డాక్టర్ల నియామకాల్లో గందరగోళం | Chaos in Doctors Appointments | Sakshi
Sakshi News home page

డాక్టర్ల నియామకాల్లో గందరగోళం

Mar 18 2026 4:34 AM | Updated on Mar 18 2026 4:34 AM

Chaos in Doctors Appointments

ముందుగా డీఎంఈ పోస్టుల నోటిఫికేషన్‌  

వాటిని వదిలేసి టీవీవీపీ నియామకాలు 

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వైద్యులు  

డీఎంఈ పోస్టులను భర్తీ చేయాలంటున్న సీనియర్‌ రెసిడెంట్లు 

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యశాఖలో జరుగుతున్న వైద్య నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా మారింది. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ) ద్వారా చేపడుతున్న ఈ నియామకాల్లో సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు సంబంధించి 607 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ గత సంవత్సరం జూన్‌ 28న విడుదల కాగా, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) పరిధిలో 600 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (స్పెషలిస్ట్‌) పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ కూడా గత ఏడాదే ఆగస్టు 22న వెలువడింది.

అయితే తొలుత విడుదలైన డీఎంఈ నియామకాన్ని పక్కనపెట్టి, టీవీవీపీ నియామకాలు మొదట జరపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. కాగా టీవీవీపీలో అనస్తీషియా, పీడియాట్రిక్, గైనకాలజీ విభాగాలకు సంబంధించి ఈనెల 12 నుంచే సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మిగతా బ్రాంచ్‌లకు సంబంధించి కూడా సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసి, నియామకాలు చేపట్టనున్నారు.  

డీఎంఈలో ఉద్యోగం వస్తే టీవీవీపీకి రాజీనామాలు? 
వైద్య వృత్తిని ఎంచుకునే వాళ్లు ఎక్కువ మంది డీఎంఈ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకే ప్రాధాన్యం ఇస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా టీవీవీపీ నియామకాలు పూర్తిచేస్తే, అభ్యర్థులు తాత్కాలికంగా ఆ పోస్టుల్లో చేరి, తరువాత డీఎంఈలో అవకాశం లభిస్తే రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఇప్పటికే భర్తీ చేసిన స్పెషలిస్ట్‌ పోస్టులు ఖాళీ కావడంతో పాటు, వైద్య సేవలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. 

ఇప్పటికే టీవీవీపీ ఆస్పత్రుల్లో నిపుణుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఇలాంటి విధానం వల్ల పరిపాలనా వైఫల్యం మరోసారి బట్టబయలైందని అభ్యర్థులు విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో బోధనా సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, డీఎంఈ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాలను ప్రాధాన్యంగా పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొంటున్నారు.  

సీనియర్‌ రెసిడెంట్లు ఆందోళన 
టీవీవీపీ స్పెషలిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసిన సీనియర్‌ రెసిడెంట్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము డీఎంఈ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హులు కాకపోవడంతో టీవీవీపీ నియామకాలపైనే ఆధారపడుతున్నామని, ముందుగా డీఎంఈ నియామకాలు పూర్తైతే, ఆ పోస్టులను ఆశించే అభ్యర్థులు నేరుగా అక్కడే చేరతారని, తద్వారా టీవీవీపీ పోస్టులు ఖాళీగా ఉండి నిజమైన అర్హులకు అవకాశాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. 

కానీ టీవీవీపీ నియామకాలు ముందుగా జరిగితే, కొంతమంది అభ్యర్థులు తాత్కాలికంగా చేరి తరువాత రాజీనామా చేయడం వల్ల సీట్లు వృథా కావడంతో పాటు, సీనియర్‌ రెసిడెంట్లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నియామకాల క్రమాన్ని సవరించి ముందుగా డీఎంఈ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాలు, అనంతరం టీవీవీపీ స్పెషలిస్ట్‌ నియామకాలు చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా చేస్తే సీట్ల వృథా నివారించడంతో పాటు, అందరికీ న్యాయం జరిగి, వైద్య సేవలు, వైద్య విద్య రెండూ బలోపేతం అవుతాయని అభిప్రాయపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement