మెట్రో టేకోవర్‌ చెల్లింపులపై స్పష్టత | Clarification on Metro takeover payments | Sakshi
Sakshi News home page

మెట్రో టేకోవర్‌ చెల్లింపులపై స్పష్టత

Mar 16 2026 4:10 AM | Updated on Mar 16 2026 4:10 AM

Clarification on Metro takeover payments

బడ్జెట్‌ సమావేశాల్లో నిధుల విడుదల 

రూ.13వేల కోట్ల బ్యాంకు రుణాలు  

3 శాతం వడ్డీతో అందజేయనున్న ఐఆర్‌ఎఫ్‌సీ 

నెలాఖరు వరకు టేకోవర్‌ పూర్తి

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో టేకోవర్‌ ప్రక్రియ ఊపందుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా ప్రాజెక్టును స్వాదీనం చేసుకొనే దిశగా ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. ఎల్‌అండ్‌టీ సంస్థకు చెల్లించాల్సిన పెండింగ్‌ బకాయిలను ప్రభుత్వమే చెల్లించే అవకాశం ఉంది. 16వ తేదీ నుంచి జరగనున్న బడ్జెట్‌ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో టేకోవర్‌లో భాగంగా రూ.15 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకోనున్న సంగతి తెలిసిందే.. ఇందులో ఎల్‌అండ్‌టీకి ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్ల పెండింగ్‌ బకాయిలను ప్రభుత్వ నిధుల నుంచి అందజేయనున్నారు. 

మిగతా రూ.13 వేల కోట్ల బ్యాంకు రుణాలను చెల్లించేందుకు ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌ఎఫ్‌సీ) ఇప్పటికే ముందుకు వచి్చంది. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైల్, ఐఆర్‌ఎఫ్‌సీ సంస్థల మధ్య పరస్పర అవగాహన కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. రూ.3 శాతం వడ్డీ చొప్పున ఐఆర్‌ఎఫ్‌సీ అందజేసే నిధులతో ప్రభుత్వం బ్యాంకు రుణాలను చెల్లించనుంది. 

మెట్రో టేకోవర్‌ గడువు సమీపిస్తున్న దృష్ట్యా ఒప్పందంలోని అన్ని అంశాలపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఏప్రిల్‌ నుంచి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థ ఆధ్వర్యంలోనే అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఒప్పందం మేరకు ఈ ఏడాది నవంబర్‌ వరకు ఫ్రాన్స్‌కు చెందిన కియోలిస్‌ సంస్థ రైళ్లను నడపనుంది. 

త్వరలో రెండో దశ.. 
మొదటి దశ టేకోవర్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం మెట్రో రెండో దశ పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఇప్పటికే పాతబస్తీలో మెట్రో విస్తరణకు అవసరమైన అన్ని చర్యలను పూర్తి చేసింది. ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న 7.5 కి.మీ. కారిడార్‌లో భాగంగా రోడ్ల విస్తరణ చేపట్టారు. అలాగే ఆస్తుల తొలగింపు, పరిహారాల చెల్లింపు కూడా తుదిదశకు చేరుకుంది. 

రెండో దశకు కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే మొదట పాతబస్తీ కారిడార్‌ను ప్రారంభించి ఆ తర్వాత దశలవారీగా ప్రతిపాదిత అన్ని రూట్లలో పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండో దశ ‘ఏ’ విభాగం కింద ఐదు కారిడార్లలో మెట్రో విస్తరణకు ప్రణాళికలను రూపొందించిన సంగతి తెలిసిందే. ‘బి’ విభాగం కింద మరో మూడు మార్గాలను ప్రతిపాదించారు. మొత్తం 8 కారిడార్లపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్‌)లను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో ఏడాదిన్నర క్రితమే కేంద్రానికి అందజేశారు.

కేంద్రం నుంచి సావరిన్‌ గ్యారెంటీ లభిస్తేనే అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలను తీసుకొనే అవకాశం ఉంది. జైకా వంటి సంస్థలు మెట్రో రెండో దశకు రుణాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి అనుమతి లభించకపోవడంతోనే ఏడాదిన్నర కాలంగా ఈ ప్రాజెక్టు పెండింగ్‌లో పడిన సంగతి తెలిసిందే.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement