరు కూడా దిగువకు వెళ్లలేక ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును ముంచేసింది. ఉస్మాన్‌సాగర్ నుంచి పూర్తిస్థాయిలో నీరు విడుదలైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. నోటీసుల జారీచేసి చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం. చెరువులు, కుంటల కబ్జా కంటే మూసీ కబ్జా వల్ల నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది’అని పేర్కొన్నారు.వరదలతో బండారం బట్టబయలు ఇటీవల మూసీ పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో వాంటేజ్ టవర్స్‌లోకి భారీగా వరదనీరు వచి్చంది. ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీరు వదలటంతో మూసీలో ప్రవహించాల్సిన నీరు.. ఎంఎఫ్‌ఎల్‌తోపాటు బఫర్ జోన్ ఆక్రమణకు గురి కావడంతో ఓఆర్ఆర్ సరీ్వస్ రోడ్డును సైతం ముంచేసింది. ఎగువన అనేక ప్రాంతాలకు పొంచి ఉన్న ముంపు ముప్పును ఎత్తి చూపింది. దీంతో ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. -
బంద్ సంపూర్ణం
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ వెనుకబడిన తరగతుల ఐక్య కార్యాచరణ సమితి (బీసీ జేఏసీ) శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఈ బంద్‌లో పాల్గొనడంతో జనజీవనం స్తంభించింది. ఎక్కడా హింసాత్మక ఘటనలు లేకుండా బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రైవేటు విద్యా సంస్థలు ముందస్తుగా సెలవు ప్రకటించగా... వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు ప్రకటించారు. తెల్లవారుజాము నుంచే బీసీ జేఏసీ నేతలు, పార్టీల నాయకులు బస్సు డిపోలు, బస్స్టాండ్ల ఎదుట బైఠాయించారు. అన్ని జిల్లాల్లోనూ నాయకులు బంద్ విజయవంతానికి సహకరించారు. దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఎంజీబీఎస్, జేబీఎస్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని బస్‌డిపోల వద్ద నిరసన కార్యక్రమాలతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగినప్పటికీ... బస్సులు లేకపోవడంతో విద్యార్థులు హాజరు కాలేదు. మరోవైపు జేఏసీ నేతలు వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి బంద్ పాటించాలని కోరుతూ వాటి కార్యకలాపాలను అడ్డుకున్నారు. ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలిపారు. జనాభా ప్రాతి పదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చాలని నినదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్ని పక్షాల మద్దతుతో సంపూర్ణ బంద్ జరగడం ఇదే తొలిసారి. అధికార, ప్రతిపక్షాలు అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఈ బంద్‌లో పాల్గొనడం గమనార్హం. ⇒ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమంలో జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, వందలాది బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, బీసీ ఉద్యమ గీతాలతో ఆటపాటలు, ధూమ్‌ధామ్ నిర్వహించారు. ⇒ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడతామని పలువురు మంత్రులు నినదించారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్‌తోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్‌కుమార్, సాట్స్ చైర్మన్ శివసేనరెడ్డి పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీలు మద్దతు పలికాయని తెలిపారు. కానీ, బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో బీసీలకు మద్దతు అంటూ కేంద్రంలో మాత్రం వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. ⇒ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను అడ్డుకుంటోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆయన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో నిర్వహించిన బంద్‌లో పాల్గొన్నారు. ⇒ మంత్రి కొండా సురేఖ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు బంద్‌లో పాల్గొన్నారు. ఆమె రిజర్వేషన్లపై అసెంబ్లీ ఆమోదించిన బిల్లును తొక్కిపెట్టిన బీజేపీకి ››బీసీల పాపం తగులుతుందన్నారు. ⇒ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌యాదవ్, ముఠాగోపాల్, గంగుల కమలాకర్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బంద్‌లో పాల్గొన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి షెడ్యూల్ 9లో చేరిస్తేనే చట్టబద్దత వస్తుందని తెలిసీ కూడా జీవో తీసుకుని ఎన్నిలకు వెళ్లేలా నోటిఫికేషన్ ఇచ్చి, న్యాయస్థానాలు కొట్టేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. ⇒ సికింద్రాబాద్‌లో నిర్వహించిన బీసీ బంద్‌లో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రపు కమిషన్లు వేసి ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. దిల్సుఖ్నగర్ డిపో వద్ద జరిగిన నిరసన కార్యక్రమం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. బస్సులు రోడ్డెక్కకుండా అడ్డుకునేందుకు బీసీ జేఏసీ నేతలు యత్నించగా పోలీసులు వారిని నిలువరించేందుకు చేసిన చర్యలతో తోపులాట చోటుచేసుకుంది. ⇒ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరన్వహించిన మానవహారంలో కల్వకుంట్ల కవితతోపాటు ఆమె కుమారుడు పాల్గొన్నారు. ⇒ బంద్‌కు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. నారాయణగూడ నుంచి కోఠి వరకు జరిగిన ర్యాలీలో సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఎ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, న్యూ డెమోక్రసీ అధికారప్రతినిధి జేవీ చలపతిరావు, పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ పి.సంధ్య, పీడీఎస్‌యూ నాయకులు మహేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. =ఎల్బీనగర్ చౌరస్తాలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, టి.చిరంజీవులు పాల్గొన్నారు. ప్రయాణికుల పాట్లు... రాష్ట్ర బంద్ నేపథ్యంలో బస్‌డిపోలు, బస్టాండ్ల వద్ద నిరసన కార్యక్రమాలు జోరందుకోవడంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో రోజువారీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీపావళి పండుగ పురస్కరించుకుని ఊళ్లకు వెళ్లేవారు, రోజువారీ జీవనోపాధి కోసం ప్రయాణించే వాళ్లు బస్సుల కోసం బస్టాండ్ల వద్ద పడిగాపులు కాశారు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకున్న ప్రైవేటు వాహనదారులు రెట్టింపు డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. చాలాచోట్ల ఆటోలు, టాక్సీలు, ఇతర ప్రైవేటు వాహనదారులు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 4గంటల తర్వాత బస్సులు రోడ్డెక్కడంతో ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం వాణిజ్య సముదాయాలు తెరుచుకున్నాయి. బంద్ విజయవంతం: ఆర్.కృష్ణయ్య హిమాయత్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, గ్రామాల్లో బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ విజయవంతమైందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. ఈ బంద్‌కు అన్ని పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతిచ్చాయని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో మీడియా సమావేశంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ విజీఆర్ నారగోని, కో–ఛైర్మన్ దాసు సురేశ్, కో–ఆర్డినేటర్ గుజ్జ కృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. స్కూళ్లు, కళాశాలలు, ఆర్టీసీ ఉద్యోగులు, 135 కులసంఘాలు, ప్రతి ఒక్కరూ బీసీ బంద్‌లో పాల్గొన్నారని పేర్కొన్నారు. బీసీల ఆకాంక్షల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావాలన్నారు. 76 ఏళ్ల నుంచి బీసీలకు మోసం జరుగుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం లాగా, సాగర హారం, మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. చట్ట సభల్లో తమ రిజర్వేషన్లు సాధించే వరకు తెగించి పోరాడుతాం అని స్పష్టం చేశారు. -
చేపలు పడుతూ లోయలో పడ్డాడు.. ఎలా బయటకొచ్చాడంటే..!
జోగుళాంబ గద్వాల్: చేపల వేటకు వెళ్లి కెనాల్లో పడ్డ జెయింట్ వీల్ నిర్వాహకుడిని ఎస్.డి.ఆర్.ఎఫ్, ఫైర్, పోలీస్ బృందాలు సాహాసోపేతంగా కాపాడాయి. గూడెందొడ్డి కెనాల్లో చేపలు పట్టేందుకు రమేష్, తనాజీలు వెళ్లారు. తనాజీ దాదాపు 25 అడుగుల ఎత్తునుండి జారిపడగా.. వారిని కెనాల్లో పడ్డ వ్యక్తిని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు.కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన తనాజీ జాతర్లలో జెయింట్ వీల్ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ప్రస్తుతం ధరూర్ మండల పరిధిలోని పాగుంట గ్రామ జాతరలో జెయింట్ వీల్ నిర్వహించడానికి వచ్చాడు. తనాజీ ఇవాళ మధ్యాహ్నం సమయంలో తన సహచరుడు రమేష్‌తో కలిసి చేపలు పట్టేందుకు గుడెం దొడ్డి కెనాల్ వద్దకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో రమేష్ పూర్తిగా కెనాల్లోకి దిగగా, తనాజీ కూడా దిగేందుకు ప్రయత్నిస్తుండగా సుమారు 25 అడుగుల ఎత్తు నుండి జారి కెనాల్లో పడిపోయాడు. ఈ ఘటనను గమనించిన రమేష్ తక్షణమే “100 డయల్”కి కాల్ చేసి ధరూర్ పోలీసులకు సమాచారం అందించాడు.సమాచారం అందుకున్న వెంటనే ధరూర్ పోలీస్ సిబ్బంది రామిరెడ్డి, వినోద్ కుమార్‌లు సంఘటన స్థలానికి బయలుదేరుతూ, వివరాలను ధరూర్ ఎస్ఐకి తెలియజేశారు. ఎస్ఐ వెంటనే ఇట్టి విషయాన్ని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్‌రావు దృష్టికి తీసుకెళ్ళి, వారి అనుమతితో ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకొని, సాహసోపేతంగా రక్షణ చర్యలు చేపట్టి తనాజీని కెనాల్లో నుంచి ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. రక్షించిన తరువాత తనాజీకి కాలు, చేయి, విరిగినట్లు గుర్తించి,108 అంబులెన్స్ ద్వారా గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందిన వెంటనే, స్పందించిన పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందిని కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు అభినందించారు. -
‘దండుపాళ్యం’ పాలన ఎవరిదో అందరికీ తెలుసు
హైదరాబాద్: ‘దండుపాళ్యం’ పాలన అంటే ఎవరిదో అందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అందుకే గట్టిగా కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. అధికారం లేదన్న అసహనం, నిరాశలో ‘కేబినేట్’పై ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను ఆయన శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. మంత్రుల మధ్య కుమ్ములాటలు, కేబినేట్ సమావేశంలో వర్గాలుగా విడిపోయి గొడవలు పడ్డారంటూ కట్టుకథల్ని సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారంతా సినిమాల్లో ‘రచయితలు’ గా ప్రయత్నించాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినేట్ సమష్ఠిగా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో అహర్నిశలు శ్రమిస్తున్న మా మంత్రులకు ప్రత్యేకంగా వ్యక్తిగత అజెండా అంటూ ఏదీ లేదన్నారు. మాకు అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలే మా అందరి అజెండా అని తేల్చి చెప్పారు. మేం వేసే ప్రతి అడుగు రాష్ట్రాభివృద్ధి కోసమేనని, ఈ విషయంలో ఎలాంటి అపోహాలకు తావు లేదని స్పష్టం చేశారు. ‘విలువ ఆధారిత వృద్ధే’ లక్ష్యంగా మా ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందన్నారు. మేం పాలనను గాలికొదిలేస్తే గత 20 నెలల్లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేవా అని ప్రశ్నించారు. మంత్రులంతా వ్యక్తిగత పంచాయతీలు పెట్టుకుంటే "ఎలీ లిల్లీ" లాంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తెలంగాణకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. మాది మాటల ప్రభుత్వం కాదని... చేతల్లో చేసి చూపించే ప్రజా ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మీ అంతర్గత కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. మీ అహంకారపూరిత వ్యవహారశైలి, పాలనా వైఫల్యాల చరిత్రను దాచుకునేందుకు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు మీ కుతంత్రాలను నమ్మరని గుర్తు చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.6 నెలల్లోనే రూ.12,864 కోట్ల ఎఫ్‌డీఐలు..‘పారిశ్రామికాభివృద్ధి విషయంలోనూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డీఐ) ఆకర్షణలో తెలంగాణ ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లోనే రాష్ట్రానికి రూ.12,864 కోట్ల ఎఫ్ డీఐలు వచ్చాయి. 2023–24లో ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోనే టాప్ – 3 అర్బన్ ఎఫ్ డీఐ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ‘2023-24లో పరిశ్రమల జీఎస్ వీఏ రూ.2.46 లక్షల కోట్లు. అది 2024-25లో 12.6 శాతం పెరిగి రూ.2.77 లక్షల కోట్లకు చేరుకుంది. వృద్ధి రేటు 8.68 శాతం. గతేడాదితో పోలిస్తే 2.1 శాతం అధికంగా నమోదయ్యింది. అదే జాతీయ సగటు వృద్ధి రేటు 6.2 శాతం మాత్రమే’ అని పేర్కొన్నారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ప్రతిపక్షాలకు సూచించారు. -
కానీ.. ఆ విద్యను రైతులకు మాత్రం నేర్పలేదు: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత పాలకులు యువత ఆకాంక్షలను రాజకీయాల కోసం వాడుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. వారి కుటుంబం కోసమే గత పాలకులు ఆలోచించారు. గత పాలకులు నిజాం నవాబులతో పోటీపడి సంపద పెంచుకున్నారంటూ ఆరోపించారు.‘‘గత పదేళ్లలో నిరుద్యోగుల సమస్యను పరిష్కరించలేదు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలింది. ఎకరానికి రూ.కోటి సంపాదించే విద్య ఉందని గత పాలకులు చెప్పారు. కానీ ఆ విద్యను రైతులకు మాత్రం నేర్పలేదు. గత పాలకులు వారి కుటుంబసభ్యులకే పదవులు ఇచ్చుకున్నారు. కానీ గ్రూప్-2 నియామకాలు చేపట్టాలని ఆలోచించలేదు’’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు.‘‘విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవి. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. పదిహేనేళ్లుగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ జరగలేదు అంటే… ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా?. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేం గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశాం. గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఇవాళ నియామక పత్రాలను అందిస్తున్నాం...మిమ్మల్ని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత టీజీపీఎస్సీ తీసుకుంది. మీరు, మేము వేరు కాదు.. మీరే మేము.. మేమే మీరు. చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్-1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్..మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా పనిచేయాలి. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవండి. గత పాలకుల పాపాల పుట్ట పలుకుతోంది. వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు..వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారు. హాస్టల్స్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు. సెంటిమెంట్‌తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్‌తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
Telangana: మద్యం దుకాణాల దరఖాస్తులకు భారీ స్పందన
సాక్షి, హైదరాబాద్: మద్యం దుకాణాల దరఖాస్తులకు భారీ స్పందన వచ్చింది. నిన్నటి వరకు 50 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ రోజు మరో 50 వేల దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా. ఒక్కో దరఖాస్తుకు మూడు లక్షల రూపాయలుగా నిర్ణయించారు. రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ నెల 23న మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ డ్రా నిర్వహించనున్నారు. గౌడ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ఎక్సైజ్ శాఖ రిజర్వేషన్లు కల్పించింది. యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మద్యం దరఖాస్తులు చేసుకున్నారు.దరఖాస్తుల ద్వారా మూడు వేల కోట్ల పైగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఏపీకి చెందిన మహిళ 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 వేల దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ అధికారులు స్వీకరించారు. -
‘బీసీ రిజర్వేషన్ అమలుకు కట్టుబడి ఉన్నాం’
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు గాను 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి పునరుద్ధాటించారు. బీసీ సామాజిక న్యాయ వ్యతిరేకి ఎవరైనా ఉన్నారంటే అది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు. ఈరోజు(శనివారం, అక్టోబర్ 18వ తేదీ) రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ నిర్వహించిన బంద్‌లో వివేక్ పాల్గొన్నారు. చెన్నూర్, మందమర్రి, మంచిర్యాలలో చేపట్టిన రాష్ట్ర బంద్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు వివేక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పరుత్వం అనేది బీసీ రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో సైతం బీసీ అనుకూల విధానాలను రాష్ట్ర ప్రభుతం అమలు చేస్తూనే ఉంటుందని, చట్టపరమైన, రాజకీయ పరమైన సవాళ్లకు భయపడకుండా తమ పొరాటాన్ని సాగిస్తూనే ఉంటుందన్నారు. . -
అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు సీఎం రేవంత్. ‘ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదు.ఇప్పటికైనా అలసత్వం వీడండి. ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు. అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ముందుగా ప్రాధాన్యమివ్వాలి. అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సీఎస్ సమీక్షించాలి. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలి. ఎక్కడ కూడా ఫైలు ఆగిపోవడానికి, పనులు ఆగిపోవడానికి వీల్లేదు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టఘి. ఏయే పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే, కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందో, వాటికి ముందుగా ప్రాధాన్యమివ్వండి. ఇకపై సీఎస్ తో పాటు సీఎంవో అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలి. నేనే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తా’ అని సీఎం తెలిపారు. -
నల్గొండలో ఉద్రిక్తత.. కార్ల షోరూమ్‌పై బీజేపీ కార్యకర్తల దాడి
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చర్లపల్లిలో ఉన్న పవన్ నెక్సా మోటార్స్ కార్ల షోరూంపై బీజేపీ కార్యకర్తల దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. బంద్ చేయకుండా షోరూం ఓపెన్ చేశారంటూ ఆగ్రహంతో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడి షోరూమ్‌గా గుర్తించారు. బంద్ చేయకుండా షోరూం తెరవడంతో బీజేపీ, సిబ్బందికి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో రాళ్లతో దాడి చేశారు. -
తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్.. వెలిసిన ‘వాంటెడ్ రియాజ్’ పోస్టర్లు
సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్ : నిజామాబాద్ కానిస్టేబుల్ హత్యోదంతాన్ని తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో నిందితుడు రియాజ్‌ను పట్టుకుని తీరాలని జిల్లా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో 8 బృందాలు రంగంలోకి దిగాయి. చిన్నచిన్న దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడే రియాజ్ గురించి శుక్రవారం నిజామాబాద్ సీసీఎస్‌కు సమాచారం అందింది. దీంతో సీసీఎస్ ఎస్ఐ భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్(48) కలిసి అతన్ని పట్టుకునేందుకు బైక్‌పై బయల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో రాత్రి 8గం. ప్రాంతంలో రియాజ్‌ను పట్టుకుని.. ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్‌పై ఎక్కించుకున్నారు. అయితే అప్పటికే తన దగ్గర దాచుకున్న కత్తి తీసి.. కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ను దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంకిత భావంతో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని, మృతుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలని, ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. దీంతో రియాజ్ పేరిట మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు వెలిశాయి. అతని ఆచూకీ చెబితే రూ.50 వేలు ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఎనిమిది బృందాలు అతని ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. -
అజ్ఞాతంలోనే తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్
సిరిసిల్ల: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో తొలిసారి నక్సలైట్లు ఆయుధాలను అప్పగించి సామూహికంగా లొంగుబాటు మొదలైంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని సాయుధ నక్సలైట్లు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతున్నారు. నాలుగు దశాబ్దాల కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ మావోయిస్టు (అప్పట్లో పీపుల్స్‌వార్) పార్టీ ఉద్యమం బలంగా ఉండేది. సమసమాజ స్థాపన కోసం ఆయుధాలను పట్టి ఎందరో అడవిబాట పట్టారు. ఏళ్లుగా ఉద్యమదారుల్లో నడిచారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. మావోయిస్టు నక్సలైట్ల సామూహిక లొంగుబాటు నేపథ్యంలో ‘మావో’ళ్లు ఇంటికి వస్తారా ! అంటూ ఆ అజ్ఞాతవాసుల కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. జనజీవనంలోకి వస్తారా? అజ్ఞాతంలోనే ఉంటారా? అనే చర్చ సాగుతోంది.27 ఏళ్ల కిందట అడవిబాటరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపలి్లకి చెందిన తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ సిద్దిపేటలో డిగ్రీ చదువుతూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 27 ఏళ్లుగా శ్రీనివాస్ జాడతెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. అతని తల్లిదండ్రులు తుమ్మల(మ్యాదరి) నారాయణ గతేడాది మరణించగా.. తల్లి భూదమ్మ ఎనిమిదేళ్ల కిందట మరణించింది. తల్లిదండ్రులు మరణించినా కడసారి చూపులకు శ్రీనివాస్ రాకపోవడం విషాదం.పోలీస్ కౌన్సెలింగ్‌తోనే వెలుగులోకి...శ్రీనివాస్ డిగ్రీ చదువుతూ కనిపించకపోవడంతో ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఎల్లారెడ్డిపేట పోలీసులు శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ పేరుతో నక్సలైట్ ఉద్యమంలో పనిచేస్తున్నాడని గుర్తించి.. బండలింగంపలి్లలోని అతని తల్లిదండ్రులు నారాయణ, భూదమ్మ ఇంటికెళ్లి.. కొడుకును లొంగిపోయేలా చూడండి.. అంటూ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సంఘటనతోనే కొడుకు అజ్ఞాతంలోకి వెళ్లాడని తెలిసింది. ఒడిషా ప్రాంతంలో పనిచేస్తున్నాడని తరా>్వత వారికి తెలిసింది. కానీ ఆచూకీ లభించలేదు. కన్న కొడుకును చూడకుండానే తల్లిదండ్రులు కన్నుమూశారు.రా అన్నా.. కలిసుందాం అన్నను 27 ఏళ్లుగా చూడలేదు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆందోళనగా ఉండేది. ప్రస్తుతం మావోయిస్టులు లొంగిపోతున్నారు. నువ్వు కూడా రా అన్న కలిసుందాం. 27 ఏళ్లుగా మన ఇల్లు ఎదురు చూస్తోంది. అమ్మానాన్నలు కాలం చేశారు. ఉద్యోగం చేస్తూ తలోదిక్కు వెళ్లాం. ఇప్పుడు మన ఇల్లు ఒంటరైంది. మీరు వస్తే కలిసి ఉందాం. – తుమ్మల మధుసూదన్, విశ్వనాథ్ సోదరుడు(టీచర్)తమ్మీ రారా..నాకు పానం బాగా లేదు. అమ్మానాయిన్నలు, తమ్ముడు కాలం చేసిండ్రు. అడవిలో అన్నలు అందరూ తుపాకులు పోలీసులకు ఇచ్చి వస్తున్నారని తెలిసింది. నువ్వు కూడా ఎక్కడ ఉన్నా ఇంటికి రా.. తమ్మీ. ప్రజల కోసం నలభై ఏళ్లు అడవుల్లో పనిచేసినవ్ చాలు. ఇగ నువ్వు వస్తే కలోగంజో కలిసి తాగుదాం. నిన్ను చూసి సచ్చిపోవాలని ఉంది. నువ్వు వస్తావని ఆశతో చూస్తున్నా. ఏడున్నా రా తమ్మీ. – బండి నాంపల్లి, చంద్రయ్య సోదరుడు, ధర్మారంనాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే..రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బండి చంద్రయ్య అలియాస్ మహేశ్ నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నాడు. పదోతరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్న చంద్రయ్య 1985లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని తల్లిదండ్రులు ఎల్లవ్వ, లింగయ్యలకు ముగ్గురు కొడుకులు నాంపల్లి, శంకరయ్య, చంద్రయ్య, ఒక్క కూతురు శాంతమ్మ. చిన్నకొడుకు చంద్రయ్య అడవిబాట పట్టారు. తల్లిదండ్రులు చిన్న కొడుకు తలంపులోనే అనారోగ్యంతో మరణించారు. మరో సొదరుడు శంకరయ్య అనారోగ్యంతో పదేళ్ల కిందట మరణించాడు. తల్లిదండ్రులు మరణించినా, సొదరుడు మరణించినా చంద్రయ్య ఇంటి ముఖం చూడలేదు. ప్రస్తుతం పెద్దన్న నాంపల్లి, వదినే దేవవ్వ ధర్మారంలో ఉంటున్నారు. -
కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీ!?
సాక్షి, హైదరాబాద్: 42 శాతం రిజర్వేషన్ల సాధన డిమాండ్‌తో బీసీ సంఘాలు ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసనల్లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శనివారం ఉదయం ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో.. ఆమె కుమారుడు ఆదిత్య సైతం పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లితో పాటే నిరసనల్లో పాల్గొన్న ఆదిత్య.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ఫ్లకార్డు చేతబూని నినాదాలు చేస్తూ కనిపించాడు.‘‘కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు.. ప్రతి ఇంటి నుండి అందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాలి. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు ఎంతో అవసరం’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ కవితను ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో నొచ్చుకున్న ఆమె ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. విదేశాల్లో చదువుకున్న ఆదిత్య ఇటీవలే ఇండియాకు రాగా.. అనూహ్యంగా ఇవాళ్టి బంద్, ధర్నాల్లో పాల్గొనడం గమనార్హం. దీంతో 20 ఏళ్లకే కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీకి రెడీనా? అనే చర్చ నెట్టింట జోరుగా నడుస్తోంది. -
‘బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా’
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కారణంగా బంద్ కొనసాగుతోంది. బంద్‌లో అన్ని రాజకీయ పార్టీ నేతలు పాల్గొంటున్నారు. మరోవైపు.. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోంది ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండాపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్యపెట్టారని చూశారు. కామారెడ్డి డిక్లరేషన్ బూటకం. కానీ, బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణం. చెల్లని జీవోలను, ఆర్డినెన్స్‌ను విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోంది. సమస్యలు పరిష్కరించే నాధుడే కరువయ్యాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయి’ అని కామెంట్స్ చేశారు. మాజీమంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..‘బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ పాల్గొంటున్నాయి. మొక్కుబడిగా బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ భాగస్వామ్యం కావద్దు. బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం రిజర్వేషన్లు వస్తాయి. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తగ్గవద్దు అంటూ కామెంట్స్ చేశారు. -
నవీన్ యాదవ్ ఆస్తులు రూ.29.66 కోట్లు..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పి.నవీన్‌యాదవ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో కీలకమైన అఫిడవిట్‌ను ఆయన జతపర్చారు. ఈ మేరకు తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. చేతిలో నగదు రూ.4 లక్షలు, భార్య చేతిలో రూ.2 లక్షలు నగదు ఉందని, ఐదు బ్యాంక్ ఖాతాల్లో రూ.37.6 లక్షలు తన పేరు, తన భార్య పేరున రెండు అకౌంట్లలో రూ.10 వేలు నిల్వ ఉన్నట్లు చెప్పారు. రూ. 7 లక్షల విలువైన షేర్లు ఉన్నాయని, తన పేరున స్కోడా కారు, తన భార్య పేరిట హుందాయ్ ఐ10 కారు ఉన్నట్లు తెలిపారు. తన వద్ద 11 తులాల బంగారం, తన భార్య పేరున రెండు కేజీల బంగారం, 15 కిలోల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున 14.39 ఎకరాల వ్యవసాయ భూమి, యూసుఫ్‌గూడలో 860 గజాల ఇంటి స్థలం, భార్య పేరుతో 4.30 ఎకరాల వ్యవసాయ భూమి, 466 గజాల స్థలంలో ఇళ్లు ఉన్నాయన్నారు. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.29.66 కోట్లు తన పేరిట, రూ.5.75 కోట్లు భార్య పేరిట ఉన్నాయన్నారు. తనకు అప్పులు రూ.75 లక్షలు ఉన్నట్లుగా అఫిడవిట్లో పొందుపర్చారు. -
దీపావళి సెలవులు.. కూకట్పల్లి కిటకిట (ఫొటోలు)
-
సినీతారల మార్ఫింగ్ ఫొటోలతో ఓటు ముద్రించిన వ్యక్తిపై కేసు
హైదరాబాద్: తయారు చేసి వైరల్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, జీహెచ్ఎంసీ సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. గత మూడు రోజులుగా సినీతారలు రకుల్ ప్రీత్‌సింగ్, సమంత రూత్ ప్రభు, తమన్నా భాటియాల ఫొటోలను ముద్రించి నియోజకవర్గ ఓటర్లుగా గుర్తు తెలియని వ్యక్తి వైరల్ చేయడం జరిగింది. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్స్ అండ్ కార్స్..సేల్స్ అదుర్స్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాహనాల అమ్మకాలు టాప్‌గేర్‌లో పరుగులు తీస్తున్నాయి. గత నెలలో జీఎస్టీ తగ్గించినప్పటి నుంచి అమ్మకాలు ఊపందుకున్నాయి. దసరా సందర్భంగా కేవలం 12 రోజుల వ్యవధిలో 55 వేలకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ వాహనాలపైన జీవితకాల పన్ను రూపంలో రవాణాశాఖకు సుమారు రూ.360.08 కోట్ల ఆదాయం లభించింది. గతేడాది కంటే ఇది ఎక్కువ. అలాగే ఈ దీపావళి సందర్భంగా కూడా అమ్మకాల జోరు అదేవిధంగా కొనసాగుతున్నట్లు ఆటోమొబైల్ డీలర్స్ తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి వాహనాల అమ్మకాల్లో కొంత వరకు స్తబ్దత నెలకొంది. జీఎస్టీ తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించిన అనంతరం జూలై, ఆగస్టు నెలల్లో అమ్మకాలు భారీగా తగ్గాయి. సెపె్టంబర్ 22 నుంచి ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ వరకు కూడా ఈ ఊపు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.10 లక్షల నుంచి రూ.13 లక్షల ఖరీదైన కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ కేటగిరీకి చెందిన వాహనాలకే బుకింగ్ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని డీలర్లు చెప్పారు. సొంత కారు కల సాకారం... అనూహ్యంగా పెరిగిన వాహనాల ధరల దృష్ట్యా వాహనం కొనుగోలు చేయలేని మధ్యతరగతి వేతనజీవుల ‘సొంత కారు’ కల జీఎస్టీ తగ్గింపుతో సాకారమవుతోంది. తమ చిరకాల వాహనయోగ కోరికను తీర్చుకొనేందుకు కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. దసరా సందర్భంగా గత నెల 22వ తేదీ నుంచి ఈ నెల 3వ తేదీ వరకు 13,,022 కార్లు, మరో 1221 క్యాబ్‌లు, అలాగే 41,089 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. మరోవైపు గత సంవత్సరం (దసరా సందర్భంగా) అక్టోబర్ 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 9,768 కార్లు, 856 క్యాబ్‌లు, 38,955 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది కంటే వాహనాల విక్రయాలు పెరిగినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ దీపావళి పర్వదినం సందర్భంగా కూడా అదే జోరు కనిపిస్తుందని పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో పాటు వివిధ శ్రేణులకు చెందిన వాహనాలపైన ఆటోమొబైల్ డీలర్లు సైతం ప్రత్యేక ఆఫర్లు, రాయితీలను ప్రకటించారు. దీంతో ధరల తగ్గింపులో ఆకర్షణీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ విధంగా కూడా చాలామంది కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. మూడు నెలల వరకు బుకింగ్‌లు.. ‘కొన్ని కేటగిరీలకు చెందిన వాహనాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.దీంతో చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. 3 నెలల వరకు కూడా ఇప్పటికే బుక్ అయ్యాయి.’ అని సోమాజిగూడ ప్రాంతానికి చెందిన ఒక డీలర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో రోజుకు 1500 నుంచి 2000 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. వాటిలో 400 నుంచి 500 వరకు కార్లు ఉంటే మిగతావి ద్విచక్ర వాహనాలే.‘ ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా వాహనాల అమ్మకాలు పెరిగినట్లు బేగంపేట్‌కు చెందిన ఒక ఆటోమొబైల్ డీలర్ చెప్పారు. జీఎస్టీ తగ్గింపు ప్రభావం హైఎండ్ వాహనాల కంటే చిన్న కార్లపైన ఎక్కువగా ఉంది. రూ.20 లక్షల కంటే తక్కువ ఖరీదైన వాహనాల ధరలు తగ్గాయి. ఈ ధరల్లో వివిధ రకాల బ్రాండ్లకు చెందిన వాహనాలపైన సుమారు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు తగ్గడంతో కొనుగోళ్లు పెరిగాయి. జీఎస్టీ తగ్గింపుతో పాటు ఆటోమొబైల్ డీలర్లు సుమారు రూ.50,000 నుంచి రూ.80,000 వరకు ధరల తగ్గింపుతో ఆఫర్లను, రాయితీలను అందజేస్తున్నారు. -
ఇక మెట్రో స్వాదీన ప్రక్రియ వేగవంతం..
సాక్షి, హైదరాబాద్: మెట్రో మొదటి దశ ప్రాజెక్టును స్వాధీనం చేసుకొనే ప్రక్రియపైన ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిసారించింది. వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేసి వీలైనంత తక్కువ వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ధేశించింది.ఈ క్రమంలోనే చీఫ్సెక్రెటరీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆరి్థక, న్యాయ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలకు చెందిన కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మెట్రో మొదటి దశపైన ఎల్అండ్టీతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందం మేరకు అన్ని అంశాలపైన సమగ్రమైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది.ఈ నివేదిక ఆధారంగా మెట్రో స్వాధీన ప్రక్రియను వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తిచేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఎల్అండ్టీతో కలిసి నిరి్మంచిన మెట్రో మొదటి దశ ప్రాజెక్టు నిర్వహణలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని రెండోదశపైన కేంద్రం పలు సందేహాలను లేవనెత్తిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్నట్లు ఎల్అండ్టీ పేర్కొన్నది. ఈ మేరకు ప్రభుత్వానికి, ఎల్అండ్టీ సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆస్తులు, అప్పులు, మెట్రో నిర్వహణ, తదితర అంశాలపైన సమగ్రమైన అధ్యయనం చేసి నివేదికను రూపొందించనున్నారు.కేబినెట్ సబ్‌కమిటీకి నివేదిక.... సాంకేతిక, న్యాయపరమైన అంశాలపైన ఈ కమిటీ దృష్టి సారించనుంది. అలాగే ఎల్అండ్టీకి వివిధ ప్రాంతాల్లో అప్పగించిన భూములను, ఆస్తులను స్వా«దీనం చేసుకోవడంతో పాటు ఆ సంస్థకు చెల్లించనున్న రూ.2000 కోట్ల చెల్లింపులకు సంబంధించిన విధివిధానాలపైన కూడా సీఎస్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల కమిటీ కార్యాచరణ రూపొందించనుందని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు తెలిపారు. ఎల్‌అండ్‌టి వైదొలగనున్న దృష్ట్యా రూ.13000 కోట్ల బ్యాంకు రుణాలను కూడా ప్రభుత్వమే భరించనుంది. అలాగే ఇప్పటికే ఎల్అండ్టీ నుంచి వివిధ సంస్థలకు లీజుకు ఇచ్చిన మాల్స్, భూముల యాజమాన్యాన్ని కూడా ప్రభుత్వానికి బదిలీ చేయవలసి ఉన్నది. ఈ మేరకు ఎల్అండ్టీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తూ ఈ ఆరి్థక సంవత్సరం ముగింపు నాటికి స్పష్టత వచ్చేవిధంగా చర్యలు చేపట్టనున్నారు. సీఎస్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్‌కమిటీకి అందజేయనుంది. రెండోదశకు మార్గం సుగమం... మెట్రో రెండోదశ ప్రాజెక్టును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కానీ కేంద్రం నుంచి అనుమతి లభించకపోవడం వల్ల ఈ ప్రాజెక్టులో ప్రతిష్టంభన నెలకొంది. పీపీపీ పద్ధతిలో కొనసాగే మొదటి దశకు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిరి్మంచనున్న రెండోదశకు మధ్య సరైన సమన్వయం కుదరకపోవడం వల్ల కేంద్రం పలు అంశాలను ప్రస్తావించింది. సీఎస్ నేతృత్వంలోని కమిటీ ఈ అంశాలపైన కూడా దృష్టి సారించనుంది. ‘ఎల్అండ్టీ వైదొలగిన అనంతరం రెండో ప్రాజెక్టులు పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోకి వస్తాయి.దీంతో ఇప్పుడు స్తబ్దత నెలకొన్న అన్ని అంశాలపైన కూడా స్పష్టత వస్తుంది.’ అని హెచ్ఎంఆర్ఎల్ అధికారి ఒకరు తెలిపారు.మొత్తం 8 మార్గాల్లో నిర్మించనున్న రెండోదశ పైన కేంద్రానికి డీపీఆర్‌లను సమరి్పంచి ఏడాది కావస్తున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో సీఎస్ కమిటీ అన్ని విధాలుగా ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు దోహదం చేయగలదని భావిస్తున్నారు.ఒక్క లైన్ పట్టాలెక్కినా చాలు.. నిజానికి రెండో దశలో ప్రతిపాదించిన అన్ని మార్గాలను 2028 నాటికి పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కేంద్రం నుంచి ఏ విధమైన సహకారం లభించకపోవడంతో తీవ్ర జాప్యమైంది. ఇప్పుడు ఎల్అండ్టీ నుంచి ప్రాజెక్టును స్వా«దీనం చేసుకోనున్న దృష్ట్యా మూడేళ్లలో రానున్న ఎన్నికల నాటికి ఏదో ఒక మార్గంలో మెట్రో కారిడార్‌ను నిరి్మంచాలని భావిస్తున్నారు. పాతబస్తీ రూట్లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన 7.5 కి.మీ.ల మార్గాన్ని చేపట్టి ఎన్నికల నాటికి కొంతమేరకు పురోగతి సాధించినా ఆశించిన ఫలితాలను పొందవచ్చునని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. -
Jubilee Hills Bypoll: పోలింగ్ రోజు సెలవు
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో బోనఫైడ్ ఓటర్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. అలాగే, ఇతర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ జూబ్లీహిల్స్ నివాసిగా ఉండి ఓటరుగా పేరు నమోదు చేసుకున్న ఉద్యోగులకు కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ పరిధిలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటిస్తూ సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల పోలింగ్ రోజున ఈసీ సెలవు ప్రకటించింది. బీహార్‌తో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. మొదటి దశ: నవంబర్ 6, 2025 (గురువారం), ద్వితీయ దశ: నవంబర్ 11, 2025 (మంగళవారం), 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు కూడా నవంబర్ 11, 2025న జరగనున్నాయి. ప్రజాప్రతినిధుల చట్టం, 1951లోని విభాగం 135B ప్రకారం.. వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమ, ఇతర ఏదైనా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి, తాను ఓటు హక్కు కలిగిన నియోజకవర్గంలో పోలింగ్ రోజు ఒక చెల్లింపు సెలవు (Paid Holiday) మంజూరు చేయాలని ఈసీ పేర్కొంది. -
బస్సులు బంద్.. పండుగ వేళ ప్రయాణీకుల ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ జేఏసీ శనివారం రాష్ట్రబంద్‌ను నిర్వహిస్తోంది. బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు డిపోల వద్ద నిలిచిపోయాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు బస్ డిపోల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు.. ఆసుపత్రులు, మందుల దుకాణాలకు మినహాయింపు ఉంటుందని బీసీ జేఏసీ ప్రతినిధులు తెలిపారు.అయితే, పండుగ వేళ కావడం, వరుస సెలవులు రావడంతో ప్రయాణీకులపై బంద్ ప్రభావం తీవ్రంగా పడింది. ఎంజీబీఎస్‌లో బస్సులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. దీంతో, సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు, జేబీఎస్, హయత్‌నగర్, మెహిదీపట్నం, దిల్సుఖ్నగర్, రాజేంద్రనగర్, ఉప్పల్, నగర శివారుల నుంచి బస్సులు లేకపోవడం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, శుక్రవారం అర్ధరాత్రి వరకు పలు జిల్లాల నుంచి నగరానికి బస్సులు వచ్చాయి. అలాగే, సిటీ నుంచి బస్సులు వెళ్లాయి. దీంతో, ఆ బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. మరోవైపు.. రైళ్ల రాకపోకలు, మెట్రో, ఎంఎంటీఎస్ సేవలపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. బంద్ నేపథ్యంలో రాష్ట్రంలో కాలేజీలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. రాష్ట్ర బంద్ నేపథ్యంలో శనివారం ఓయూలో జరగనున్న అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోరుతూ.. 9వ షెడ్యూల్ చేర్చి చట్టసవరణ చేయాలంటూ బీసీ సంఘాలు శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. ఈ బంద్‌కు అన్ని పార్టీలతో పాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు మద్దతు ప్రకటించాయి. -
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వివరాలను తమ ముందు ఉంచాలని జీపీ, ఈసీ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. దీనికి రెండు వారాలు సమయమిస్తూ, విచారణను వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంచిర్యాల మండలం లక్సెట్టిపేట్‌కు చెందిన రేంక సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘రిజర్వేషన్లపై పిటిషన్ నేపథ్యంలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ నిలిపివేస్తూ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో స్పష్టత వచ్చినా ఎన్నికల నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వెంటనే మరో నోటిఫికేషన్ జారీ చేసి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలి’అని కోరారు.ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు, షెడ్యూల్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం తరఫున షాజియా పర్వీన్ వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ దాఖలు చేసేందుకు 3 వారాలు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ అవసరం లేదని, ఎన్నికల తేదీలు తెలియజేస్తే చాలని స్పష్టం చేస్తూ, విచారణను వాయిదా వేసింది. -
మంత్రులు వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం.. దండుపాళ్యం ముఠా కంటే అధ్వానంగా తయారైందని..కేబినెట్ మీటింగ్‌లో మంత్రులు అరడజను వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కమీ షన్లు, కాంట్రాక్టులు, వసూళ్లు, వాటాలు, కబ్జాలు, పోస్టింగుల కోసం పోటీలు పడుతూ పాలన గాలికి వదిలి వ్యక్తిగత పంచాయితీలు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్య మంత్రి, మంత్రులు పరస్పరం తిట్లతో గడుపుతున్నారని, అతుకుల బొంత ప్రభుత్వ మనుగడపై అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల్లోనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు.దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే భావనతో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పుడే అందినకాడికి దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మాజీమంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మాణిక్‌రావు, పార్టీ నేతలు చిరుమర్తి లింగయ్య, పల్లె రవికుమార్‌తో కలిసి శుక్రవారం తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. దీపావళి పండుగ నేపథ్యంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశం ద్వారా తీపి కబురు చెప్తారని ఆశించిన అన్ని వర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారన్నారు.రేవంత్ ‘గన్ కల్చర్’ తెచ్చారు‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యాపార వేత్తలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికి పెట్టుబడులతోపాటు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి చేశాం. కానీ రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోకి గన్ కల్చర్ తెచ్చి వ్యాపారవేత్తలను తుపాకులతో బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి సన్నిహితులు తుపాకులు పెడుతున్నారని, సీఎం జపాన్ నుంచి ఫైళ్లు ఆపించారని ఓ మంత్రి కుమార్తె స్పష్టంగా చెప్తోంది.కాంట్రాక్టుల కోసం.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినిమా హీరోలు, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. ఇక్కడ జరుగు తున్న అరాచకాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో లేదా స్వతంత్ర జ్యుడీషియల్ కమిషన్‌తో విచారణ జరిపించాలి. సీఎం తుపాకీ పంపారు అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో డీజీపీ స్పందించాలి’అని హరీశ్‌రావు అన్నారు. దేని కోసం విజయోత్సవాలు..?‘ప్రభుత్వ సంస్థలను అప్పుల కుప్ప చేసి ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి అప్పులు తెచ్చారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి కమీషన్లు దండుకునేందుకు హ్యామ్ మోడల్ పేరిట రూ.10,547 కోట్లతో రోడ్లకు టెండర్లు పిలిచారు. బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోవడంతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి పేద, మధ్య తరగతి ప్రజలను రేవంత్ ప్రభుత్వం దొంగ దెబ్బతీసింది. 23 నెలల పాలనలో అన్ని పథకాలు, హామీలను అమలు చేయకుండా డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు జరపాలని నిర్ణయించడం సిగ్గుచేటు. రాష్ట్రంలో పెరిగిన అరాచకాలపై విచారణ ఏజెన్సీలకు ఫిర్యాదు చేస్తాం’అని హరీశ్‌రావు చెప్పారు. -
బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న బంద్ ఇది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకుందని.. ఆ పార్టీ నైజం రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశం మొత్తం తెలిసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్ర మార్క అన్నారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో శుక్ర వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం, పార్టీకి చిత్తశుద్ధి ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాగానే రిజర్వేషన్ అంశంపై చర్చించి ఈ నెల 23న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా శనివారం నిర్వహించే బీసీల బంద్‌లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ రిజ ర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్రం నుంచి అఖిలపక్ష పార్టీలు బీజేపీ నాయకత్వంలోనే ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని భట్టి తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తామని పదేపదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా అనుమతి రాలేదన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఈ విషయంలో చొరవ చూపి ప్రధాని, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఆమోదం కోసం నాయకత్వం వహించాలని సూచించారు.సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా రూ.400 కోట్ల బోనస్ ప్రకటించామని భట్టి తెలిపారు. సింగరేణి కార్మి కులకు దీపావళి బోనస్ ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, కొత్త సీతారాములు, కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రన్‌వేకు అటు పౌర విమానాలు ఇటు ఐఏఎఫ్ జెట్లు!
సాక్షి, హైదరాబాద్: సుమారు 3 కిలోమీటర్ల పొడవైన రన్‌వే.. దానికి ఓవైపు విమానాశ్రయం.. మరోవైపు భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) స్టేషన్. అంటే పౌర విమానాలు, ఎయిర్‌ఫోర్స్ విమానాలకు కామన్ రన్‌వే అన్నమాట. ఇదీ సమీప భవిష్యత్తులో రూపుదిద్దుకోనున్న ఆదిలాబాద్ విమానాశ్రయ ముఖచిత్రం. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. తొలుత చిన్న విమానాశ్రయాన్నే నిర్మించాలని భావించినా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్‌లోనూ భారీ విమానాశ్రయాన్నే నిర్మించాలని తాజాగా ఏఏఐ నిర్ణయించింది.ఎయిర్‌బస్ ఏ–320, బోయింగ్–737 రకం విమానాల రాకపోకలకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి ఆమోదం తెలిపింది. అలాగే రాత్రివేళల్లోనూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు జరిగేలా వసతుల కల్పనకు కూడా సమ్మతించింది. దీంతో రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణ ప్రాజెక్టులో వరంగల్ విమానాశ్రయ ప్రతిపాదన తర్వాత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రెండో విమానాశ్రయం ఇదే కానుంది. వరంగల్ విమానాశ్రయంతోపాటే దీన్ని కూడా నిర్మించనున్నారు.ఇప్పటికే అన్ని రకాల సర్వేలు ముగిసి టెండర్లు పిలిచేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా తుది సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఏఐ కోరింది. దానికి ఇక్కడి నుంచి సమాధానాలు ఢిల్లీకి చేరాయి. వాటి ఆధారంగా మాస్టర్‌ప్లాన్ సిద్ధమైంది.దాదాపు 650 ఎకరాల్లో నిర్మాణం..ఆదిలాబాద్ పట్టణ శివారులోని శాంతినగర్‌లో నిజాంకాలం నాటి ఎయిర్‌స్ట్రిప్ ఉంది. అక్కడకు కేవలం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లు మాత్రమే అడపాదడపా వస్తుంటాయి. వీఐపీలు వచ్చినప్పుడు అక్కడి హెలిపాడ్‌ను వాడుతుంటారు. ఈ హెలిపోర్టును ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌గా మార్చుకోవాలని చాలాకాలంగా ఐఏఎఫ్ ప్రయత్నిస్తోంది. తొలి నుంచీ హెలిపోర్టుకు చెందిన 369 ఎకరాల స్థలం దాని అధీనంలోనే ఉంది.అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయం కోసం ప్రతిపాదించగా అందుకు ఐఏఎఫ్ సమ్మతించి ఉమ్మడి అవసరాలకు వాడుకునేలా దాన్ని నిర్మించేందుకు అంగీకరిస్తూ నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయడంతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 250–300 ఎకరాల స్థలాన్ని సేకరించాలని నిర్ణయించారు.తాజాగా అన్ని అడ్డంకులు తీరిపోవడంతో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. వచ్చే 30 ఏళ్ల అవసరాలు తీర్చేలా ఇక్కడ నైట్ ల్యాండింగ్‌తో కూడిన పెద్ద విమానాశ్రయాన్నే నిర్మించనున్నారు. కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న ఏఏఐ తాజాగా ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆదిలాబాద్‌లో ఎయిర్‌బస్–380, బోయింగ్–777 విమానాలు (అతిపెద్ద విమానాలు) దిగే సామర్థ్యంతో కూడిన రన్‌వే అవసరమా లేక ఎయిర్‌బస్–ఏ320, బోయింగ్–737 రకం విమానాలు దిగే సామర్థ్యంతో కూడిన రన్‌వే కావాలా అని ప్రశ్నించింది.ఎయిర్‌బస్–ఏ320, బోయింగ్–737 స్థాయి విమానాలు దిగే రన్‌వే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో 2.8 కి.మీ. నుంచి 3 కి.మీ. పొడవైన రన్‌వే నిర్మాణానికి నిర్ణయించారు. దానికి ఓవైపు ప్రయాణికుల విమానాలు నిలిచే స్థలం, ప్రయాణికుల ప్రాంగణం మరోవైపు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నిర్మించనున్నారు. సాధారణ ప్రయాణికులు, పౌర విమానాలు రెండో వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేయనున్నారు. వాయుసేనకు దాదాపు 50–80 ఎకరాల స్థలం కేటాయించి మిగతా మొత్తాన్ని ప్రయాణికుల విమానాశ్రయానికి వినియోగించనున్నారు. -
నేడు బీసీ జేఏసీ రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల సాధనలో భాగంగా శనివారం తెలంగాణ బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్రబంద్‌కు అన్ని రాజకీయపార్టీలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలంటూ పార్టీలు... వారి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇవ్వడం, ఆ దిశగా అసెంబ్లీలో చట్టాలు చేసి కేంద్రానికి పంపడం... మరోవైపు ఆర్డినెన్స్ జారీ చేసినా, గవర్నర్ ఆమోదించకపోవడం...చివరకు బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయగా... వాటిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.బీసీలకు కేవలం స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాలు, రాజకీయ రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ పెరిగింది. ఈ మేరకు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఈనెల 12న బీసీ జేఏసీ ఏర్పాటైంది. ప్రజాజీవనాన్ని స్తంభింపజేసి బీసీల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకే రాష్ట్రబంద్ నిర్వహిస్తున్నట్టు జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఈ బంద్‌కు అన్ని వర్గాల మద్దతును కోరారు.బీసీ జేఏసీ నిర్ణయం మేరకు ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిచి్చన వెంటనే ప్రధాన రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ సైతం మద్దతు ప్రకటించడంతోపాటు రాష్ట్ర బంద్‌లో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను పాల్గొనాలని టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్ గౌడ్ ఆదేశించారు.మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సైతం క్షేత్రస్థాయిలోని నాయకత్వానికి బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్రంలోని ప్రజాసంఘాలన్నీ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయించాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న బంద్‌కు అన్ని పక్షాల మద్దతు లభించడం ఇదే తొలిసారి. -
మావోయిస్టు విప్లవ చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశ సాయుధ విప్లవ చరిత్రలోకెల్లా మావోయిస్టుల అతిపెద్ద లొంగుబాటు ఛత్తీస్‌గఢ్‌లో నమోదైంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సహా 210 మంది మావోయిస్టులు శుక్రవారం లాంఛనంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 111 మంది మహిళలు, 99 మంది పురుషులు ఉన్నారు.వారందరిపై కలిపి రూ. 9.18 కోట్ల రివార్డు ఉంది. హోదా పరంగా చూస్తే లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, నలుగురు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, ఒక రీజనల్ కమిటీ సభ్యుడు, 21 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 61 మంది ఏరియా కమిటీ సభ్యులు, 22 మంది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులతోపాటు 98 మంది పార్టీ సభ్యులు తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా 19 ఏకే–47లు, 17 ఎస్ఎల్ఆర్లు, 23 ఇన్సాస్ రైఫిళ్లు, ఒక ఇన్సాస్ లైట్ మెషీన్ గన్, 36 (.303 రకం) రైఫిళ్లు, 11 బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు, నాలుగు కార్బైన్లు తదితర ఆయుధాలను అప్పగించారు. బస్తర్ జిల్లా కేంద్రమైన జగ్దల్పూర్లోని పోలీస్ లైన్లో ఉన్నతాధికారుల సమక్షంలో ‘పున మార్గ్’పేరిట ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయి, హోంమంత్రి విజయ్‌శర్మ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన మావోయిస్టులకు స్థానికంగా ఉన్న మాంజీ చాల్కీ తెగకు చెందిన నాయకులు గులాబీ పూలు అందించి జనజీవన స్రవంతిలోకి ఆహ్వనించారు. ఆ తర్వాత వారికి దేశ రాజ్యాంగ ప్రతులు అందచేశారు.ఈ సందర్భంగా సీఎం విష్ణుదేవ్ సాయి మాట్లాడుతూ సాయుధ పోరాటాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో తాజా లొంగుబాట్లు కీలక మలుపుగా నిలుస్తాయన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నట్లుగా 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ఉద్ఘాటించారు. అంతకు ముందు అడవిని వీడి గురువారం రాత్రి జగ్దల్పూర్ చేరుకున్న మావోయిస్టులను ప్రత్యేక బస్సుల్లో పోలీస్‌లైన్ వరకు తీసుకొచ్చారు. మారిన పరిస్థితులతోనే.... అనంతరం ఆశన్న మీడియాతో మాట్లాడుతూ మారిన పరిస్థితుల కారణంగానే లొంగిపోయామని చెప్పారు. ప్రస్తుతం విప్లవకారులకు అడవుల్లో ఆశ్రయం పొందే వీల్లేని పరిస్థితి నెలకొందని.. కానీ తమ సహచరులు ఇంకా అజ్ఞాతంలో ఉంటూ సాయుధ పోరాటం చేయాలనే దృక్ఫథంతో ఉన్నారని తెలిపారు. అందులో ఎవరైనా జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటే ఫోన్లో తనను సంప్రదించాలని సూచించారు. అబూజ్మాడ్ ఖాళీ పోలీసు వర్గాల అంచనా ప్రకారం దేశంలో మావోయిస్టు ఉద్యమానికి దండకారణ్యం ప్రధాన స్థావరంగా ఉంది. ఇందులో ఛత్తీస్‌గఢ్–మహారాష్ట్ర సరిహద్దులోని అబూజ్మాడ్ అడవులు మావోయిస్టులకు పెట్టని కోటలా ఉండేవి. కానీ మల్లోజుల, ఆశన్న బృందాల లొంగుబాట్లతో అబూజ్‌మాడ్‌లో ఆ పార్టీ పట్టు కోల్పోయినట్టయింది. అయితే ఇప్పటికీ దట్టమైన అడవితోపాటు ఇంద్రావతి నేషనల్ పార్క్, తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్న దక్షిణ బస్తర్ డివిజన్లలో మావోయిస్టుల ప్రభావం ఉంది. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక 477 మంది మావోయిస్టులు మృతిచెందగా 1,785 మంది అరెస్టయ్యారు. అలాగే 2,110 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముఖ్యులు 1) తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న – కేంద్ర కమిటీ సభ్యుడు 2) భాస్కర్ అలియాస్ రాజ్మన్ – డీకేఎస్జెడ్సీ 3) రాణిత – డీకేఎస్జెడ్సీ 4) రాజు సలాం – డీకేఎస్జెడ్సీ 5) దన్నువెట్టి అలియాస్ సంతు – డీకేఎస్జెడ్సీ 6) రతన్ ఎలాం – రీజనల్ కమిటీ సభ్యుడు -
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అధికారులు, ఉద్యోగులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ ఎన్నికలు ఎప్పుడు జరగొచ్చు అనే దానిపై రెండుమూడు రోజుల్లోనే స్పష్టత వస్తుందని సంకేతాలిచ్చినట్టు సమాచారం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుతోపాటు ఎన్నికల తేదీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఎన్నికలపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తెలిసింది. లోపాలు లేకుండా పకడ్బందీ చర్యలు..: ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమస్యలు, చట్టపరమైన అంశాలపై ప్రభుత్వం కోరిన వివరణకు కూడా పీఆర్‌శాఖ సమాధానం పంపించినట్టు తెలుస్తోంది. ఇదివరకు జరిగిన కసరత్తులో నాలుగైదు జిల్లాల వరకు మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ స్థానాల రిజర్వేషన్ల ఖరారులో తప్పులు దొర్లినందున ఈసారి అలాంటివి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం.గురువారం రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో పాటు 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రెండువారాల్లోగా స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీలను తెలియజేయాలంటూ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)లను తాజాగా శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో ఇంకా స్పష్టత రాలేదనే ఉద్దేశంతో అధికారులు అలసత్వం చూపొద్దని పీఆర్ఆర్డీ శాఖ సూచించింది.శుక్రవారం జెడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు తదితరులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ అంశాలపై పీఆర్ఆర్డీ డైరెక్టర్ స్పష్టతనిచ్చినట్టు సమాచారం. రాష్ట్ర పభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే మళ్లీ రిజర్వేషన్ల (50 శాతం మించకుండా) ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించినట్టు తెలిసింది. హైకోర్టు ఆదేశాలతో ఎస్ఈసీ కూడా ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమైనట్టు సమాచారం.ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల శాతం ఖరారుతోపాటు, ఫలానా తేదీ లోగా ఎన్నికలు జరపాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు అందగానే ఎన్నికల నిర్వహణ పనులు వేగవంతం చేయనుంది. గతంలోనే ఐదు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ జారీచేసినందున, రిజర్వేషన్లు ఖరారై, తేదీలపై స్పష్టత వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి సంసిద్ధంగా ఉన్నట్టు ఎస్ఈసీ వర్గాల సమాచారం. -
హైదరాబాద్ టు శ్రీశైలం నాన్ స్టాప్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నాన్ స్టాప్ ప్రయాణం వీలుకానుంది. 147 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. రావిర్యాల నుంచి ఆమన్‌గల్, ఆమన్‌గల్ నుంచి మన్ననూరు వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మించి అక్కడి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు.ఫ్యూచర్ సిటీలో భాగంగా ఇప్పటికే హెచ్ఎండీఏ నిర్మిస్తున్న రావిర్యాల (ఓఆర్ఆర్) నుంచి ఆమన్‌గల్ వరకు కొత్త రహదారిని ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారితో అనుసంధానించనున్నారు. ఆమన్‌గల్ నుంచి మన్ననూరు వరకు 52.2 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే... మన్ననూరు నుంచి శ్రీశైలం 54 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరగనుంది.రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు రూ. 7,500 కోట్ల వ్యయ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం తెలి సిందే. ఈ ఎలివేటెడ్ కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించనుంది. నిర్మాణ భారాన్ని తగ్గించుకోవడానికి.. తుక్కుగూడ నుంచి దిండి వరకు 85.8 కి.మీ. మేర నాలుగు వరుసలుగా రహదారి విస్తరణ.. మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 54 కి.మీ. వరకు ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఈ మేరకు దిండి నుంచి మన్ననూరు వరకు ఉన్న ప్రాంతాన్ని ఎన్హెచ్ఏఐకు బదిలీ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.అయితే భూసేకరణ, ప్రస్తుతం రహదారి వెంబడి యుటిలిటీ షిఫ్టింగ్‌కు భారీ వ్యయం అవుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల (ఓఆర్ఆర్ జంక్షన్) నుంచి ఆమన్‌గల్ వరకు 41.5 కి.మీ. వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మిస్తున్న ప్రభుత్వం.. ఇందుకోసం రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీలు, యుటిలిటీల వంటి అన్ని రకాల అవసరాల కోసం 100 మీటర్ల వరకు భూములను సమీకరిస్తోంది.రావిర్యాల నుంచి ఆమన్‌గల్ వరకు నిర్మించనున్న రోడ్డు ముగింపు తర్వాత అక్కడి నుంచే ఆమన్‌గల్–మన్ననూరు వరకు 52.2 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ రహదారిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ రహదారి అలైన్‌మెంట్‌కు కల్వకుర్తి బైపాస్‌లోని ప్రస్తుత ఎన్‌హెచ్–765, ఎన్‌హెచ్–167లను అనుసంధానించనుంది. ఈ కొత్త రహదారి పొడవు 11 కి.మీ. ఉంటుంది. దీని డీపీఆర్‌ను ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ (ఏఏసీ) ఆమోదం కోసం పంపింది. -
కార్పొరేట్ ‘చదివింపులు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదలకు మెరుగైన విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు వీలుగా సరికొత్త మార్గాలను అన్వేషించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడాలని.. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు.ఇందులో భాగంగా స్కూళ్ల అభివృద్ధికి నిధులిచ్చే దాతలు, పూర్వ విద్యార్థుల తోడ్పాటు తీసుకోవాలని కోరారు. మౌలిక వసతుల కల్పనలో ఇది సరైన మార్గమని పేర్కొన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.ఆయా స్కూళ్లలో ఆట స్థలాలు, అవసరమైనన్ని తరగతి గదులతోపాటు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. స్థలం సమస్య వల్ల సౌకర్యాలలేమి ఎదుర్కొంటున్న పాఠశాలలను దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లోకి తరలించాలని ఆదేశించారు. విదేశాల్లో విద్యా వ్యవస్థల పరిశీలనకు టీచర్లను పంపే ప్రక్రియను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇతర దేశాల్లోని మెరుగైన విధానాలను అనుసరించాలని సూచించారు. నిధుల కొరత వల్ల.. విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలు, జరుగుతున్న కృషిని అధికారులు సీఎంకు వివరించారు. అయితే నిధుల కొరత అభివృద్ధికి ఆటంకంగా మారుతోందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలకు బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించినప్పటికీ ఇంతవరకు నిధులు మంజూ రు కాలేదని.. ముఖ్యంగా చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 100 కోట్ల చొప్పున, మిగతా వర్సిటీలకు రూ. 35 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయింపులు చేసినా ఇప్పటికీ నిధులివ్వలేదని పేర్కొన్నారు.దీనివల్ల వర్సిటీల్లో కొత్త కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేకుండా పోతోందని వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. ప్రస్తుతానికి ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటున్నందున కార్పొరేట్ సంస్థల ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద స్కూళ్లు, ఇతర విద్యా సంస్థలను అభివృద్ధి చేసుకోవాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించాలని ఆయన పేర్కొన్నట్లు అధికార వర్గాల సమాచారం. నర్సరీ స్కూళ్లపై దృష్టి నర్సరీ స్కూళ్ల ఏర్పాటుపై సీఎం సమీక్షిస్తూ వాటి ఏర్పాటు, ప్రజల్లో అవగాహన గురించి అధికారులను వివరాలు అడిగారు. నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు కొత్త స్కూళ్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు సరికొత్త రీతిలో బోధన జరిగేలా చూడాలన్నారు. ప్రైవేటు స్కూళ్లకు వెళ్ళకుండా పేద విద్యార్థులను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.వచ్చే విద్యా సంవత్సరం ఇది అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.కాగా, ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉన్నత విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలపై రూపొందించిన పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. -
లేజర్.. డేంజర్!
శంషాబాద్: విందులు వినోదాలు చేసుకునేవారికి అవి మిరుమిట్లు గొలిపే కాంతులు.. కానీ, వందలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విమాన పైలట్లకు మాత్రం అవి కంగారు పుట్టించే వెలుగులు. విమానాల టేకాఫ్, ల్యాండింగ్లపై తీవ్ర ప్రభావం చూపే లేజర్ లైట్లను విమానాశ్రయాల సమీపంలో వినియోగించరాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిషేధించినప్పటికీ.. కొందరు తరచూ వాటిని వాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో కూడా వీటి వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ప్రారంభంలో చిన్నచిన్న గ్రామాలే ఉండేవి. గత దశాబ్దకాలంగా చుట్టూ జనావాసాలు, వాణిజ్య కార్యకలాపాలు భారీగా పెరిగాయి. అనేక కన్వెన్షన్లతోపాటు కొందరు సంపన్నులు ఎయిర్‌పోర్టుకు అత్యంత సమీపంలోనే విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్నారు.ఎయిర్‌పోర్టు సమీపంలో లేజర్ లైట్ల వినియోగంపై ఆంక్షలు ఉన్నప్పటికీ కొదరు పట్టించుకోవటంలేదు. ఆరేళ్ల క్రితం కొందరు బాలురు బర్త్‌డే పార్టీ చేసుకుని లేజర్ లైట్లు వేయటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగేందుకు గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమాన పైలట్ కంగారు పడ్డాడు. అప్పట్లో ఇది పెద్ద కలకలమే రేపింది. తాజాగా మూడు రోజుల క్రితం కూడా ఓ విమానంపై గ్రీన్ కలర్ లేజర్ కాంతులు పడ్డాయనే సమాచారంపై అంతర్గత విచారణ చేపట్టారు.కఠిన నిబంధనలున్నాయి..శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో లేజర్ లైట్లు, డ్రోన్ల వినియోగానికి అనుమతి లేదు. ఎవరైనా ఈవెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే.. వారికి ముందుగానే నిబంధనలు వివరించి లేజర్ లైట్లు వాడకూడదని స్పష్టంగా చెబుతాం. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో నిబంధనలు అతిక్రమించి ఎవరైనా వినియోగిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తాం. – బి. రాజేష్, శంషాబాద్ డీసీపీఏమిటి నిబంధనలు? విమానాశ్రయం పరిసరాల్లో లేజర్ కాంతుల వాడకంపై డీజీసీఏ పలు నిబంధనలు పెట్టింది. విమానాశ్రయానికి పది కిలోమీటర్ల లోపు వివిధ జోన్లుగా విభజించి నిబంధనలు పెట్టారు. కాంతి ప్రసార వేగం ఆధారంగా నిబంధనలు రూపొందించారు. మొదటిది లేజర్ బీమ్ ఫ్రీ ఫ్లైట్ జోన్. ఈ జోన్ పరిధిలో లేజర్ కాంతులు పూర్తిగా నిషిద్ధం. రెండోది లేజర్ బీమ్ క్రిటికల్ ఫ్లైట్ జోన్. ఇందులో లేజర్ కాంతి ప్రసారం మేరకు నిబంధనలుంటాయి. మూడోది లేజర్ బీమ్ సెన్సిటివ్ ఫ్లైట్ జోన్.పైలట్ల కష్టాలు..టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో లేజర్ కాంతులతో పైలట్లు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. వేగవంతమైన కాంతి ద్వారా పైలట్లకు ఫ్లాష్ బ్లైండ్నెస్ ప్రమాదం ఉంటుంది. దీంతో తాత్కాలిక దృశ్యలోపంతో పైలట్లు కంగారు పడతారు. దీంతోపాటు ఆఫ్టర్ ఇమేజ్ ప్రభావం ఉంటుంది. లేజర్ కాంతి పడి తర్వాత పోయినా ఆ దృశ్యం కళ్లలో నిక్షిప్తమై మరోమారు కనిపిస్తుంటుంది. ఇది దృష్టిభ్రమ లాంటింది. ఇది కూడా పైలట్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.తీవ్ర ప్రభావం ఉంటుంది రన్‌వేపై వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటుచేసే లైటింగ్, సహజ వెలుగుల ప్రభావంతో టేకాఫ్, ల్యాండింగ్‌లు ఆధారపడి ఉంటాయి. అకస్మాత్తుగా లేజర్ కాంతులు పడితే పైలట్లు తీవ్ర ప్రభావానికి లోనవుతారు. దృశ్యలోపం కూడా సంభవిస్తుంది. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో లేజర్ కాంతులపై కఠిన నిబంధనలు కొనసాగించాలి. – నవీన్చందర్, విశ్రాంత పైలట్ -
ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రతీ ప్రభుత్వ పారశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 17వ తేదీ) విద్యాశాఖ సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. ‘ పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయండి. తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించండి. ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలి. ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతోపాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలి. ఇందుకు విద్యా శాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించండిసరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించండి. నర్సరీ నుంచి 4 వ తరగతి వరకు నూతన స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాటు చేయండి విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయండి 2026 జూన్ లో అకడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్లాలి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
డీజీపీని కలిసిన మంచు మనోజ్ దంపతులు
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ విషయాన్ని మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉందని ట్వీట్లో రాసుకొచ్చారు.మంచు మనోజ్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'నేను, నా భార్య మౌనిక గౌరవనీయులైన డీజీపీ శివధర్‌రెడ్డిని కలిశాం. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉంది. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయన ప్రయాణం క్రమశిక్షణ, ధైర్యం, నైతిక పోలీసింగ్ పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.Me and my wife @BhumaMounika met Shri B. #ShivadharReddy Garu, the new @TelanganaDGP 💐Delighted to see a leader of integrity and vision take charge. His journey from the grassroots to the top reflects discipline, courage, and an unshakable commitment to ethical policing.… pic.twitter.com/0f4g3YS7FP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 17, 2025 -
హరీష్‌కు మంత్రి సీతక్క కౌంటర్
హైదరాబాద్: క్యాబినెట్లో రాద్దాంతం జరిగిందంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటరిచ్చారు. క్యాబినెట్లో రాద్దాంతం జరిగిందని హరీష్ నిరూపించగలరా? అంటూ సవాల్ విసిరారు. ‘ నిన్న క్యాబినెట్లో ఎలాంటి రాద్దాంతం జరగలేదు. క్యాబినెట్ ఎజెండా, ప్రజల సమస్యలు తప్పా ఇంకేమీ చర్చ జరగలేదు. జరగని విషయాలను జరిగిందని మాట్లాడి హరీష్ రావు దిగజారిపోయారు. హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. నిన్న వ్యక్తిగతంగా సీఎంతో మాట్లాడినపుడు కూడా ఇతర మంత్రుల మీద చర్చ చేయలేదు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం హరీష్ రావు. దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్ఎస్ పార్టీనే’ అని విమర్శించారు మంత్రి సీతక్క.ఇదీ కూడా చదవండి:‘రాష్ట్ర క్యాబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరి తయారైంది’ -
‘రాష్ట్ర క్యాబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరి తయారైంది’
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మంత్రులు వారి పంచాయితీలు చెప్పుకోవడానికే క్యాబినేట్ మీటింగ్‌లు పెడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం (అక్టోబర్ 17) తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. హరీష్ మాట్లాడుతూ.. ‘మంత్రులు గ్రూపులుగా విడిపోయారు. దంళుపాళ్యం ముఠాకంటే అధ్వాన్నంగా మారింది. మంత్రుల పంచాయితీ చెప్పుకోవడానికే క్యాబినెట్ మీటింగ్. కేసీఆర్ ఢిల్లీలో తిరిగి లోకల్ రిజర్వేషన్ల వాటా, నీళ్ల వాటాను సాధించారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి కమీషన్లు.కాంట్రాక్టుల వాటాల కోసం కొట్లాడుతున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు. రేవంత్‌రెడ్డి పాలనతో అతితక్కువ ఇండస్ట్రీలు వచ్చాయి. టీఎస్ ఐపాస్ ఏర్పడిన తర్వాత పరిశ్రమల రాక సంఖ్య పెరిగింది.మా హయాంలో పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యాత ఇచ్చాం. మీరు వ్యాపార వేత్తలకు తుపాకులు గురి పెడుతున్నారు. గన్ కల్చర్ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రేపు తెలంగాణ బంద్.. డీజీపీ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రేపటి (అక్టోబర్18,శనివారం) బంద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలని డీజీపీ శివధర్‌రెడ్డి సూచించారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా చూసుకోవాలని.. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీజీపీ అన్నారు. బంద్ పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం ఈ నెల 18న బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. శనివారం చేపట్టబోయే బంద్‌కు రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల జేఏసీ ప్రజలను కోరింది.బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రేపు జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ బీసీ సంఘాలు ఆల్ పార్టీల ఆధ్వర్యంలో బషీరాబాగ్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు. ఈ ర్యాలీలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం, మాల మహానాడు నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీసీ జేఏసీ నాయకులు రాజారాం యాదవ్ పాల్గొన్నారుబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు తలపెట్టిన రేపటి తెలంగాణ బంద్ కార్యక్రమానికి అదిలాబాద్ భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పత్రిఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.ఖమ్మం: రేపు జరగబోయే బంద్‌కు సంపూర్ణ మద్దతు కోరుతూ డిప్యూటీ సీఎంకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మసనం శివరామకృష్ణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నలమాస సుగుణ ఖమ్మం టౌన్ మహిళా అధ్యక్షురాలు గాజుల శ్రీదేవి ఖమ్మం టౌన్ అధ్యక్షుడు గద్దె వెంకటరామయ్య ఉపాధ్యక్షుడు అమృతం మల్లికార్జున్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కూరపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
పిట్ట కొంచెం.. కూత ఘనం..! మూడున్నరేళ్ల వయస్సులోనే..
ఆ చిన్నారికి మూడున్నరేళ్లే.. అయినా టీవీల్లో వచ్చే పాటలు విని తిరిగి అద్భుతంగా పాడుతోంది. ఆమె పాటలు వింటున్న గ్రామస్తులు చిన్నారిని అభినందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నర్సింహులపల్లెకు చెందిన ఆవునూరి సంజీవ్, మౌనిక కూతురు వరుణవి. టీవీల్లో వచ్చే పాటలు విని తిరిగి అలాగే పాడుతుండడంతో తల్లిదండ్రులు రికార్డు చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఆమె ప్రతిభను గుర్తించిన ఓ ప్రైవేటు టీవీ నిర్వహించే ప్రోగ్రామ్‌కు ఆహ్వానించారు. ఆమె పాడిన పాటలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సుమారు నాలుగు నెలలుగా ప్రోగ్రామంలో పాల్గొంటోందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..) -
‘కొండా’ వివాదం సమసినట్లేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్ : సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ దంపతులు, ఆమె కూతురు సుస్మిత వ్యాఖ్యల వివాదం సమసినట్లేనా.. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు.. ఈ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఏమిటి.. ఇంతకీ వివాదానికి కారణమైన మాజీ ఓఎస్డీ సుమంత్ ఎక్కడ.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన సురేఖ.. కీలకమై కేబినెట్ మీటింగ్‌కు ఎందుకు వెళ్లలేదు?.. ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. 48 గంటలుగా తాజా రాజకీయ పరిణామాలు వరంగల్‌ను హీటెక్కించాయి.సుమంత్ కోసం పోలీసులు..కలకలం రేపిన సుస్మిత వ్యాఖ్యలు..మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మధ్య విభేదాలు పక్కన పెడితే... మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లడం.. అక్కడ సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు. కొండా సురేఖ, మురళికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదే సమయంలో వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన కొండా మురళీధర్ సీఎం రేవంత్‌రెడ్డితో తమకు విభేదాలు లేవని, తనకు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పారన్నారు. సుస్మిత ఎక్కడ.. ఎప్పుడు.. ఏం మాట్లాడింది తనకు తెలియదని కొట్టిపారేశారు. మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు? ఇంతకీ అతను ఎక్కడ ఉన్నాడు? ప్రభుత్వం తదుపరి ఏం చేయబోతుంది? అనే అంశాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.కేబినెట్‌కు ఎందుకు వెళ్లలేదు..అసలేం జరుగుతోంది..?రెండు రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో గురువారం జరిగిన కీలకమైన మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత.. టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌తో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కూడ కలిసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌లను కలిసిన కొండా సురేఖ.. 48 గంటల్లో జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిసింది. పార్టీపరంగా, కొందరు ప్రజాప్రతినిధుల వల్ల తమకెదురవుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా మీడియాతో మాట్లాడిన సురేఖ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌తో భేటీ అయిన సురేఖ, ఆ తర్వాత జరిగిన కేబినెట్ మీటింగ్‌కు హాజరుకాకపోవడం కొత్త వివాదానికి తెర తీసింది. అసలు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడిన సురేఖకు వారు ఏమి భరోసా ఇచ్చారు? అక్కడినుంచి కేబినెట్ మీటింగ్‌కు వెళ్లాల్సిన ఆమె ఎందుకు వెళ్లలేదు? కావాలనే వెళ్లలేదా? లేక ఎవరైనా వద్దని చెప్పారా? ఈ నేపథ్యంలో కొండా దంపతులకు ఏమైన ప్రత్యేక వ్యూహం ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది..? అన్న అంశాలు అన్ని వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. -
శృంగారంలో ఉండగా స్పృహ కోల్పోయాడని..
కరీంనగర్‌క్రైం: నిత్యం డబ్బుల కోసం వేధిస్తున్నాడని భర్తను చంపాలనుకున్నదో భార్య. మొదటిసారి విఫలం కావడంతో రెండోసారి మద్యంలో బీపీ, నిద్రమాత్రలు పొడిచేసి కలిపి తాగించింది. అపస్మారస్థితిలోకి వెళ్లాక ఉరేసి చంపేసింది. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలితో పాటు ఐగురుగురిని కరీంనగర్ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కమిషనరేట్‌లో గురువారం సీపీ గౌస్ఆలం కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..నగరంలోని సప్తగిరికాలనీలో నివాసముంటున్న కత్తి మౌనిక, సురేశ్ 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మౌనిక ఇటీవల సెక్స్‌వర్కర్‌గా మారింది. సురేశ్ నిత్యం డబ్బుల కోసం వేధించడంతో చంపాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన బంధువులైన అరిగె శ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి అజయ్, నల్ల సంధ్య ఊరాఫ్ వేముల రాధ, నల్ల దేవదాస్ సాయం కోరింది. వారి సూచనల మేరకు ఒకరోజు వయాగ్రా మాత్రలు కూరలో కలిపి చంపాలని ప్రయత్నించగా, వాసన రావడంతో సురేశ్ తినలేదు. గతనెల 17న సురేశ్ మద్యం సేవిస్తుండగా బీపీ, నిద్ర మాత్రలు పొడిగాచేసి మద్యంలో కలపడంతో అది తాగిన సురేశ్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు.సురేశ్ మెడకు చీరను బిగించి, కిటికి గ్రిల్‌కు వేలాడదీసి ఉరేసి చంపేసింది. తర్వాత లైంగిక చర్య సమయంలో స్పృహ కోల్పోయాడని తన అత్తమామలకు చెప్పింది. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సురేశ్ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మౌనిక ప్రవర్తనపై నిఘా పెట్టిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఆమెను విచారించగా తానే అరిగెశ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి ఆజయ్, వేముల రాధ, నల్ల దేవదాస్ సాయంతో హత్య చేసినట్లు ఒప్పుకుంది. నిందితులను టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి, గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్‌రెడ్డి, ఎస్సై చంద్రశేఖర్‌ను సీపీ అభినందించారు. -
ఆస్తి కోసం తల్లి అంత్యక్రియలు ఆపిన కూతుళ్లు..
ఆత్మకూర్.ఎస్ (సూర్యాపేట): భర్త చనిపోయినా తన ఇద్దరు ఆడ పిల్లలను కష్టపడి పెంచి ఆస్తులు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తే... చివరికి మిగిలి ఉన్న బంగారం పంచుకోవడం కోసం గొడవపడి 3 రోజులుగా కన్నతల్లి మృతదేహానికి దహన సంస్కారాలు చేయలేదు ఆ కూతుళ్లు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఆత్మకూరు.ఎస్ గ్రామానికి చెందిన పొదిల నరసమ్మ (80)కు ఇద్దరు కూతుళ్లు. పిల్లల చిన్న తనంలోనే భర్త చనిపోగా కష్టపడి ఆడపిల్లలను పెంచి పెద్ద వాళ్లని చేసింది. ఇటీవల అనారోగ్యంతో ఉన్న నరసమ్మ తన చిన్న కూతురు కళమ్మ ఇంటికి తనవద్ద ఉన్న ఆరు తులాల బంగారం, కొంత నగదు, వెండి వస్తువులను వెంట తీసుకెళ్లింది. మంగళవారం సాయంత్రం నరసమ్మ అనారోగ్యంతో మృతిచెందింది.దీంతో అంత్యక్రియలు చేసేందుకు మృతదేహాన్ని ఆత్మకూర్‌కు తీసుకొచ్చారు. అయితే నరసమ్మ వద్ద ఉన్న నగదు, బంగారం, వెండి వస్తువుల గురించి ఇద్దరు కూతుళ్లు వివాదానికి దిగారు. అంత్యక్రియలు చేయకుండానే చిన్న కూతురు కళమ్మ వెళ్లిపోయింది. నరసమ్మ వద్ద ఉన్న నగదు, బంగారం, వెండి తెచ్చే వరకు అంత్యక్రియలు చేసేది లేదని పెద్ద కూతురు వెంకటమ్మ పట్టుపట్టింది. బంధువులు నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోవడంతో గురువారం స్థానిక ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని వెంకటమ్మ కుటుంబ సభ్యులకు సర్దిచెప్పడంతో అంత్యక్రియలు నిర్వహించారు. -
హైదరాబాద్ నిమ్స్‌లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరుకాగా.. ఇవాళ(అక్టోబర్ 17, శుక్రవారం) ఉదయం ఆపరేషన్ థియేటర్లో వైద్య విద్యార్థి నితిన్ విగతజీవిగా పడి ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లొంగిపోనున్న మరో కీలక దళం నేత! ఎవరంటే..
వరుస బెట్టి అన్నలు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. కేంద్ర హోం శాఖ ఆపరేషన్ కగార్ ప్రభావంతో.. కీలక నేతలు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. ఈ ఏడాది మే 21న సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ చత్తీస్‌గఢ్‌లోని అబుజ్మాద్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే పార్టీ అంతర్గతంగా గందరగోళానికి లోనవుతూ వస్తోంది. ఆపరేషన్ కగార్(Operation kagar)తో మావోయిస్టు శిబిరాల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. బస్వరాజ్ మరణం తర్వాత CPI (మావోయిస్టు)లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ ఆంతర్గత విభేదాలు బయటపడడం, కీలక నేతల ఆరోగ్య సమస్యలు లొంగుబాటుకు కారణాలవుతున్నాయి. దీనికి తోడు భద్రతా దళాల ఒత్తిళ్ల కారణంగా అగ్రనేతలు వరుసగా లొంగిపోతున్నారు. తాజాగా కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆశన్న ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట శుక్రవారం లొంగిపోయారు. జగదల్పూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో 208 మావోయిస్టులతో కలిసి ఆయన ఆయుధాలు అప్పగించారు. మొత్తం 153 తుపాకులు అగప్పించగా.. లొంగిపోయినవాళ్లలో 110 మంది మహిళా మావోయిస్టులు ఉండడం గమనార్హం. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత ఆశన్న(రెడ్ సర్కిల్లో)ఆశన్న అసలు పేరు తక్కపల్లి వాసుదేవరావు. ములుగు జిల్లా వెంకటాపురం ఆయన స్వస్థలం. బైరంగూడా అడవుల్లో దశాబ్దాలుగా అండర్‌గ్రౌండ్‌గా జీవనం కొనసాగిస్తూ వచ్చారు. 2003లో చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి, మాజీ మంత్రి మాధవరెడ్డి, IPS అధికారి ఉమేశ్ చంద్ర హత్యలకు ప్రధాన సూత్రధారిగా ఆయనకు పేరుంది. అలాంటి కీలక నేత లొంగుబాటును మావోయిస్టులకు భారీ దెబ్బ అనే చెప్పొచ్చు. లొంగిపోవాలని నిర్ణయించుకున్న వాళ్లు తనను సంప్రదించవచ్చని తన చివరి ప్రసంగంలో ఆయన దళ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..మల్లోజుల, ఆశన్న.. రేపు ఎవరా? అనే చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మావోయిస్ట్ పార్టీకి మరో ఝలక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్(Bandi Prakash) లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి ద్వారా లొంగుబాటు యత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, అశోక్, క్రాంతి.. స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. ప్రకాశ్ తండ్రి సింగరేణి కార్మికుడు. 1982–84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) తరఫున పోరాడారు. ఆపై మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేదా డీజీపీ లేకుంటే స్థానిక పోలీసుల ఎదుట బండి ప్రకాశ్ లొంగిపోయే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. 2026 మార్చి కల్లా మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ కగార్‌ను ఉధృతం చేశారు. గత రెండేళ్లలో దేశంలో వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలి ఉండగా.. అందులో 8 మంది తెలంగాణ నుంచే ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: ఆ ఒక్కడి లెక్క తేలిస్తే మావోయిస్టు పార్టీ ఖతమైనట్లే! -
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చర్చించి చెప్పాలని హైకోర్టు పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కాగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నెల 9 న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేయగా.. నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నిన్న సుప్రీం కోర్టు కూడా ఎన్నికలకు వెళ్లమని చెప్పింది కదా అంటూ వ్యాఖ్యానించింది. ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓరల్‌గా మాత్రమే చెప్పిందని.. ఆర్డర్లో ఎక్కడా చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అన్నారు.నిన్ననే(అక్టోబర్ 16, గురువారం) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని కోర్టుకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టే దాన్ని సస్పెండ్ చేశాం. ఫ్రెష్ గా రిజర్వేషన్ లను గూర్చి ప్రభుత్వంతో చర్చించాకే రీ నోటిఫికేషన్ ఉంటుంది. రెండు వారాల సమయం కావాలంటూ కోర్టును స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. -
లొంగిపోయే ముందు ఆశన్న చివరి ప్రసంగం.. ఏమన్నారంటే?
భద్రాద్రి కొత్తగూడెం: లొంగిపోయే ముందు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న చివరిసారిగా తన సహచర మావోయిస్టులకు భావోద్వేగ ప్రసంగం ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలు వదిలిపెడుతున్నామని.. ఇది లొంగుబాటు కాదు.. జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని ప్రభుత్వం ఒప్పుకుందని ఆయన అన్నారు. ఎవరికి వారే తమ రక్షణ కోసం ఇప్పుడు పోరాటం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు.‘‘ఎవరైనా లొంగిపోవాలనుకుంటే నన్నుకాంటాక్ట్ చేయండి. సహచరులందరూ ఎక్కడవాళ్లు అక్కడే లొంగిపోవడం మంచిది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే జనజీవన స్రవంతిలో కలుస్తున్నాం. జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజల కోసం పోరాటం చేస్తాం. ఉద్యమంలో అమరులైన వారందరికీ జోహార్లు’’ అంటూ ఆశన్న ప్రసంగించారు.కాగా, అడవిని వీడి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆశన్న ఛత్తీస్‌గఢ్ మీడియాతో మాట్లాడారు. ఇకపై తమ పోరాటం రాజ్యాంగానికి లోబడి కొనసాగుతుందన్నారు. తాము సాయుధ పోరాటానికి మాత్రమే విరమణ ఇచ్చామని, ఇకపై శాంతియుగ మార్గంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘శాంతి చర్చల కోసం ప్రజా సంఘాలు, మేధావులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో సాయుధ పోరాటానికి విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.ఈ సందర్భంగా మేము పెట్టిన ప్రధాన షరతుల విషయంలో ప్రభుత్వ స్పందన సానుకూలంగా ఉంది. గతంలో మా పార్టీ, అనుబంధ సంఘాల్లో పని చేశారనే ఆరోపణలపై పోలీసులు జైళ్లలో పెట్టిన వారిని వెంటనే విడుదల చేయాలి. దీంతోపాటు మూలవాసీ బచావో మంచ్ సంస్థపై నిషేధాన్ని ఎత్తివేయాలి. ఆ సంస్థలో పనిచేస్తున్నారనే ఆరోపణలతో పెట్టిన కేసులు ఎత్తివేయాలి. ఇకపై మూలవాసీ బచావో మంచ్ వంటి సంస్థల ద్వారా చట్టబద్ధంగా మా పోరాటం కొనసాగిస్తాం. మేము కేవలం సాయుధ పోరాటానికే విరమణ ఇచ్చాం తప్పితే లొంగిపోలేదు. మా పోరాటం ఆపేది లేదు. జనజీవన స్రవంతిలో కలిసినవాళ్లు ప్రభుత్వ పోలీసు విభాగమైన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ)లో చేరబోమని స్పష్టం చేశాం’అని ఆయన వెల్లడించారు. -
సజ్జనార్ ఎఫెక్ట్.. ఆ చిల్లర ఇంటర్వ్యూలు డిలీట్!
ఇటీవల కాలంలో యూట్యూబ్ చానళ్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. దీంతో పాటు ఇతర సోషల్ మీడియాలోనూ పోటీ పెరిగిపోయింది. ఎవరికి వారు లైకులు, షేర్లు, వ్యూస్ కోసం వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. కొందరైతే విశృంఖలానికి తెర లేపుతున్నారు. ఈ క్రమంలో.. ఇంటర్వ్యూల పేరుతో మైనర్లను ఎంచుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు, చేష్టలు చేయిస్తున్నారు. తాజాగా ఓ మైనర్ జంట ఇంటర్వ్యూ సో.మీ. ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా వైరల్ అయ్యింది. ఓ షార్ట్‌ఫిల్మ్/ఆల్బమ్ చేసిన జంట అందులో ముద్దు సీన్ చేయడంపై యాంకర్ ప్రశ్నిస్తాడు. అయితే ఆ బాలిక దాంట్లో ఏముంది? ఇప్పుడు కూడా పెట్టేస్తా.. అంటూ ఇంటర్వ్యూలో బరితెగించి ఓవరాక్షన్‌కు దిగింది. ఈ పరిణామంతో యాంకర్ షాక్ కావడం.. మీమ్స్, ఫన్నీ ఎడిట్ వీడియోల రూపంలోనూ వైరల్ అయ్యింది. అయితే ఈ తరహా ఇంటర్వ్యూలు, వీడియోల వ్యవహారంపై నగర పోలీస్ బాస్ వీసీ సజ్జనార్ కన్నెర్ర చేశారు. మైనర్ల అభ్యంతరకరమైన వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్ యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్ట్రాగామ్ తదితర సోషల్‌మీడియాల్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వీడియోలు, ఇంటర్వ్యూలను అధ్యయనం చేస్తూ పోక్సోతో పాటు కిడ్నాప్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సజ్జనార్ హెచ్చరికల నేపథ్యంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లపై సిటీ పోలీసుల నజర్ పెరిగింది. మైనర్లతో అభ్యంతరకర వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి వీడియోలను చేసేవాళ్లనే కాదు, అప్లోడ్ చేస్తున్నవాళ్లను, మీమ్స్ పేరిట పరోక్షంగా ప్రమోట్ చేస్తున్నవాళ్లను కూడా వదిలిపెట్టబోమని పోలీసులు అంటున్నారు. అంతా అల్గారిథమ్ మహిమ!ఇటీవల కాలంలో సోషల్‌మీడియా ఖాతాలు, ఈ–కామర్స్ వెబ్సైట్లు తదితరాలన్నీ ప్రత్యేక ఆల్గరిథెమ్ ఆధారంగా పని చేస్తున్నాయి. ఈ ఆల్గరిథెమ్ సదరు వ్యక్తి ఏ తరహా కంటెంట్‌ను వీక్షిస్తున్నారు? ఎలాంటి వస్తువులు ఖరీదు చేస్తున్నారు? సెర్చ్ చేస్తున్నారు? అనే అంశాలను అధ్యయనం చేస్తుంది. ఐపీ అడ్రస్, మెయిల్ ఐడీ ఆధారంగా జరిగే ఈ ప్రక్రియలో ఆ వ్యక్తికి అదే తరహా కంటెంట్, ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలు, యాప్స్ పదేపదే పంపిస్తుంది. ఈ కారణంగా ఇలాంటి వీడియోలు, రీల్స్‌ను పొరపాటున మైనర్లు ఒక్కసారి వీక్షిస్తే చాలు.. వారికి పదేపదే అదే తరహావి కనిపిస్తాయి. వ్యూస్ కోసం విలువలు వదిలేస్తారా? వ్యూస్, లైక్స్‌తో పాటు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తును ఫణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం? ఇది విలువలను వదిలేయడంతో సమానం. మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు. అలా చేయడం బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు..చట్టరీత్యా నేరం. బాలబాలికల్ని ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషనే అవుతుంది. ఇప్పటికే ఉన్న కంటెంట్‌ను తొలగించకున్నా, భవిష్యత్తులో అప్లోడ్ చేసినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇలాంటి వీడియోలు, రీల్స్ గమనిస్తే 1930కు ఫోన్ చేసి లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయండి. పిల్లల బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం కూడా తల్లిదండ్రుల బాధ్యతే.వీసీ సజ్జనార్, నగర కొత్వాల్ పోక్సోతో పాటు కిడ్నాప్ కేసు కూడా! ప్రేమ, పెళ్లి, భాగస్వామ్యం తదితర అంశాలపై మైనర్లలో సరైన అవగాహన పెరిగేలా, వారు పెడదారి పట్టకుండా వీడియోలు రూపొందిస్తే ఇబ్బంది ఉండదు. అయితే మైనర్ల ప్రేమ వ్యవహారాలు, ముద్దుమచ్చట్లను రీల్స్, వీడియోలు, ఇంటర్వ్యూలుగా చిత్రీకరించి మరింత మందిని పెడదోవ పట్టించడం నేరమే అవుతుంది. ఈ వీడియోలతో పాటు వాటిలో మైనర్లు, యాంకర్లు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో పోక్సో యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద యాంకర్లు, నిర్వాహకులపై కేసులు నమోదు చేయవచ్చు. ఈ ఇంటర్వ్యూల కోసం ఆ మైనర్లను వివిధ ప్రాంతాల నుంచి మరో ప్రాంతానికి తరలించడమూ నేరమే. దీనికి సంబంధించి కిడ్నాప్ కేసు నమోదు చేసే అవకాశమూ ఉంది. ఇవన్నీ పరిశీలించిన కొత్వాల్ సజ్జనర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై గురువారం కొత్వాల్ ‘ఎక్స్’ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఇవి చూసిన అనేక మంది తమ వీడియోలు, రీల్స్, ఇంటర్వ్యూలను డిలీట్ చేస్తుండటం గమనార్హం.:::సాక్షి, సిటీబ్యూరో -
మనకు నాసి... పొరుగుకు వాసి
సాక్షి, హైదరాబాద్: అవి రెండూ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలే. కానీ ఒక సంస్థ మరో సంస్థపై వివక్ష చూపుతోంది. వాటిలో ఒకటి సింగరేణి.. మరొకటి టీజీజెన్కో. నాసిరకం బొగ్గుతో ఒక సంస్థ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయలేక.. ఉత్పత్తి కేంద్రాలను బలవంతంగా మూసుకోవాల్సిన దుస్థితి. తెలంగాణ విద్యుదుత్పాదనకు నాసిరకం బొగ్గు సరఫరా చేస్తూ.. పొరుగు రాష్ట్రాలకు సింగరేణి మేలు రకం బొగ్గు అందిస్తోంది. దీనిపై జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ స్వయంగా సింగరేణి సీఎండీకి రెండు రోజుల క్రితం సుదీర్ఘ లేఖ రాశారు.నాణ్యత లేని బొగ్గుతో రాష్ట్ర విద్యుత్ సంస్థలు సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వాటిని బ్యాక్‌డౌన్ చేయడం లేదా సామర్థ్యం తగ్గించుకుని ఉత్పత్తి చేయడం వల్ల బొగ్గు వినియోగం పెరుగుతోందని, తద్వారా తమ పై భారం పడుతోందని చెప్పారు. జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఉపయోగించే బొగ్గు మొత్తం (ఏటా 28.872 మిలియన్ టన్నులు) సింగరేణి నుంచే కొనుగోలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తక్కువ గ్రేడ్ రకంతో ఇబ్బందులుకేటీపీఎస్–6 (500 మెగావాట్లు), కేటీపీఎస్–7 (800 మెగావాట్లు), కేటీపీపీ–1 (500 మెగావాట్లు), బీటీపీఎస్ (4 ్ఠ270 మెగావాట్లు), వైటీపీఎస్ (800 మెగావాట్లు) తదితర థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నత శ్రేణి బొగ్గు వినియోగించేలా రూపొందించినవని జెన్కో సీఎండీ లేఖలో చెప్పారు. ఒప్పందం ప్రకారం కాకుండా తక్కువ గ్రేడ్ బొగ్గు సరఫరా వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు.దీంతో సామర్థ్యాన్ని తగ్గించుకొని ఉత్పత్తి చేయడం, బాయిలర్స్ దెబ్బతినడం, త్వరగా యంత్రాలు వేడెక్కడం, అధికంగా బూడిద రావడం లాంటివి జరుగుతున్నాయన్నారు. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి లో నష్టం వాటిల్లుతోందని చెప్పారు. అదే ఏపీలోని రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్‌కు, అలాగే తమిళ నాడులోని థర్మల్ కేంద్రాలకు మాత్రం నాణ్యమైన బొగ్గు సరఫరా చేస్తున్నారని ఆక్షేపించారు. 85% పీఎల్ఎఫ్ తగ్గితే..రాష్ట్ర విద్యుత్ నియంత్రణ జెన్కో థర్మల్ కేంద్రాలకు 85 % పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధారణంగా నిర్ధారించిన దానికంటే తగ్గితే ఆ మేరకు ఫిక్స్డ్ చార్జీలు తగ్గుతాయని సంస్థ సీఎండీ పేర్కొన్నారు. బ యటి రాష్టాలకు మేలైన బొగ్గు సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, రాష్ట్రంలో సింగరేణి గనులు ఉన్నందున జెన్కోకు నాణ్యమైన బొగ్గు సరఫరా చే యాలని జెన్కో సీఎండీ కోరారు. పెరుగుతున్న డి మాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే.. ఉన్నతశ్రేణి బొగ్గు సరఫరా చేయాలన్నారు. -
పెద్దల వద్దకు ‘కొండా’ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణా మాలు కలకలం రేపాయి. కొంతకాలంగా నెల కొన్న వివాదం గురువారం రాత్రి వరకు కొన సాగింది. పరిస్థితి మరీ దిగజారి రచ్చకెక్కకుండా పార్టీ పెద్దలు అతికష్టం మీద నియంత్రించగలి గారు. తనను లక్ష్యగా చేసుకొని పార్టీలో, మంత్రివర్గంలో కుట్రలు జరుగుతున్నాయని భావిస్తున్న మంత్రి సురేఖ గురు వారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశ మై తన వాదన వినిపించారు.అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌తో కూడా చర్చించారు. తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా తన దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీని ప్రభుత్వం తొలగించడాన్ని అవమానకరంగా భావించినట్లు ఆమె వారికి తెలిపినట్లు సమాచారం. పార్టీలో తనపై జరుగుతున్న దాడి గురించి మీనాక్షికి వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరు కాలేదు. పార్టీ పెద్దల నిర్ణయమే శిరోధార్యం: కొండా మీనాక్షి నటరాజన్‌తో సమావేశం అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘తాజా పరిణామాలపై పార్టీ ఇన్చార్జి, పీసీసీ అధ్యక్షుడు మహేష్మార్ గౌడ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపినం. ఈ విషయంలో పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు. సమస్యను పార్టీ పెద్దలు సెటిల్ చేస్తా మని చెప్పారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసా ఉంది’అని పేర్కొన్నారు. నివురుగప్పిన నిప్పులా పరిస్థితి..వరంగల్‌లో మంత్రి పొంగులేటి దేవాదాయ శాఖకు సంబంధించిన కాంట్రాక్టు వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ లేకుండానే సమావేశం జరగడం, ఆ తరువాత సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను తొలగించడంతో వివాదం ముదిరింది. మేడారం అభివృద్ధి పనులను దేవా దాయ శాఖ నుంచి రోడ్లు, భవనాల శాఖకు బదలాయించడంతో మంత్రి సురేఖ ప్రమేయం లేకుండానే పనులు జరుగుతున్నాయి. పోలీసులతో వాగ్వాదానికి దిగిన మంత్రి కుమార్తె సుష్మిత.. సీఎం పలువురు మంత్రులపై నేరుగా విమర్శలు చేశారు. బీసీ నాయకురాలైన తన తల్లి పట్ల ఓ వర్గం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం సృష్టించాయి. -
ఇంజనీరింగ్ ఫ్యాకల్టీకి ఈ-పాఠాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల బోధన ప్రమాణాలు మెరుగు పర్చాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూచించింది. కాలానుగుణంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలని పేర్కొంది. దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఈ మేరకు లేఖ రాసింది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్‌లో కొత్తగా వచ్చిన డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఎమర్జింగ్ కోర్సులపై దృష్టి పెట్టాలని తెలిపింది. దేశంలో ఏటా 12.53 లక్షల మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు.ఇందులో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరేవారే 68 శాతం ఉంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ కోర్సులు చేస్తున్నవారు 3.90 లక్షల మంది ఉండగా, వీరిలో కనీసం 50 వేల మందికి కూడా స్కిల్ ఉద్యోగాలు రావడం లేదు. ఏఐ కోడింగ్, సైబర్ సెక్యూరిటీ మాడ్యూల్స్‌పై పట్టు ఉండటం లేదు. బోధన మెళకువలు లోపించడమే ఈ పరిస్థితి కారణంగా ఏఐసీటీఈ భావిస్తోంది. అధ్యాపకులకు కొత్త కోర్సులపై తాజా టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశం ఉండటం లేదు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు.అప్‌గ్రేడ్‌కు అనేక మార్గాలుకొత్త ఎమర్జింగ్ కోర్సుల్లో మాస్టర్ డిగ్రీ చేసినవారు ఉండటం లేదు. అయితే, ప్రొఫెషనల్స్‌కు దీనిపై ఎక్కువ పరిజ్ఞానం ఉంటోంది. ఉదాహరణకు ఏఐఎంఎల్ సబ్జెక్టు బోధించే అధ్యాపకులకన్నా, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారికి కొత్త టెక్నాలజీ తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి వారిని ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ క్లాసుల ద్వారా అధ్యాపకులకు కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించాలని ఏఐసీటీఈ సూచించింది.క్లౌడ్, డేటాపై పట్టు కోసం డేటా సెంటర్స్‌లో పనిచేసే ప్రొఫెషనల్స్ సహకారం తీసుకోవాలి. సైబర్ సెక్యూరిటీ కోర్సు బోధించేవారు కొత్తగా వస్తున్న సైబర్ నేరాలు, సెక్యూరిటీ ఆప్షన్స్‌ను తెలుసుకోవడా నికి దర్యాప్తు సంస్థల్లో నిపుణుల సహకారం తీసుకోవాలి. వీటితో పాటు ఐఐటీ, ఎన్ఐటీ సంస్థలు ఎమ ర్జింగ్ కోర్సులపై అంతర్జాతీయ టెక్నా లజీని అందిపుచ్చుకుంటున్నాయి. ఆయా సంస్థల్లో పనిచేసే అధ్యాపకుల చేత క్లాసులు తీసుకోవడం ప్రయోజ నకరంగా ఉంటుంది.వీటిపై పట్టు అవసరం⇒ బోధన టెక్నాలజీ వినియోగంలో డిజిటల్ టూల్స్ వాడకంపై అధ్యాపకులకు అవగాహన అవసరం. గూగుల్ క్లాస్ రూం, ఎల్ఎంఎస్ ప్లాట్‌ఫాం, ఆన్లైన్ క్లాస్ నిర్వహణ, ఇంటరాక్టివ్ క్లాసులు తీసుకోవడం వంటి కోర్సులపై స్వయం, కోర్సెరా, ఎన్పీటెల్ వంటి సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి.⇒ ఆధునిక బోధన పద్ధతులను అనుసరించే విధానం పెరగాలి. వీడియో లెక్చర్లు, వర్చువల్ ల్యాబ్స్, రిమోట్ ఎక్స్పర్మెంట్, ఆన్లైన్ అసైన్మెంట్ వంటి కోర్సులను ఎన్ఐటీటీఆర్ అనే సంస్థ అందిస్తోంది.⇒ ఏఐఎంఎల్, డేటాసైన్స్ టూల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి సాంకేతిక స్కిల్స్ ఆప్డేట్ కోర్సులను ఐఐటీలు, ఇస్రో వంటి సంస్థలు అందిస్తున్నాయి.⇒ స్టాన్‌ఫర్డ్, గూగుల్, ఐబీఎం వంటి సంస్థలు కూడా సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసేలా యూనివర్సిటీలు అధ్యాపకులను ప్రోత్సహించాలి. దీంతోపాటు పారిశ్రామిక భాగస్వామ్యంతో కొత్త టెక్నాలజీని నేర్చుకునేలా చేయాలని ఏఐసీటీఈ సూచించింది. -
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు అనర్హులన్న నిబంధనను ఎత్తివేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ట నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీఎం, మంత్రులు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఈ నిబంధనను తొలగించాలన్న డిమాండ్లు రావడంతో అందుకనుగుణంగా కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించింది.ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సడలింపుతోనే స్థానిక ఎన్నికలను నిర్వహించనున్నారు. మంత్రివర్గ వివరాలను రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మీడియాకు వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా.. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచి్చన స్టేను సవాల్ చేస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు పొంగులేటి చెప్పారు. తీర్పు ప్రతిని పరిశీలించాకే దీనిపై ఒక ని ర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఈలో గా న్యాయ నిపుణులు నివేదిక ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈనెల 23న మళ్లీ కేబినెట్ సమావేశం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈలోగా బీసీ సంఘాలతో చర్చించి ప్రభుత్వం వచ్చే మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. మెట్రోపై సీఎస్ అధ్యక్షతన అధికారుల కమిటీ.. మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని పొంగులేటి చెప్పారు. రూ.36 వేల కోట్లతో మెట్రో 2ఏ, 2బీ విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ విధానంలో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వా«దీనం చేసుకునే విషయంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందన్నారు. మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వా«దీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయ నం చేసేందుకు సీఎస్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించామన్నారు.ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక శాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్య దర్శి, మెట్రో రైలు ఎండీ, పట్టణ రవాణా సలహాదారుతో కమిటీ నియమించాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే కేంద్రానికి సవివర నివేదిక అందించినా మొదటి దశకు అడ్డంకిగా కేంద్రం కొర్రీలు వేసిందని చెప్పారు. సీఎస్ అధ్యక్షతన కమిటీ తమ నివేదికను డిప్యూటీ సీఎం నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి అందిస్తుందన్నారు. కేబినేట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వా«దీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించినట్లు చెప్పారు. ప్రతీ గింజా కొంటాం.. ఈసారి వానాకాలంలో దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడానికి కేబినెట్ నిర్ణయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచి్చందని, అయితే అదనంగా మరో 15 నుంచి 20 లక్షల మెట్రిక్ టన్ను లు తీసుకోవాలని హైకోర్టు నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్రం అంగీకరించినా, అంగీకరించకోయినా ప్రభుత్వం ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామన్నారు. ఎస్ఎస్పీతోపాటు సన్నాలకు అదనంగా క్వింటాల్‌కు రూ. 500 బోనస్ చెల్లిస్తామన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేయాలని నిర్ణయించామన్నారు. శ్రీశైలం ఎలివేటెడ్ రహదారికి ఓకే.. మన్ననూరు నుంచి శ్రీశైలం వెళ్లడానికి నల్లమల్ల అటవీ ప్రాంతంలో హైలెవల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 75 కి.మీకు రూ. 7500 కోట్ల వ్యయమవుతుందని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదించింది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. మూడు కొత్త వ్యవసాయ కళాశాలలు కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలలు ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. హుజూర్నగర్, కొడంగల్, నిజామాబాద్‌లో వీటిని ఏర్పాటు చేస్తారు. నల్సర్ యూనివర్సిటీకి ఇప్పుడున్న చోట అదనంగా ఏడు ఎకరాల కేటాయించడానికి ఆమోదం తెలిపింది. నల్సార్ ప్రవేశాల్లో ప్రస్తుతం తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతానికి పెంచాలని కేబినెట్ తీర్మానించింది. రెండేళ్ల ఉత్సవాలకు కేబినెట్ కమిటీ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన –ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఉత్సవాల నిర్వహణ.. సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్ అండ్ బీ హ్యామ్ రోడ్లకు ఓకే.. మండలం–జిల్లా–రాజధాని వరకు ఆర్ అండ్ డీ ఆధ్వర్యంలో నిర్మించనున్న 5566 కి.మీ. రహదారులకు రూ. 10,547 కోట్లతో నిర్మించడానికి వీలుగా టెండర్లు పిలవడానికి మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గం నుంచి వెళ్లేలా వికారాబాద్–కృష్ణా రైలు మార్గానికి అవసరమైన భూ సేకరణ చేయాలని కేబినెట్ ఆదేశించింది. మొత్తం 845 హెక్టార్ల కోసం రూ. 438 కోట్లు మంజూరు చేసింది.సురేఖ వ్యవహారం టీకప్పులో తుపాను మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో చిట్‌చాట్ చేస్తూ.. సురేఖ వ్యవహారంపై స్పందించారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయని, ఇది టీకప్పులో తుపాను లాంటిదన్నారు. అయితే, మీరు దాన్ని సముద్రంలో తుపానుగా మార్చారని, త్వరలో అన్నీ సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు. -
సమాధానం ఇచ్చినా.. పదేపదే నోటీసులా?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘సమాధానం ఇచ్చినా.. పదేపదే నోటీసులు ఇవ్వడం అంటే మీడియా గొంతు నొక్కడమే’అని సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి విమర్శించారు. ఏపీ ప్రభుత్వ అరాచకపాలన, దమనకాండకు ఇదే నిదర్శనమన్నారు. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ గురువారం రాత్రి హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో జర్నలిస్టులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘మీడియాపై కేసులా? సిగ్గు..సిగ్గు, రెడ్‌బుక్ పాలన మాకొద్దు.. చంద్రబాబు నిరంకుశ విధానం నశించాలి’అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎడిటర్ ధనంజయరెడ్డి మాట్లాడుతూ పత్రికాస్వేచ్ఛపై దాడి.. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. అక్రమ కేసులు, పదే పదే నోటీసుల జారీతో జర్నలిస్టుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన హెచ్చరించారు. ఐదు రోజుల నుంచి కేవలం ఒక్క కేసులోనే నాలుగైదు నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యక్తి∙స్వేచ్ఛ అన్నా, పత్రికా స్వేచ్ఛ అన్నా, జర్నలిస్టుల హక్కులన్నా గౌరవం లేదని విమర్శించారు. 16 నెలలుగా కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై తీవ్రమైన దమనకాండను కొనసాగిస్తోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. నకిలీ మద్యంపై రాసిన కథనాలకు ఆధారాలు చూపాలంటూ, సమాచారం ఇచ్చిన సోర్స్ సహా రాసిన విలేకరుల పేర్లు చెప్పాలని తీసుకొస్తున్న ఒత్తిళ్లకు సాక్షి మీడియా భయపడబోదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ కుట్రలను న్యాయస్థానాల ద్వారా తిప్పి కొట్టనున్నట్టు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండను ఎదుర్కొనేందుకు ప్రజా సంఘాలు, జర్నలిస్టులంతా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. సాక్షి మీడియాపై పెట్టిన తప్పుడు కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. -
నీటి కాలుష్యానికి రోబోలతో చెక్
సాక్షి, హైదరాబాద్: భూగర్భ తాగు నీటి జల మార్గాలలో కాలుష్య మూలాలు, లీకేజీలను త్వరితగతిన గుర్తించి సత్వరమే సమస్యను పరిష్కరించేందుకు జలమండలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసే అత్యాధునిక రోబోలను రంగంలోకి దించింది. ఇవి నేరుగా పైపుల్లోకి వెళ్లి లీకేజీలను, కలుషితాలను గుర్తిస్తాయి. చెన్నైకి చెందిన సోలినాస్ ఇంటిగ్రిటీ డీప్‌టెక్ సంస్థ ఎండోబోట్.. స్వాస్థ్ సాంకేతికతతో వీటిని రూపొందించింది. సుమారు 70 ఎంఎం నుంచి 250 ఎంఎం డయా పైప్లైన్లలో ఈ రోబోలు సాఫీగా పనిచేస్తాయి. పైప్‌లైన్‌లో కాలుష్య కారకాలు కలిసే ప్రాంతం, పైప్‌లైన్ జీవితకాలం, అక్రమ ట్యాపింగ్ తదితర కీలక సవాళ్లను ఈ రోబోలు గుర్తిస్తున్నాయి. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా నాలుగు డివిజన్లలో మూడు రోబోలను ప్రవేశపెట్టారు. 132 ప్రాంతాల్లో నీటి కాలుష్యంపై వచ్చిన ఫిర్యాదులను నెలరోజుల్లోనే ఈ రోబోలతో పరిష్కరించినట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. అక్రమ కనెక్షన్ల గుర్తింపుహైదరాబాద్లో భూగర్భ నీటి సరఫరా వ్యవస్థలో సమస్యలు తలెత్తి తరచూ నీరు కాలుష్యమవుతోంది. పైప్లైన్లలో లీకేజీలతో ఈ సమస్య వస్తోంది. అయితే, భూగర్భంలో ఈ కలుషిత మూలాలను గుర్తించడం జలమండలికి తలకు మించిన భారంగా మారింది. తరచూ రోడ్లపై గుంతలు తవ్వాల్సి వస్తోంది. రెండేళ్ల క్రితం ట్రెంచ్‌లెస్ టెక్నాలజీ కెమెరాతో కూడిన అధునాతన ‘క్విక్ ఇన్స్పెక్షన్ వాటర్ పొల్యూషన్ సిస్టం (క్యూఐడబ్ల్యూపీఎస్) యంత్రాలను పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వినియోగించారు. కానీ, ఆ యంత్రానికి ఉండే కెమెరా చెడిపోవటం, కేబుల్ సమస్య, పాడైన పరికరాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో ఆర్థికంగా భారంగా మారింది. దీంతో వాటి స్థానంలో రోబోలను ప్రవేశపెడుతున్నారు. ఇవి పైప్‌లైన్ లోపల తిరుగుతూ సమస్యను కనుగొంటాయి. జీఐఎస్ మ్యాపింగ్‌తో ఆ పైప్‌లైన్ మార్గంలో ఉన్న వాటర్ కనెక్షన్ల సమగ్ర సమాచారాన్ని అందిస్తాయి. దీంతో అక్రమ, సక్రమ కనెక్షన్ల సమాచారం కూడా రికార్డు అవుతోంది. ఈ రోబోలకు లైట్‌తో కూడిన ‘హై రిజల్యూషన్ కెమెరా’ఉంటుంది. దానిని పైపులై¯న్లోకి పంపించి భూ ఉపరితలంపై ఉండే మానిటర్లో పరిస్థితిని ప్రత్యక్షంగా చూడవచ్చు. రోబో గుర్తించే దృశ్యాలతో వీడియో సైతం రికార్డు అవుతోంది. దీంతో కాలుష్యమూలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి అక్కడ మాత్రమే రోడ్డును తక్షణం రిపేర్లు చేసేందుకు వీలవుతోంది. సత్ఫలితాలు ఇస్తే రోబోటిక్స్ సేవలు విస్తరిస్తాంపైప్లైన్లలో కాలుష్య మూ లాలను గుర్తించేందుకు ఏఐ రోబోలను ప్రయోగిస్తున్నాం. సమస్య ఎక్కడ ఉందో గుర్తించి అక్కడే రోడ్డు, పైప్‌లైన్ కట్‌చేసి మరమ్మతులు చేస్తున్నాం. ప్రస్తు తం పైలట్ ప్రాజెక్టుగా నాలుగు డివిజన్లలో అమలు చేస్తున్నాం. సత్ఫలితాలు వస్తే అన్ని డివిజన్లలో వీటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. – మాయంక్ మిట్టల్, ఈడీ, జలమండలి -
దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దీపావళి, ఛట్ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడప నున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తిరుపతి–సికింద్రాబాద్ (07497/ 07498), విజయవాడ–సికింద్రాబాద్ (0721 3/07214) మధ్య ఈ నెల 17, 18 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. అలాగే హైదరాబాద్–భువనేశ్వర్ (07165/07166) ఎక్స్‌ప్రెస్ నవంబర్ 4వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాకపోకలు సాగించనుంది. -
కొత్త వైద్య కళాశాలలు ఇలానా?
సాక్షి, హైదరాబాద్: దేశంలో కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు, శిక్షణ ప్రమాణాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని తేలింది. వైద్య విద్యార్థులకు బోధించే నిపుణులైన ప్రొఫెసర్లు, ప్రాక్టికల్ శిక్షణ అందించే ప్రొఫెసర్లు పూర్తిస్థాయిలో లేరని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లతో నిర్వహించిన ఫైమా–రివ్యూ మెడికల్ సిస్టం (ఆర్ఎంఎస్) సర్వేలో వైద్య కళాశాలల్లోని లోపాలు వెలుగుచూశాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 2 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. అందులో 90.4 శాతం మంది ప్రభుత్వ కాలేజీలు, 7.8 శాతం మంది ప్రైవేట్ కాలేజీలకు చెందినవారు ఉండగా, ప్రముఖ వైద్య విద్యాసంస్థలైన ఎయిమ్స్, పీజీఐ, జిప్‌మార్ వంటి కళాశాలలకు చెందిన వైద్యులతోపాటు ఆండమాన్ నికోబార్ దీవులకు చెందిన వైద్యులు కూడా పాల్గొనడం విశేషం. మౌలిక వసతుల కొరత, బోధనలో నిర్లక్ష్యం కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల్లో పూర్తిస్థాయిలో పేషెంట్ ఎక్స్పోజర్ లేదని తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 89.4 శాతం మంది మౌలిక వసతుల లేమి..వైద్యవిద్య ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లో పేషెంట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నా, పాలనా భారం అధికంగా ఉందన్నారు. ప్రైవేటు కాలేజీల్లో బోధన క్రమబద్ధంగా ఉన్నా, అక్కడ మౌలిక వసతుల స్థాయి తక్కువగా ఉందని సర్వేలో స్పష్టమైంది. సర్వేలో పాల్గొన్న 71.5 శాతం మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు పేషెంట్ ఎక్స్పోజర్ ఉందని చెప్పగా, మిగతా 29.5 శాతం మంది లేరని చెప్పారు. » తరగతుల నిర్వహణలోనూ లోపాలు ఉన్నట్టు వెల్లడైంది. 54.3 శాతం మంది మాత్రమే తరగతులు క్రమం తప్పకుండా జరుగుతున్నట్టు చెప్పగా, 69.2 శాతం ల్యాబ్‌లు, పరికరాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 44.1 శాతం మంది కళాశాలల్లో స్కిల్ ల్యాబ్స్ పనిచేస్తున్నట్టు తెలిపారు. » అధ్యాపకుల విషయంలో 68.8 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు స్టైపెండ్ సగం మందికి మాత్రమే అందుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. ప్రైవేటు కళాశాలల్లో స్టైఫండ్ ఇవ్వకపోవడం దేశవ్యాప్తంగా ఉన్నట్టు తేలింది. » 73.9 శాతం మంది అధిక క్లెరికల్ పనిభారం ఉందని చెప్పగా, స్థిరమైన పనిగంటల్లోనే విద్యాబోధన ఉన్నట్టు కేవలం 29.5 శాతం మంది మాత్రమే చెప్పారు. » సిబ్బంది కొరత ఉన్నట్టు 55.2 శాతం మంది చెప్పగా, 40.8 శాతం మంది తమ కళాశాలల పరిసరాలు కలుషితమైన వాతావరణంలో ఉన్నట్టు పేర్కొన్నారు. నేషనల్ టాస్క్‌ఫోర్స్ సిఫారసులు అమలు కాలేదు 2024లో నేషనల్ టాస్‌్కఫోర్స్ జరిపిన సర్వేలో వైద్య కళాశాలల నిర్వహణ ఎలా ఉండాలనే అంశంపై కొన్ని సూచనలు చేసింది. రెసిడెంట్ డాక్టర్లు, ఇంటర్న్‌షిప్‌లకు సంబంధించి స్థిరమైన పనిగంటలు ఉండాలని, ప్రతి మెడికల్ కాలేజీకి మానసిక ఆరోగ్య కౌన్సిలర్‌ను నియమించాలని సూచించింది. ఏటా మానసిక ఆరోగ్య సమీక్షల్లో తల్లిదండ్రులను భాగస్వాములను చేయడం, 10 రోజుల సెలవు వంటి సిఫార్సులు చేసినా, వాటిలో ఒకటి రెండు మాత్రమే కొన్ని చోట్ల అమలైనట్టు సర్వేలో తేలింది. తక్షణ జోక్యం అవసరం కొత్తగా ప్రభుత్వ రంగంలో ఏర్పాటయ్యే వైద్య కళాశాలలతోపాటు ప్రైవేటు రంగంలోని ఇతర కళాశాలల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండకుండా చూసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నేషనల్ మెడికల్ కమిషన్ తక్షణ జోక్యం అవసరమని ఫైమా పేర్కొంది. ఫైమా సర్వేకు సంబంధించిన తుది నివేదికను త్వరలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎన్ఎంసీ, నీతి అయోగ్లకు సమరి్పంచనుంది. మెడికల్ విద్యార్థుల మానసిక, విద్యా సంక్షేమానికి సమగ్ర సంస్కరణలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఫైమా తెలిపింది. -
ఓటర్ల జాబితాపై జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై బీఆర్ఎస్ అభ్యర్థి సమర్పించిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ చర్యలు ప్రారంభించినందున తమ జోక్యం అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఓటర్ల నమోదు, తొలగింపు నిరంతర ప్రక్రియ అని, ఈ నెల 21 వరకు సమయం ఉన్నందున సరైన చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అత్యంత అనివార్యమైతే తప్ప న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రస్తావించింది. కోర్టు ఉత్తర్వుల కారణంగా ఎన్నికల ప్రక్రియలో జాప్యం జరగకుండా చూసుకోవాలని సుప్రీం హెచ్చరించిందని వ్యాఖ్యానించింది. ఇక ఈ పిటిషన్లో ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ విచారణ ముగించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లతోపాటు బయటి వ్యక్తుల పేర్లు చేర్చారంటూ మాగంటి సునీతతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదనలేంటంటే... పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దామ శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘బీఆర్ఎస్ అభ్యర్థి ఈసీ అధికారిక వెబ్సైట్ నుంచి ఓటర్ల జాబితాను తీసుకున్నారు. నియోజకవర్గంలో 12 వేల బోగస్ ఓట్లతోపాటు బయటి వ్యక్తులు జాబితాలో ఉన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిష్క్రియాత్మకంగా వ్యవహరిస్తోంది. అధికార పార్టీ తో కుమ్మక్కైన ఈసీ ఓటర్ల జాబితా సమగ్రతను దెబ్బతీసేలా ఎన్నికల దురి్వనియోగానికి పాల్పడింది. బోగస్ ఓట్లు తొలగించి.. నవంబర్ 11న ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా ఈసీని ఆదేశించాలి’అని చెప్పారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ‘ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ నిరంతరం సాగుతుంది. ఈ నెల 21న నామినేషన్లు పూర్తయ్యే వరకు సవరణకు అవకాశం ఉంది. జాబితాపై పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. సెప్టెంబర్ 2న ఈసీ విడుదల చేసిన ప్రాథమిక జాబితా ప్రకారం 3.92 లక్షల ఓటర్లున్నారు. సవరణల తర్వాత 6,976 మందిని కొత్తగా చేరగా, 663 మందిని తొలగించారు. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30న ప్రచురించాం. మొత్తం ఓటర్ల సంఖ్య 3.99 లక్షలు. జాబితాపై ఓటర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. 12వేల బోగస్ ఓట్లు చేర్చారన్న వాదన సమర్థనీయం కాదు’అని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈసీ చర్యలు ప్రారంభించినందున ప్రత్యేక ఉత్తర్వులు అనవసరం లేదని పేర్కొంది. పిటిషనర్లు తమ ఫిర్యాదుపై చర్యలకు వేచిచూడకుండా కోర్టును ఆశ్రయించారని చెప్పింది. -
మావోయిస్టుల లొంగుబాటు యాత్ర
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆపరేషన్ కగార్తో తీవ్ర ఒత్తిడిలో ఉన్న మావోయిస్టులు భారీ సంఖ్యలో ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌సహా 61 మంది బుధవారం లొంగిపోగా, ఛత్తీస్‌గఢ్‌లో అంతకు దాదాపు మూడింతల మంది అడవిని వీడి బయటకు రాబోతున్నారు. 170 మందికి పైగా మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయేందుకు రెండు బృందాలుగా బయలుదేరారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించారు. దండకారణ్యంలోని మడ్ అడవుల నుంచి ఒక భారీ బృందం రణిత నేతృత్వంలో అడవిని వీడి కాంకేర్ జిల్లాలోకి చేరింది. తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న నేతృత్వంలో మరో 140 మంది బృందం ఇంద్రావతి నదిని దాటి బీజాపూర్ జిల్లాలోని ఒకప్పటి మావోయిస్టుల కంచుకోట బైరాంగఢ్‌కు చేరుకోనుంది. ఇక్కడి నుంచి వీరంతా జగదల్పూర్కు చేరుకునే అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సమక్షంలో శుక్రవారం వీరంతా ప్రభుత్వానికి ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసే కార్యక్రమం జరగనుంది. సందేహాలకు తావులేకుండా..మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు సమయంలో బుధ వారం కనిపించిన దృశ్యాలు అనేక సందేహాలకు తావిచ్చాయి. మల్లోజుల బృందం చాన్నాళ్లుగా పోలీసులకు టచ్‌లో ఉన్నారని, లొంగిపోయినప్పుడు సమర్పించిన ఆయుధాలు సైతం ప్రభుత్వానివే అనే ప్రచారం సాగింది. దీంతో ఇలాంటి సందేహాలు మరోసారి తలెత్తకుండా ఆశన్న లొంగుబాటు విషయంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే 50 మందితో కూడిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జెడ్సీ) సభ్యుడు భాస్కర్, దండకారణ్యం మాడ్ డివిజన్ ఇన్చార్జి రణిత బృందం అడవిని వీడి ఆయుధాలతో బయటకు వచ్చే వీడియోలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం ఉదయం అబూజ్‌మడ్‌లోని హండావాడా జలపాతం నుంచి ఇంద్రావతి నేషనల్ పార్కు మీదుగా 140 మందికి పైగా సాయుధ మావోయిస్టులతో బయల్దేరిన ఆశన్న బృందం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రావతి నదిని దాటి ఉస్పారీ ఘాట్ మీదుగా భైరాంగఢ్ వైపుగా సాగుతోంది. ఈ బృందాల ప్రయాణం సాఫీగా సాగేలా పోలీసు శాఖ నుంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరిగాయి. వీరిలో ఎక్కువ మంది ఆలివ్ గ్రీన్ దుస్తులకు బదులుగా సాధారణ దుస్తుల్లోనే ఉన్నారు. హండావాడా జలపాతం కేంద్రంగాఅబూజ్మడ్లోని దట్టమైన అడవుల్లో ఛత్తీస్‌గఢ్ వైపు హండావాడా జలపాతం ఉంది. ఇక్కడే లొంగుబాటుకు సిద్ధంగా ఉన్న ముఖ్య నేతలు సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీ నాటికి ఏ బృందాలు ఎలా వెళ్లాలి, ఎక్కడ లొంగిపోవాలి, వెళ్లే మార్గంలో అడ్డంకులు ఎదురుకాకుండా అవసరమైన శక్తులతో ఎలా సమన్వయం చేసుకోవాలనే అంశంపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. 6వ తేదీన కేంద్ర కమిటీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు, ప్రజలకు క్షమాపణ చెబుతున్నట్టుగా మల్లోజుల నుంచి 22 పేజీల లేఖ జారీ అయింది. ఈ నెల 13న లొంగిపోయే మావోయిస్టులు అడవి నుంచి బయటకు రావడం మొదలైంది. 14న మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు మల్లోజుల బృందం చేరుకోగా, 15న ఆయన లొంగుబాటును అధికారికంగా ప్రకటించారు. అదే రోజు ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్, సుక్మా జిల్లాల్లో మరో 78 మంది లొంగిపోయారు. -
ఇకపై రాజ్యాంగ పరిధిలో పోరాటం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇకపై తమ పోరాటం రాజ్యాంగానికి లోబడి కొనసాగుతుందని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ సతీశ్ తెలిపారు. తాము సాయుధ పోరాటానికి మాత్రమే విరమణ ఇచ్చామని, ఇకపై శాంతియుగ మార్గంలో పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ఆశన్న నేతృత్వంలో దాదాపు 120 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసేందుకు గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యాన్ని వీడారు. వీరంతా ప్రభుత్వ పెద్దల సమక్షంలో శుక్రవారం లాంఛనంగా సాయుధ పోరాట బాటను వీడనున్నారు. ఈ సందర్భంగా అడవిని వీడి బయటకు వచ్చిన తర్వాత ఆశన్న ఛత్తీస్‌గఢ్ మీడియాతో మాట్లాడారు. ‘శాంతి చర్చల కోసం ప్రజా సంఘాలు, మేధావులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో సాయుధ పోరాటానికి విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా మేము పెట్టిన ప్రధాన షరతుల విషయంలో ప్రభుత్వ స్పందన సానుకూలంగా ఉంది. గతంలో మా పార్టీ, అనుబంధ సంఘాల్లో పని చేశారనే ఆరోపణలపై పోలీసులు జైళ్లలో పెట్టిన వారిని వెంటనే విడుదల చేయాలి. దీంతోపాటు మూలవాసీ బచావో మంచ్ సంస్థపై నిషేధాన్ని ఎత్తివేయాలి. ఆ సంస్థలో పనిచేస్తున్నారనే ఆరోపణలతో పెట్టిన కేసులు ఎత్తివేయాలి. ఇకపై మూలవాసీ బచావో మంచ్ వంటి సంస్థల ద్వారా చట్టబద్ధంగా మా పోరాటం కొనసాగిస్తాం. మేము కేవలం సాయుధ పోరాటానికే విరమణ ఇచ్చాం తప్పితే లొంగిపోలేదు. మా పోరాటం ఆపేది లేదు. జనజీవన స్రవంతిలో కలిసినవాళ్లు ప్రభుత్వ పోలీసు విభాగమైన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ)లో చేరబోమని స్పష్టం చేశాం’అని ఆయన వెల్లడించారు. -
50 శాతం మించొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేదు. రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు కేవలం షెడ్యూల్డ్ ఏరియాల్లోనే ఉన్నాయని గుర్తుచేస్తూ, 50 శాతం పరిమితిని మించరాదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రభుత్వం వాదన ఇదీ.. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, రిజర్వేషన్లను నిర్ణయించుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అత్యంత శాస్త్రీయంగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల సర్వే నిర్వహించామని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ‘ట్రిపుల్ టెస్ట్’నిబంధనలకు అను గుణంగా, డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఇంటింటికీ తిరిగి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై సమగ్రంగా, శాస్త్రీయంగా సర్వే జరిపామని తెలిపారు. 94 వేల ఎన్యూమరేషన్ బ్లాక్‌లలో లక్షలాది మంది సమాచారాన్ని సేకరించి, బీసీ జనాభా డేటా ఆధారంగానే కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్లు పెంచామని వివరించారు. ఈ సందర్భంగా ఇందిరా సహానీ కేసులో తీర్పును సింఘ్వీ ఉటంకించారు. డేటా బేస్ ఆధారంగా, అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% మించి పెంచుకునే సౌలభ్యం ఉందని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. వికాస్ కృష్ణారావ్ గవాలి కేసు తీర్పు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తోందన్నారు. అంతేగాక ఈ వ్యవహారంలో రాజకీయ ఏకాభిప్రాయం సాధ్యమైందని చెప్పారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని, అయితే గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. బిల్లును సవాల్ చేయకుండా, దాని ఆధారంగా జారీ చేసిన జీవోను సవాల్ చేయడం సరికాదని సింఘ్వీ వాదించారు. ఇంతటి విస్తృత కసరత్తు తర్వాత, ఎలాంటి సహేతుక కారణాలు చూపకుండా హైకోర్టు స్టే విధించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కోటా 50% పరిమితి దాటరాదు: ప్రతివాదుల వాదన ప్రతివాది మాధవరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ ప్రభుత్వ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసిందన్నారు. కృష్ణమూర్తి కేసు తీర్పును ఉటంకిస్తూ ‘షెడ్యూల్డ్ ఏరియాలు, గిరిజన ప్రాంతాల్లో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఉంది. జనరల్ ఏరియాల్లో ఈ పరిమితిని దాటడానికి వీల్లేదు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పును వెల్లడించింది’అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ట్రిపుల్ టెస్ట్‌లో కూడా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనేది ఒక కీలకమైన షరతు అని, దాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల ఉదంతాలను ప్రస్తావిస్తూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో కూడా రిజర్వేషన్ల పెంపును సుప్రీంకోర్టు తిరస్కరించి, 50 శాతం పరిమితికి లోబడే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించిందని గుర్తుచేశారు. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో విభేదించింది. ‘ఎస్టీ ప్రాంతాల్లోనే రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు ఉన్నాయి కదా?’అని పేర్కొంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను, ముఖ్యంగా కృష్ణమూర్తి కేసులో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై నిర్దేశించిన 50 శాతం పరిమితిని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ఈ అంశం హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనబడటం లేదంటూ తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తమ ఆదేశాలతో సంబంధం లేకుండా కేసు మెరిట్స్ ఆధారంగా తదుపరి విచారణను కొనసాగించాలని హైకోర్టుకు సూచించింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతమున్న రిజర్వేషన్ల విధానం ప్రకారమే జరగనున్నాయి. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: 1.48 లక్షల ఎకరాల్లో 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మద్దతు ధర, బోనస్ 500 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్‌లో అగ్రికల్చర్ కాలేజీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఉత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఉత్సవాల నిర్వహణ కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది.రాష్ట్ర వ్యాప్తంగా పలు సెక్టార్లకు ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయించింది. నల్సార్ యూనివర్సిటీ కి 7 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. నల్సార్ యూనివర్సిటీలో 25 నుంచి 50 శాతం సీట్ల కేటాయింపు కోటా పెంచుతూ కేబినెట్ తీర్మానించింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2A, 2B పొడిగింపుపై అధికారుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. సీఎస్ ఛైర్మన్‌గా ఉన్నతాధికారుల కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని కేబినెట్ ఆదేశించింది. రూ.10,500 కోట్లతో 5,500 కి.మీ మేర హ్యామ్ రోడ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతాం.ఇద్దరు పిల్లలకు మించి సంతానం వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ఠ నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్ కు పది ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్‌లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా చర్చించింది.మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నత అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎస్ ఛైర్మన్‌గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, లా సెక్రెటరీ, మెట్రో రైలు ఎండీ, అర్బన్ ట్రాన్స్‌ఫోర్ట్ అడ్వయిజర్ అధికారుల కమిటీలో సభ్యులుగా ఉంటారు. అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినేట్ సబ్ కమిటీకి అందిస్తుంది. కేబినేట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి రక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. కృష్ణా-వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. -
‘బీసీ రిజర్వేషన్లలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లలో వెనకడుగు వేసే ప్రకస్తే లేదని టీపీసీసీ చీఫ్ మహేహ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీ భవన్లో బీసీ సంఘాల నేతలతో సమావేశం అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ కుల సర్వేకు ఆద్యులు రాహుల్ గాంధీ. స్వాతంత్ర్యం అనంతరం శాస్త్రీయ బద్దంగా కుల సర్వే నిర్వహించి అఫిషియల్ డాక్యుమెంట్ ఇచ్చాం. కామారెడ్డి డిక్లరేషన్‌కే కట్టుబడి ఉన్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్‌కు మద్దతు ఇస్తున్నాం. బంద్ విజయవంతం కావాలి. బీసీ బంద్‌తో కనువిప్పు కలగాలి. అసెంబ్లీలో మద్దతు ఇచ్చి బయటకు వచ్చి మోకాలడ్డు పడుతున్నారు. రాహుల్ గాంధీ ఎవరి వాటా వారికి నినాదం.. ఉద్యమంగా మారింది. రాహుల్ గాంధీ నినాదం గొప్ప వరంబీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయ పరంగా పోరాడుదాం. రాజకీయాలు ఎన్నికల వరకే. రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రిజర్వేషన్ల 9 వ షెడ్యూల్ చేర్చే విషయంలో ప్రధాని మోదీని అడిగేందుకు బీజేపీ నేతలు ఎందుకు జంకుతున్నారు. బీజేపీ బిఆర్ఎస్లో పాయికారి ఒప్పందంతో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం. సిఎం రేవంత్,నాకు ఉన్న సఖ్యత దేశంలో ఎక్కడా లేదు. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ ఎనలేని కృషి చేస్తున్నారు’ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి:బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్! -
జూబ్లీహిల్స్ ఓట్ చోరీ కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో ఓట్ చోరీపై హైకోర్టు విచారణ చేపట్టింది. బోగస్ ఓట్లు తొలగించాలంటూ మాగంటి సునీత, కేటీఆర్ లంచ్ మోషన్ పిటీషన్లు దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌తో సంబంధం లేనివారు ఓటర్ జాబితాలో చేరారని పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది దామా శేషాద్రినాయుడు తన వాదనలు కోర్టుకు వినిపించారు. ‘‘జూబ్లీహిల్స్‌లో 19వందలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయి. 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయి. కొంతమందికి రెండు ఓట్లు ఉన్నాయి. డూప్లికేట్ ఓట్లు కూడా నమోదయ్యాయి’’ అని ఆయన కోర్టుకు తెలిపారు.పిటీషనర్లు చీఫ్ ఎలక్ర్టోరల్ అధికారికి ఫిర్యాదు చేశారని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అవినాష్.. కోర్టుకు తెలిపారు. ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ.. 21వ తేదీ వరకు పరిశీలన చేస్తారన్న ఈసీ తరఫు న్యాయవాది.. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారిని సైతం వివరణ అడిగినట్లు తెలిపారు.పిటీషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు.. ఈసీ తరఫు న్యాయవాది వాదనలను సీజే ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. పిటీషనర్ విజ్ఞప్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్న ఈసీ న్యాయవాది వాదనలను హైకోర్టు రికార్డు చేసింది. ఈ పిటీషన్లో ప్రత్యేక ఆదేశాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. -
కొండా సురేఖ ఎపిసోడ్.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎక్కడో కమ్యూనికేషన్ లోపంగా కనిపిస్తుందన్నారు. సాయంత్రం లోగా ఈ విషయంపై క్లారిటీ వస్తుందని మహేష్ గౌడ్ అన్నారు.కాగా, సుప్రీం కోర్టు తీర్పుపై మహేష్ గౌడ్ స్పందిస్తూ.. హైకోర్టులో కేసుకి సమయం ఉందని.. వేచి చూస్తామన్నారు. హైకోర్టులోనే తేల్చుకుంటామన్నారు. బీసీ రేజర్వేషన్ అంశం మీద కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో ఉందని.. వెనక్కి తగ్గేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలనే తపన ఉందని.. హై కోర్టులో పోరాడతామని మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయట పెట్టాలి: బీజేపీ చీఫ్మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు మాట్లాడుతూ.. సిమెంట్ ఫ్యాక్టరీని బెదిరించడంలో పెద్దవారి హస్తముందని కొండ సురేఖ కుటుంబ సభ్యులు చెబుతున్నారని.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాలన్నారు. ‘‘కాంగ్రెస్ అంటేనే కరప్షన్. కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయట పెట్టాలి. బలవంతంగా కాంగ్రెస్ వసూలు చేస్తుంది. సీఎంపై ఆరోపణలు చేసింది కేబినెట్ మినిస్టర్ కుటుంబ సభ్యులే...దోచుకున్న సొమ్మును పంచుకోలేక దంచుకొని తన్నుకుంటున్నారు. కొండ సురేఖ కుమార్తె మాట్లాడిన విషయంపై విచారణ జరపాలి. దోచుకునే లీడర్లు ఎక్కువ రోజులు ఉండొద్దు. కాంగ్రెస్ నాయకులు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయొద్దు’’ అంటూ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. -
కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు
తన తల్లిదండ్రులకు ఏమైనా హానీ జరిగితే సీఎం రేవంత్‌రెడ్డిదే బాధ్యత అంటున్నారు తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కుమార్తె సుస్మిత. మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అడ్డం పెట్టుకుని తమను వేధిస్తున్నారని ఆరోపించారు. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన పోలీసులను ఆమె అడ్డుకున్నారు.బుధవారం రాత్రి ఆమె తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ''బీసీ లీడర్లను, మమ్మల్ని తొక్కడానికి ట్రై చేస్తున్నారు. ఎక్స్‌టార్సన్ కేసు అంటున్నారు. ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్నను తీసుకొద్దామని ట్రై చేస్తున్నారని నా డౌట్. ఆ డౌట్లో మాత్రం మానాన్నకు కానీ, మా అమ్మకు కానీ ఎటువంటి హాని జరిగినా పూర్తి బాధ్యత రేవంత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోహిన్ రెడ్డిలదే. వీళ్లందరు మాత్రం బాధ్యత వహించాలి. నేను ముందే చెబుతున్నా.ఇది కాంగ్రెసా, తెలుగుదేశమా తెలుస్తలేదండీ. రెడ్ల రాజ్యం నడుస్తోంది. బీసీ నినాదమేమో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎత్తుకుంటే.. ఇక్కడ బీసీ మంత్రి ఇంటికి టాస్క్‌ఫోర్స్ సీఐ వస్తడా? అసలు ఎక్కడైనా ఉందా? ఎంత సిగ్గుమాలిన చర్య? ఒక ముఖ్యమంత్రి సిగ్గుపడాలి దానికి. ఒక బీసీ లేడీ లీడర్ ఇంటికి రాత్రి తొమ్మిదింటికి ఒక టాస్క్‌ఫోర్స్ సీఐ వచ్చిండంటే ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. అయామ్ టెల్లింగ్ ఆన్ మీడియా'' అంటూ సుస్మిత ఫైర్ అయ్యారు. కాగా, నిన్నరాత్రి తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని గురువారం మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు కొండా సుస్మిత. చదవండి: కొండా సురేఖ వివాదం.. అసలేం జరిగింది? -
టికెట్ నాకే.. ఎమ్మెల్యే నేనే
మెదక్ అర్బన్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం నేనే ఎమ్మెల్యే. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై నమ్మకం ఉంది. పార్టీ టికెట్ ఎలాగైనా ఇస్తారు. అమ్మవారి దయతో 2029 ఎన్నికల్లో నిజాంపేట బిడ్డగా.. ఎమ్మెల్యేగా మీ ముందుకొస్తానంటూ..’ నిజాంపేటలో ఆదివారం జరిగిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పంపిణీ కార్యక్రమంలో కంఠారెడ్డి తిరుపతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు గులాబీ దళంలో కాక రేపుతున్నాయి. మెతుకుసీమ రాజకీయాల్లో ఉద్యమ నేతగా పేరొందిన పద్మక్క.. ద్వితీయ శ్రేణి నాయకుడి ధిక్కార స్వరంతో కలవరపడుతోంది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పు లా ఉన్న ఆశలు.. ఒక్కసారిగా భగ్గుమనడంతో బీ ఆర్ఎస్లో అలజడి మొదలైంది. అయితే ఈ వ్యా ఖ్యల పరిణామాలను ట్రబుల్ షూటర్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.అప్పుడు నెయ్యం.. ఇప్పుడు కయ్యంగత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డికి మైనంపల్లి రోహిత్‌రావు రూపంలో పార్టీ షాకిచ్చింది. అనూహ్య పరిణామంతో తీవ్ర ఆందోళనకులోనైన కంఠారెడ్డి డీసీసీ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. మోసం చేసిన కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో హస్తం పార్టీలో ఉన్న తనవర్గాన్ని బీఆర్ఎస్లోకి తిప్పుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. కొంతమేర కృతకృత్యుడయ్యాడు. అప్పట్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారెడ్డి విజయం కోసం కృషి చేశారు. కాలం గడుస్తున్నా కొద్ది బీఆర్ఎస్లో కొంతమందిని తన వైపు తిప్పుకున్నాడు. విందులు, వినోదాలతో మరికొంత మందిని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గత ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యే కొంతకాలం నియో జకవర్గానికి దూరంగా ఉన్న సమయాన్ని వినియోగించుకొని కొంతమేర పట్టు పెంచుకున్నాడు. ఆర్థిక సహాయాలు, ప్రజోపయోగ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీలో పరపతిని పెంచుకున్నాడు.ముందుగానే పసిగట్టిన పద్మారెడ్డిమెతుకుసీమ రాజకీయాల్లో ఎదురులేని ఏలికగా నిలిచిన బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మారెడ్డి, పార్టీలో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ముందుగానే పసి గట్టారు. ఎమ్మెల్యే పదవిపై ఆశలు పెంచుకుంటున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కదలికలపై కన్నేసి, కౌంటర్ చర్యలు ప్రారంభించారు. పైకి సఖ్యతగా ఉన్నట్లు కనిపించినా, కంఠారెడ్డితో కలిసి ఉన్న సందర్భాల్లో పద్మారెడ్డి అసౌకర్యంగానే ఉన్నట్లు కనిపించేవారని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ తిరుపతిరెడ్డి తన స్వస్థలమైన నిజాంపేటలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో నెలకొన్న వర్గ విబేధాలను ప్రస్పుటం చేసేవిగా ఉండటంతో.. రెండు, మూడు రోజుల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించి, సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని పాపన్నపేటకు చెందిన బీఆర్ఎస్ ముఖ్యనాయకుడు ఒకరు తెలిపారు.గులాబీ దళంలో పెరిగిన కంఠ స్వరంమెతుకుసీమ బీఆర్ఎస్లోవర్గపోరు కొనసాగుతోంది. తాజాగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి వ్యాఖ్యలతో అలజడి మొదలైంది. ఈ పరిణామాలను పార్టీ నిశితంగా పరిశీలిస్తున్నట్లుతెలుస్తోంది. -
అమ్మ అడిగితే కాదంటారా? ఊరంతా తిప్పారు!
జగిత్యాల జిల్లా: అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వృద్ధురాలికి సంతోషం కలిగించడానికి ఆమె కుటుంబ సభ్యులు వినూత్నంగా వ్యవహరించారు. వేంపేట గ్రామానికి చెందిన శ్రీరాముల నర్సమ్మ (90) వృద్ధాప్యంతో కొంతకాలంగా మంచానికే పరిమితమైంది. కుమారుడు, కోడలు, మనువళ్లు సపర్యలు చేస్తున్నారు. అడుగు కూడా వేయలేని ఆమెకు ఊరంతా చూపించాలని నిర్ణయించుకున్న కుటుంబసభ్యులు.. తోపుడు బండిపై గ్రామమంతా తిప్పారు. బంధువుల ఇళ్లకు తీసుకెళ్లారు. గ్రామంలోనే ఉంటున్న కూతురి ఇంటికి ఆమెను తీసుకెళ్లి.. అక్కడ భోజనం చేయించి తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబసభ్యుల ప్రేమకు ఆమె ఎంతగానో పరవశించింది.వాగు కష్టాలు తీరేదెన్నడో..?ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి వద్ద మూడేళ్ల కింద ట భారీ వరదకు బ్రిడ్జి కూలిపోయిన విషయం తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు కొండాయి, మల్యాల, ఐలాపురం, గోవిందరాజుల కాలనీవాసులు వర్షా కాలం, మిగతా కాలాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటుకుంటూ అవ సరాలను తీర్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. బుధవారం కొండాయి వద్ద ఓ బాలింత తన చంటిపిల్లాన్ని ఎత్తుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టు కొని వాగు దాటింది. బ్రిడ్జి ఎప్పుడు కడతారో.. మా వాగు కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ఆయా గ్రామాలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘నా మాటలకు కట్టుబడి ఉన్నా.. ఫోన్ వచ్చింది ఇప్పుడేం మాట్లాడలేను’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ(konda Surekha) ఎపిసోడ్ తీవ్ర కలకలం సృష్టించింది. ఇక, తాజాగా మరోసారి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటానని సుస్మిత చెప్పుకొచ్చారు. దీంతో, అధికార కాంగ్రెస్ పార్టీలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.కొండా సుస్మిత(konda Sushmita) తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాత్రి నేను మాట్లాడిన మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. అధిష్టానం మాతో మాట్లాడింది. మీడియాలో ఎలాంటి అంశాలపై మాట్లాడవద్దని అదేశాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని విషయాలపై మాట్లాడలేను. ఏం జరిగిందో అందరికీ తెలుసు’ అని కామెంట్స్ చేశారు.మరోవైపు.. మంత్రి కొండా సురేఖకు సైతం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి పిలుపు వెళ్లింది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి రావాలని సురేఖకు తెలిపారు. మరికాసేపట్లో ఎమ్మెల్యే క్వాటర్స్‌కి మంత్రి కొండా సురేఖ వెళ్ళనున్నారు. కేబినెట్ భేటీకి కూడా కొండా సురేఖ హాజరకానున్నారు. ఇదిలా ఉండగా.. మినిస్టర్ క్వార్టర్స్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటికి ఆమె మాజీ osd సుమంత్ భార్య డాక్టర్ మనిషా చేరుకున్నట్టు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: కొండా సురేఖకు బిగ్ షాక్.. -
బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. జీవో నెంబర్ 9పై హైకోర్టు విధించిన స్టేను ఎత్తేయాలని దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు నిరాకరించింది. గురువారం వాడి వేడి వాదనల అనంతరం.. తమ తీర్పుతో హైకోర్టు విచారణపై ప్రభావం పడొచ్చని, ఈ దశలో పిటిషన్‌ను స్వీకరించబోమని చెబుతూ ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలే చేసింది.స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరిట తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 9ని జారీ చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆ జీవోపై స్టే విధిస్తూ.. విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈలోపు రిజర్వేషన్ల పరిమితి మీరకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది కూడా. అయితే.. 42 శాతం బీసీ రిజర్వేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను.. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఇవాళ పరిశీలించింది. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత.. ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలంది. కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. హైకోర్టులో విచారణ యధాతథంగా కొనసాగుతుందని.. అక్కడే తేల్చుకుని రావాలని పిటిషనర్ తరఫు లాయర్‌కు స్పష్టం చేసింది. వాదనలు ఇలా.. తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయి. శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించాం. డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందిదేశంలో ఎక్కడా లేనివిధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాం. గవర్నర్ బిల్లు పెండింగ్‌లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్ లో పెట్టారు. బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారు. రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సహాన్ని జడ్జిమెంట్ లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి ఎంపరికల్ డేటా సేకరించింది. కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించాం. బీసీ జనాభా డేటా ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు పెంచాము. ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించాం. సమగ్రంగా , సాంకేతికంగా సర్వే జరిపాం. అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపాం. ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈ సర్వే నిర్వహించాం. దీనిపైన స్టే ఎలా విధిస్తారు ?. హైకోర్టు మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవు. వెంపరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గౌలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందిబెంచ్ జోక్యం చేసుకుని.. ఎస్టీ ప్రాంతాలలోనే రిజర్వేషన్ల పెంపుకు మినహాయింపులు ఉన్నాయి కదా ? అని ప్రశ్నించింది. ప్రతివాది మాధవరెడ్డి తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ ఏరియా ,గిరిజన ప్రాంతాలలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఉంది. జనరల్ ఏరియాలలో రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచడానికి వీలులేదు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెల్లడించింది. మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్ లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించింది. 50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. ట్రిపుల్ టెస్ట్ లో కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్ ఉండదు అని అన్నారు. -
కొండా సురేఖ వివాదం.. అసలేం జరిగింది?
మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. తన మాజీ ఓఎస్డీ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల మంత్రి సురేఖ కోపంగా ఉన్నట్టు కనబడుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించిన సురేఖ ఓఎస్డీపై చట్టపరమైన చర్యలకు సర్కారు యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన పోలీసులను సురేఖ కుమార్తె సుస్మిత (konda sushmitha) అడ్డుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. తమను టార్గెట్ చేశారని, రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తోందంటూ సుస్మిత మీడియా ముందు ఫైర్ అయ్యారు.మరోవైపు ఈ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని మంత్రి సురేఖ భర్త కొండా మురళి హన్మకొండలో చెప్పారు. తమ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసి వివాదం పరిష్కారానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. అదే సమయంలో తన కూతురును ఆయన వెనకేసుకొచ్చారు. కాగా, ఈ వివాదంపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కూడా సురేఖ వ్యవహరించిన తీరు పట్ల సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖను ఆమె నుంచి తీసేసుకోవాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం.అసలేం జరిగింది? తన నియోజకవర్గం హుజూర్‌నగర్‌లోని డెక్కన్ సిమెంట్స్‌లోని పనిచేస్తున్న ఓ వ్యక్తిని డబ్బుల కోసం కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ బెదిరించినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో అతడిని విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. సుమంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతడు సురేఖ ఇంట్లో ఉన్నాడన్న సమాచారంతో బుధవారం రాత్రి అక్కడికి వెళ్లారు. జూబ్లీహిల్స్ గాయత్రిహిల్స్‌లోని తమ ఇంటికి మఫ్టీలో వచ్చిన పోలీసులను సురేఖ కూతురు సుస్మిత అడ్డుకున్నారు. మంత్రి ఇంటికి పోలీసులు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. ఈలోపు ఇంట్లో ఉన్న సురేఖ, సుమంత్ బయటికి వచ్చి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మా ప్రమేయం లేదుఈ నేపథ్యంలో మేడారం జాతర పనులను రోడ్లు భవనాలకు అప్పగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కొండా సురేఖ (Konda Surekha) వివాదంపై స్పందించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిరాకరించారు. డెక్కన్ సిమెంట్ వివాదంలో తన ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే వ్యవహారంలో తనపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి తోసిపుచ్చారు. డెక్కన్ సిమెంట్ వివాదంలో తన ప్రమేయం లేదని అన్నారు.తెలంగాణ కేబినెట్ భేటీసీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు, రైతు భరోసా, మైనింగ్ కొత్త పాలసీ, ట్రో ఫేజ్-2 టెండర్లపై మంత్రి మండలిలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కొండా సురేఖ వివాదం నేపథ్యంలో కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, సురేఖకి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి క్యాబినెట్ మీటింగ్‌కు హాజరు కావాలని కోరినట్టు తెలుస్తోంది. చదవండి: నన్ను తిట్టినవాళ్లే నాకోసం వస్తున్నారుపొంగులేటిపై ఫిర్యాదు!అంతకుముందు మేడారం పనుల టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. తన శాఖకు సంబంధించిన రూ. 71 కోట్ల విలువైన పనులను తనవాళ్లకు ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని సురేఖ ఆరోపించినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి పొంగులేటితో ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. మహేష్ గౌడ్ క్లారిటీమంత్రి కొండా సురేఖ వివాదంపై పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ స్పందించారు. ఈ వ్యవహారాన్ని తాను మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎక్కడో కమ్యూనికేషన్ లోపం కనిపిస్తుందని, తొందరలో క్లారిటీ వస్తుందని మీడియా ప్రతినిధులతో చెప్పారు. -
కొండా సురేఖకు బిగ్ షాక్?
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొండా సురేఖను దేవాదాయశాఖ నుంచి తప్పించేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు... -
కొండా సుస్మిత ఎపిసోడ్.. స్పందించిన రోహిన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూబ్లీహిల్స్‌లో ఉన్న మంత్రి కొండా సురేఖ(konda Surekha) ఇంటి పోలీసులు వెళ్లడంపై బుధవారం రాత్రి హైడ్రామా నెలకొంది. ఈ సందర్బంగా పోలీసులు, డెక్కన్ సిమెంట్, రోహిన్ రెడ్డిపై(Congress DCC Rohin Reddy) కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత(Konda Sushmitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎపిసోడ్‌పై తాజాగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి స్పందించారు.కొండా సుస్మిత పటేల్ ఆరోపణలను రోహిన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘నాపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు. డెక్కన్ సిమెంట్స్ అంశం చెప్తే నేను ఇలాంటి వాటిలో వేలు పెట్టను అని సుమంత్‌కి ముందే చెప్పి పంపేశాను. నేను ఎలాంటి అసాంఘిక పనుల్లో తల దూర్చను.. ఈ విషయంలో నా ప్రమేయం లేదు’ అని చెప్పుకొచ్చారు.సుస్మిత ఆరోపణలు..ఇక, అంతకుముందు.. కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సుస్మిత మాట్లాడుతూ.. సుమంత్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారని తెలిసింది. డెక్కన్ సిమెంట్ వాళ్లను సుమంత్ గన్‌తో బెదిరించారని ఫిర్యాదు ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ ఫిర్యాదుతో అరెస్టు చేసేందుకు వచ్చామని పోలీసులు తెలిపారు. ఆధారాలు ఉంటే చూపించాలని పోలీసులను అడిగాను. ఆధారాలు అడిగితే వరంగల్ నమోదైన మరో కేసులో అరెస్టు చేసేందుకు వచ్చామని అన్నారు. మమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించేందుకు చూస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి కూడా ఈ ఎపిసోడ్లో ఉన్నారని ఆరోపించారు. ఆయన వెనుక ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందా? అంటూ ప్రశ్నించారు. సుమంత్‌ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్టు చేసేందుకే మహిళా పోలీసులు కూడా వచ్చారంటూ కామెంట్స్ చేశారు.బీసీ లీడర్లయిన తమ తల్లిదండ్రుల్ని పార్టీ నుంచి బహిష్కరించేందుకు యత్నిస్తున్నారని ఇదంతా రెడ్డి నాయకులు చేస్తున్న కుట్రగా తెలుస్తోందని కొండా సుస్మిత ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రోహిణ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి హాని ఉన్నప్పటికీ బందోబస్తును తొలగించారని అలాంటప్పుడు సీఎం సోదరులకు మాత్రం గన్మెన్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. -
రేవంతన్నతో గొడవల్లేవ్.. నా బిడ్డ అందుకే అలా మాట్లాడింది: కొండా మురళి
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ(మాజీ) సుమంత్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు గత అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఆమె నివాసం వద్దకు పోలీసులు రావడం, సురేఖ కూతురు సుస్మిత వాళ్లతో వాగ్వాదానికి దిగడం, ఈ క్రమంలో సంచలన ఆరోపణల చేయడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్సీ, సురేఖ భర్త కొండా మురళి స్పందించారు. సుమంత్ వ్యవహారం, కూతురు సుస్మిత వ్యాఖ్యలపై కొండా మురళి గురువారం ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించి స్పందించారు. ‘‘హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు సుమంత్ వ్యవహారంలోనూ ఏం జరుగుతుందో తెలియదు. సెక్రటేరియట్లో కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి నేను ఒక్కసారే వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు.నా బిడ్డకు(సుస్మితను ఉద్దేశించి..) మాట్లాడే స్వేచ్ఛ ఉంది. తాను ఇబ్బంది పడ్డాడని చెప్పింది. అందుకే అలా మాట్లాడి ఉంటుంది. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ కష్టపడ్డాం. నాకు ఎమ్మెల్సీ ఇస్తానని రేవంతన్న హామీ ఇచ్చారు. తప్పకుండా ఇస్తారు కూడా. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే మాకు సంబంధం లేదు. అందరి మంత్రుల ఇండ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది. నేను మంత్రుల వద్దకు వెళ్తాను. పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుని అడుగులు వేస్తా. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ అన్నతో మాట్లాడి సమస్య సాల్వ్ అయ్యేలా చేస్తా. ఎవరి తప్పు ఉన్నా, సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తా. మీడియా ముందు మాట్లాడొద్దని మీనాక్షి నటరాజన్ చెప్పారు. మళ్ళీ మీనాక్షి గారిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతా. మీనాక్షి అమ్మ చెప్పినట్లు వింటాను... నన్ను తిట్టిన వల్లే మళ్ళీ నా కోసం వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్ట్ పనులు కోసం నా దగ్గరకు వచ్చిన వాడే. వేం నరేందర్ రెడ్డి(సీఎం సలహాదారు) నేను కామన్ గా కలుస్తుంటాం. నేను ఎవరికీ టార్గెట్ కాను, నాకు ఎవరూ టార్గెట్ లేరు. నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టం అని మురళి అన్నారు.ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మాజీ ఓస్డీని అర్ధరాత్రి తన కారులో మంత్రి కొండా సురేఖ తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కొండా మురళి పరోక్షంగా స్పందించారు. కొండా సురేఖ హైదరాబాద్‌లోనే ఉన్నారని.. ఈరోజు వరంగల్ తూర్పులో అబ్జర్వర్‌తో ప్రోగ్రామ్ ఉందని, దానికి ఆమె హాజరవుతారని అన్నారాయన. ఇదీ చదవండి: మా అమ్మ అరెస్టుకు కుట్ర జరుగుతోంది: కొండా సుస్మిత -
అన్నా.. ఒక్కసారి వచ్చిపో
‘అన్నా.. మా చిన్నప్పుడు ఊరొదిలి అడవిబాట పట్టినవ్.. పీడిత, తాడితుల కోసం అరణ్యంలో ఉంటూ సమాంతర సర్కార్ నడిపించినవ్.. మారుతున్న పరిస్థితుల్లో బుల్లెట్‌తో కాదు బ్యాలెట్‌తోనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని గుర్తించినవ్.. ఆయుధం వీడి, రాజ్యాంగాన్ని చేతబట్టుకొని జనజీవన స్రవంతిలో కలిసినవ్.. పేపర్లు, టీవీల్లో నీగురించి వినడం తప్ప నేరుగా జూసిందేలేదు.. పెద్దపల్లి పెద్దవ్వ మధురమ్మ నా కొడుకును ఒక్కసారి జూసి కన్నుయూలని తండ్లాడింది.. ఆశ నెరవేరకుండానే కన్నుమూసింది.. నాన్న, అన్న, అమ్మ అంత్యక్రియలకూ రాకపోతివి.. ఇప్పుడైనా వచ్చిపోరాదే.. నిన్ను జూసి ఒక్కసారి చిన్ననాటి ముచ్చట్లు పంచుకోవాలని ఉంది.. జెర గిప్పుడైనా గిటొచ్చి పోరాదే’ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావుతో అనుబంధం ఉన్నవారు అంటున్నారు.సాక్షి పెద్దపల్లి ●: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు ఉరఫ్ అభయ్, సోను, భూపతి, వివేక్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. ఆయుధలను అప్పగించి, రాజ్యాంగాన్ని చేతబూనారు. 44 ఏళ్లఉద్యమ ప్రస్థానం ముగించి జనజీవన స్రవంతిలోకి వచ్చిన వేణుగోపాల్‌రావు తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది.తండ్రి స్ఫూర్తి.. సోదరుడి పిలుపు..పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య–మధురమ్మకు మూడోసంతానం వేణుగోపాల్‌రావు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని తామ్రపత్రం అందుకున్న తండ్రి నుంచి పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న అభయ్.. సోదరుడు మల్లోజుల కోటేశ్వర్రావు ఉరఫ్ కిషన్‌జీ పిలుపుతో 1981లో అడవిబాట పట్టారు. 2010లో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ ఉరఫ్ ఆజాద్ మృతి తర్వాత ఆయన స్థానంలో నియమితులయ్యారు. 2010లో గడ్చిరోలిలో 76 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్ల ఊచకోతలో మాస్టర్ మైండ్‌గా పనిచేశారు. సీస్ఫైర్(కాల్పుల విరమణ)కు అనుకూలంగా లేఖరాసి మావోయిస్ట్ పార్టీలైన్ దాటారు. దీంతో విప్లవ ద్రోహిగా పార్టీ ప్రకటించింది. ఇప్పుడు ఆయన లొంగిపోవడంతో 44 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. వేణుగోపాల్‌రావు భార్య తారక్క 10 మంది మావోయిస్టులతో ఈ ఏడాది జనవరి ఒకటిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో లొంగిపోయారు. ఇప్పుడు ఆయన కూడా 60 మందితో నక్సల్స్‌తో అదే సీఎం వద్ద లొంగిపోవడం గమనార్హం.మిగిలింది 9మందే..మావోయిస్ట్ పార్టీ అగ్రనేత లొంగిపోవడంతో మిగిలినవారి అడుగులపైనా చర్చ జరుగుతోంది. మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన మల్లా రాజిరెడ్డి ఉరఫ్ సంగ్రాం(సీసీఎం), రామగుండం ప్రాంతానికి చెందిన అప్పాసి నారాయణ ఉరఫ్ ర మేశ్(డీసీఎం), సబ్బితానికి చెందిన గంగిడి సత్యనా రాయణరెడ్డి ఉరఫ్ విజయ్(ఎస్సీఎం), పాలితానికి చెందిన అలేటి రామలచ్చులు ఉరఫ్ రాయలచ్చులు(డీసీఎస్), దాతు ఐలయ్య(ఏసీఎస్), జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాదరావు ఉరఫ్ చంద్రన్న, సోమన్న(సీసీఎం) అదే గ్రామానికి చెందిన దీకొండ శంకరయ్య ఉరఫ్ శేషన్న(ఏసీఏస్), కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన కంకణాల రాజిరెడ్డి ఉరఫ్ వెంకటేశ్(ఎస్సీఎం), సుల్తానాబాద్ మండలం కొదురుపాకకు చెందిన వెంకటేశ్వర్రావు ఉరఫ్ ధర్మన్న(ఎసీఎం) మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతుండటంతో వీరి తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది. -
Telangana: నా కొద్దు.. హెడ్మాస్టర్ నౌకరీ
కరీంనగర్‌రూరల్: పదోన్నతి రావాలని ఉద్యోగులందరు కోరుకోవడం సహజం. కానీ, ఈ ఉపాధ్యాయుడు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పదోన్నతిపై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన ఈ ఉపాధ్యాయుడు పాఠశాలలోని పరిస్ధితులను తట్టుకోలేక ప్రమోషన్ రద్దు చేసుకుని పాత పాఠశాలలోనే యథావిధిగా ఉపాధ్యాయుడిగా పోస్టింగ్ పొందడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు..కరీంనగర్‌లోని సవరన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎ.రఘురాంరావు నెల క్రితం పదోన్నతిపై దుర్శేడ్ జెడ్పీ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా బదిలీపై వచ్చారు. కొన్నిరోజులుగా పాఠశాలలో నెలకొన్న పరిస్ధితులు, ఒక స్కూల్ అసిస్టెంట్ వ్యవహరిస్తున్న తీరుతో మానసికంగా ఆందోళనకు గురయ్యారు. విధులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. చివరకు కుటుంబ సభ్యుల ఒత్తిడితో పదోన్నతి రద్దు చేయాలని ఈ నెల 13న స్కూల్ ఎడ్యుకేషన్ వరంగల్ ఆర్జేడీకి దరఖాస్తు చేసుకున్నారు.ఆర్జేడీ ఉత్తర్వుల మేరకు జిల్లా విద్యాధికారి శ్రీరాంమొండయ్య మంగళవారం రఘురాంరావు పదోన్నతిని రద్దు చేసి తిరిగి స్కూల్ అసిస్టెంట్‌గా సవరన్ ప్రభుత్వ పాఠశాలలో చేరాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దుర్శేడ్ స్కూల్లో ఒక స్కూల్ అసిస్టెంట్ వ్యవహరిస్తున్న తీరుతోనే రఘురాంరావు వెళ్లిపోయినట్లు ఉపాధ్యాయుల ద్వారా తెలిసింది. గతేడాది పాఠశాలలోని పరిస్ధితులను తట్టుకోలేక అప్పటి హెచ్ఎం పరబ్రహ్మమూర్తి గుండెపోటుతో మృతిచెందడం ఉపాధ్యాయులను కలవరపరిచింది. ప్రస్తుతం మరో ప్రధానోపాధ్యాయుడు పదోన్నతి రద్దు చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖాధికారులు దుర్శేడ్ పాఠశాలలో నెలకొన్న అసాధారణ పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
కలెక్టర్ గాత్రం.. అతివకు ఛత్రం
కరీంనగర్ అర్బన్: పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి తన గాత్రంతో ప్రత్యేకంగా నిలిచారు. ఇప్పటికే బాలికలు, మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రస్థాయిలో మన్ననలు పొందిన విషయం విదితమే. కాగా అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ స్వయంగా ‘ఓ చిన్ని పిచ్చుక.. చిన్నారి పిచ్చుక’ అంటూ పాడిన వీడియో పాటను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. హిందీలో స్వానంద్ కిర్కిరే అనే రచయిత రాసి పాడిన పాట కాగా రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు నంది శ్రీనివాస్ తెలుగులోకి అనువదించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. -
కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం
భిక్కనూరు/బోనకల్: రాంగ్ రూట్లో దూసుకొచ్చిన టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం వద్ద ఎన్‌హెచ్ 44పై బుధవారం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్‌పల్లికి చెందిన మెరుగు కిషన్ (54) ఆదిలాబాద్ జిల్లా రణదీవ్నగర్లో చర్చి పాస్టర్‌గా పనిచేస్తుండగా, ఆయన తల్లిదండ్రులు కామా రెడ్డిలో ఉంటున్నారు. కిషన్ తన కుమార్తె జాస్లీన్ (30)ను ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా ముష్టికుంటకు చెందిన ఆగ మని ప్రకాశ్‌కు ఇచ్చి వివాహం చేశాడు. ప్రకాశ్ చింతకాని మండలం చిన్న మండవలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జోయల్ ప్రకాశ్ (4), జాడ్సన్ (3 నెలలు). కామారెడ్డిలో ఉంటున్న తన నానమ్మ, తాతయ్య వద్దకు జాస్లీన్ తన ఇద్దరు కుమారులతో కలిసి కొద్ది రోజుల క్రితం వచ్చింది. కిషన్ సైతం తన తల్లి దండ్రుల వద్దకు వచ్చాడు. జాస్లీన్ తన చిన్న కుమారుడు జాడ్సన్కు టీకా వేయించేందుకు భిక్కనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆశ వర్కర్‌గా పనిచేస్తున్న తమ బంధువు వద్దకు తండ్రి, పెద్ద కుమారుడితో కలిసి ఎలక్ట్రిక్ స్కూటర్‌పై బయల్దేరింది. వారి వాహనం జంగంపల్లి వద్దకు చేరుకోగానే రాంగ్రూట్లో అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో నలుగురు రోడ్డుపై పడిపోయారు. కిషన్, జాస్లీన్ అక్కడి కక్కడే మృతి చెందగా, చిన్నారులు జోయల్ ప్రకాశ్, జాడ్సన్ను కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు ఘటనాస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ రాజిరెడ్డిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
అంతా మార్చిన ఆ లేఖ!
మహారాష్ట్ర: మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, అగ్రనే త మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవటానికి మాజీ మావోయిస్టు ఒకరు రాసిన ఓ లేఖ కారణ మని పోలీసులు తెలిపారు. మల్లోజులతో పాటు మరికొందరితో సన్నిహితంగా పని చేసిన అనిల్ అనే మావోయిస్టు గత ఏడాది సెప్టెంబర్ 15న పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత ప్రశాంత జీవనం గడుపుతున్నానని పేర్కొంటూ ఇటీవల ఆయన మల్లోజులకు లేఖ రాశారు. ఆ తర్వాతే మల్లోజుల కూడా లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘గౌరవనీయులైన కామ్రేడ్ సోను దాదా.. జోహార్! ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో కూడా మీరు సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నాను. నేను, అంజు నాగపూర్‌లో 2024 సెప్టెంబర్ 15న లొంగిపోయాం. ప్రస్తుతం మేము గడ్చిరోలిలో ఉన్నాం. పోలీసుల నుంచి మాకు మంచి సహకారం అందింది. నేను ఉద్యోగం కూడా సంపాదించుకున్నాను. గడ్చిరోలిలో ఇల్లు కూడా కట్టుకోవా లని ప్రయత్నాలు చేస్తున్నాం. తారక్క (మల్లోజు భార్య) కూడా మాతోపాటే ఉంది. ఇక్కడ మనవాళ్లంతా దాదాపు 60–70 మందిమి కలిశాం. తార దీదీ బాగున్నారు. ఆమె అనారోగ్యానికి గురైతే మేమే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆమె కుటుంబ సభ్యులు కూడా తరచూ వచ్చి చూసి వెళ్తున్నారు’ అని లేఖ లో అనిల్ పేర్కొన్నాడు. -
పుంజు పుంజుకో గూడు!
అశ్వారావుపేట రూరల్: సంక్రాంతి పండుగ వేళ పలు ప్రాంతాల్లో కోడి పందేలు హోరాహోరీగా జరుగుతాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పండువారిగూడెంలో ఓ రైతు పలు రకాల కోడి పుంజులను విక్రయానికి పెంచుతున్నాడు. ఖాళీగా ఉన్న వ్యవసాయ క్షేత్రంలో వందల సంఖ్యలో పందెం పుంజులు పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషం. పొలం చుట్టూ కంచెకు గ్రీన్షీట్తో చాటు కట్టి.. ఇనుప కడ్డీలతో చేసిన గంపల కింద పుంజులను కాపాడుతున్నాడు. ఎండ, వాన తగలకుండా తాటి ఆకులను రక్షణగా పెట్టాడు. -
Jubilee Hills bypoll: ఎగ్జిట్ పోల్స్ నిషేధం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ, ప్రచారం నవంబర్ 6 నుంచి 11 వరకు నిషేధిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఈ నెల 13న జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ మేరకు నవంబర్ 6వ తేదీ ఉదయం 7 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదు, ప్రచురించరాదు, ఎలాంటి మాధ్యమంలోనూ ప్రచారం చేయరాదని పేర్కొన్నారు. ఈ నిషేధం టెలివిజన్, రేడియో, వార్తాపత్రికలు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వంటి అన్ని సమాచార మాధ్యమాలకు వర్తిస్తుంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారికి ప్రజాప్రతినిధుల చట్టం, 1951లోని 126ఏ సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. అలాగే, పోలింగ్ ముగిసే ముందు 48 గంటల వ్యవధిలో ఎటువంటి ఎన్నికల సంబంధిత విషయాలు, సర్వేలు, అభిప్రాయ సేకరణ ఫలితాలు ఎలక్ట్రానిక్ మీడియా లేదా ఇతర మాధ్యమాల్లో ప్రదర్శించరాదు. మీడియా సంస్థలు, రాజకీయ పారీ్టలు, సోషల్ మీడియా వినియోగదారులు, ఎన్నికల సంబంధిత అన్ని వర్గాలు ఈ మార్గదర్శకాలను కచి్చతంగా పాటించాలని, స్వేచ్ఛా, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల నిర్వహణలో భాగస్వాములుగా నిలవాలని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ విజ్ఞప్తి చేశారు. -
విమానానికి లేజర్ కాంతులు తగిలాయా?
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో లేజర్ కాంతులు వేయడం నిషేధం అయినప్పటికీ ఓ విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మంగళవారం రాత్రి తిరుపతి నుంచి బయలుదేరి విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాత్రి 9.30 సమయానికి చేరుకుంది. రన్‌వే 09ఆర్ వద్ద ల్యాండ్ అవుతున్న సమయంలో ఎయిర్‌పోర్టుకు ఎడమవైపు బయటి ప్రాంతం నుంచి ఆకుపచ్చని రంగులోని లేజర్ కాంతులు విమానంపై పడినట్లు సమాచారం అందింది. దీనిపై అప్రమత్తమైన అధికారులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే దీనిపై ఎయిర్‌లైన్స్ వర్గాలు కానీ, ఎయిర్‌పోర్టు అధికారులు కానీ తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్, ఆర్జీఐఏ ఔట్‌పోస్టు సీఐ కనకయ్య ‘సాక్షి’కి తెలిపారు. సుమారు ఆరేళ్ల కిందట రషీద్‌గూడలో కొందరు యువకులు బర్త్‌డే పార్టీ చేసుకున్న సమయంలో డీజేతో పాటు లేజర్ లైట్లు ఉపయోగించడంతో విమానాన్ని ల్యాండ్ చేస్తున్న సందర్భంలో పైలట్ కంగారు పడి ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన అప్పట్లో కలకలం రేపింది. తాజాగా వచ్చిన సమాచారం ఎయిర్‌పోర్టు ప్రిడెక్టివ్ ఆపరేషన్ కేంద్రానికి వచి్చనట్లు తెలుస్తోంది. ఇది ఏఐ జనరేటెడ్ కావడంతో దీనిని ధ్రువీకరించుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
పాతబస్తీ మహిళకు పాతికేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళకు దుబాయ్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గంజాయి అక్రమ రవాణా చేస్తూ అక్కడి విమానాశ్రయంలో చిక్కడంతో ఈ మేరకు తీర్పు ఇచి్చంది. బహదూర్‌పురలోని ఆమె కుటుంబీకులు బ్యాంకాక్‌కు చెందిన ట్రావెల్ ఏజెంట్‌పై ఆరోపణలు చేస్తున్నారు. మహిళకు న్యాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బహదూర్‌పురకు చెందిన ఓ మహిళ బ్యూటీషియన్ కోర్సు చేశారు. ఈమెకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. తండ్రి పక్షవాతంతో మంచం పట్టగా...తల్లి గృహిణి కావడంతో కుటుంబ పోషణ భారం మహిళ పైనే పడింది. దీంతో కుమారుడిని తల్లిదండ్రుల వద్ద వదిలి దుబాయ్ వెళ్లి బ్యూటీషియన్ ఉద్యోగం చేయాలని భావించింది. దీనికోసం ఓ ఏజెంట్ ద్వారా వీసా ప్రాసెసింగ్ చేయించుకుంది. అతగాడు ఈ మహిళను బ్యాంకాక్ మీదుగా దుబాయ్ పంపాడు. బ్యాంకాక్‌లో సదరు ఏజెంట్‌కు సంబంధించిన వ్యక్తి ఈ మహిళకు ఓ ప్యాకెట్ ఇచ్చాడు. దాన్ని దుబాయ్‌లో తమ మనిషి వచ్చి తీసుకుంటారని చెప్పారు. ఈ ప్యాకెట్‌తో మహిళ ఈ ఏడాది మే 18న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగింది. అక్కడ తనిఖీలు చేపట్టిన అధికారులు మహిళ తీసుకువచి్చన ప్యాకెట్లో గంజాయి ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన దుబాయ్ కోర్టు ఈ నెల 6న నేరం నిరూపణ అయినట్లు ప్రకటించింది. మçహిళకు 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి సదరు మహిళ వీడియో కాల్ ద్వారా నగరంలోని తల్లితో మాట్లాడింది. తీవ్రంగా రోదిస్తూ తాను కేవలం పది నిమిషాలే మాట్లాడగలనని, ఒక్కసారి తన కుమారుడిని చూపించాలంటూ తల్లిని కోరింది. న్యాయసహాయం చేస్తే నిరోషిగా బయటపడతాననే నమ్మకం ఉందని చెప్పింది. దీంతో మహిళ తల్లి పాతబస్తీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులకు విషయం తెలిపింది. వీరి ద్వారా విషయం తెలుసుకున్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో దుబాయ్‌లో ఉన్న ఇండియన్ కాన్సులేట్ జనరల్ (సీజీఐ) స్పందించారు. యువతికి అవసరమైన న్యాయసహాయం అందిస్తామని హామీ ఇచ్చి బహదూర్‌పురలోని ఆమె కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 120మంది నామినేషన్లు..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..!సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే పలు రకాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నిక ఫలితం భవిష్యత్ సూచిక అనే అభిప్రాయాలున్నాయి. అందుకే వేటికవిగా అన్నివిధాలుగా శక్తియుక్తులు ఒడ్డుతున్నాయి. అధికార యంత్రాంగానికి సైతం ఈ ఉపఎన్నిక పెనుసవాల్‌గా మారింది. సాధారణంగా ఏ ఎన్నికలో అయినా పది మందో, ఇరవై మందో పోటీలో ఉంటారు. కానీ.. ప్రభుత్వంపై వ్యతిరేకతతో వివిధ వర్గాల వారు, అసంతుషు్టలు ఈ ఉపఎన్నికతో తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం ద్వారా ప్రజలకు తమ వేదన వెల్లడించడంతో పాటు ప్రభుత్వానికి సెగ తగిలేలా చేయాలనుకుంటున్నారు. ట్రిపుల్ఆర్, ఫార్మాసిటీ, లగచర్ల ప్రాజెక్టుల భూసేకరణ బాధితులు, గ్రూప్–1 అభ్యర్థులు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి మాలలు, తదితర వర్గాలు, గ్రూపులకు చెందిన వారు భారీ సంఖ్యలో ఇండింపెండెంట్లుగా నామినేషన్లు వేసేందుకు ‘జూబ్లీహిల్స్’ను వేదిక చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే బుధవారం వరకు 30 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసేందుకు మరో 120 మందికి పైగా నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయముంది. ఆలోగా ఇంకెంతమంది నామినేషన్లు వేయనున్నారో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. అధికారులకు ఇరకాటం బ్యాలెట్ పేపర్ల కాలం ముగిశాక ఈవీఎంల ద్వారా పోలింగ్ జరుగుతుండటం తెలిసిందే. ఒక ఈవీఎంలో గరిష్టంగా 16 మంది అభ్యర్థులు, గుర్తులకు అవకాశం ఉంది. వీటిల్లో ఒకటి నోటాకు పోను 15 మంది అభ్యర్థులుంటారు. ఎక్కువమంది అభ్యర్థులు బరిలో ఉంటే గతంలో ఒక కంట్రోల్ యూనిట్‌కు నాలుగు బ్యాలెట్ యూనిట్లు జత చేసేవారు. తద్వారా నోటా పోను 63 మంది అభ్యర్థులకు అవకాశం ఉండేది. 2013 తర్వాత నుంచి ఎం3 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. వీటిని ఒక కంట్రోల్ యూనిట్‌కు గరిష్టంగా 24 బ్యాలెట్ యూనిట్లను కనెక్ట్ చేయవచ్చు. నోటా పోను 383 మంది అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. అంతకుమించి అభ్యర్థులు బరిలో మిగిలితే సంప్రదాయ పద్ధతిలో బ్యాలెట్ విధానానికి వెళ్లాల్సి వస్తుంది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు సిద్ధం చేసుకున్నారు. రెండు బ్యాలెట్ యూనిట్లు మించి అవసరం రాకపోవచ్చునని అంచనా వేశారు. కానీ నామినేషన్లు పెరిగితే అదనపు యూనిట్లు సమకూర్చుకోవడం, ర్యాండమైజేషన్ వంటివి చేయాల్సి వస్తుంది. ఓటరు తాను వేసిన ఓటు సరిగ్గా పడిందో లేదో తెలుసుకునే వీవీప్యాట్లను కూడా అదనంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. గతంలో 1996లో నల్లగొండ పార్లమెంట్‌కు 470 మందికి పైగా ఇండిపెండెంట్లు, ఈవీఎంలు వచ్చాక గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి దాదాపు 185 మంది పోటీలో ఉండటం తెలిసిందే. -
అందరికీ సవాలే!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. జూబ్లీహిల్స్ గెలుపు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా మారుతుంది. దీంతో గెలుపు కోసం మూడు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత లాగా జూబ్లీహిల్స్ గెలుపు రానున్న రోజుల్లో రచ్చ గెలిచేలా చేస్తుందని భావిస్తున్నాయి.కాంగ్రెస్: విజయం కోసం ప్రణాళికలు అధికార కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు సవాలుగా మారింది. స్థానిక యువనేత, అనుభవం ఉన్న నవీన్‌యాదవ్‌కు టికెట్‌ను ఖరారు చేసింది. ముగ్గురు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులను ఇక్కడ ప్రచారంలో దింపి కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టినా గ్రేటర్లో మాత్రం ఒక్క సీటు గెలవలేదు. దీంతో ఇక్కడ గెలిస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు దారి మరింత సులువు అవుతుందని భావిస్తోంది. అధికారంలో ఉన్నా గ్రేటర్ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు లేకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రేటర్లో పాగా వేస్తే వచ్చే స్థానిక, అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలం చేకూరుతుందని ప్రణాళికలు చేపడుతుంది.బీఆర్ఎస్: పట్టు నిలుపుకునే యత్నం బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా గ్రేటర్లో మాత్రం తన పట్టును కోల్పోలేదు. అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని గ్రేటర్లో అన్నివర్గాలు తమవైపే ఉన్నాయని చూపించింది. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జరుగుతున్న ఉపఎన్నికల్లో మాగంటి సతీమణి సునీతకు సీటు కేటాయించి సెంటిమెంట్‌తో పాటు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ క్షేత్రస్థాయి బలంతో మరోసారి పాగా వేయాలని చూస్తోంది. కేటీఆర్, హరీష్‌రావులు తప్పక విజయం సాధించాలనే తపనతో ఇక్కడ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోజూ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే జీహెచ్ఎంసీ పీఠం తప్పక కైవసం చేసుకోవచ్చని అంచనా వేస్తొంది. గ్రేటర్ పీఠాన్ని కొట్టి అన్ని ఎన్నికల్లో బలాన్ని మరింత పెంచుకొని అసెంబ్లీ ఎన్నికల నాటికి రాటుదేలి మూడోసారి తెలంగాణలో అధికారాన్ని పొందాలని చూస్తుంది.బీజేపీ: వ్యూహం మారింది.. లేటుగా అయినా లేటెస్ట్ అంటూ..బీజేపీ జూబ్లీహిల్స్‌లో మరోసారి లంకల దీపక్‌రెడ్డికి ఛాన్స్ ఇచి్చంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన దీపక్‌రెడ్డి 26 వేల ఓట్లను సాధించారు. దీంతో బీజేపీ ఇప్పుడు తన వ్యూహాలను మార్చింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్‌లో ఓ వర్గం ఓట్లు రెండు పార్టీలు పంచుకుంటాయని, మరోవర్గం, సెటిలర్లు, కాలనీ, కమ్యూనిటీ ఓట్లు తప్పక వస్తాయని, అనూహ్యంగా రేసులో ముందుండి గెలుస్తామని ధీమాగా ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకోకుండా గట్టి పోటీతో 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఇక్కడ గెలిస్తే గ్రేటర్ పీఠం తప్పక తమదేనని బీజేపీ కూడా భావిస్తోంది. పార్టీ అధ్యక్షుడు రాంచంద్రరావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తమ వ్యూహాలను ఎవరికీ తెలియకుండా గుంభనంగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. -
మాగంటి సునీత ఆస్తులివే..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయగా..తన ఆస్తుల వివరాలు అఫిడవిట్లో పొందుపరిచారు. ఈ మేరకు ఆమె వద్ద 4097 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే చేతిలో నగదు 38,800 రూపాయల నగదు ఉండగా మూడు బ్యాంకు ఖాతాల్లో కలిసి సుమారు 32 లక్షలు, బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారు వెండి ఆభరణాలు మొత్తం కలిపి 6,18,54,274 రూపాయలు ఉన్నట్టు పేర్కొన్నారు. ముగ్గురు పిల్లల పేరిట షేర్లు, ఆభరణాల విలువ సుమారు రూ.4.62 కోట్లుగా పేర్కొన్నారు. సిరాస్తులు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 34 లో ఓ ప్లాటు, గోపనపల్లిలో ఓ ప్లాటు ఉన్నట్లు, వీటి మొత్తం విలువ 6.11 కోట్ల రూపాయలు, పిల్లల పేరిట 8 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా సునీత పేరిట రూ.4.44 కోట్లు అప్పు ఉండగా, పిల్లల పేరుపై ఆరు కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆమెపై ఎన్నికల నియామావళి ఉల్లంఘించినందుకు గతవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. -
స్థానికం.. నేడే కీలకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు 9, 41, 42ల అమలును నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవా ల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాల యంలో సమావేశం కానుంది. సుప్రీంకోర్టు విచారణలో వచ్చే ఫలితం ఆధారంగా ఎన్నికల నిర్వహణ విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పాత విధానంలో రిజర్వేషన్లను అమలు పరుస్తూ ఎన్నికలు నిర్వహించుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చి న మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు కనుక స్టే విధించి బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో పంచా యతీ ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తే తక్షణమే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లనుంది. ఒకవేళ స్టే నిరాకరిస్తూ హైకోర్టు సూచనల మేరకు పాత రిజర్వేషన్ల విధానంలోనే ఎన్నికలకు వెళ్లాలని సుప్రీం చెప్పినా, ఇతర సూచనలు ఏమైనా చేసినా..తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై మంత్రివర్గం చర్చించి ఓ నిర్ణ యం తీసుకునే అవకాశం ఉంది. ‘దేవాదుల’,‘తుమ్మిడిహెట్టి’పైనా నిర్ణయాలు! శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగాల నిర్మాణ సంస్థ జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్‌తో 2ఒప్పందం రద్దు చేస్తే మళ్లీ టెండర్లు నిర్వహించి పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాల్సి ఉంటుంది. టన్నెల్ బోరింగ్ మెషీన్‌కి బదులు అధునాతన టెక్నాలజీతో సొరంగం తవ్వకాలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశాలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ–6 అంచనాల పెంపుతో పాటు అదనంగా మూడో దశ పనులకు అనుమతులు ఇచ్చే అంశంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనుల పునరుద్ధరణతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు డిజైన్ల రూపకల్పన కోసం ఇటీవల నీటిపారుదల శాఖ ఆహ్వానించిన ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లకు సైతం ఆమోదం తెలిపే (రాటిఫై) అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు రాంరెడ్డి దామోదరరెడ్డి పేరు పెట్టే అంశాన్ని కూడా రాటిఫై చేయనుంది. డిసెంబర్ 1 నుంచి విజయోత్సవాలు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. సనత్‌నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టనుంది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్–2047పై మంత్రివర్గం చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. హామ్ విధానంలో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి చేపట్టడంతో పాటు ఎల్అండ్టీ నుంచి హైదరాబాద్ మెట్రో రైలును టేకోవర్ చేయాలనే నిర్ణయాలకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. -
శుభ్రమైన చేతులు.. ఆరోగ్యకరమైన జీవితం!
కరకగూడెం(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): పరిశుభ్రత అంటే కేవలం ఇల్లు, పరిసరాలే కాదు.. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే కీలకం. కనిపించని సూక్ష్మక్రిములు ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా సబ్బుతో కడుక్కోవడం ప్రధానంగా నిలుస్తుంది. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏటా అక్టోబర్ 15న ‘గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే’ నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత, ఆరోగ్యం, అవగాహన జీవితాలను ఎంత మెరుగుపరుస్తాయో చెప్పడమే ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం. ఈ మేరకు పాఠశాలలు, వైద్యసంస్థల్లో అధికారులు చేతులు కడుక్కోవడం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. వాస్తవానికి ఈ దినోత్సవం బుధవారం ముగిసినా.. విద్యార్థులకు చేతుల శుభ్రతపై అవగాహన కల్పించడాన్ని యంత్రాంగం నిరంతరం కొనసాగించేలా ప్రణాళిక రూపొందించింది. అందుకోసం క్షేత్రస్థాయి నుంచి కార్యాచరణపై అధికారులు దృష్టిపెట్టారు. చేతుల పరిశుభ్రతే మొదటి టీకా.. ఆహారం తినే ముందు లేదా వండే ముందు, టాయిలెట్‌కు వెళ్లి వచ్చాక, దగ్గు లేదా తుమ్ము తర్వాత, పిల్లల సంరక్షణ ముందు, రోగులు, చెత్త, జంతువులను తాకాక చేతులను తప్పనిసరి కడుక్కోవాలి. పైపైన కాక సబ్బు, శుభ్రమైన నీటితో కడిగి తుడుచుకోవడం ప్రధానం. నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ వాడొచ్చు. తద్వారా మనం తాకే వస్తువుల్లో దాగి ఉండే లక్షలాది సూక్ష్మక్రిములు చేతుల ద్వారా ఆహారంలోకి, ఆపై శరీరానికి చేరి వ్యాధులకు కారణం కాకుండా అడ్డుకోవచ్చు. గ్రామీణులకు అవగాహన లోపం.. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతపై అవగాహన లోపం కనిపిస్తోంది. ముఖ్యంగా టాయిలెట్ వెళ్లి వచ్చాక లేదా పిల్లలకు ఆహారం ఇచ్చే ముందు సబ్బు వాడకపోవడం, మొక్కుబడిగా చేతులు కడుక్కోవడంతో అతిసార, వాంతులు వంటివి వ్యాపిస్తున్నాయి. గొత్తికోయ ప్రాంతాల్లో హ్యాండ్‌వాష్ కు బదులు ఇప్పగింజల పొడి, కానుగ పొడి వాడుతున్నా అవగాహన మరింత పెరగాల్సి ఉంది. చేతులు కడుక్కోకపోతే అనర్థాలు చేతులు కడుక్కోకపోవడం వల్ల కలిగే అనర్థాలు చాలా తీవ్రమైనవి. కంటికి కనిపించని క్రిములు, బ్యాక్టీరియా, వైరస్లు శరీరంలోకి ప్రవేశించి వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి. టాయిలెట్‌కు వెళ్లివచ్చాక చేతులు కడుక్కోకపోతే మలంలోని సూక్ష్మక్రిములు చేతులకు అంటుకోవడం, అపరిశుభ్రమైన చేతులతో ఆహారం తినడం ద్వారా అవి శరీరంలోకి ప్రవేశించి డయేరియాకు కారణమవుతాయి. ఇది చిన్న పిల్లలలో తీవ్రమైన డీహైడ్రేషన్‌కు దారితీసి మరణానికి కారణం కావచ్చు. అపరిశుభ్రమైన చేతులతో ఆహారాన్ని తాకినా, తయారుచేసినా వాంతులు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటికి తోడు టైఫాయిడ్, కలరా కూడా కలిగే ప్రమాదమూ ఉంది. అలాగే, ముఖం, కళ్లు, ముక్కును చేతులతో తాకినప్పుడు క్రిములు శ్వాసకోశంలోకి చేరి ఇన్ఫుయెంజా, జలుబు వ్యాపిస్తాయి. అలాగే, కళ్లను రుద్దుకున్నప్పుడు కండ్ల కలక వచ్చే ప్రమాదం ఉంది.చేతుల శుభ్రతతో ఆరోగ్యం సొంతంమన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అంతా గుర్తించాలి. తరచుగా చేతులు కడుక్కోవడం ద్వారా అంటువ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. ఈ చిన్న అలవాటు కుటుంబ ఆరోగ్య రక్షణలో కీలకంగా నిలుస్తుంది. సబ్బు, నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ఉపయోగించొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ‘హ్యాండ్ వాషింగ్ హీరో’గా మారితే వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుంది. – డాక్టర్ జయలక్ష్మి, డీఎంహెచ్ఓ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -
నిలువు రాళ్ల కోసం తప్పుకోనున్న భారీ టవర్లు
సాక్షి, హైదరాబాద్: అవి మామూలు రాళ్లు కాదు, మూడున్నర వేల ఏళ్ల క్రితం పాతిన ఆది మానవుల స్మారక శిలలు. సమీప భవిష్యత్‌లో ప్రపంచ వారసత్వ సంపద హోదాను దక్కించుకునే ప్రయత్నంలో ఉన్న అత్యంత చారిత్రక ప్రాధాన్యం ఉన్న శిలలు. ఇంతకాలం ఆలనాపాలనా లేక నిలబడి కొన్ని, వంగిపోయి కొన్ని, కూలిపోయి మరికొన్ని ఉండిపోగా..అనుకున్నది అనుకున్నట్టు జరిగి యునెస్కో గుర్తింపు పొందితే ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే నిలువు రాళ్లవి. అంత ప్రాధాన్యం ఉన్న అతి పురాతన శిలలు కావటంతో, ఇప్పుడు వాటి కోసం జాతీయ పవర్ గ్రిడ్‌కు చెందిన భారీ టవర్లు పక్కకు తప్పుకోబోతున్నాయి. కర్ణాటక–తెలంగాణ సరిహద్దులో కృష్ణానది తీరంలోని ముడుమాల్ గ్రామ శివారులో ఆదిమానవులు ఏర్పాటు చేసిన భారీ గండ శిలలు ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) గుర్తింపు పొందేందుకు పరిశీలనలో ఉన్నాయి. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన యునెస్కో ఇప్పటికే వాటిని తాత్కాలిక జాబితాలో చేర్చింది.ఆ టవర్లే అడ్డు...ఇలాంటి కీలక తరుణంలో ఆ నిలువు రాళ్ల ప్రాంగణంలో ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టవర్లు నిపుణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముడుమాల్‌కు దాదాపు పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఆవల కర్ణాటకలో రాయచూర్ విద్యుత్ కేంద్రం ఉంది. అక్కడి నుంచి విద్యుత్‌ను పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ప్రత్యేక లైన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని గుత్తికి తరలిస్తోంది. ఈ లైన్ల తాలూకు టవర్లు సరిగ్గా ముడుమాల్ నిలువు రాళ్ల ప్రాంగణం మీదుగా సాగుతున్నాయి. అందులో ఓ టవర్ సరిగ్గా నిలువు రాళ్లున్న చోటుకు కాస్త పక్కనే ఉంది. లైన్లు మాత్రం సరిగ్గా నిలువు రాళ్ల మీదుగా సాగుతున్నాయి. మరో టవర్ ఈ నిలువ రాళ్లకు చేరువగా ఉన్న రాకాసి గుండుŠల్ (ఆదిమానవులు సమాధి ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే పెద్ద రాతి గుండ్లు) ఉన్న ప్రాంతంలో ఉంది. మరో టవర్ దానికి కాస్త పక్కగా ఉంది. వెరసి మూడు టవర్లు ఆ ప్రాంగణం వద్దనే ఉన్నాయి. ఓ చారిత్రక ప్రాంతానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే ముందు చాలా అంశాలను యునెస్కో పరిశీలిస్తుంది. ఆ ప్రాంతం ప్రత్యేకతకు అడ్డుగా కనిపించేలా భారీ టవర్లు ఉండకూడదనేది దాని నిబంధనల్లో ఒకటి. మరో ఏడాదిన్నరలో యునెస్కోకు డోషియర్‌ను సమర్పించనున్నారు. ఆ డోషియర్‌లో పేర్కొన్న ప్రత్యేకతలు ఆ ప్రాంతంలో ఉన్నాయా లేదా అని పరిశీలించేందుకు యునెస్కో ప్రతినిధులు వస్తారు. వారు వచ్చే నాటికి టవర్లు అడ్డుగా ఉంటే గుర్తింపునకు అవకాశాలు మూసుకుపోతాయి. ఈలోపే టవర్లను తరలించాల్సి ఉంటుంది. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని నిపుణుల బృందం ప్రభుత్వానికి తాజాగా విజ్ఞప్తి చేసింది.ఇదీ ఆ రాళ్ల ప్రత్యేకత...దాదాపు మూడున్నర వేల నుంచి నాలుగు వేల సంవత్సరం క్రితం ఆదిమానవులు ఆ రాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కోటి 10 అడుగుల నుంచి 15 అడుగుల ఎత్తున పెద్ద నిలువు రాళ్లను ఆదిమానవుల సమూహంలోని ముఖ్యుల సమాధులకు స్మారక శిలలుగా వాటిని ఏర్పాటు చేశారు. గతంలో వందల సంఖ్యలో ఉన్న రాళ్లు, వ్యవసాయ పనుల వల్ల ధ్వంసమై ప్రస్తుతం కేవలం 80 మాత్రమే మిగిలాయి.ఇక, వాటికి కనీసం 500 ఏళ్ల పూర్వం ఇదే తరహాలో వందల సంఖ్యలో పెద్ద రాతి గుండ్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అలాంటి గుండ్లు 1200 ఉన్నాయి.. ఇవి స్మారక శిలలే అయినా, ఆ రాతి నీడల ఆధారంగా నాటి వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు వినియోగించారని పరిశోధనలో గుర్తించారు. ఆకాశంలో సప్తర్షి మండలం(ఉర్సామెజర్)గా పరిగణించి నక్షత్రాల సమూహం ఉన్న ఆకృతి ఈ నిలువు శిలల వద్ద చెక్కి ఉంది. అది మూడున్నర వేల ఏళ్ల క్రితం చెక్కినదేనని పరిశోధకులు తేల్చారు. నక్షత్ర గమనం, రాళ్ల నీడల గమనం... తదితరాల ఆధారంగా వాతావరణంలో మార్పులు, కాలాల ఆగమనం, విపత్తుల అంచనా... ఇలా గుర్తించేవారని నిపుణులు పేర్కొంటున్నారు. -
జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర
బంజారాహిల్స్ (హైదరాబాద్): జూబ్లీహిల్స్‌లో జరిగే ఉప ఎన్నిక పార్టీల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎన్నిక కాదని పదేళ్ల అభివృద్ధి పాలనకు, రెండేళ్ల అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేళ్ల రైతుబంధు పాలనకు, రెండేళ్ల రాక్షస పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటీ 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారన్నారు. ఆమెకు అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని, రాష్ట్రంలో మరోసారి గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతోందని చెప్పారు. బుధవారం తమ పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరే ముందు బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. గోపీనాథ్ విశేష సేవలందించారు‘లక్షల మంది రైతన్నలు, నిరుద్యోగులు సునీత గెలవాలని కోరుకుంటున్నారు. తమ ఇళ్లు కూలగొట్టడం లాంటి అరాచకాలను చూసిన తర్వాత, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని, ఆ అరాచకాలకు అడ్డుకట్ట పడాలని నగర పేదలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాద్‌లో కట్టలేదు.. కానీ నగరంలో కేసీఆర్ కట్టిన లక్ష ఇళ్లు, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ హైదరాబాద్ ప్రజలకు గుర్తున్నాయి. బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్ని విషయాల్లో మోసపోయామని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు గుర్తించారు. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పడానికి వారితో పాటు మైనారిటీలు కూడా సిద్ధంగా ఉన్నారు. దళితబంధు, అభయహస్తం అమలుకాక దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో ప్రతిఒక్కరికి, నియోజకవర్గానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు గోపీనాథ్. ఆయన అకాల మరణంతో బాధపడుతున్న కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఆయన సతీమణి సునీతకు టికెట్ కేటాయించారు. రెండు సంవత్సరాల ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతిఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి..’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాగా సునీత గోపీనాథ్ బుధవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కేటీఆర్‌తో పాటు పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘ఓటుకు కోట్లు’పై నేడు సుప్రీం తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై గతంలో దాఖలైన ‘ఓటుకు కోట్లు’కేసులో గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఓటుకు నోటు కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల నియమావళి కింద విచారణ చేపట్టాలని కోరుతూ 2021 జూలై 22న రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ అంతకుముందు ఏప్రిల్ 13న సండ్ర వెంకట వీరయ్య కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లపై తాజాగా బుధవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని గతంలో బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి వారి తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం తొలుత వాదనలు వినిపించారు. అనంతరం రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహిత్గీ సుమారు గంటకుపైగా వాదనలు వినిపించారు. ఏసీబీ కేసు అక్రమం: ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై గతంలో దాఖలైన కేసు చెల్లుబాటు కాదని రోహత్గీ వాదించారు. ఈ కేసులో ముందుగా రేవంత్‌రెడ్డిని ట్రాప్ చేసిన తర్వాతే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎఫ్ఐఆర్ను నమోదు చేసిందని చెప్పారు. ఏసీబీ ట్రాప్ అక్రమమని పేర్కొన్నారు. 2015లో అమలుల్లో ఉన్న అవినీతి నిరోధక చట్టాలను అనుసరించి లంచం ఇవ్వడం నేరం కూడా కాదన్నారు. తమ కేసు 2015లో దాఖలైనందున, ఆనాటి చట్టాలే వర్తిస్తాయని చెప్పారు. మరోవైపు.. అప్పట్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన రేవంత్ ఇప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి మరోసారి తమ వైపు వాదనలు వినాలని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం ధర్మాసనాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. గురువారం వాదనల అనంతరం తీర్పును వెలువరించనుంది. -
మొదటి ప్రాధాన్యం ఆ 8 వైద్య కళాశాలలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 70 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తయిన ఎనిమిది వైద్య కళాశాలలను తొలుత అందుబాటులోకి తెచ్చేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కళాశాలలకు చెందిన 30 ఎకరాల ఆవరణ లో వైద్య విద్యార్థులకు హాస్టళ్లు, పారా మెడికల్ కాలేజీ, బోధనాస్పత్రి, ఎంసీహెచ్‌తోపాటు కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెలలో రూ. 500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. నవంబర్ నుంచి 2026 మార్చి వరకు ప్రతినెలా రూ. 340 కోట్లు కేటాయిస్తారు. ఈ మేర కు సీఎం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలలో విడుదల కానున్న రూ. 500 కోట్ల నుంచి తొలిదశలో చేపట్టిన 8 వైద్య కళాశాలల నిర్మాణానికి సంబంధించిన బకాయిల చెల్లింపు, మిగిలిపోయిన పనుల పూర్తికి వెచ్చిస్తారు. మొదటి దశ కాలేజీలే ముందుగా... రాష్ట్రంలో 2021 వరకు 9 మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉండగా, ఆ ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం 8 కొత్త కాలేజీలను ప్రకటించింది. సంగారెడ్డి, మహబూబాబాద్, జగిత్యాల, వనపర్తి, మంచిర్యాల, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండంలోని 8 మెడికల్ కాలేజీల్లో 2022 నుంచి అడ్మిషన్లు జరుగుతున్నాయి. అయితే తాత్కాలికంగా వేర్వేరు చోట్ల కళాశాలలను ఏర్పాటు చేసి, జిల్లా ఆస్పత్రులను అనుబంధ ఆస్పత్రులుగా మార్చి ఎంబీబీఎస్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలల నిర్మాణ పనులు దాదాపు 70 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్ల విధి వైద్యమే... వైద్య సంబంధమైన అంశాలపై సూపరింటెండెంట్లు దృష్టి పెట్టడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి నిర్వహణ బాధ్యతల నుంచి సూపరింటెండెంట్లను తప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఆస్పత్రుల్లో వైద్యం, వైద్యేతర అంశాలను విడివిడిగా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 100 పడకలు దాటిన ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను గ్రూప్–1 స్థాయి అధికారులకు అప్పగించాలని సీఎం రేవంత్‌రెడ్డి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఇతర అధికారులతో మంగళవారం రాత్రి జరిగిన సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు. కొత్తగా నియమితులైన గ్రూప్–1 స్థాయి అధికారుల్లో తొలుత 20 మందిని ప్రధాన ఆస్పత్రులు, బోధనాస్పత్రులకు కేటాయించాలని ఆదేశించినట్టు సమాచారం. » జోన్–1లో 65 ఏఓ పోస్టులు ఖాళీగా ఉండగా, జోన్–2లో 49 పోస్టులు వేకెంట్‌గా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయడం ద్వారా సూపరింటెండెంట్లకు పనిభారం తగ్గించనున్నారు. -
మాపై సీఎం రేవంత్ కుట్ర.. మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత ఆరోపణ
బంజారాహిల్స్ (హైదరాబాద్): తమ కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. రెడ్లందరూ కలసి తమ కుటుంబంపై పగబట్టారని విమర్శించారు. బుధవారం రాత్రి మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీ లోని కొండా సురేఖ నివాసం వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చి సురేఖ ఓఎస్డీ సుమంత్ గురించి ఆరాతీశారు. సుమంత్‌ను అరెస్టు చేసేందుకే వారు వచ్చినట్లు తెలుసుకున్న సుస్మిత బయటకు వచ్చి.. ‘ఎవరి కోసం వచ్చారు?.. ఎందుకొచ్చార’ని ప్రశ్నించారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో మీడియా చేరుకుంది. దీంతో ఆ నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజకీయంగా అణగదొక్కేందుకే..: ఈ వ్యవహారంపై కొండా సుస్మిత ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. బీసీ మంత్రి అయిన తన తల్లిని రాజకీయంగా అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘ఈరోజు సుమంత్‌పై కేసు పెట్టి, అర్ధరాత్రి ఇంటికి పోలీసులను పంపి మా అమ్మను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉండటమే మేం చేసిన తప్పా?. రేవంత్‌రెడ్డి మా కుటుంబంపై ఎందుకు పడ్డాడు? రేవంత్‌రెడ్డి అన్నదమ్ములైన తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి పార్టీకి ఏం చేశారని గన్మెన్లను ఇచ్చారు?’ అని ఆమె విరుచుకుపడ్డారు. కాగా, జూబ్లీహిల్స్ పోలీసులు మంత్రి సురేఖ ఇంటికి చేరుకుని మఫ్టీలో వచ్చిన వారి గురించి ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో సురేఖ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. -
రేపు ‘హ్యామ్’ టెండర్లు
సాక్షి, హైదరాబాద్: హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) ప్రాజెక్టులో భాగంగా పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి శుక్రవారం టెండర్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మొదటిదశలో 17 ప్యాకేజీల కింద 96 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,162 రహదారులు (7,449.50 కిలోమీటర్ల పొడవుతో) నిర్మించనున్నారు. హ్యామ్ ప్రాజెక్టుల కోసం.. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. 17 ప్యాకేజీలకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించేందుకు పీఆర్ ఈఎన్సీ జోగారెడ్డి ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారమే నోటీసు ద్వారా టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసి..టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. హ్యామ్ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ రహదారులు కొత్త దశలోకి ప్రవేశిస్తాయని, జాతీయ, అంతర్జాతీయ రహదారి నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్టు టెండర్లలో పాల్గొనాలని సీతక్క కోరారు. ఈ ప్రాజెక్ట్ అమలుతో గ్రామీణ రహదారి సదుపాయాలు మరింత పటిష్టమై గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. ఈ విధానం ద్వారా గ్రామీణ రహదారుల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, రవాణా సౌకర్యాలు విస్తృతంగా మెరుగుపడతాయని తెలిపారు. -
నిన్న మల్లోజుల.. నేడు ఆశన్న
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ హైదరాబాద్: మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోగా... అదే బాటలో మరో అగ్రనేత,కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సైతం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ముందు లొంగిపోనున్నట్లు తెలిసింది. ఆయనతోపాటు దాదాపు 60 మంది వరకు లొంగిపోతారని సమాచారం. వీరంతా ఇప్పటికే జగదల్పూర్కు చేరుకున్నట్లు చెబుతున్నారు. కీలక మహిళా మావోయిస్టు రణిత కూడా లొంగిపోయే వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి వీరంతా జనజీవన స్రవంతిలో కలవనున్నారు. మరోవైపు బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని వేర్వేరు జిల్లాల్లో మొత్తం 78 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో 27 మంది లొంగిపోగా, ఇందులో పది మంది మహిళా మావోలు ఉన్నారు. కాంకేర్ జిల్లాలో 32 మంది మహిళా మావోయిస్టులతో కలిపి మొత్తంగా 50 మంది అజ్ఞాతం వీడారు. ఇందులో మావోయిస్టు పార్టీలో కీలకమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన రాజమన్ మండావి అలియాస్ రాజ్‌మోహన్, రాజు సలామ్ అలియాస్ శివప్రసాద్ కూడా ఉన్నారు. 50 మంది మావోయిస్టుల బృందాన్ని ప్రత్యేక బస్సులో కాంకేర్ తరలించి అక్కడ లొంగుబాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ 7 ఏకే 47లతో పాటు మరో 17 ఇతర ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇక కొండగావ్ జిల్లాలో మరో మహిళా మావోయిస్టు లొంగిపోయింది. మల్లోజుల మార్గంలో.. శాంతిచర్చలపై ముందుగా అభయ్ పేరుతో మల్లోజుల వేణుగోపాల్ రాసిన లేఖ మార్చి 28న వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నార్త్ వెస్ట్ సబ్‌జోనల్ బ్యూరో ఇన్చార్జిగా రూపేశ్ అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ నుంచి వరుసగా మూడు లేఖలు విడుదలయ్యాయి. అంతేకాక ఒక యూట్యూబర్‌కు వీడియో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అన్ని లేఖల్లోనూ ‘శాంతి చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొందాం. తుపాకీ కంటే చర్చల ద్వారానే సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుంది’అనే అభిప్రాయాన్నే ఆశన్న వ్యక్తంచేశారు. దీంతో మల్లోజుల, ఆశన్న ఒకేదారిలో ఉన్నారనే అభిప్రాయం ఏర్పడింది. అందుకు తగ్గట్టే మల్లోజుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించిన మరుసటి రోజే ఆశన్న సైతం లొంగిపోతుండట గమనార్హం.యాక్షన్లలో దిట్ట తక్కెళ్లపల్లి వాసుదేవరావు స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట. హæన్మకొండలో పాలిటెక్నిక్ చదువుతూ రాడికల్ ఉద్యమాల వైపు ఆకర్షితుడై 1989లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ) చేపట్టిన పలు కీలక యాక్షన్లలో సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో 1999 సెపె్టంబర్ 4న ఐపీఎస్ అధికారి ఉమేశ్‌చంద్రను దారికాచి కాల్చి చంపిన ఘటన, ఆ తర్వాత 2000 మార్చి 7న అప్పటి ఉమ్మడి ఏపీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని ఘట్కేసర్ దగ్గర బాంబు పేల్చి చంపిన టీమ్‌లోనూ ఆశన్న ఉన్నారు. అంతేకాక 2003 అక్టోబర్‌లో తిరుపతి సమీపంలోని అలిపిరి దగ్గర సీఎం నారా చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకుని క్లెమోర్ మైన్స్ పేలి్చన తొమ్మిది మంది సభ్యుల బృందానికి ఆశన్నే నాయకత్వం వహించారు. వేర్వేరు లొంగుబాట్లు.. ప్లాన్‌లో భాగమే దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనపడిందనే అభిప్రాయం కలిగించడానికే అగ్రనేతల లొంగుబాటు కార్యక్రమాలను వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ ఏపీ, తెలంగాణలో ఉనికి కోల్పోయింది. ఏఓబీలో వరుస ఎన్కౌంటర్లలో చలపతి, గాజర్ల గణేశ్, మోడెం బాలకృష్ణ వంటి కేంద్ర కమిటీ సభ్యులతో పాటు చైతే వంటి మహిళా అగ్రనేతలు చనిపోయారు. ఇక ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్, మైలారపు ఆడేళ్లు చనిపోయారు. జార్ఖండ్‌లో జరిగిన ఎన్కౌంటర్లలో ప్రయాగ్ మాంఝీ, అంజు సోరేన్ మృతి చెందారు. దీంతో దండకారణ్యం అందునా అబూజ్మడ్, దక్షిణ బస్తర్‌కే మావోయిస్టు పార్టీ పరిమితమైంది. ఇక్కడ కూడా ఆ పార్టీ పట్టు కోల్పోయిందనే విషయం ప్రపంచానికి చాటేందుకే అబూజ్‌మాడ్‌లో మహారాష్ట్ర కేడర్‌కు చెందిన మావోలంతా మల్లోజుల వెంట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇదే మాడ్ ఏరియాలో ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన మావోయిస్టులంతా ఆశన్నతో కలిసి ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయ్ ఎదుట లొంగిపోయేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అంతకు మూడు రోజుల ముందు దక్షిణ బస్తర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు అగ్రనేతలు హైదరాబాద్‌లో లొంగిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు కీలక నేతలంతా మాడ్ అడవుల్లోనే తలదాచుకు న్నారు. అక్కడి నుంచి సురక్షితంగా లొంగిపోవాలంటే వారి ముందున్న ప్రత్యామ్నాయాలు మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మాత్రమేనని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. -
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. దాంతో మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగిన కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత.కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. అయితే సుమంత్ కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తుంది.నిన్న సుమంత్‌ను తన బాధ్యతల నుండి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
18న బీసీ సంఘాల బంద్‌కు బీఆర్ఎస్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్‌కు మద్దతు కోరుతూ ఆ సంఘాల నేతలు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం మాదిరే సమస్యను ఢిల్లీ దాకా తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే ఓటు వేసేది తమ ఎంపీలేనన్నారు.‘‘ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే చాయ్ తాగినంతసేపట్లో రిజర్వేషన్లు వస్తాయి. ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు కలిస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు వెంటనే చట్టంగా మారుతుంది...పార్లమెంటులో బిల్లు పెడితే కచ్చితంగా అనుకూలంగా పాస్ అవుతుంది. బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి తీసుకెళ్తే మేము వచ్చి మద్దతు ప్రకటిస్తాం. ప్రధాని స్వయంగా ఓబీసీ కాబట్టి, ఆయనకి బీసీ రిజర్వేషన్లపైన చిత్తశుద్ధి ఉంటే మంచిది’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. -
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
సాక్షి,హైదరాబాద్: కామారెడ్డి జిల్లా ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల మేరకు.. బుధవారం (అక్టోబర్ 15) బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం వద్ద ప్రయాణిస్తున్న స్కూటీని రాంగ్ రూట్లో వచ్చిన ఓ టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటన స్థలంలో మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని అత్యవసర చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మరో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నలుగురు మరణానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
బీజేపీ ఆఫీసులో ఉద్రిక్తత.. తన్నుకున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర బీజేపీ ఆఫీస్‌లో(BJP state office) బీసీ నేతల మధ్య కొట్లాట(BC leaders fight) తీవ్ర కలకలం రేపింది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు(ramachander Rao), బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య.. ఎదుటే నేతలు ఇలా తన్నుకోవడం విశేషం. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈనెల 18న బీసీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన బంద్‌కు(BC Bandh) మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరేందుకు ఇవాళ ఆర్.కృష్ణయ్యతో(R.Krishnaiah) పాటు బీసీ సంఘాల నేతలు బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టే సమయంలో జూనియర్ అయి ఉండి ఫొటోలకు ఎలా ముందుకు వెళ్తావ్ అని ఒకరినొకరు తిట్టుకున్నారు. దీంతో, రెండు వర్గాల నేతలు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. అనంతరం, ఒక్కసారిగా బీజేపీ ఆఫీసులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘర్షణకు దిగిన నేతలను మిగతా బీసీ నాయకులు అడ్డుకున్నారు. కొట్లాటకు దిగిన నేతలపై మిగతా బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
తెలంగాణలో గుప్త ఆలయం! సాహసోపేతమైన ప్రయాణం.. కోపాన్ని తగ్గించే కోనేరు.. మీకు తెలుసా? (ఫొటోలు)
-
ఇంక కేసీఆర్ ఫొటో ఎందుకు?..: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ప్రజల్లోకి వెళ్తూ నాలుగు నెలలపాటు యాత్ర చేపడుతున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ లాంచ్ చేసిన అనంతరం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల యాత్రతో తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఉద్యమకారులు,అమరవీరుల త్యాగాలకు అర్ధం ఉండాలంటే సామాజిక తెలంగాణ రావాలి. అందుకే యాత్రను చేస్తున్నాం. అయితే ఈ యాత్రలో తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫొటో ఉండబోదు అని అన్నారామె. అయితే.. ఇది కేసీఆర్‌ను అగౌరవపరిచే ఉద్దేశం ఎంతమాత్రం కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమం,తెలంగాణ లేదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే మనస్తత్వం నాకు లేదు. ఆ చెట్టు కింద దుర్మార్గులు ఉన్నారు. నేను నా తొవ్వను వెతుక్కుంటున్నా. కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయన ఫొటోతో ప్రజల్లోకి వెళ్లలేను అని స్పష్టత ఇచ్చారామె. అక్టోబర్ 25 2025 నుంచి నుంచి ఫిబ్రవరి 13 20206 వరకు నాలుగు నెలల పాటు జాగృతి జనం బాట కార్యక్రమం జరగనుందని కవిత ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటన చేస్తూ బీఆర్ఎస్ను వీడే సమయంలో కేసీఆర్ ఫొటోతోనే తాము భవిష్యత్ కార్యక్రమాలు చేపడతామంటూ కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. -
Rave Party: హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులో మళ్లీ రేవ్ పార్టీ కలకలం రేగింది. మాదకద్రవ్యాలు, మద్యం, క్యాసినో కాయిన్స్‌తో సాగే ఈ రాత్రి పార్టీలకు మరోసారి తెరలేపిన ఘటన ఇది. రాచకొండ పరిధిలోని మహేశ్వరం మండలం చెర్రాపల్లి సమీపంలోని కె. చంద్రారెడ్డి రిసార్ట్స్‌లో ఈ రేవ్ పార్టీ జరిగింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా SOT పోలీసులు రాత్రి ఆలస్యంగా దాడులు నిర్వహించి, రిసార్ట్స్‌లో జరిగిన అశ్లీల విందును అడ్డుకున్నారు.ఈ పార్టీని గుంటూరుకు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ డీలర్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన కంపెనీకి చెందిన ఇతర డీలర్లను, వ్యాపార భాగస్వాములను కలిపి “బిజినెస్ గ్యాదరింగ్” పేరుతో ఈ రేవ్ పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. రాత్రంతా సాగిన ఈ పార్టీలో 14 మంది మహిళలతో సహా మొత్తం 50 మంది ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు . ఈ మహిళలు హైదరాబాద్, బెంగళూరుకు చెందినవారని సమాచారం. వారితో పాటు పలువురు వ్యాపారవేత్తలు, యువకులు కూడా పార్టీలో పాల్గొన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దాడుల్లో 3 బ్లాక్‌డాగ్ విస్కీ మద్యం బాటిళ్లు, రెండు కాటన్ల బీర్లు స్వాధీనం చేసుకున్నారు. -
జూబ్లీహిల్స్ ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Jubilee Hills Elections) ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడింది. లంకల దీపక్ రెడ్డిని(Deepak Reddy) తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఊహించిన విధంగా దీపక్ రెడ్డి వైపే.. బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. తాజాగా బుధవారం ఉదయం దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక, దీపక్ రెడ్డి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దీపక్‌రెడ్డికి 25వేల ఓట్లు వచ్చాయి.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలోనూ పార్టీలు ఆచితూచి అడుగులు వేశాయి. ఇక, ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు ఉండనుంది. -
కేసీఆర్ రీఎంట్రీకి ఇదే మొదటి మెట్టు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తమకు మంచి రోజులు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఓటమి తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాగంటి సునీత గోపినాథ్ నామినేషన్ దాఖలు చేయడానికి బయల్దేరే ముందు తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ మాకు మంచి రోజులు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో అన్ని పనులు ఆగిపోయాయి. హైడ్రా పేరిట శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. కాబట్టి ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం.. .. గులాబీ దండు జైతయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం అవుతుంది. కేసీఆర్ పునరాగమనానికి ఇదే తొలి మెట్టు. ప్రజల దీవెనలు బీఆర్ఎస్కే ఉంటాయని ఆశిస్తున్నాం. మాగంటి సునీత గెలుపునకు బీఆర్ఎస్ సమిష్టిగా కృషి చేస్తుంది అని కేటీఆర్ అన్నారు.నామినేషన్ వేసిన సునీతజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ షేక్‌పేట ఎమ్మార్వో ఆఫీస్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమె వెంట కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితరులు ఉన్నారు. పదేళ్ల అభివృద్ధికి, రెండేళ్ల అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని, బీఆర్ఎస్ గెలిస్తే బుల్డోజర్ అరాచకాలకు పుల్‌స్టాప్ పడ్డట్లేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: వీడిన సస్పెన్స్.. బీజేపీ అభ్యర్థి ఎవరంటే..? -
రాజేంద్రనగర్‌లో కబ్జాలు..
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలను, భూ ఆక్రమణల నిరోధానికి ఏర్పాటైన హైడ్రా మరోసారి కొరడా ఝళిపించింది. నగరంలోని రాజేంద్రనగర్ (Rajendranagar) పరిధిలో బుధవారం దాడులు నిర్వహించిన హైడ్రా రూ.139 కోట్ల విలువైన భూములను అక్రమార్కుల బారి నుంచి కాపాడింది. హైడ్రా అధికారులు బుల్డోజర్లు, జేసీబీలతో అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలను తొలగిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అధికారులు తదనుగుణంగా చర్యలు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్, ఉప్పరపల్లి (upparpalli) గ్రామాల్లో ఉన్న ‘జన చైతన్య ఫేస్-1, ఫేస్-2’ నిర్మాణాల్లో నాలుగు పార్కుల భూమి ఆక్రమణలకు గురయ్యాయి. ఈ విషయమై స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపిన హైడ్రా అధికారులు.. కబ్జాలను ధ్రువీకరించుకున్నారు. బుధవారం నాటి చర్యలతో ఆక్రమణలో ఉన్న సుమారు 19,878 గజాల పార్కు స్థలం మళ్లీ ప్రభుత్వం స్వాధీనమైంది. దీని విలువ దాదాపు రూ.139 కోట్లు ఉండవచ్చునని అంచనా. బుధవారం ఉదయం ఉప్పరపల్లికి చేరుకున్న అధికారులు వేర్వేరు చోట్ల ఉన్న ఆక్రమిత భూముల్లోకి బుల్డోజర్లు, జేసీబీలు నడిపించారు. ఒక్కో ఆక్రమిత ప్రాంతం విస్తీర్ణం 500 నుంచి 3000 గజాల వరకు ఉంది. వీటిల్లోని చెట్లను తొలగించిన అధికారులు స్థలం చుట్టూ ఫెన్సింగ్ పనులు చేపట్టారు. ప్రభుత్వ భూమి అన్న హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. -
Hyderabad: టికెట్ లేని ప్రయాణం రూ.1.08 కోట్ల జరిమానా
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారి నుంచి ఒకేరోజు ఏకంగా రూ.కోటికి పైగా మొత్తం జరిమానాగా వసూలు చేశారు. ఒక రోజు జరిపిన తనిఖీలో ఇంతపెద్ద మొత్తం వసూలు కావటం భారతీయ రైల్వేలోనే రికార్డుగా నిలిచింది. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే ఆదేశం మేరకు.. మంగళవారం జోన్‌లోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ డివిజన్లలో సిబ్బంది విస్తృత తనిఖీలు జరిపారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని గుర్తించి 16,105 కేసులు నమోదు చేసి జరిమానాగా రూ.1.08 కోట్లను వసూలు చేశారు. ఈనెల 6న జరిపిన తనిఖీల్లో రూ.92.4 లక్షలు జరిమానాగా వసూలు చేశారు. ఇప్పటి వరకు అదే అత్యధికం. మంగళవారం వసూలు చేసిన జరిమానా మొత్తం భారతీయ రైల్వేలోనే ఒకరోజు గరిష్టం కావటం విశేషం. విజయవాడ డివిజన్ పరిధిలో అత్యధికంగా రూ.36.91 లక్షలు, గుంతకల్లు డివిజన్లో రూ.28 లక్షలు, సికింద్రాబాద్ డివిజన్లో రూ.27.9 లక్షలు, గుంటూరు డివిజన్లో రూ.6.46 లక్షలు, హైదరాబాద్ డివిజన్లో రూ.4.6 లక్షలు, నాందేడ్ డివిజన్లో రూ.4.08 లక్షల చొప్పున జరిమానా వసూలైంది. -
కదలికలను గమనించి.. కళ్లలో కారం కొట్టి
రంగారెడ్డి జిల్లా: కొన్నాళ్లుగా మహిళ కదలికలను గమనిస్తున్న ఓ దుండగుడు ఇంట్లోకి దూరి కళ్లలో కారం చల్లి.. క్రికెట్ బ్యాట్‌తో దాడిచేసి పుస్తెలతాడును అపహరణకు యత్నించాడు. పారిపోతున్న దొంగను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం శంకర్పల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన ప్రకారం.. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సవర్గాన్కు చెందిన కుంబారే సిద్ధారెడ్డి, సునీత దంపతులు వారి కుమారుడు, కుమార్తెతో కలిసి నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం శంకర్‌పల్లికి వచ్చారు. పట్టణంలో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రోజుమాదిరిగానే టిఫిన్ సెంటర్‌కు వచ్చిన సునీత పిల్లలకు లంచ్ బాక్స్ కట్టేందుకు ఉదయం 11.30గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లింది. కొన్నాళ్లుగా ఈ దంపతుల కదలికలను గమనిస్తున్న దుండగుడు మంకీ క్యాప్ ధరించి హఠాత్తుగా ఇంట్లోకి చొరబడ్డాడు. సునీత కళ్లలో కారం చల్లి.. క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసి మెడలోని పుస్తెలతాడును లాక్కుని పరారయ్యాడు. అక్కడే కార్ వాషింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ప్రవీణ్ గమనించి వెంటనే పట్టుకుని తనిఖీ చేశాడు. బ్యాగులో కారం పొడి, మంకీక్యాప్, పుస్తెలతాడు లభించింది. అప్పటికే సునీత భర్తకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలికి చేరుకున్న సిద్ధారెడ్డి దుండగుడు టిఫిన్ సెంటర్ ఎదురుగా అద్దెకు ఉండే వాసు(45)గా గుర్తించాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వాసు డైలీ ఫైనాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చేవెళ్ల కోర్టులో హాజరు పరచారు. రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
తనయుడి తిట్లతో తల్లి ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా: తరచూ కుమారుడు తిడుతుండటంతో మనస్తాపానికి గురైన తల్లి ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ స్రవంతి తెలిపిన వివరాలివి. మండల కేంద్రానికి చెందిన చింతల సాయిలు తన తల్లి చింతల లక్ష్మి (70)ను తరచూ తిడుతూ ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. తిండి పెట్టకుండా తల్లిని వేధించాడు. సూటిపోటి మాటలతో ఎందుకు బతికున్నావ్.. చనిపో అంటూ దూషించేవాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మి జీవితంపై విరక్తి చెంది.. సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు లక్ష్మి మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణలో కుమారుడు తల్లిని తిట్టడం, చనిపొమ్మంటూ వేధించడంతో ఆమె మనోవేదనకు గురయినట్లు తేలిందని ఎస్ఐ వివరించారు. పోలీసులు సాయిలుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో సల్మాన్‌ఖాన్..!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పక్షాల మైనారిటీ ఓటు బ్యాంక్‌కు గండి పడనుందా? అంటే అవుననే రాజకీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నియోజక వర్గంలో మైనారిటీ ఓట్లు కీలకం. మొత్తం ఓట్లలో 24 శాతానికిపైగా మైనారిటీ ఓటర్లు గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపనున్నారు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు మజ్లిస్ పార్టీకి మైనారిటీల్లో గట్టి పట్టు ఉంది. ఈసారి మజ్లిస్ ఉప ఎన్నికల బరికి దూరం పాటిస్తూ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌కు మైనారిటీ ఓటు బ్యాంక్‌తో పాటు మజ్లిస్ ఓటు బ్యాంక్ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక బీఆర్ఎస్ మైనారిటీ ఓటు బ్యాంక్‌పై ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల బరిలో సోషల్ వర్కర్ సల్మాన్‌ఖాన్ ఎన్నికల బరిలో దిగుతుండటంతో ప్రధాన ప్రక్షాల మైనారిటీ ఓటు బ్యాంక్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. స్థానికుడైన సల్మాన్ క్రౌడ్ ఫండింగ్‌తో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుండటంతో నిరుపేద మైనారిటీల్లో గట్టి పట్టు ఉంది. యువత ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. సల్మాన్ ఎన్నికల బరిలో ఉంటే మొత్తం మీద 20 శాతంపైగా కుటుంబాలు అతని వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మైనారిటీ ఓటర్లు 96 వేలపైనే జూబ్లీహిల్ నియోజకవర్గంలో మొత్తం 3.98 లక్షల ఓటర్లు ఉండగా అందులో 96 వేలపైగా మైనారిటీ ఓటర్లు ఉన్నారు. దీంతో మైనారిటీ ఓటర్లే గెలుపు ఓటములను నిర్ణయించే శక్తిగా మారారు. మజ్లిస్ పార్టీ గతంలో పాగా వేసేందుకు ప్రయతి్నంచింది. మొదటి సారి 2014 ఎన్నికలలో నవీన్ యాదవ్‌ను బరిలో దింపగా 41,656 ఓట్లు దక్కించుకొని స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్తో దోస్తీ కారణంగా పోటీకి దూరం పాటించడంతో నవీన్ యాదవ్ పారీ్టకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18,817 ఓట్లు వచ్చాయి.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కార్పొరేటర్‌ను ఎన్నికల బరిలో దింపినా.. పెద్దగా ప్రభావం చూపలేదు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్దిగా భారత క్రికెటర్ దిగ్గజం అజహరుద్దీన్ ఎన్నికల బరిలో దిగడంతో మైనారిటీ ఓట్లు చీలిపోయాయి. బీఆర్ఎస్కు మైనారిటీ ఓటు బ్యాంక్ కలిసి రావడంతో ఎన్నికల్లో గట్టెక్కగలిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేసిన నవీన్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈసారి మజ్లిస్ ఎన్నికల బరికి దూరం పాటిస్తూ కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం ఉన్నా.. సోషల్ వర్కర్ సల్మాన్ ఎన్నికల బరిలో దిగడం మింగుడు పడని అంశంగా తయారైంది. -
గర్భస్రావంతో ప్రాణం తీశారు
హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువతిని గర్భవతిని చేసిన హోంగార్డు.. గర్భస్రావం కోసం ఆర్ఎంపీతో చికిత్స చేయించాడు. అది వికటించి బాధితురాలు మృతి చెందిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో హోంగార్డుతో పాటు మహిళా ఆర్ఎంపీని పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూక్నగర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన బ్యాగరి మౌనిక (29) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ముచ్చింతల్ కు చెందిన బానూరి మధుసూదన్ పోలీస్ శాఖలో శంషాబాద్ ఫింగర్ ప్రింట్ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. మౌనికను ప్రేమిస్తున్నానంటూ ఏడేళ్ల నుంచి ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. ఈ క్రమంలో మౌనిక గర్భం దాల్చగా.. నాలుగు రోజుల క్రితం విషయం అతనికి తెలిసింది. దీంతో గర్భం తొలగించడానికి మౌనికను పాల్మాకులలో ఉన్న ఆర్ఎంపీ పద్మజ వద్దకు తీసుకువచ్చి అబార్షన్ చేయించాడు. వైద్యం వికటించి మౌనికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ మౌనిక ఈ నెల 13న మృతి చెందింది. మృతురాలి తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపైలైంగిక దాడి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. మంగళవారం నిందితులు మధుసూదన్, ఆర్ఎంపీ పద్మజను అరెస్టు చేశారు. -
Jubilee Hills Bypoll: అదృష్టం కలిసి రావాలని..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా అభ్యర్థులు నమ్మే స్వాములు, పంచాంగ కర్తలు వారి జాతకం, నక్షత్రం ప్రకారం ఏ రోజు, ఏ సమయంలో వేస్తే అదృష్టం వరిస్తుందో తెలుసుకొని నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఆయా స్వామీజీలు, పంచాంగకర్తలు, జ్యోతిషులు బిజీబిజీగా మారి వారికి తగు సలహాలు, సూచనలు, ఏదైనా సమస్య ఉండే దానికి చేయాల్సిన పరిహారాలు కూడా చెబుతున్నారు. కొందరు నేతలు మా అభ్యర్థే గెలవాలని పూజలు, హోమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు వందల దాకా నామినేషన్లు పడే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి రెండు రోజుల్లోనే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడం విశేషం. అయితే.. 16, 17, 18 తేదీల్లో దశమి, ఏకాదశి, ద్వాదశి మంచి రోజులు కావడంతో ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అధికంగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ నెల 17న నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ బుధవారం కొందరు నేతలతో కలిసి నామమాత్రపు నామినేషన్ వేసి, 18వ తేదీలోపు పార్టీ క్రియాశీల నేతలతో కలిసి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
నేడు మాగంటి సునీత నామినేషన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నా రు. హంగూఆర్భాటానికి తావు లేకుండా తొలిసెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో వెళ్లి నామినేషన్ వేస్తారు. ఈ నెల 19న మరో సెట్ నామి నేషన్ పత్రాల దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.కాగా మాగంటి సునీత మంగళవారం ఎర్రవల్లి నివా సంలో పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేతుల మీదుగా సునీత బీఫామ్‌ను అందుకున్నారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరఫున సునీతకు రూ.40 లక్షల చెక్కును కూడా కేసీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ కుటుంబ సభ్యులతోపాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావుగౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తదితరులు ఉన్నారు. -
నేడు హనుమకొండకు సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి బుధ వారం హనుమకొండ జిల్లాకు వెళ్లనున్నారు.నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృ మూర్తి సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం హనుమకొండకు వెళ్తున్నా రని, ఈ కార్యక్రమం అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరిగి వస్తారని సీఎంఓ మంగళవారం వెల్లడించింది. -
ఆర్ఆర్ఆర్ నం.161ఏఏ
సాక్షి, హైదరాబాద్ : రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి కీలక పురోగతి చోటుచేసుకుంది. ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ (పీఏటీఎస్సీ) ఆమోదించింది. ఇది ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సంబంధమైన సాధ్యాసాధ్యాలను అంచనా వేసి పరిశీలించి లోపాలను ఎత్తిచూపి వాటిని సరిదిద్దిన తర్వాత ఆమోదముద్ర వేస్తుంది. దాని ఆమోదం తర్వాతనే కీలక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదముద్ర లభిస్తుంది. దానికి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ పచ్చజెండా ఊపుతుంది. తాజాగా రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం సాంకేతిక, ఆర్థిక పరమైన అంశాల అప్రైజల్ను పూర్తి చేసుకుని పీపీపీఏసీ ఆమోదముద్రకు వెళ్లింది. త్వరలో ఆ కమిటీ కూడా సమావేశమై దీనికి తుది అనుమతి ఇవ్వనుంది. మరో పక్షం/నెల రోజుల్లో స్పష్టత రానున్నట్టు తెలిసింది. ఆ వెంటనే టెండర్లు తెరిచి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.నవంబరులో ఉత్తర భాగం టెండర్లను తెరవను న్నారు. అప్పటికి రోడ్డుకు జాతీయ రహదారి నంబరు రావాల్సి ఉంది. దీంతో దీనికి ఎన్‌హెచ్ 161ఏఏ నంబరును కేటాయించనున్నారని తెలిసింది. ఎన్‌హెచ్ 161ఏఏ ఎన్ఈ (నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే)గా రికార్డుల్లో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఆ నంబరును సంగారెడ్డి నుంచి తూప్రాన్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఉన్న రోడ్డుకు ఉంది. గతంలో రాష్ట్ర రహదారిగా ఉన్న ఆ రోడ్డును రీజినల్ రింగురోడ్డు ప్రతిపాదన సమయంలో జాతీయ రహదారిగా గుర్తించారు. అప్పట్లో ఆ రోడ్డును రీజినల్ రింగురోడ్డులో భాగంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉండేది. కానీ, దాన్ని ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించాలని నిర్ణయించటంతో, ఉన్న పాత రోడ్డు బదులు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుగా నిర్మించాలని ఆ తర్వాత నిర్ణయించారు. ఫలితంగా ఆ రోడ్డు దీనికి సమాంతరంగా కొనసాగనుంది. అయితే రీజినల్ రింగురోడ్డు జాతీయ రహదారి ఎక్స్‌ప్రెస్‌వేగా రూపుదిద్దుకోనున్నందున, దానికి సమాంతరంగా కొనసాగే పాత రోడ్డును జాతీయ రహదారి హోదా తొలగించి తిరిగి రాష్ట్రరహదారిగా మార్చనున్నారు. అప్పుడు దానికి 161ఏఏ నంబరు తొలగిపోతుంది. దాని నిర్వహణ పూర్తిగా రాష్ట్రప్రభుత్వ అధీనంలోని ఆర్అండ్బీ పరిధిలోకి చేరుతుంది. ఇప్పటికే 161 నంబరుతో ప్రధాన జాతీయ రహదారి, 161ఏ నెంబరుతో మరో రోడ్డు ఉన్నందున 161ఏఏ నంబరు ఏర్పడింది. మూడు రోడ్లకు అదే నంబరు ఉండనున్నందున అయోమయం లేకుండా రీజినల్ రింగురోడ్డుకు కొత్త నంబరు కేటాయించాలన్న అభిప్రాయం కూడా ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అప్పటివరకు 161 ఏఏతోనే రీజినల్ రింగురోడ్డు కొనసాగనుంది. -
‘టిమ్స్’కు కార్పొరేట్ లుక్..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఆస్పత్రుల్లో వైద్య సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటిని కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో తీర్చిదిద్దు తున్నారు. నిమ్స్ కన్నా మెరుగ్గా వైద్య సేవలతో పాటు నిర్వహణ వ్యవస్థను కూడా ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లో నిర్మిస్తున్న ‘టిమ్స్’పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కానున్నాయి. ఈ మూడు ఆస్పత్రులను నగర శివార్లలో ఏర్పాటైన కుత్బుల్లాపూర్, మహేశ్వరం మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఓవైపు జనరల్ ఆస్పత్రులుగా నడిపిస్తూనే, స్పెషలైజేషన్ వైద్యానికి కేరాఫ్‌గా ‘డ్యూయల్ రోల్’లో కొనసాగించనున్నారు.‘ఆపరేషనల్ ఫ్రేమ్‌వర్క్’పై...టిమ్స్‌లో కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉన్న ‘ఆపరేషనల్ ఫ్రేమ్‌వర్క్’ను సాధ్యమైనంత మేర అమలు చేసే అంశాన్ని ఆరోగ్యశాఖ సునిశితంగా పరిశీలిస్తోంది. ఇందుకోసం గచ్చిబౌలి, హైటెక్ సిటీల్లో ఉన్న రెండు మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ ఆస్పత్రుల ఫ్రేమ్ వర్క్‌పై ఆరోగ్యశాఖ అధికారులు అధ్యయనం చేశారు. ఆ రెండు 1,000 పడకల సామర్థ్యం కలవి కావడంతో అక్కడి ఓవర్వ్యూతోపాటు స్టాఫింగ్ ప్యాటర్న్, నాన్ మెడికల్ సర్వీసెస్, ఇతర ముఖ్యమైన అంశాలపై నివేదికలు తెప్పించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. బెడ్ కెపాసిటీ, ఓపీ, ఐపీ తీరు, స్టాఫింగ్, ఐటీ, మౌలిక వసతుల వరకు అన్ని అంశాలను పరిశీలించారు. ఆస్పత్రుల నిర్వహణ వ్యవస్థ నుంచి డాక్టర్లను పక్కన బెట్టి, వైద్యులు, ప్రొఫెసర్లుగా ఉన్న నిపుణులు పూర్తిస్థాయిలో వైద్యంపైనే దృష్టి పెట్టేలా ప్రణాళిక రూపొందించారు. ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను ఎండీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు పూర్తి చేసిన వారిని నియమించడంతోపాటు ఆస్పత్రులకు అవసరమైన స్పెషలైజ్ డాక్టర్లను ప్రత్యేకంగా నియమించుకోవాలని నిర్ణయించారు. ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన వేలాది మంది సిబ్బందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోనున్నారు.నిమ్స్ తరహాలో ఫీజుల వసూలుటిమ్స్లో చికిత్స పొందే రోగుల నుంచి స్వల్పంగా ఫీజులను వసూలు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక ప్రతిపత్తితో కొన సాగుతున్న నిమ్స్ తరహాలోనే ఓపీ నుంచి ఇన్‌పేషెంట్ల వరకు ఈ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఫీజులు నిర్ణయించనున్నారు. అయితే నిమ్స్ స్థాయిలో కాకుండా సామా న్యులు కూడా భరించేలా తక్కువ మొత్తంలో రోగుల నుంచి ఫీజులు వసూలు చేయ డం ద్వారా వారిలో జవాబుదారీతనాన్ని పెంపొందించనున్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 1,000 పడకలు గల ఒక్కో ఆస్పత్రిలోని 350 పడకలను రెండు మెడికల్ కళాశాలలకు అనుబంధంగా కేటాయించి, మిగతా 650 పడకలకు సంబంధించి ఫీజులు వసూలు చేయను న్నారు. అవి కూడా స్పెషలైజ్ వ్యాధులకు సంబంధించి మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలకు సంబంధించి నిమ్స్‌లో అమలవుతున్న విధానాన్నే ఈ టిమ్స్‌ల్లో కూడా పాటించనున్నారు. -
జూబ్లీహిల్స్ ఓట్ చోరీపై నేడు హైకోర్టుకు..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైన నకిలీ ఓటర్లను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. డూప్లికేట్ ఓటర్ల నమోదు ద్వారా అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా విశ్వసనీయత ప్రశ్నార్థకమైన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలన్నారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. ఓట్ చోరీకి సంబంధించిన రుజువులను తమ పార్టీ కార్యకర్తల సహకారంతో రెండు రోజుల వ్యవధిలోనే ప్రజల ముందు పెట్టామన్నారు. అయినా ఎన్నికల కమిషన్ ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఓటరు జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలపై మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసి 24 గంటలు దాటినా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బుధవారం హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. అసాధారణంగా ఓట్లు పెరిగాయ్.. ‘తెలంగాణ ఓట్ చోరీ అంశంపై రాహుల్ గాంధీ స్పందించాలి. బిహార్‌లో ఓటు చోరీ జరిగితే తెలంగాణలో ఓట్ల చోరీ ద్వారా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోంది. రాహుల్ గాంధీ రాజ్యాంగం ప్రతులను చేతిలో పట్టుకొని అన్ని రాష్ట్రాల్లో నీతి సూక్తులు వల్లె వేస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని యత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కింది అధికారులతో కుమ్మక్కైన అంశాన్ని రాహుల్ గాంధీ పరిగణనలోకి తీసుకొని ఇక్కడ జరిగిన దొంగ ఓట్ల అంశంపై స్పందించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా 23వేల ఓట్లు పెరిగాయని ఎన్నికల సంఘం చెబుతోంది. మరో 12వేల ఓట్లు తొలగించామని చెబుతున్నా అసాధారణంగా ఓట్లు పెరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన వ్యక్తి అక్రమంగా ఓటరు ఐడీ కార్డులను పంపిణీ చేయడంపై ఎన్నికల సంఘం కేసు కూడా నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్‌కు మూడు ఓట్లు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఎన్నికల అక్రమాల కోసం కిందిస్థాయి అధికారులను కాంగ్రెస్ ఉపయోగించుకుందనే అనుమానం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి మూడు ఓట్లు ఉన్న తర్వాత స్వేచ్ఛగా ఎన్నిక జరుగుతుందని ఎలా అనుకోవాలి. ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
లొంగిపోయిన మల్లోజుల..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి, పెద్దపల్లి: తొలితరం మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోయారు. ఆయన తలపై రూ.6 కోట్ల వరకు రివార్డు ఉంది. 60 మంది అనుచరులతో కలిసి ఆయన గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వేణుగోపాల్‌తోపాటు లొంగిపోయిన మావోయిస్టులందరినీ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో హోద్రి గ్రామం నుంచి పోలీస్ వాహనాల్లోనే గడ్చిరోలి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. లొంగిపోయినవారిలో ముగ్గురు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జెడ్సీ) సభ్యులు, పదిమంది డివిజినల్ కమిటీ సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, మల్లోజుల లొంగుబాటును మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నెల 16న మీడియా సమావేశంలో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించనున్నారని సమాచారం. మల్లోజుల భార్య, గడ్చిరోలి దళ సభ్యురాలు తారక్క 2024 డిసెంబర్ 31న లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ వల్ల పార్టీ ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోవడంతో ఇక పోరాడలేమని గ్రహించి మావోయిస్టు పార్టీలో కొందరు లొంగుబాట పట్టారు. మల్లోజుల కూడా సాయుధ పోరాట పంథాను వీడుతున్నట్లు ఇటీవలే లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో మల్లోజుల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్ జీ కూడా పార్టీలో అగ్రనేతే. ఆయన 2011లో పశ్చిమబెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. కిషన్‌జీ భార్య పోతుల కల్పన గతేడాది తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగుబాటుకు కారణాలివే.. వేణుగోపాల్‌కు ప్రస్తుతం 70 ఏళ్లు. ఆయనపై 100కుపైగా కేసులున్నాయి. అనారోగ్య, వ్యక్తిగత కారణాలతోపాటు మారుతున్న రాజకీయ పరిస్థితులు కూడా ఆయన లొంగుబాటుకు కారణమని చెబుతున్నారు. ప్రజల నుంచి రోజురోజుకూ ఆదరణ తగ్గుతుండటం, అడవులపై బలగాల పట్టు పెరిగిన కొద్దీ.. వాటిని వదిలి కొత్త ప్రాంతాలకు వెళ్లడంపై వేణుగోపాల్ విభేదిస్తూ వస్తున్నారు. సాయుధ పోరు వదిలి రాజకీయ వేదికగా ఉద్యమించాలని కొంతకాలంగా చెబుతున్నారు. ఈ విషయంపై ఆగస్టు 15న ‘టెంపరరీ ఆర్మ్డ్ స్ట్రగుల్ అబాండెన్’పేరిట విడుదల చేసిన లేఖ సెపె్టంబర్ 17న వెలుగుచూడటం పార్టీలో కలకలం రేపింది. పార్టీలో తీవ్ర చర్చకు దారితీయడంతో ఆయుధాలు సరెండర్ చేయాలని పార్టీ ఆదేశించింది. వేణుగోపాల్ లొంగుబాటును మహారాష్ట్ర గడ్చిరోలి, ఉత్తర బస్తర్, దండకారణ్యంలోని మెజారిటీ మావోయిస్టు అనుచరగణం సమర్థిస్తోంది. కానీ, మావోయిస్టు అగ్రనేతలు పుల్లూరి ప్రసాద్, పార్టీ తెలంగాణ కమిటీ, సెంట్రల్ కమిటీ నేతలు ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. తండ్రి బాటలో పోరాట మార్గం.. మల్లోజుల వేణుగోపాల్‌ది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కేంద్రం). బ్రాహ్మణ కుటుంబంలో 1956లో ఆయన జన్మించారు. తండ్రి మల్లోజుల వెంకటయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా తామ్రపత్రం అందుకున్నారు. ఆయన వెంకటయ్య 1997లో మరణించారు. తల్లి మధురమ్మ గతేడాది కాలం చేశారు. మరో సోదరుడు ఆంజనేయులు కేడీసీసీ బ్యాంకులో పనిచేసి రిటైరయ్యారు. తండ్రి బాటలోనే పేద ప్రజల హక్కుల కోసం మల్లోజుల కోటేశ్వర్రావు, వేణుగోపాల్ ఉద్యమించారు. జగిత్యాల జైత్రయాత్ర అనంతరం 1978లో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1980లో పీపుల్స్‌వార్ ఆవిర్భావ సభ్యులుగా వ్యవహరించారు. 1986లో పెద్దపల్లిలో డీఎస్పీ బుచ్చిరెడ్డిని అప్పటి పీపుల్స్‌వార్ నక్సల్స్ కాల్చి చంపారు. ఆగ్రహించిన పోలీసులు వెంకటయ్య – మధురమ్మ ఇంటిని కూల్చివేశారు. దీంతో కొంతకాలం వారు గుడిసెలో తలదాచుకున్నారు. వేణుగోపాల్ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి అధినేతగా పనిచేశారు. మహారాష్ట్ర, ఏపీ, గోవాతోపాటు పశ్చిమ కనుమల్లో పార్టీ కార్యకలాపాలు విస్తరించారు. 2010లో పార్టీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ మరణం తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. 2010లో గడ్చిరోలిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోతలో ఇతనే మాస్టర్ మైండ్ అని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. 2011లో పశ్చిమబెంగాల్ పోలీసుల ఎన్కౌంటర్లో ఆయన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్రావు మరణించారు. ఆ తరువాత సెంట్రల్ ఇండియా అడవుల్లో పార్టీని బలోపేతం చేయడంలో వేణుగోపాల్ వ్యూహాలు రచించారు. ఆయన గడ్చిరోలి జిల్లాలో పనిచేసే సమయంలో తారక్కను వివాహమాడారు. 2018లో ఆమె మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. 44 ఏళ్లపాటు అజ్ఞాతంలోనే ఉన్న ఆయన పార్టీ విధానాలతో విబేధించి జనజీవన శ్రవంతిలో కలిశారు. వేణుగోపాల్ తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కోయ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరని చెబుతారు. ‘సాధన’అనే కలం పేరుతో గోండుల జీవితాలకు అక్షరరూపం ఇచ్చారు. సరిహద్దు, రాగో అనే నవలు రాశారు. అడవి నుంచి అమ్మకు లేఖ తన తల్లి మధురమ్మ అంత్యక్రియలకు రాలేకపోయిన వేణుగోపాల్.. మీడియాలో కథనాలు చూసి ‘అమ్మా.. నన్ను మన్నించు’అని లేఖ రాశారు. ‘నీకు, అమరుడైన నా సోదరునికి.. మన కుటుంబానికి ఏ కలంకం రాకుండా, జనానికి దూరం కాకుండా తుదివరకూ నమ్మిన ఆశయాల కోసం నిలబడతానని మరోసారి హామీ ఇస్తున్నా.. అమ్మా’అంటూ లేఖ విడుదల చేశారు. దానికి విరుద్ధంగా వేణుగోపాల్ లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. నానమ్మ ఉంటే సంతోషించేది మా బాబాయ్ జనజీవన స్రవంతిలోకి రావడం సంతోషంగా ఉంది. కుటుంబం, దోస్తుల ప్రేమను దూరం చేసుకుని నమ్మిన సిద్ధాంతాలు, ఆశయాల కోసం ఇన్నేళ్లు నిస్వార్థంగా పనిచేశారు. మా నానమ్మ (మధురమ్మ) కొడుకును చివరిచూపు చూడాలని తపించింది. రెండేళ్ల క్రితం చనిపోయింది. ఇప్పుడు ఉంటే కొడుకుని చూసుకుని సంతోషపడేది. –దిలీప్‌శర్మ, వేణుగోపాల్ అన్న కూమరుడు వారిచేతుల్లోనే ఎదిగిన నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు వేణువాళ్ల ఇంట్లోనే తిరుగుతుండేవాడిని. కోటన్న, వేణన్న నన్ను ఎత్తుకుని ఆడించేవారు. విప్లవబాట పట్టాక మధురమ్మ ద్వారా వారి గురించి తెలుసుకున్నా. వెంకటయ్య తాత, కిషన్ అన్న, మధురమ్మ చనిపోయినప్పుడు కూడా వాళ్లు రాలేదు. ఇప్పుడు లొంగిపోయారు. ఇక్కడకు వస్తే ఒక్కసారి చూడాలని ఉంది. – ఠాకూర్ విజయ్‌సింగ్, పొరుగింటి వ్యక్తి -
బనకచర్ల డీపీఆర్ చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) రూపకల్పన కోసం తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించడం పూర్తిగా చట్టవిరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. ఈ ప్రాజెక్టును చేపట్టకుండా ఏపీని కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుకు లేఖ రాశారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2010, 2017లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 75 శాతం నీటి లభ్యత ఆధారంగానే కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని గుర్తు చేసింది. దీనికి విరుద్ధంగా వరద జలాల ఆధారంగా ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతుల జారీ అంశాన్ని ఏ ప్రాతిపదికన పరిశీలిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సీడబ్ల్యూసీ, గోదావరి యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)తో పాటు ప్రభావిత రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయని గుర్తు చేసింది. ఏపీ సమర్పించిన పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ప్రిఫీజిబిలిటీ నివేదిక (పీఎఫ్ఆర్)ను పరిశీలించరాదని కేంద్రాన్ని కోరింది. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ సమ్మతి ఇచ్చినట్టు పరిగణించాలని పేర్కొంటూ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన సెక్షన్ 90 (3)ని ఉల్లంఘించి ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించిందని అభ్యంతరం తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ ఇచ్చిన సమ్మతి పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు వర్తించదని స్పష్టం చేసింది. ఇదే చట్టంలోని సెక్షన్–30(2) ద్వారా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో పాటు ఈ ప్రాజెక్టు ఆపరేషన్ ప్రొటోకాల్‌ను సైతం కేంద్రమే ఖరారు చేసిందని గుర్తు చేసింది. వీటన్నింటినీ ఉల్లంఘిస్తూ ఏపీ ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు అనుమతుల జారీ ప్రక్రియను చేపట్టరాదని కేంద్రాన్ని కోరింది. అత్యవసర సమావేశం నిర్వహించాలి ఏపీ అక్రమంగా నిర్మించతలపెట్టిన పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై చర్చించడానికి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని తెలంగాణ రాష్ట్రం కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్ ఈ నెల 10న లేఖ రాశారు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా 484.5 టీఎంసీల గోదావరి జలాల తరలింపునకు మాత్రమే అనుమతి ఉండగా, దీనికి విరుద్ధంగా ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన కోసం ఏపీ టెండర్ ప్రకటన జారీ చేసిందని అభ్యంతరం తెలిపారు. దీని వల్ల ప్రభావితం కానున్న గోదావరి పరీవాహకంలోని రాష్ట్రాలతో తక్షణమే అత్యవసర సమావేశం నిర్వహించాలని లేఖలో కోరారు. బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన కోసం ఏపీ టెండర్లను ఆహ్వానించడం పట్ల అభ్యంతరం తెలుపుతూ ఈఎన్సీ అంజాద్హుసేన్ ఈ నెల 10న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్ జైన్‌కు మరో లేఖ రాశారు. -
ఎలాగూ శిక్ష పడుతుందని.. ఘోరానికి పాల్పడ్డాడు
మెదక్ మున్సిపాలిటీ: హత్య కేసులో తనకు ఎలాగైనా శిక్ష పడుతుందని భావించిన ఓ నిందితుడు మరో ఘాతు కానికి పాల్పడ్డాడు. గిరిజన మహిళకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి హత్యాచారం చేశాడు. సంచలనం సృష్టించిన మెదక్ జిల్లా కొల్చారం మండలం పొతంశెట్టిపల్లి వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు గల కారణాలు తెలుసుకొని పోలీసులు సైతం నివ్వెరపోయారు. మంగళవారం మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సేవాలాల్ తండాకు చెందిన ఫకీరానాయక్.. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం అంబోజిగూడ తండాలో ఉంటున్నాడు. ఈనెల 11న మెదక్‌లో అడ్డాపైకి వచి్చన సంగాయిగూడ తండాకు చెందిన గిరిజన మహిళను పనికోసమని చెప్పి బస్సులో కొల్చారం మండలం ఏడుపాయల కమాన్ వద్ద ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసి, బండ రాయితో కొట్టి వెళ్లిపోయాడు. కొనఊపిరితో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మెదక్‌లోని పాత బస్టాండ్ వద్ద గల ఓ వైన్స్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. పాత నేరస్తుడు ఫకీరానాయక్ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. నిందితుడిపై ఇది వరకే ఏడు కేసులు ఉన్నాయి. మహిళ హత్య కేసుకు సంబంధించిన కేసులో శిక్ష పడుతుందన్న ఉద్దేశంతో తన కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. ఆమె నిరాకరించడంతో పైశాచికంగా వ్యవహరించాడు. ఆమె ఒంటిపై ఉన్న బట్టలు తీసి చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసి, అక్కడే ఉన్న రాయితో కొట్టి చంపాడు. మహిళను హత్యచేసిన సమయంలో ఎత్తుకెళ్లిన ముక్కు పుడక, హత్యకు ఉపయోగించిన రాయి, కట్టె, చర్చి వద్ద వదిలేసిన దుస్తులను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 2020లో జరిగిన హత్య కేసులో సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితుడు ఫకీరానాయక్కు జీవిత ఖైదుతోపాటు రూ.15వేల జరిమానా విధించారు. -
ఎన్ఓసీల దందా బంద్ !
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని చెరువులు, కుంటల ఫుల్ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతిస్తూ అడ్డగోలుగా నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) జారీ చేశారని వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వరుసగా ఎన్ఓసీల కుంభకోణాలు వెలుగులోకి రావడంతో హైదరాబాద్ సర్కిల్ సీఈ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. నీటిపారుదల శాఖ హైదరాబాద్ సర్కిల్ సీఈ పరిధిలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి ఇంజనీర్లలో ఒకరు మినహా మిగిలిన వారందరినీ ఆన్‌డ్యూటీ (ఓడీ)పై జిల్లాలకు పంపింది. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ), సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ), డిప్యూటీ సీఈ హోదాలో హైదరాబాద్ సీఈ పరిధిలో పనిచేస్తున్న మొత్తం 55 మంది ఇంజనీర్లను హైదరాబాద్ బయటి ప్రాంతాలకు పంపింది. వారి స్థానంలో పనిచేసేందుకు జిల్లాల్లో పనిచేస్తున్న 51 మంది ఇంజనీర్లను ఆన్‌డ్యూటీపై హైదరాబాద్ సీఈ కార్యాలయానికి పంపింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఉద్యోగుల సర్దుబాటు కొనసాగుతుందని చెప్పారు. గండిపేట సబ్ డివిజన్ డీఈఈగా, హైదరాబాద్‌లోని జలసౌధ కార్యాలయం ఎస్టేట్ అధికారిగా దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ మహిళా ఇంజనీర్‌కు మాత్రమే ప్రత్యేక మినహాయింపు కల్పించడం పట్ల నీటిపారుదల శాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. గండిపేట పరిధిలో రూ.వేల కోట్లు విలువ చేసే నీటిపారుదల శాఖ భూములు పెద్దఎత్తున కబ్జాలకు గురయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకోవాలని ఇటీవల మంత్రి ఉత్తమ్ ఆదేశించిన విషయాన్ని కొందరు ఇంజనీర్లు గుర్తు చేస్తున్నారు. నాలుగేళ్లుగా గండిపేట సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఇంజనీర్‌ను అక్కడే కొనసాగిస్తూ క్షేత్ర స్థాయి పోస్టుల్లో పనిచేస్తున్న ఇంజనీర్లందరినీ పంపడం వెనక మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఓడీపై ఎందుకంటే..పైరవీలు, రాజకీయ పలుకుబడితో కార్యాలయం పరిధిలో దీర్ఘకాలంగా తిష్టవేసి అక్రమాలకు పాల్ప డుతున్నట్టు ఆరోపణలుండడంతో క్షేత్రస్థాయిలో ఇంజనీర్లందరినీ బదిలీ చేయాలని మంత్రి ఆదేశించినట్టు తెలిసింది. బదిలీలపై అమల్లో ఉన్న నిషేధాన్ని ఉల్లంఘిస్తూ బదిలీలు నిర్వహిస్తే సంబంధిత ఉద్యోగుల జీతాలను ఆర్థిక శాఖ నిలుపుదల చేసిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆన్‌డ్యూటీపై ఇతర ప్రాంతాలకు పంపి నిషేధం ఎత్తేశాక బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలని ఆ శాఖ నిర్ణయం తీసుకుంది. నేపథ్యం ఇదీ...రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామంలోని కొత్తకుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు ఎన్ఓసీ జారీ చేయడంపై ఇటీవల నీటిపారుదల శాఖ విచారణ జరిపించగా ఎన్నో సంచలన అంశాలు వెలుగు చూశాయి. కొత్తకుంట చెరువు ఎఫ్టీఎల్ 8.284 ఎకరాల్లో విస్తరించి ఉండగా 2.03 ఎకరాలేనంటూ ఎన్ఓసీ జారీ చేసినట్లు తేలింది. ఈ వ్యవహారంపై ఆరోపణలు రావడంతో ఎన్ఓసీ జారీకి సంబంధించిన రికార్డులను మాయం చేసేసినట్టు రుజువైంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న హైదరాబాద్ సర్కిల్ సీఈ కె.ధర్మాను గతంలోనే ప్రభుత్వం పోస్టు నుంచి తొలగించి కొత్త పోస్టింగ్ కేటాయించలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఏఈఈ వి.గంగరాజు ఏడాది కాలంగా విధులకు గైర్హాజరవుతున్నారు. డీఈఈ కె.జగదీశ్వర్, ఈఈ కె.బన్సీలాల్, ఎస్ఈ హైదర్ ఖాన్‌కు సైతం ఈ వ్యవహారంలో పాత్ర ఉన్నట్టు విచారణలో తేలింది. వీరిలో గంగరాజు, కె.జగదీశ్వర్‌ను ప్రభుత్వం ఓడీపై ఇతర జిల్లాలకు పంపింది. -
మహేశ్వరంలో రేవ్‌పార్టీ కలకలం.. పోలీసుల అదుపులోకి లేడీ డ్యాన్సర్లు
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రేవ్ పార్టీ కలకలం రేగింది. కె చంద్రారెడ్డి రిసార్ట్స్‌లో పోలీసులు ఆకస్మిక ఆపరేషన్‌తో రేవ్ పార్టీ గుట్టురట్టయ్యింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ పార్టీ ఏర్పాటు చేసుకుంది. ఫర్టిలైజర్ కంపెనీ వివిధ డీలర్లకు పార్టీ ఇచ్చే క్రమంలో లిక్కర్‌తో పాటు అమ్మాయిలను కూడా ఏర్పాటు చేసింది ఫర్టిలైజర్ కంపెనీ. దీనిపై సమాచారం అందుకున్న రాచకోండ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. దాంతో వీరి వ్యవహారం బట్టబయలైంది. లిక్కర్ కోసం ఎక్స్సైజ్ శాఖ అనుమతి తీసుకున్నారు ఫర్టిలైజర్ కంపెనీ యజమాని. అయితే అక్కడ అమ్మాయిల ఏర్పాటు అనేది చట్ట విరుద్ధం కావడంతో లిక్కర్‌తో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డైల్ 100 ఫిర్యాదు మేరకే పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. -
తెలుగు ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్
భోపాల్: హర్యానాలో తెలుగు సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు పూరాన్ కుమార్ తన మరణానికి కారణమైన పోలీస్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తుల పేర్లు రాశారు. వారిలో ఒకరైన రోహత్క్ సైబర్ సెల్ ఏఎస్ఐ సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సందీప్ కుమార్ సైతం ‘సత్యం’ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లు లేఖ రాయడం కలకలం రేపుతోంది.రోహ్తక్లోని ఓ పొలంలో సందీప్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ వీడియో,మూడుపేజీల సూసైడ్ నోట్ రాశారు. ఆ నోట్లో ‘ఐపీఎస్ పూరన్ కుమార్ అవినీతి పోలీసు అధికారి. తన అవినీతి బయటపడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత పూరన్ కుమార్ బదిలీ అయ్యారు. ఐపీఎస్ అధికారి గన్‌మెన్ మద్యం కాంట్రాక్టర్ నుండి రూ. 2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా నేనే పట్టుకున్నాను. ఓ గ్యాంగ్‌స్టర్ బెదిరించడంతో కాంట్రాక్టర్ పూరన్ కుమార్‌ను కలిశాడు. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పుడు.. ఐపీఎస్ అధికారి దానికి కులం రంగు పులిమేందుకు ప్రయత్నించారు. పూరన్ కుమార్‌ను రోహ్తక్ పరిధిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అవినీతికి అంతులేకుండా పోయింది. రోహ్తక్లో బాధ్యతలు చేపట్టి నిజాయితీపరులైన పోలీసు అధికారుల స్థానంలో అవినీతిపరులైన అధికారులను నియమించడం ప్రారంభించారు. సదరు అధికారులు బ్లాక్మెయిల్ చేయడం, పిటిషనర్లకు ఫోన్ చేసి, డబ్బులు అడిగి వారిని మానసికంగా హింసించేవారు. బదిలీలకు బదులుగా మహిళా పోలీసు సిబ్బందిని లైంగికంగా వేధించారు. ‘ఐపీఎస్ పూరన్ కుమార్ అవినీతి మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. అతనిపై వచ్చిన ఫిర్యాదులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆస్తులపై దర్యాప్తు చేయాలి. ఇది కుల సమస్య కాదు. నిజం బయటకు రావాలి. అతను అవినీతిపరుడు. ఈ నిజం కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేస్తున్నాను. నేను నిజాయితీతో నిలబడినందుకు గర్వపడుతున్నాను. నా కుటుంబ సభ్యులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు’ అంటూ తన బలవన్మరణానికి ముందు సైబర్ సెల్ ఏఎస్ఐ సందీప్ కుమార్ రాసిన సూసైడ్ నోట్లో సంచలన ఆరోపణలు చేశారు. కాగా, సందీప్ కుమార్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్న పదిమంది అధికారులలో ఒకరైన రోహ్తక్ పోలీస్ చీఫ్ నరేంద్ర బిజార్నియాను ప్రశంసించారు. వెనువెంటనే బిజార్నియా రోహ్తక్ నుంచి మరో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసినట్లు సమాచారం. -
తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా చిలుకు వేణుగోపాల్ రెడ్డి
బెంగుళూరు: సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ (సీమ) జాతీయ అధ్యక్షులు కె. ఆదినారాయమూర్తి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర (2025-27) నూతన అధ్యక్షులుగా సౌత్ ఇండియా టైమ్స్ ఎడిటర్ చిలుకు వేణుగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తారని, తెలంగాణ వ్యాప్తంగా 'సీమ' కార్యకలాపాల విస్తరణకు కృషి చేస్తారని ఆశిస్తున్నామని, వివిధ పత్రికలు, టెలివిజన్లలో పనిచేస్తున్న పాత్రికేయులు దైనందిని జీవనంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాత్రికేయులకు కల్పిస్తున్న సదుపాయాల్ని వారు విస్తృత స్థాయిలో వినియోగించుకోవటానికి మీరు పాటు పడాలని 'సీమ' ప్రధాన కార్యదర్శి నకిరెకంటి స్వామి ఆకాంక్షించారు. చిలుకు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన అన్నారు. -
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థికి కేసీఆర్ చేతుల మీదుగా బి ఫామ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్,కు పార్టీ అధినేత కేసీఆర్ బి ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున 40 లక్షల రూపాయలు చెక్కు ను అందించారు.ఈ సందర్భంగా.. దివంగత మాగంటి గోపీనాథ్ కూతుళ్లు కుమారుడు, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
‘అపోలో’ వేదికగా అంతర్జాతీయ ఆరోగ్య సంభాషణ 2026
హైదరాబాద్]: రోగుల భద్రత, ఆరోగ్య సంరక్షణలో కొత్త ఆవిష్కరణలు, వ్యవస్థల అభివృద్ధిని ప్రోత్సహించే ప్రపంచంలోని ప్రముఖమైన వేదికల్లో ఒకటైన అంతర్జాతీయ ఆరోగ్య సంభాషణ (International Health Dialogue - IHD) 2026 ఎడిషన్‌ను అపోలో హాస్పిటల్స్ నిర్వహించనుంది. ఈ సదస్సు 2026 జనవరి 30 మరియు 31 తేదీలలో హైదరాబాద్‌లో జరగనుంది. ఐహెచ్డీ 2026 థీమ్ 'గ్లోబల్ వాయిసెస్ వన్ విజన్’ ఈ థీమ్ ఒక ఉమ్మడి లక్ష్యం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. ఆ లక్ష్యం ఏంటంటే.. పటిష్టంగా, రోగి-కేంద్రీకృతంగా, సాంకేతికతతో కూడిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను నిర్మించడం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, ప్రపంచం నలుమూలల నుండి వచ్చే ఆలోచనలు, ఆవిష్కరణలు, నాయకత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలని ఈ సదస్సు భావిస్తోంది. ఈ కార్యక్రమం ప్రధానంగా మూడు కీలక అంశాలపై దృష్టి సారిస్తుంది. అవి: నాయకత్వంతో నడిచే భద్రతా నమూనాలు; మానవ-కేంద్రీకృత రూపకల్పన, డిజిటల్ పరివర్తన; అలాగే ఆసుపత్రి కార్యకలాపాలు, రోగి అనుభవం, చికిత్స ఫలితాలు వంటి అన్ని రంగాలలో అత్యుత్తమ ప్రమాణాలు సాధించే అంశాలపై సదస్సు దృష్టి పెడుతోంది.అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సంగీత రెడ్డి మాట్లాడుతూ, “ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ ఆరోగ్య సంభాషణ (IHD) ఒక శక్తివంతమైన ప్రపంచ వేదికగా మారింది. ఇక్కడ వైద్యులు (క్లినిషియన్లు), కొత్త ఆవిష్కరణలు చేసేవారు (ఇన్నోవేటర్లు), విధానాలు రూపొందించేవారు, ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంచేవారు అంతా ఒకచోట చేరి, ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశం కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతుంది’ అని అన్నారు. -
మరో వివాదంలో HCA.. టాలెంట్ ఉన్న వాళ్లను తొక్కేస్తున్నారు!?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరో వివాదంలో చిక్కుకుంది. HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం రేపింది. ఈ విషయంపై అసోసియేషన్‌తో పలువురు క్రికెటర్లపై రాచకొండ సీపీకి ఫిర్యాదు అందింది. అండర్- 16, అండర్- 19, అండర్-23 లీగ్ మ్యాచ్‌లలో పలువురు ప్లేయర్ల ఫేక్ బాగోతం తాజాగా బయటపడినట్లు సమాచారం. వయసు ఎక్కువగా ఉన్న ఆటగాళ్లు కూడా నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో లీగ్‌లలో ఎంట్రీ ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ విషయంలో గతంలో ఆరుగురు ప్లేయర్లను గుర్తించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వారిపై నిషేధం విధించింది. అయినప్పటికీ ఎక్కువ వయసున్న ఆటగాళ్లలో తక్కువ వయసున్న విభాగంలో ఆడేందుకు HCA అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. దీని వల్ల ప్రతిభావంతులైన ఆటగాళ్లకు నష్టం వాటిల్లుతుందన్న సంగతి తెలిసినా HCA తమ తీరు మార్చుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో.. అవినీతికి పాల్పడుతూ టాలెంట్ లేని ప్లేయర్లను ఆడిస్తున్న HCA అధికారులపై చర్యలు తీసుకోవాలని అనంతరెడ్డి అనే వ్యక్తి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా గత కొన్నాళ్లుగా HCA వివిధ అంశాల్లో అవినీతికి పాల్పడిన తీరు.. అసోసియేషన్‌పై విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.చదవండి: యువ క్రికెటర్లకు HCA బంపరాఫర్.. ఆలస్యం చేయకండి -
కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం.. కేసీఆర్ ఫొటో లేకుండానే..
సాక్షి,హైదరాబాద్: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక తెలంగాణ లక్క్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నారు. తండ్రి కేసీఆర్ ఫొటో కాకుండా ప్రొఫెసర్ జయ శంకర్ ఫొటోతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. యాత్ర పోస్టర్లను సిద్ధం చేశారని, యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం (అక్టోబర్15) విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కవిత మేథావులు, విద్యావంతులతో భేటీ కానున్నారు.అక్టోబర్ చివరి వారం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర తెలంగాణలోని అన్నీ జిల్లాలను కవర్ చేస్తూ ఫిబ్రవరిలో ముగియనుంది. కవిత తెలంగాణ యాత్రపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అక్కినేని నాగార్జునతో వివాదంపై.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హన్మకొండ: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని దెబ్బతీయాలని కొంతమంది రెడ్లు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం (అక్టోబర్14)ఆమె మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ..‘కొంతమంది రెడ్లు నన్ను దెబ్బతీయాలని చూస్తున్నారు. మంత్రిగా నేను ఏ పనిచేసినా వివాదం చేయాలనుకుంటున్నారు. నాగార్జున విషయంలో నేను మాట్లాడింది వేరు. కానీ దాన్ని వివాదంగా చిత్రీకరించారు. అందుకే మీడియాతో ఓపెన్‌గా ఉండటం లేదు. మౌనంగా నాశాఖ పనులు చేసుకుంటున్నాను’అని వ్యాఖ్యానించారు. -
యువ క్రికెటర్లకు HCA బంపరాఫర్.. ఆలస్యం చేయకండి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) యువ మహిళా క్రికెటర్లకు బంపరాఫర్ ఇచ్చింది. భారత అండర్-19 వుమెన్ జట్టులో చోటు కోసం పోటీపడే సువర్హావకాశం కల్పించింది. ఇందుకోసం అక్టోబరు 15, 16 తేదీల్లో ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది.ఇందులో సత్తా చాటిన మహిళా క్రికెటర్లు 2025-26 సీజన్‌కు గానూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్వహించే టోర్నీల్లో భాగం కావొచ్చని హెచ్‌సీఏ ఈ సందర్భంగా తెలిపింది. ఇక పోటీల్లో పాల్గొనాలనుకునే మహిళా క్రికెటర్లకు ఉండాల్సిన అర్హతలను కూడా మంగళవారం వెల్లడించింది. ప్రతి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఈ నోటిఫికేషన్ గురించి స్థానిక ప్లేయర్లకు సమాచారం అందించాలని ఆదేశించింది.రిజిస్ట్రేషన్ వివరాలు👉అక్టోబరు 15 2025న ఉదయం తొమ్మిది గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభం👉మధ్యాహ్నం 12- సాయంత్రం 5 గంటలకు వరకు ట్రయల్స్👉అక్టోబరు 16న కూడా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రిజిస్ట్రేషన్, ట్రయల్స్ ప్రక్రియవేదిక👉ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (RGICS), ఉప్పల్, హైదరాబాద్.నోట్: జిల్లాల నుంచి వచ్చే క్రికెటర్లు అక్టోబరు 15న రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోనట్లయితే.. అక్టోబరు 16న ఉప్పల్‌లో ఉదయం 9- సాయంత్రం ఐదు గంటల వరకు రిపోర్టు చేయవచ్చు.అర్హత👉01.09.2006న లేదంటే ఆ తర్వాత జన్మించిన మహిళా క్రికెటర్లకు మాత్రమే ఈ అవకాశంప్లేయర్లు పాటించాల్సిన నిబంధనలు👉ఉప్పల్‌లోని RGICSలో గేట్ 1 వద్ద ప్లేయర్లంతా రిపోర్టు చేయాలి.👉ప్రతీ ప్లేయర్ తమ క్రికెట్ కిట్, తెలుపు రంగు దుస్తులు వెంట తెచ్చుకోవాలి.👉 గుర్తింపు పత్రాలను తప్పక తీసుకురావాలి.1. పుట్టినరోజును ధ్రువీకరించే బర్త్ సర్టిఫికెట్ ఒరిజినల్ డిజిటల్ కాపీ, దానితో పాటు జిరాక్స్ ఫొటోకాపీని తీసుకురావాలి.2. ఒరిజినల్ ఫుల్ సైజ్ ఆధార్ కార్డుతో పాటు.. దాని జిరాక్స్ ఫొటోకాపీ కూడా తెచ్చుకోవాలి.3. ఒక పాస్‌పోర్టు సైజ్ ఫొటో తీసుకురావాలి.చదవండి: సిగ్గు చేటు: అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్‌పై గంభీర్ ఫైర్ -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సుప్రీం’ కీలక ఆదేశాలు
ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు తన ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ పొడిగించింది. రీసెట్ చేసిన తర్వాత డేటా డిలీట్ చేశారని తేలితే కేసు డిస్మిస్ చేస్తామని జస్టిస్ మహదేవన్ హెచ్చరించారు.ఈ కేసుపై జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఇవాళ(అక్టోబర్ 14, మంగళవారం) విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తునకు ప్రభాకర్‌రావు సహకరించడం లేదని.. ఆయనను కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు అప్పగించాలన్నారు.‘‘కస్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారానే నిజాలు బయటికి వస్తాయి. ఐ ఫోన్, ఐ క్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్క్‌ల్లో డేటా ధ్వంసం చేశారు. కొత్తగా 50 హార్డ్ డిస్కులు అక్కడ పెట్టారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లు టాప్ చేశారు. నక్సలైట్ల పేరుతో ఈ కార్యక్రమాలన్నీ చేశారు. డేటా మొత్తం డిలీట్ చేసి డివైసెస్ మాకు ఇచ్చారు’’ అని కోర్టుకు సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ప్రభాకర్‌రావు తరఫున శేషాద్రి నాయుడు తన వాదనలు వినిపిస్తూ.. డివైస్ రీసెట్ చేసేందుకు సిద్ధమన్నారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం.. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల (నవంబర్ 18)కి వాయిదా వేసింది. -
సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ బాలికపై లైంగికదాడి
కొత్తపల్లి (కరీంనగర్): బాలికపై అత్యాచారం చేస్తూ.. సెల్ఫోన్లో చిత్రీకరించి ఆపై వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ఇద్దరు యువకులు ప్రేమపేరుతో నమ్మించారు. ఓ రోజు గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తేరుకున్న బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ యువకులు విశ్వతేజ (19), సన్నీ (21)లను అరెస్టు చేసి పోక్సో కింద కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థిని..
సిరిసిల్ల: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన యువతి మరణించింది. స్థానిక సుభాష్‌నగర్‌కు చెందిన బండారి అశోక్–గీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు బండారి మనోజ్ఞ(22) హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఇటీవల దసరా పండుగకు ఇంటికొచ్చి వెళ్లిన మనోజ్ఞ హైదరాబాద్ వనస్థలిపురంలో శనివారం స్నేహితులతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. కారు డ్రైవర్ తాగిన మైకంలో ఉన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్ఞను యశోద ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. మనోజ్ఞ మృతదేహాన్ని సిరిసిల్లకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. బంగారు భవిష్యత్ కోసం హైదరాబాద్‌కు వెళ్లిన యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం సిరిసిల్లలో విషాదం నింపింది -
నా అప్పులతో నా భార్యాపిల్లలకు సంబంధం లేదు..!
సిరిసిల్ల: ‘మీ అమ్మకి ఏమీ తెలియదు. చాలా అమాయకురాలు. ఇక నన్ను క్షమించండి. నేను చేసిన అప్పులతో నా భార్యాపిల్లలకు ఏం సంబంధం లేదు. వారికి ఎలాంటి హానీ తలపెట్టవద్దు. నా భార్యాపిల్లలకు మనవి.. మీకు ఇబ్బందిగా ఉంటే.. నాతోపాటే మీరు కూడా రాగలరు. జిల్లా కలెక్టర్ గారు.. ఎస్పీ గారు.. నా భార్యాపిల్లలకు న్యాయం చేయండి.. నేను బిజినెస్‌లో నష్టపోయి.. అప్పులోళ్లకు మొహం చూపించలేక సచ్చిపోతున్నా... అప్పులోళ్లు ఇద్దరే చాలా వేధించారు..’ అని సూసైడ్ నోట్ రాసి చనిపోయిన సంఘటన సిరిసిల్లలో సంచలనంగా మారింది. కరీంనగర్ శివారులోని ఎలగందులకు చెందిన విక్కుర్తి శేఖర్(48) ఇరువై ఏళ్లుగా సిరిసిల్లలో స్థిరపడ్డారు. స్థానిక మొదటి బైపాస్‌రోడ్డులో గణపతి విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తుంటారు. వ్యాపారంలో నష్టాలు రావడం.. అప్పుల వాళ్ల వేధింపులు తీవ్రమయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక సోమవారం విగ్రహాలను తయారు చేసే షెడ్డులోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్లకు చెందిన బాలసాని అంజయ్యగౌడ్ తన ప్లాటు(స్థలం) కాగితాలను బెదిరించి లాక్కున్నారని, బాలసాని యాదయ్య ఇల్లును ఆక్రమించుకోవాలని చూస్తున్నారని లేఖలో శేఖర్ పేర్కొన్నారు. అప్పులు ఇచ్చిన ఇతరులు ఏమీ అనలేదని, మూడేళ్లు సమయం ఇచ్చారని, వాళ్లంతా నన్ను క్షమించాలని లేఖలో వేడుకున్నారు. వాళ్లకు మొఖం చూపించలేకపోతున్నానని పేర్కొన్నారు. షెడ్డు ఓనర్ తన భార్యపిల్లలకు సహకరించాలని కోరారు.కలెక్టర్, ఎస్పీలకు లేఖతన ఆస్తి భార్య పిల్లలకు దక్కేలా చూడాలని, కల్లు సొసైటీలో సభ్యత్వం పిల్లలకు వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను కోరారు. మృతుడికి భార్య వసుధ, పిల్లలు అఖిల్, మణిదీప్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపారు. -
కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ భగ్గుమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతుంది? తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి నియోజకవర్గంలో వేలుపెట్టడం మీకు అలవాటు. నా జిల్లాను సర్వనాశనం చేసి నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. మీరు కూడా ఏదో ఒకరోజు బయటకు వెళ్లడం పక్కా’’ అంటూ రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.కాగా, అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై పడింది. రాష్ట్ర రాజధానిలోని అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో ఉపఎన్నిక ఆసక్తిగా మారింది. ఎన్నికల బరికి ప్రధాన రాజకీయ పక్షాలతోపాటు చిన్నా చితక పార్టీలు, సామాజిక వేత్తలు, నిరసనకారులు పెద్ద ఎత్తున ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నిరసన గళం తలనొప్పిగా తయారైంది. కుల, నిరుద్యోగ సంఘాలతో పాటు బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్ల వేసేందుకు సిద్ధమవడం కలకలం రేపుతోంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత రెండో ఉపఎన్నిక కావడంతో జూబ్లీహిల్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మంకంగా తీసుకొని ముందస్తుగానే ముగ్గురు మంత్రులు, 18 మంది కార్పొరేషన్లు చైర్మన్లను రంగంలోకి దింపారు. గత రెండు మాసాల్లో సుమారు రూ.15 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయతి్నంచారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేసి బీసీ కార్డు ప్రయోగించి యువ నాయకుడు నవీన్ యాదవ్‌ను ఎన్నికల బరిలో దింపింది. టికెట్ ఆశించిన సీనియర్లు అసంతృప్తికి గురి కావడంతో మంత్రులను రంగంలోకి దింపి బుజ్జగించడంలో సఫలీకృతమైంది. తాజాగా నిరసనగళం ఆందోళన కలిగిస్తోంది. -
అన్ని చోట్లా నడిచినట్లు మునుగోడులో నడవనీయను: కోమటిరెడ్డి
నల్లగొండ జిల్లా: ఎక్సైజ్ పాలసీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. వీడియోలో ఆయన మరోసారి ప్రభుత్వ ఎక్సైజ్ విధానాలను ఎత్తి చూపారు. ఎక్సైజ్ పాలసీని మార్చాల్సిందేనని.. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే బదులు.. మెరుగు పరిచేలా ప్రభుత్వం పనిచేయాలి. వైన్ షాపుల విషయంలో మునుగోడులో తన సూచనలు పాటించాల్సిందేనంటూ తేల్చి చెప్పారు. పదవి ఉన్నా లేకున్నా ఒకటే.. అన్ని ప్రాంతాల్లో నడిచినట్లు మునుగోడులో నడవనీయనంటూ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.మునుగోడులో ఎమ్మెల్యే నూతన నిబంధనలుమద్యం దుకాణాలకు ఈ నెలతో గడువు ముగియనుంది. దీంతో ప్రభుత్వం కొత్తగా టెండర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అందుకు ఈ నెల 18 వరకు గడువు ఉంది. దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని మద్యం దుకాణాల టెండర్లు వేయాలనుకునే వ్యాపారులు తాను సూచిస్తున్న నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. ఈ విషయాన్ని టెండర్లు వేయకముందే చెబుతున్నానని పేర్కొంటున్నారు.అంతే కాకుండా నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలను నల్లగొండ ఎక్సైజ్ కార్యాలయానికి పంపి ఎమ్మెల్యే సూచనలకు సంబంధించిన వినతిపత్రాన్ని ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌కు పంపారు. కార్యాలయం బయట ఆ సూచనల పోస్టర్‌ను ఏర్పాటు చేయించారు. తాను చేస్తున్నది ఎవ్వరి మీదనో కోపంతో కాదని.. అలా అని తాను మద్యానికి పూర్తిగా వ్యతిరేకం కూడా కాదని అంటున్నారు. కొందరు యువకులు, నడి వయస్సు వాళ్లు కుటుంబ పోషణ మరచి ఉదయం నుంచే మద్యం తాగి అనారోగ్యం బారిన పడుతున్నారని.. అలాంటి వారిని కాపాడేందుకే తాను ఈ నిర్ణయాలు తీసుకున్నాని రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నారు.ఎమ్మెల్యే చేస్తున్న సూచనలు ఇవీ..మద్యం దుకాణాలు గ్రామ శివారులో ఏర్పాటు చేయాలి.మద్యం దుకాణంలో సిట్టింగ్ ఏర్పాటు చేయకూడదుబెల్ట్షాపులకు మద్యం విక్రయించవద్దుమద్యం వ్యాపారులు సిండికేట్ కావొద్దురోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయించాలికొత్తగా టెండర్లు వేసేవారు ఈ షరతులు పాటిస్తామంటేనే టెండర్లు వేయాలని, లేదంటే టెండర్లు వేసి నష్టపోవద్దని తమ నాయకులతో సోషల్ మీడియాతో వైరల్ చేయడంతోపాటు గొడలపై పోస్టర్లు ఏర్పాటు చేయించారు. -
BC Reservations: ‘మా వాదనలు పూర్తిగా వినలేదు..’
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది. బీసీలకు 42% శాతం రిజర్వేషన్ల జీవో పై హైకోర్టు స్టే తొలగించాలని అందులో కోరింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం సోమవారం అర్ధరాత్రి పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అందులో ఏముందంటే.. 50% రిజర్వేషన్లు పరిమితి నియమమే తప్ప రాజ్యాంగ పరమైనది కాదని పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తమ వాదనలు సంపూర్ణంగా వినకుండానే జీవో 9పై స్టే విధించిందని తెలిపింది. ఓబీసీ సమగ్ర వివరాలను కుల సర్వే ద్వారా సేకరించాం. కమిషన్ అధ్యయన తర్వాత రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించారు. తెలంగాణలో 56% పైగా బీసీలు ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42 శాతం రిజర్వేషన్లు కేటాయించామని పిటిషన్ లో పేర్కొంది ప్రభుత్వం. వీలైనంత త్వరగా విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ శనివారం నుంచి పదిరోజుల పాటు సుప్రీం కోర్టుకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారాంతం లోపే ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు కావడంతో విచారణ జరిగితే వాటిని కూడా కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.