ఏపీలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఒకరి మృతి | Heavy Rains Lash Andhra Telangana Districts | Sakshi
Sakshi News home page

ఏపీలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఒకరి మృతి

Mar 18 2026 5:57 PM | Updated on Mar 18 2026 6:05 PM

Heavy Rains Lash Andhra Telangana Districts

అమరావతి: ఆంధ‍్రప్రదేశ్‌లోని పలు జిల‍్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. అమరావతిలో భారీ వర్షం కురిసింది. తుళ్లూరులోని మేరీ మాత హై స్కూల్‌కు సమపీంలో పిడుగుపడి ఓ విద్యార్థి తండ్రి మృతిచెందారు.  

కృష్ణాజిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరులో వర్షం పడింది. విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. ఏలూరు జిల్లాలోని నూజివీడులో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. ఓ ఇంటిపై పిడుగు పడింది. దీంతో ఇంటి టెర్రస్ పైన పిట్టగోడ పాక్షికంగా ధ్వంసమైంది.

రాగల మూడు గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ చెప్పారు.

తెలంగాణనూ వదలని వానలు 
తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు కురిసిన వర్షానికి పలుచోట్ల పెద్దఎత్తున పంట నష్టం తలెత్తింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెద్దపెల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, మంగపేటల్లో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలరాలింది.

కరీంనగర్ జిల్లా వీణవంకలోనూ అపార పంటనష్టం జరిగింది. నర్సింగాపూర్‌లోనూ మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. కొన్ని చోట్ల మామిడి పిందెలు రాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గత రాత్రి కురిసిన వడగండ్ల వానకు.. చేతికొచ్చిన పంట  నేలరాలింది. 

భారీగా పంట నష్టం తలెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి మిర్చి రైతులు విలవిలలాడారు. మిర్చి కుప్పలపై టార్పాలిన్లు కప్పి పంటను కాపాడుకుంటున్నారు రైతులు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement