ఆ ఉత్తర్వులు చూపిస్తే రాజీనామా | KTR Challenge in Legislative Assembly: Telangana | Sakshi
Sakshi News home page

ఆ ఉత్తర్వులు చూపిస్తే రాజీనామా

Mar 18 2026 5:39 AM | Updated on Mar 18 2026 5:39 AM

KTR Challenge in Legislative Assembly: Telangana

శాసనసభలో కేటీఆర్‌ సవాల్‌

రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామనడంపై అభ్యంతరం 

మహిళలకు ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం చూపిస్తే తాను తక్షణమే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు మంత్రి సీతక్క చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 28 నెలలు అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎగ్గొట్టిందని విమర్శించారు.  

కాగితాలపైనే హామీలు 
‘మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ మభ్యపెడుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు? కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్‌ పెంపు, తులం బంగారం వంటి హామీలు అన్నీ కాగితాలపైనే మిగిలిపోయాయి. కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలను నిలిపివేయడం వల్ల తల్లీబిడ్డల సంక్షేమం దెబ్బతింటుంది. కేసీఆర్‌ పేరు ఇష్టం లేకపోతే రాహుల్‌గాంధీ కిట్‌ అని పేరు పెట్టి అయినా అమలు చేయండి. నిరుద్యోగులకు 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు పదే పదే అబద్ధాలు చెపుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 11,921 ఉద్యోగాలే ఇచ్చింది. మిగిలినవన్నీ కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం యువతను మోసం చేస్తోంది.

జాబ్‌ క్యాలెండర్‌లో జాబులు లేవు.. కేవలం తేదీలు మాత్రమే ఉన్నాయి. రైతులకు మూడు సీజన్లలో రైతు భరోసా ఎగ్గొట్టారు. డిసెంబర్‌లో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం పంటలు కోతకు వచ్చే టైంలో కూడా అందలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఉందని అప్పుడిస్తాం.. ఇప్పుడిస్తాం అంటూ లీకులిస్తున్నారు. 22 లక్షల మంది కౌలు రైతులకు ఇచ్చిన హామీలను కూడా పూర్తిగా తుంగలో తొక్కారు. ఏ గ్రామంలోనైనా రుణమాఫీ 100 శాతం అమలు జరిగిందని నిరూపిస్తే ఆ ఊరికి వెళ్లి నా రాజీనామా అందజేస్తా..’అని కేటీఆర్‌ మరో సవాల్‌ చేశారు. 

ఇబ్బందుల్లో విద్యార్థులు, ఉద్యోగులు 
‘విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. గురుకులాల్లో విషాహార ఘటనలు, మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గురుకులాలను మూసివేసే కుట్రలు సాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకపోవడం, రిటైర్డ్‌ ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. భూముల విషయంలో చాలా కుట్రలు నడుస్తున్నాయి.

హెచ్‌ఎండీఏ వంటి సంస్థల భూములను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. హిల్ట్‌ పాలసీ పేరుతో 9 వేల ఎకరాలు సంతర్పణ చేసేందుకు జరుగుతున్న కుట్రలను అడ్డుకుంటాం. ఉన్న సిటీని వదిలేసి ఫ్యూచర్‌ సిటీ పేరుతో గ్రాఫిక్స్‌ చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో దోమలు ఎన్నడూలేని విధంగా పెరిగిపోతే కనీసం ఫాగింగ్‌ చేసే నాథులు లేరు. మూసీ బ్యూటిఫికేషన్‌కు మేం వ్యతిరేకం కాదు. పేదలకు అన్యాయం చేయొద్దని అంటున్నాం. కాళేశ్వరంపై కుట్రలు ఆపి, మేడిగడ్డను నింపి రైతాంగానికి మేలు చేయాలి..’అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 

మీరు ఎగ్గొట్టిన వడ్డీని మేం కట్టాం: భట్టి 
కేటీఆర్‌ మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళలకు రుణాలు ఇచ్చి ఎగ్గొట్టిన వడ్డీని తమ ప్రభుత్వం కట్టిందని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో మహిళా సంఘాలకు ఇచ్చిన అన్ని రుణాలు కలిపి రూ.74 వేల కోట్లు అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.57 వేల కోట్లు ఇచ్చినట్లు చెప్పారు.    

Advertisement
 
Advertisement
Advertisement