లూటీకి సహకరిస్తున్న అధికారుల తోకలు కత్తిరిస్తాం | KTR comments over Revanth Reddy | Sakshi
Sakshi News home page

లూటీకి సహకరిస్తున్న అధికారుల తోకలు కత్తిరిస్తాం

Mar 19 2026 2:20 AM | Updated on Mar 19 2026 2:20 AM

KTR comments over Revanth Reddy

మంత్రుల కంటే అధికారులే ఎక్కువ మాట్లాడుతున్నారు: కేటీఆర్‌ 

రియల్‌ ఎస్టేట్‌ దందా కోసమే మూసీ ప్రాజెక్టు 

ఐటీ రంగం కుప్పకూలితే హైదరాబాద్‌ ఆర్థిక రంగం కుదేలు 

రోహిత్‌రెడ్డిపై ఇప్పటికే తాత్కాలిక సస్పెన్షన్‌ విధించాం 

జీవన్‌రెడ్డి చేరికపై ఎలాంటి మంతనాలు లేవు

సాక్షి, హైదరాబాద్‌: మూసీ ప్రాజెక్టు విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని, ఆరు నూరైనా పూర్తి చేస్తామంటూ తమ పరిధికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు పేరిట సీఎం చేస్తున్న దోపిడీకి సహకరిస్తున్న అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, తాము అధికారంలోకి వ­చ్చా­క తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. శాసనసభ లాబీ­లోని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం చాంబర్‌లో కేటీఆర్‌ బుధవారం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. 

మూసీ సుందరీకరణకు సంబంధించి అందరి అభిప్రాయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తయారు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తోందన్నారు. మూసీ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం వచ్చిందని, డీపీఆర్‌ పూర్తయిందని సీఎం, మంత్రులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. 

డీపీఆర్‌ పూర్తయినట్లు సభలో ఆధారాలు చూపకపోతే అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెడతామని కేటీఆర్‌ చెప్పారు. 3,297 ఎకరాల భూ సేకరణ, 10 వేల నిర్మాణాలపై ప్రభావం చూపుతుందని నోటిఫికేషన్‌ ఇచ్చిన ప్రభుత్వం.. అసెంబ్లీలో మాత్రం 1,400 నిర్మాణాలు ఉన్నాయని మాత్రమే చెప్తోందన్నారు.  

బ్లాక్‌ లిస్ట్‌లో మూసీ కాంట్రాక్టు సంస్థ 
‘మూసీ పరిసరాలను సుందరీకరణ చేయడం మినహా ప్రభుత్వం చేసేదేమీ ఉండదు. మధు రిడ్జ్‌ పార్కువాసులపై వల్లమాలిన ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న సీఎం ఇతర నిర్వాసితులనూ అదే రీతిలో ఎందుకు చూడటం లేదు. మూసీ ప్రాజెక్టు అప్పగించిన మెయిన్‌హార్ట్‌ కాంట్రాక్టు సంస్థను సింగపూర్, పాకిస్తాన్‌తోపాటు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా కూడా బ్లాక్‌ లిస్టులో పెట్టింది. బఫర్‌జోన్‌లో 50 మీటర్లు దాటి ఎక్కడో 5 కి.మీ. దూరంలో ఉన్న హనుమాన్‌నగర్‌ వాసులకూ నోటీసులు ఇస్తున్నారు.

పలువురు మంత్రులు, సీఎం సోదరుడు, పలువురు నేతల ఇళ్లు బఫర్‌ జోన్‌లో ఉన్నాయి. నార్సింగి, మంచిరేవుల వరకు మూసీ బఫర్‌లో అనేక నిర్మాణాలు ఉన్నాయి. ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) అంటే సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి అనే విమర్శ ఉంది. హైదరాబాద్‌లో ఏవీ రెడ్డి, కొండల్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు ముఠాగా ఏర్పడి రిటైర్డ్‌ అధికారుల అండతో భూ దందా సాగిస్తున్నారు’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.  

ముఖ్యమంత్రికి పాలనపై పట్టులేదు.. 
‘సీఎంకు, మంత్రులకు పాలనపై పట్టులేదు. మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. మంత్రులకు 
అధికారులు బిజినెస్‌ రూల్స్‌ చెప్పాలి. ఐటీ రంగం కుప్పకూలితే హైదరాబాద్‌లో ఆతిథ్య, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు దెబ్బతింటాయి. ఫ్యూచర్‌ సిటీ పేరిట ఫార్మాసిటీ కోసం బీఆర్‌ఎస్‌ హయాంలో సేకరించిన 14 వేల ఎకరాలతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలనుకుంటున్నారు. ఫార్మా భూముల్లో ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, జడ్జీలు, జూ పార్కులకు భూములు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్తోంది’అని కేటీఆర్‌ చెప్పారు.  

అసెంబ్లీకి ఎప్పుడు రావాలో కేసీఆర్‌కు తెలుసు 
‘అసెంబ్లీకి ఎప్పుడు రావాలో కేసీఆర్‌కు తెలుసు. మా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ధాటిని తట్టుకోలేక అసెంబ్లీ ఎందుకు పెట్టామా అని మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. రేవంత్‌ మమ్మల్ని దూషిస్తున్నా స్పీకర్‌ ఖండించే పరిస్థితి లేదు. అలాంటపుడు కేసీఆర్‌ అసెంబ్లీకి ఎందుకు వస్తారు. మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డిపై ఇప్పటికే తాత్కాలిక సస్పెన్షన్‌ విధించాం. ఆయన నుంచి సమాధానం వచ్చిన తర్వాత తుది నిర్ణయం ఉంటుంది. కాంగ్రెస్‌ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరికపై ఇప్పటివరకు ఎలాంటి సంప్రదింపులు జరపలేదు’అని కేటీఆర్‌ వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement