Doctors recruitment
-
డాక్టర్ల నియామకాల్లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశాఖలో జరుగుతున్న వైద్య నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా మారింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా చేపడుతున్న ఈ నియామకాల్లో సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి 607 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ గత సంవత్సరం జూన్ 28న విడుదల కాగా, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో 600 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ కూడా గత ఏడాదే ఆగస్టు 22న వెలువడింది.అయితే తొలుత విడుదలైన డీఎంఈ నియామకాన్ని పక్కనపెట్టి, టీవీవీపీ నియామకాలు మొదట జరపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. కాగా టీవీవీపీలో అనస్తీషియా, పీడియాట్రిక్, గైనకాలజీ విభాగాలకు సంబంధించి ఈనెల 12 నుంచే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మిగతా బ్రాంచ్‌లకు సంబంధించి కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తి చేసి, నియామకాలు చేపట్టనున్నారు. డీఎంఈలో ఉద్యోగం వస్తే టీవీవీపీకి రాజీనామాలు? వైద్య వృత్తిని ఎంచుకునే వాళ్లు ఎక్కువ మంది డీఎంఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకే ప్రాధాన్యం ఇస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా టీవీవీపీ నియామకాలు పూర్తిచేస్తే, అభ్యర్థులు తాత్కాలికంగా ఆ పోస్టుల్లో చేరి, తరువాత డీఎంఈలో అవకాశం లభిస్తే రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఇప్పటికే భర్తీ చేసిన స్పెషలిస్ట్ పోస్టులు ఖాళీ కావడంతో పాటు, వైద్య సేవలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే టీవీవీపీ ఆస్పత్రుల్లో నిపుణుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఇలాంటి విధానం వల్ల పరిపాలనా వైఫల్యం మరోసారి బట్టబయలైందని అభ్యర్థులు విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బోధనా సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, డీఎంఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలను ప్రాధాన్యంగా పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొంటున్నారు. సీనియర్ రెసిడెంట్లు ఆందోళన టీవీవీపీ స్పెషలిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసిన సీనియర్ రెసిడెంట్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము డీఎంఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు కాకపోవడంతో టీవీవీపీ నియామకాలపైనే ఆధారపడుతున్నామని, ముందుగా డీఎంఈ నియామకాలు పూర్తైతే, ఆ పోస్టులను ఆశించే అభ్యర్థులు నేరుగా అక్కడే చేరతారని, తద్వారా టీవీవీపీ పోస్టులు ఖాళీగా ఉండి నిజమైన అర్హులకు అవకాశాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. కానీ టీవీవీపీ నియామకాలు ముందుగా జరిగితే, కొంతమంది అభ్యర్థులు తాత్కాలికంగా చేరి తరువాత రాజీనామా చేయడం వల్ల సీట్లు వృథా కావడంతో పాటు, సీనియర్ రెసిడెంట్లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నియామకాల క్రమాన్ని సవరించి ముందుగా డీఎంఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు, అనంతరం టీవీవీపీ స్పెషలిస్ట్ నియామకాలు చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేస్తే సీట్ల వృథా నివారించడంతో పాటు, అందరికీ న్యాయం జరిగి, వైద్య సేవలు, వైద్య విద్య రెండూ బలోపేతం అవుతాయని అభిప్రాయపడుతున్నారు. -
వసతులు లేనిదే ఎలా పనిచేస్తాం?
సాక్షి, హైదరాబాద్: కౌన్సెలింగ్ లేకుండా తమకు ఏకపక్షంగా పోస్టింగులు ఇవ్వడంపై పీజీ వైద్యులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను విస్తృతం చేసేందుకు 1,200 మంది పీజీ వైద్యులకు వివిధ ఆస్పత్రుల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2 రోజుల క్రితం 800 మందికి పోస్టింగ్‌లు ఇచ్చింది. సోమవారం నాటికి వారు ఆయాచోట్ల రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే, చాలా మంది రిపోర్ట్ చేయలేదని సమాచారం. చాలాచోట్ల కనీస సౌకర్యాలు లేవని, ఈ అంశాన్ని పరిగణించకుండా ఏకపక్షంగా పోస్టింగ్‌లు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. వసతులు లేనిచోట ఎలా పనిచేస్తామని ప్రశ్నించారు. (చదవండి: సర్కారు తీరుపై హైకోర్టు అసహనం) మరోవైపు పీజీ వైద్యుల పోస్టింగ్‌ల విషయంలో ఎలాంటి మార్పులు చేసే ఆలోచన లేదని వైద్య విద్య సంచాలక కార్యాలయం(డీఎంఈ) స్పçష్టం చేస్తోంది. పీజీ వైద్యులు కచ్చితంగా ఏడాది పాటు వారికి కేటాయించిన చోట వైద్య సేవలు అందించాల్సిందేనని, ఈ సమయంలో ప్రతి నెలా వారికి రూ.70వేల వేతనంతో పాటు అదనంగా మరో పది శాతం ఇన్సెంటివ్ ఇస్తున్నామని, క్వారంటైన్ కూడా అమలు చేస్తున్నామని వైద్య విద్య వర్గాలు చెబుతున్నాయి. ఇక పీజీ వైద్యుల పోస్టింగ్స్, ఇతర డిమాండ్లకు సంబంధించి సోమవారం హెల్త్ కేర్ రిఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్.. డీఎంఈకి లేఖ రాసింది. పీజీ వైద్యులకు మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించాలని, ప్రెగ్నెన్సీ డాక్టర్లకు మినహాయింపులు ఇవ్వాలని కోరింది. (ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం) -
త్వరలో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వరంగల్: వైద్య సంబం ధ నియూమకాల కోసం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. వరంగల్‌లోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల(ఎంజీఎం)ను ఆది వారం ఆయన సందర్శించారు. పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలసి బోధనా ఆస్పత్రుల అధికారులతోపాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 2006 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీ జరగలేదని, దీని వల్ల ఆయాఆస్పత్రుల్లో పెద్దఎత్తున సిబ్బంది కొరత ఉందన్నారు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును త్వరలో ఏర్పాటు చేసి ఖాళీల ను భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో ఓ రకమైన భావన ఉందని, దీన్ని పోగొట్టేందుకు కృషి చేయూలన్నారు. రాష్ట్ర ప్రభు త్వ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వాస్పత్రిలో కార్పొరేట్ తరహాలో వైద్యం అందించాలని సూచించారు. -
వైద్యుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో 350 మంది వైద్యుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో కామినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ( డీఎం అండ్ హెచ్‌వో) ప్రక్షాళనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 108 సర్వీసుల నిబంధనలపై సీఎం చంద్రబాబుతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కామినేని చెప్పారు.


