హవాలా సొమ్ము కొట్టేద్దామని.. | Kukatpally Police Crack hawala Case Within 24 Hours | Sakshi
Sakshi News home page

హవాలా సొమ్ము కొట్టేద్దామని..

Mar 18 2026 4:28 AM | Updated on Mar 18 2026 4:28 AM

Kukatpally Police Crack hawala Case Within 24 Hours

యజమాని అక్రమ లావాదేవీలను గ్రహించి.. దాన్ని దొంగిలించాలని ప్లాన్‌.. 

కళ్లల్లో కారం కొట్టి.. రూ. కోటి నగదుతో ఉడాయింపు.. 

24 గంటల్లో కేసును చేధించిన కూకట్‌పల్లి పోలీసులు

ముఠా సభ్యుల్లో పలువురి అరెస్టు... రూ.77 లక్షల నగదు స్వాధీనం

మూసాపేట: యజమాని హవాలా సొమ్మును కొట్టేద్దామనుకున్న ఓ ముఠా గుట్టును పోలీసులు కొన్ని గంటల్లోనే చేధించారు. కేసు వివరాలను కూకట్‌పల్లి జోన్‌ డీసీపీ రితిరాజ్‌ మంగళవారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. బహదూర్‌పురాలోని సిద్రా ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని అమీర్‌ వద్ద మహ్మద్‌ ఖుస్రీద్దీన్, మహమ్మద్‌ అజీముద్దీన్‌ ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. దీంతోపాటు వీరు యజమాని ఆదేశాల మేరకు హవాలా నగదు బదిలీ కూడా చేసేవారు. 

రూ.10 కరెన్సీ నోటును టోకెన్‌గా చూపించగానే అవతలి వ్యక్తి నగదు ఇచ్చేవారు. దాన్ని వీరు షేక్‌ ఇబ్రహీం అనే వ్యక్తికి అందజేసేవారు. కొంతకాలానికి తాము చేస్తున్న నగదు లావాదేవీలు చట్టవిరుద్ధమైనవని ఖుస్రీద్దీన్‌ గ్రహించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని.. ఆ డబ్బును కాజేయాలని ప్లాన్‌ వేశాడు. దీని కోసం తనకు పరిచయస్తుడైన డ్రైవర్‌ మహ్మద్‌ ఒమర్‌ షరీఫ్‌కు ఈ హవాలా లావాదేవీల గురించి చెప్పాడు. అవకాశం దొరకగానే డబ్బును కాజేయాలని స్కెచ్చేశారు. 

ఇలా చేసి.. దోచేద్దాం..
సోమవారం జరిగే హవాలా లావాదేవీ సమయంలోనే తమ ప్లాన్‌ను అమలు చేయాలని డిసైడ్‌ అయ్యారు. తమకు తెలిసిన డ్రైవర్లు అబ్దుల్‌ హమీద్,  మహ్మద్‌ గౌస్‌ సద్దాంలతోపాటు చోటు, సల్మాన్, జీషాన్, జమ్మూలకు కూడా దోపిడీ గురించి చెప్పి.. అందరూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. నగదుతో తాను, అజీముద్దీన్‌ వస్తున్నప్పుడు దాడి చేసి ఆ సొమ్మును లాక్కుని వెళ్లాలని, అనంతరం ఆ డబ్బును పంచుకుందామని ఖుస్రీద్దీన్‌ చెప్పాడు. 

సోమవారం ఎప్పట్లాగే.. ఖుస్రీద్దీన్, అజీముద్దీన్‌ మోటార్‌ సైకిల్‌పై కూకట్‌పల్లికి వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తికి రూ.10 నోట్‌ను చూపించగానే.. ఒక దూది పెట్టెలో రూ.కోటి ఇచ్చాడు. అదే సమయంలో తమ కదలికలను ఖుస్రీద్దీన్‌ ఎప్పటికప్పుడు ఒమర్‌ షరీఫ్‌కు తెలిపాడు. దీంతో ఒమర్‌ షరీఫ్‌ తన అనుచరులతో కలిసి మూడు మోటార్‌ సైకిళ్లపై వాళ్లను వెంబడించాడు. రాత్రి 9.30 గంటల సమయంలో ఖుస్రీద్దీన్, అజీముద్దీన్‌ కూకట్‌పల్లిలోని పిల్లర్‌ నంబర్‌ 836 వద్దకు చేరుకోగానే  వారిపై కారం చల్లారు. 

గందరగోళంలో ఎదురుగా ఉన్న బస్సును వారి బైక్‌ ఢీకొట్టింది. వాళ్లు కింద పడిపోయారు. అజీముద్దీన్‌ వద్ద ఉన్న డబ్బు బాక్స్‌ను ఒమర్‌ షరీఫ్‌ లాక్కున్నాడు. అయితే, ఈ దాడిలో సద్దాం కళ్లలో కూడా కారం పొడి పడటంతో రోడ్డుపై పడిపోయాడు. ఈ హడావుడిలో సద్దాంకు చెందిన వాహనాన్ని అక్కడే వదిలేసి  ఖుస్రీద్దీన్‌ సహా నిందితులందరూ పారిపోయారు. ఈ వ్యవహారాన్ని అక్కడే గస్తీలో ఉన్న కానిస్టేబుల్‌ వైభవ్‌ గమనించి కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ కె.వి. సుబ్బారావుకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకొని, మహ్మద్‌ అజీముద్దీన్‌ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

వాహనం నంబర్‌ ఆధారంగా..
దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలంలోని సద్దాం వాహనాన్ని పోలీసులు గమనించారు. సద్దాం తల్లి ఫాతిమా పేరుపై బైక్‌ రిజిస్టర్‌ అయి ఉంది. ఆ వాహనం నంబర్‌తో ఇంటి చిరునామా తెలుసుకొని అక్కడికి వెళ్లారు. సద్దాం ఫోన్‌ నంబర్‌ తీసుకుని ట్రేస్‌ చేయగా శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఉన్నట్లు తెలిసింది. వెంటనే కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌లు అక్కడికి వెళ్లి నిందితులు మహ్మద్‌ ఒమర్‌ షరీఫ్, హమీద్, సద్దాంలను ఒక బ్యాగ్‌తో సహా పట్టుకున్నారు. వారిని విచారించగా డబ్బు తీసుకుని లక్నోకు వెళ్తున్నామని తెలిపారు. 

వారి నుంచి రూ. 77,39,000 నగదు, రూ.39,195 విలువైన విమానం టికెట్లు, ఒక వాహనం, 5 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకు న్నారు. మిగిలిన డబ్బు, హవాలా లావాదేవీల వ్యవహారాలు వంటి వివరాలు దర్యాప్తు అనంతరం తెలుస్తాయని, ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని, మిగతావారు పరారీలో ఉన్నట్లు డీసీపీ రితిరాజ్‌ తెలిపారు. 24 గంటల్లోనే కేసును చేధించిన కూకట్‌పల్లి పోలీసులు, సీసీఎస్‌ బాలానగర్‌ బృంద సభ్యులను అభినందించి, రివార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలానగర్‌ ఏసీపీ నరేష్‌ రెడ్డి, సీసీఎస్‌ ఏసీపీ నాగేశ్వరరావు, కూకట్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ కె.వి. సుబ్బారావు, సీసీఎస్‌ సీఐ రవికుమార్, అడ్మిన్‌ ఎస్‌ఐ రామకృష్ణ, ఎస్‌ఐలు చంద్రశేఖర్, గిరీష్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement