‘కోచ్‌’.. తూచ్‌! | Kazipet coach factory have not been started production | Sakshi
Sakshi News home page

‘కోచ్‌’.. తూచ్‌!

Mar 18 2026 4:38 AM | Updated on Mar 18 2026 4:38 AM

 Kazipet coach factory have not been started production

నిర్మాణాలు పూర్తి.. పూర్తి స్థాయి యంత్ర పరికరాలూ సిద్ధం 

మార్చిలోనే ప్రారంభం కావాల్సిన ఉత్పత్తి 

ఇప్పటివరకు టెండర్లు కూడా పిలవని తీరు 

టెండర్ల బాధ్యత చెన్నై ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి అప్పగింత 

నెలలు గడుస్తున్నా ప్రక్రియ ప్రారంభించని ఐసీఎఫ్‌ 

కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో రైల్వే శాఖ దోబూచులాడుతోంది. నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి చేయటానికి అంతా సిద్ధమైనప్పటికీ, అక్కడ ఉత్పత్తి ప్రారంభించేందుకు కనీస ఏర్పాట్లు కూడా మొదలు కాలేదు. విదేశాల నుంచి ఆధునిక యంత్రాలు దిగుమతి అయి దాదాపు 9 నెలలు అవుతోంది. ప్రధాన లైన్‌తో ట్రాక్‌ అనుసంధానం కూడా పూర్తయింది. ఈపాటికే ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, రైల్వే శాఖ కనీసం టెండర్లు కూడా పిలవలేదు. 

ఎన్నో పోరాటాల పిదప సాకారమైన కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందో తెలియని గందరగోళం నెలకొంది. దీనివల్ల ప్రత్యక్షంగా 3 వేల కుటుంబాలకు, పరో క్షంగా మరో ఆరేడు వేల కుటుంబాలకు ఉపాధి లభించనుండటంతో ఆయా కుటుంబాలు ఉత్పత్తి ప్రారంభం కోసం ఆశతో ఎదురుచూస్తున్నాయి. 

దేశంలో వందేభారత్, వందేభారత్‌ స్లీపర్, అమృత్‌ భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టడం, వాటికి విపరీతమైన డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ సిద్ధమైంది. ఇక్కడ ఆధునిక రైళ్లను తయారీ చేసే లక్ష్యంతో అందుకు వీలుగా మౌలిక వసతులు కల్పించారు. సాధారణ రైళ్లే కాకుండా మెట్రో రైళ్లను కూడా ఉత్పత్తి చేయగలిగే వసతి ఇక్కడ ఉంది. తొలుత ఏసీ ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్లను తయారు చేసేందుకు అనుమతించారు. ఎంఎంటీఎస్‌ తరహా లోకల్‌ రైళ్లను ఉత్పత్తి చేయనున్నారు. 

ఆ తర్వాత దశలవారీగా వందేభారత్‌ రైళ్ల తయారీకి నిర్ణయించారు. అయితే ఉత్పత్తి బాధ్యతను ఏ సంస్థకు అప్పగించాలన్న విషయంలో టెండర్లు పిలిచే పనిని చెన్నై ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి అప్పగించారు. ఈ క్రమంలో మార్చిలోనే ఉత్పత్తి మొదలవుతుందని భావించారు. కానీ ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియే మొదలు కాలేదు. దీంతో ఉత్పత్తి ఇప్పట్లో ప్రారంభం కాదన్న చర్చ అధికార వర్గాల్లో నడుస్తోంది.

ఉత్తుత్తి హడావుడి..
కాజీపేట శివారు మడికొండలో దాదాపు 160 ఎకరాల విస్తీర్ణంలో రూ.521 కోట్ల వ్యయంతో భారీ ఫ్యాక్టరీని నిర్మించారు. నాలుగు రకాల ఉత్పత్తికి వీలుగా నాలుగు భారీ షెడ్లు నిర్మించారు. వాటికి వేరువేరు ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. కాజీపేట–సికింద్రాబాద్‌ ప్రధాన లైన్‌తో అనుసంధానించారు. 

దాదాపు 13.15 కి.మీ. నిడివితో ఈ ట్రాక్‌ నిర్మాణం పూర్తయింది. జపాన్‌ సహా కొన్ని విదేశాల నుంచి ఆధునిక యంత్రాలు, స్థానికంగా తయారైన మరికొన్ని యంత్రాలు గతేడాదే వచ్చాయి. గతేడాది జూలైలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కోచ్‌ ఫ్యాక్టరీని సందర్శించి 2026 మొదట్లోనే ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలూ ముందుకు సాగక పోవడం గమనార్హం. 

ప్రైవేటుకు పనులు?
ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ పర్యవేక్షించింది. కానీ ఉత్పత్తి బాధ్యతను రైల్వే శాఖ దానికి అప్పగించలేదు. చెన్నై ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ద్వారా టెండర్లు పిలిచి ప్రైవేటు సంస్థకు బాధ్యత అప్పగించే యోచనలో ఉన్నారు. ప్రైవేటు సంస్థకు ఉత్పత్తి బాధ్యత అప్పగిస్తే అందులో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

తక్కువ జీతాలకు పని చేసే వారిని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుని పనులు అప్పగిస్తే స్థానిక నిరుద్యోగ యువతకు అవకాశాలు సన్నగిల్లుతాయని అంటున్నారు. అయితే ఇటీవల ఉన్నట్టుండి ట్రాక్‌ మీద రైలుతో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. దీంతో ఉత్పత్తి కసరత్తు మొదలవుతోందనే ప్రచారం జరిగింది. కానీ.. ఏదో చేస్తున్నామనే హడావుడి కోసం ఢిల్లీ నుంచి రైల్వే అధికారులు చేసిన సూచన మేరకు ఉత్తుత్తి ట్రయల్‌ రన్‌ నిర్వహించారని స్థానిక అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.  

ఉద్యోగాల పేరిట దందా 
ఇటీవల వాట్సాప్‌లో కొన్ని ప్రకటనలు చక్కర్లు కొడుతున్నాయి. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగాల ఎంపిక ఉందని, వివిధ సాంకేతిక పోస్టుల కోసం సంప్రదించాలంటూ కొందరు ఫోన్‌ నంబర్‌తో ప్రకటన ఇచ్చారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయడానికే ఇలా చేశారని తెలుస్తోంది. ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దని, ఇది మోసపూరిత ప్రకటన అని, రైల్వే ఉద్యోగాలకు అధికారికంగా పత్రికల్లో నోటిఫికేషన్‌ వెలువడుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement