అధికారం పోతే.. అందరికీ పోతుంది | CM Revanth class for Congress MLAs and MLCs at CLP meeting | Sakshi
Sakshi News home page

అధికారం పోతే.. అందరికీ పోతుంది

Mar 17 2026 5:38 AM | Updated on Mar 17 2026 5:38 AM

CM Revanth class for Congress MLAs and MLCs at CLP meeting

నన్ను అనలేదు కదా అని ఊరికే ఉంటే అందరం నష్టపోతాం 

ప్రతిపక్షాలను సమర్థంగా తిప్పికొట్టాలి.. చర్చల్లో చురుకుగా పాల్గొనాలి 

సభలో కూర్చోకపోతే ఎమ్మెల్యే అవడం ఎందుకు? 

సీఎల్పీ సమావేశానికి రానంత బిజీగా ఎమ్మెల్యేలున్నారా? 

ఎమ్మెల్యేలు కలిసేందుకు మంత్రులు టైం ఇవ్వాలి... నేనూ ఇస్తా 

సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌ క్లాస్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘అధికారంలో ఉంటేనే అందరికీ గౌరవం ఉంటుంది. అధికారం పోతే ఏ ఒక్కరిదో పోదు. అందరికీ పోతుంది. నన్ను అనలేదు కదా అని ఏమీ మాట్లాడకుండా ఉంటే అందరం నష్టపోతాం. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదు. వ్యవస్థ మొత్తం డ్యామేజీ అవుతుంది. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. పార్టీ, ప్రభుత్వ లైన్‌లోనే అందరూ స్పందించాలి. ఇప్పుడు మనం వేసుకునే రోడ్‌మ్యాపే వచ్చే ఎన్నికలకు ఎజెండా అవుతుంది’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

రెండేళ్లపాటు గత ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు చెప్పుకున్నామని, ఇప్పుడు ఆ టైం అయిపోయిందని, ప్రజలకు సమాధానం చెప్పుకునే సమయం వచ్చిందని, చేసింది చెప్పుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన సోమవారం మధ్యాహ్నం శాసనమండలి సమావేశ మందిరంలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ, ప్రభుత్వ పరంగా సమష్టిగా ముందుకెళ్లాల్సిన తీరును వారికి వివరిస్తూనే వ్యక్తిగత వ్యవహారశైలిపైనా ఆయన క్లాస్‌ తీసుకున్నారు.  

జీవిత లక్ష్యం వృధా చేసుకోవద్దు 
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరు గురించి రేవంత్‌ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ‘జీవిత లక్ష్యంగా పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా మీరు చట్టసభలకు వచ్చారు. కానీ ఆ పదవికి న్యాయం చేయనప్పుడు ఎందుకు? నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీనియర్లు ఉండేవారు. నాకు మాట్లాడటానికి మైక్‌ ఇచ్చేవారు కాదు. అయినా కొట్లాడి మాట్లాడాలని ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు సభకు కూడా రావడం లేదు. వచి్చనా సంతకం పెట్టి వెళ్లిపోతున్నారు. 

సభలో కూర్చోకపోతే ఎమ్మెల్యే ఎందుకు కావాలి? కొందరు సీఎల్పీ సమావేశానికి కూడా రాలేదు. సీఎల్పీ సమావేశానికి రాలేనంత బిజీగా ఉన్నారా? కష్టపడి సాధించుకున్న ఎమ్మెల్యే పదవికి అన్యాయం చేయొద్దు. సభకు రాకపోయినా, ఏం చేసినా ఏం కాదులే అనుకోవద్దు. ఇప్పటికిప్పుడే ఏమీ కాకపోవచ్చు. కానీ భవిష్యత్తులో అన్నింటిని పరిగణనలోకి తీసుకుంటారు. బీఫారం ఇచ్చేటప్పుడు అన్ని లెక్కలూ చూస్తారు’అని చెప్పారు. 

సమర్థవంతంగా తిప్పికొట్టాలి 
అసెంబ్లీ, మండలిలో జరిగే చర్చల్లో చురుకుగా పాల్గొనాలని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించా రు. బాగా చదువుకున్న మహిళా ఎమ్మెల్యేలున్నారని, వారంతా సభకు హాజరు కావడమే కాకుండా చర్చల్లో పాలుపంచుకోవాలని కోరారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాల వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో మూడో బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నామని, ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్‌ ప్రణాళికలను గవర్నర్‌ ప్రసంగంలో వివరించారని సీఎం చెప్పారు. ఈ ప్రసంగం ప్రభుత్వానికి రోడ్‌ మ్యాప్‌ లాంటిది. మన భవిష్యత్‌ ప్రణాళికలపై దృష్టి సారించాలి. 

మూడో బడ్జెట్‌తోపాటు మిగిలిన సంవత్సరాల బడ్జెట్‌ ప్రతిపాదనలు కూడా ప్రజారంజకంగా ఉండబోతున్నాయి. ఈ విషయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలి. సభలో మాట్లాడే అంశాలపై విప్‌ల మధ్య సమన్వయం ఉండాలి. అసెంబ్లీ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలు పర్యటించి సమస్యలు, ఆయా ప్రభుత్వ విధానాల ను అధ్యయనం చేయాలి. అవసరమైతే చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకూ వెళ్లి రావాలి’అని దిశానిర్దేశం చేశారు. 

మంత్రులు సమయం ఇవ్వాలి 
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్‌మోహన్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలుగా తాము మంత్రులు, అధికారులకు ఇచి్చన వినతులకు సరిగా స్పందన ఉండడం లేదని వాపోయారు. ఎమ్మెల్యేలకు మంత్రులతోపాటు సీఎం టైం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ మంత్రులు తమను కలిసేందుకు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వా లని సూచించారు. తాను కూడా ఇస్తానని చెప్పారు. ఏదో ఒక సమయం ఇందుకోసం ఫిక్స్‌ చేసుకోవాలని, ఎమ్మెల్యేలిచ్చే వినతిపత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశలో చర్యలు తీసుకోవాలని కోరారు. 

అయితే, తన దగ్గరకు వచి్చ న ఎమ్మెల్యేలే మళ్లీ వచ్చి కలుస్తున్నారని, అలా కలవడం ఎందుకని ప్రశ్నించారు. ప్యానెల్‌ స్పీకర్‌గా దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్‌ బాగా హ్యాండిల్‌ చేస్తున్నారని కొనియాడారు. అడ్లూరి లక్ష్మణ్‌కు ఎమ్మెల్యే కావడానికి 30 ఏళ్లు పట్టిందని, అంత కష్టపడితే లభించిన పదవికి అడ్లూరి లక్ష్మణ్‌తో సహా అందరు ఎమ్మెల్యేలు న్యాయం చేయాలని సూచించారు. 

మీడియాతో జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేవంత్‌ సూచించినట్టు సమాచారం. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మీడియాతో చిట్‌చాట్‌లు చేయొద్దని, వ్యక్తిగతంగా ఎవరూ మాట్లాడవద్దని చెప్పినట్టు తెలిసింది. విలేకరులు అడిగే ప్రశ్నలు ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రేమతో కాదని, వార్తల కోసం మాత్రమే వారు ప్రశ్నలు అడుగుతారని చెప్పినట్లు సమాచారం.  

అబద్ధాలను తిప్పికొట్టండి: పీసీసీ చీఫ్‌  
గత రెండేళ్లలో ప్రజలకు ఇచి్చన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేశామని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు. ఆరు గ్యారంటీల విషయంలో ప్రతిప క్షాల అబద్ధపు ప్రచారాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాగా, ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని సీఎల్పీ అభినందించింది.  

Advertisement
 
Advertisement
Advertisement