ఖర్గేతో సీఎం రేవంత్‌ భేటీ | CM Revanth Redddy Meets AICC President Mallikarjun Kharge | Sakshi
Sakshi News home page

ఖర్గేతో సీఎం రేవంత్‌ భేటీ

Mar 18 2026 5:26 AM | Updated on Mar 18 2026 5:26 AM

CM Revanth Redddy Meets AICC President Mallikarjun Kharge

రాజ్యసభ ఎంపీ ‘వేం’ను ఖర్గేకు పరిచయం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో కలిసి ఇటీవల ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని ఖర్గే, కేసీల వద్దకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఆయన్ను పరిచయం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మొన్నటి వరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్‌రెడ్డి చేసిన కృషిని వారికి వివరించారు. కాగా.. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇచ్చినందుకు ఖర్గే, కేసీలకు వేం నరేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా.. నరేందర్‌ రెడ్డిని వారు అభినందించారు. ఎంపీగా తనదైన ప్రత్యేక ముద్ర కనిపించేలా పనిచేయాలని ఖర్గే సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగానే.. ఆయనతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇటీవల ఏఐసీసీ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ పనితీరుపై చర్చించినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం కుదిరేలా, ప్రభుత్వ పథకాల అమలులో పార్టీ నేతల భాగస్వామ్యం ఉండేలా చూసుకుకోవాలని ఖర్గే సూచించినట్లుగా తెలిసింది. 

ప్రతీ రెండు నెలలకోసారి ఈ కమిటీ సమావేశమై.. సమన్వయ అంశాలపై చర్చించాలని ఖర్గే తెలిపినట్లు చెబుతున్నారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి.. సీపీపీ చైర్మన్‌ సోనియాగాంధీ, లోకస్‌భలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఎంపీ ప్రియాంక గాం«దీలను కలిసే అవకాశం ఉంది. అలాగే.. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలతో జరిగిన భేటీలో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, బలరామ్‌ నాయక్, సురేశ్‌ షెట్కార్‌ ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement