శాసన సభలో తీవ్ర స్థాయిలో వాదోప వాదాలు
ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా విమర్శలు,ప్రతి విమర్శలు
ధన్యవాదాలు ఎందుకు తెలపాలన్న బీఆర్‌ఎస్ నేత
ప్రభుత్వానికి, సీఎం సంతకానికి జీరో వాల్యూ అంటూ ఎద్దేవా
కేటీఆర్ ప్రసంగిస్తుండగా జోక్యం చేసుకున్న ఐదుగురు అమాత్యులు
ప్రభుత్వ పథకాలు ప్రస్తావిస్తూ దీటుగా జవాబు.. సభను పక్కదారి పట్టిస్తున్నారంటూ ఫైర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండోరోజు మంగళవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల సవాళ్లు, ప్రతిసవాళ్లకు శాసనసభ వేదికైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే సమయంలో విపక్ష బీఆర్‌ఎస్, అధికార కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్సెస్ మంత్రులు అన్నట్టుగా సభ సాగింది. కేటీఆర్.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధతను ప్రశ్నిస్తూ, ఆ ఆరు అంశాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని ధ్వజమెత్తారు. కేటీఆర్‌కు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
కేటీఆర్ ప్రశ్నల వర్షం
సుమారు 1.40 గంటల పాటు మాట్లాడిన కేటీఆర్.. గవర్నర్ ప్రసంగంలోని అంశాలతో పాటు రెండున్నరేళ్ల ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ప్రభు త్వం విఫలమైనందుకు ధన్యవాదాలు తెలపాలా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్‌కార్డుల విషయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మధ్య సమన్వయ లోపం ఉందని వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్న సీఎం సంతకానికి విలువలేకుండా పోయిందని విమర్శించారు. ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని ప్రశ్నించారు. దీనిపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, సీఎం సంతకానికి జీరో వాల్యూ అంటూ ఎద్దేవా చేశారు.
ప్రతి విమర్శలతో మంత్రుల ఫైర్
కేటీఆర్ ప్రసంగానికి పలుమార్లు అడ్డుపడిన మంత్రులు.. ప్రతి విమర్శలకు దిగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్, సన్నబియ్యం, మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా వంటి పథకాలను ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగాన్ని చదివి ఉపన్యాసా లు ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌బాబు హితవు పలికా రు. గోబెల్స్ సదస్సులో రూ.లక్షల కోట్లు పెట్టుబడు లు వచ్చాయని చెప్తున్నా, టీజీఐఐసీ గణాంకాలు అందుకు భిన్నంగా ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యల పై స్పందిస్తూ.. ఎంఓయూలు కుదిరినా అవి ఆచరణలోకి వచ్చేందుకు సమయం పడుతుందంటూ వివరణ ఇచ్చారు.
మంత్రి కోమటిరెడ్డి.. తెల్లరేషన్‌కార్డులు, సన్న బియ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా మిస్ బ్రిటన్ చేసిన ఆరోపణలను కేటీఆర్ ప్రస్తావించడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి..సీతక్కకు మద్దతుగా మాట్లాడారు. అనర్హత పిటిషన్లపై కేటీఆర్ మాట్లాడినప్పుడు మంత్రి పొంగులేటి..కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!
‘శోభాకృత నామ, క్రోదీకృత నామ సంవత్సరాలు పోయాయి. విశ్వావసునామ సంవత్సరం 19న పోతోంది. రేపు పరాభవ నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మిగిలింది పరిహాసమే. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే. ఉగాదులు వస్తున్నయి.. పోతున్నయి. గ్యారంటీలు మాత్రం రావడం లేదు. గవర్నర్ ప్రసంగంలో గ్యారంటీలు, డిక్లరేషన్ల ఊసే లేదు. మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నా రు. ప్రభుత్వ అర్ధభాగం గడిచిపోయింది. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. సినిమా పేరు అభయహస్తం.. లోపల కథ చూస్తే భస్మాసుర హస్తం అని ప్రజలకు అర్థమైంది.
మూడు ముక్కల్లో చెప్పాలంటే హామీలు ఎగ్గొట్టు.. కట్టిన వాటిని కూలగొట్టు.. ఉన్న పథకాలను చెడ గొట్టు..అన్నట్టుగా కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలన ఉంది..’ అంటూ బీఆర్‌ఎస్ సభ్యుడు కేటీ రామారావు ధ్వజమెత్తారు. రైతు భరోసా, మహాలక్ష్మీ, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లను ఉద్దేశించి..ఈ ఆరు గ్యారంటీల (అభయ హస్తం) ఫైలు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఆ ఫైలు ఆచూకీ కోసం సిట్ వేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
మీ ప్రభుత్వానికే జీరో వేల్యూ
‘ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై సీఎం రేవంత్ తొలి సంతకం చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధి, సంకల్పానికి నిదర్శనమని 2023 డిసెంబర్ 15న కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన తన తొలి ప్రసంగంలో నాటి గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. సీఎం సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది? ఎఫ్‌ఎస్‌ఎల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? తొలి కేబినెట్‌లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఇప్పటికే 50–60 కేబినెట్ సమావేశాలు జరిగినా అతీగతీ లేదు. కొంతమంది ఆస్తులకు జీరో వేల్యూ చేసినట్టు సీఎం రేవంత్ అన్నారు. సీఎం సంతకానికి, ఆయన సంతకం చేసిన ఫైల్‌కి, మీ గ్యారంటీల కార్డుకి, మీ డిక్లరేషన్లకి, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికే జీరో వేల్యూ..’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల లబ్ధి ఎక్కడ?
‘ఆరు గ్యారంటీలతో ఏటా ప్రతి కుటుంబానికి రూ.2.50 లక్షల లబ్ధి కలుగుతుందని హామీ ఇచ్చారు. ఏటా రూ.2.75 లక్షల కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఖర్చు చేశారా? రూ.2.5 లక్షల లబ్ధి పొందిన ఒక్క కుటుంబాన్నైనా చూపించగలరా? నేనే రాజు నేనే మంత్రి.. అని మిడిసిపడ్డ వారెవరూ సంపదలను, పదవులను మూటగట్టుకుని పోలేదని భాగవతంలో బలి చక్రవర్తి అన్నారు..’ అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇటీవల ‘నేనే రాజు..నేనే మంత్రి’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడంపై పరోక్ష విమర్శలు చేశారు.
ఎవరికి ధన్యవాదాలు తెలపాలి?
‘ధన్యవాద తీర్మానంపై చర్చలో ఎవరికి ధన్యవాదాలు చెప్పాలి? రూ.4 వేల పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న 46 లక్షల మందికా? రూ.6 వేల పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న దివ్యాంగులకా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులకా? డీఏలు, పీఆర్సీ, బెనిఫిట్స్ అందని 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకా? నెలకు రూ.2,500 కోసం నిరీక్షిస్తున్న కోటి 65 లక్షల మంది ఆడపడుచులకా? విషాహారంతో చస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ధన్యవాదాలు చెప్పాలా?..’ అని కేటీఆర్ నిలదీశారు.
420 వరల్డ్ కప్ పెడితే గెలిచేది కాంగ్రెస్సే..
‘ఇండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. 420 వరల్డ్ కప్ పెడితే గెలిచేది కాంగ్రెస్సే. నేను కర్ణుడిలాంటి వాడిని అని ఇటీవల సీఎం అన్నారు. ఎన్నికలయ్యాక కుంభకర్ణుడు అయ్యారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరి గినా తెలంగాణలో గొప్ప పాలన చేస్తున్నామంటూ ప్రజాధనంతో ప్రకటనలు ఇస్తున్నారు. పీసీ సర్కారు మాయాజాలాన్ని ఈ సర్కారు మరిపించింది. అట్టర్ ఫ్లాప్ సినిమాకి సంబరాలు చేస్తారా?. ఢిల్లీకి పోయి నిధులు తెస్తారనుకుంటే ఇచ్చి వస్తున్నారు.
బాకీలు.. బకాయిలు.. డైవర్షన్లు.. కమీషన్లు!
చెప్పుకోవడానికి ఏం ఉంది? బాకీలు..బకాయిలు.. డైవర్షన్లు.. కమీషన్లు. బుల్డోజర్ల చప్పుళ్లు..బూతుల మోతలు. ఆల్‌టైమ్ రికార్డు అప్పులు.. క్యూలైన్‌లో చెప్పులు. 420 హామీల ఎగనామాలు.. మూడున్నర కోట్ల మందికి పంగనామాలు. నోటిఫికేషన్లు నిల్.. లూటిఫికేషన్లు ఫుల్లు. చెక్‌డ్యామ్‌ల పేలి్చవేతలు..అడుగడుగున అణచివేత. క్రెడిట్ చౌర్యం.. భూముల బేరం. స్కాముల కళకళ.. స్కీముల వెలవెల. రైతన్నలకు బేడీలు.. నిరుద్యోగులపై లాఠీలు. ఫిరాయింపుల కంపు.. బస్సు చార్జీల వాయింపు. ఫుడ్ పాయిజనింగ్ చావులు.. ఫుట్‌బాల్ సరదాలు. గల్లీల్లో చెత్తకుప్పలు.. ఢిల్లీలో విమానయాత్రలు. మాటలు ధడేల్.. చేతలు తుఫేల్. దరఖాస్తులు.. దండాలు.. దఫ్తర్లు..’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఇంకో 4 రోజులైతే ట్రిలియన్ డాలర్లు వచ్చేవి..!
‘గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు, ఐటీ ఉద్యోగాలు 9.39 లక్షలకు చేరుకున్నట్టు పేర్కొన్నారు. అయితే 2023–24లోనే 9.46 లక్షల ఐటీ ఉద్యోగాలున్నాయి. మరి కాంగ్రెస్ వచ్చాక 7 వేల ఉద్యోగాలు తగ్గాయా? ఐటీ ఎగుమతులు రూ.3.60 లక్షల కోట్లకు చేరాయని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది. తప్పుదోవ పట్టించిన ఐటీ శాఖ కార్యదర్శిని తీసి చెత్తబుట్టలో పారేయండి. గోబెల్స్ (గ్లోబల్) సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. కానీ టీజీఐఐసీ వెబ్‌సైట్ ప్రకారం 2022–23లో 3,010, 2023–24లో 4 వేలు కొత్త పరిశ్రమలు వస్తే కాంగ్రెస్ వచ్చాక 2024–25లో 2,050, 2025–26లో 1,026కి ఎందుకు తగ్గాయి? 2031 కల్లా ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తామన్నారు.
గ్రాఫిక్స్ మాయాజాలంతో రూ.100 కోట్లు పెట్టి డేరా నగర్‌లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగలినప్పుడు.. సమ్మిట్ ఇంకో నాలుగు రోజులు నడిపిస్తే అక్కడే ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమయ్యేది. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. రూ.కోటి కోట్లు సమకూరితే రాష్ట్రం 100 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవుతుంది. పెట్టుబడులు వెల్లువెత్తినట్టు చెబుతున్నారు. పారిశ్రామికవేత్తల కణతపై తుపాకులు పెడితే వారు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తర్వాత. ముందు వారికి నెలకు రూ.2,500 ఇచ్చేందుకు బడ్జెట్‌లో నిధులు పెట్టాలి. రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇవ్వలేదు..’ అంటూ కేటీఆర్ విమర్శించారు. ఎంఓయూలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఫార్మా సిటీ స్థలాలపై కోర్టుకు ఒకటి.. బయటకు ఇంకొకటి
‘ఫార్మాసిటీ కోసం మా ప్రభుత్వం 14వేల ఎకరాలను సేకరిస్తే అప్పుడు భట్టి రైతులకు వెనక్కి ఇస్తామన్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ప్రభు త్వం చెప్పుతున్నట్టు అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్టులకు ఇళ్లు, జూపార్క్, స్టేడియం కట్టడం కుదరదు. ఫార్మాసిటీకి ఆ స్థలాలను వాడతామని ప్రభు త్వం కోర్టుకు చెప్పింది. బయట ఇంకొకటి అంటున్నారు..’ అని తప్పుబట్టారు. ‘హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలప్పుడు మిస్ బ్రిటన్ దేశం వదిలి పారిపోయింది. ఆమెను వ్యభిచారిణిలాగా భావన కలిగేలా వ్యవహరించారని సన్ మ్యాగజైన్‌లో వచ్చింది. మిస్ బ్రిటన్‌కు వేధింపులు ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ధనిక రాష్ట్రాన్ని చేతుల్లో పెడితే జీరో చేశారు
‘రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్‌గా చేసి ధనిక రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాం. ఈ రోజు ఆదాయం అంచనాలు తప్పుతున్నాయి. బడ్జెట్ అంచనాలు బోల్తా కొడుతున్నాయి. కరోనా కాలం తరహాలో తిరోగమనం చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నది. డే ఎకానమీ ఢమాల్ అన్నది. ఇప్పుడు నైట్ ఎకానమీ తెస్తారట. మేము దిగేసరికి రూ.3.47 లక్షలతో తలసరి ఆదాయంలో నంబర్ వన్‌గా ఉండగా, ఈ రోజు అదీ తగ్గింది. జీఎస్టీ, వాహనాల రిజిస్ట్రేషన్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయింది. మందుగమనం ఒక్కటే జోరుగా ఉంది. 2023 డిసెంబర్ నుంచి ఈ రాష్ట్రంలో జీరో వేల్యూ మిషన్ ప్రారంభమైంది. అన్నీ ఫాల్.. మీరేమో జాకీలు పెట్టి రైజింగ్ అంటున్నారు. నీరో చక్రవర్తి గురించి విన్నాం. జీరో చక్రవర్తిని చూస్తున్నాం..’ అని కేటీఆర్ విమర్శించారు. మాజీ సీఎంలు చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డిలను ప్రస్తావించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పేరును విస్మరిస్తున్నారని విమర్శించారు.
మీదే ఫ్లాప్ సినిమా!
‘శాసనసభకు 2023లో జరిగిన ఎన్నికల్లో ఫ్లాప్ అయింది మీరు. లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. మల్ల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్లాప్ అయ్యారు. అన్నిసార్లు ఫ్లాప్ అయ్యి మమ్మల్ని ఫ్లాప్ అంటారు ఏంటి?’ అని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌పై శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు మండిపడ్డారు. తీరు మార్చుకుంటే రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మెరుగయ్యే అవకాశం ఉంటదని హితవు పలికారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చలో సర్కారుపై కేటీఆర్ చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఎవరో రాసిన స్క్రిప్‌్టను చదువుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, అధిష్టానాన్ని కలిసేందుకు ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తామని అన్నారు. 
‘రాష్ట్ర ప్రయోజనాల కోసం మేం ఎన్నిసార్లు అయినా ప్రధానిని, మంత్రులను కలుస్తాం. రాష్ట్ర ప్రజల అబివృద్ధి. సంక్షేమానికి నిధులు ఇచ్చేందుకు తప్పకుండా ఢిల్లీకి పోతాం. మీరు ప్రాంతీయ పార్టీ (బీఆర్‌ఎస్)గా ఉండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మీరు ఎన్నిసార్లు బీజేపీ ప్రధానమంత్రి వద్దకు పోలేదు?..’ అని శ్రీధర్‌బాబు నిలదీశారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ పరిశ్రమలు వస్తే వాటికి అనుబంధంగా నివాస, వినోద, క్రీడా, ఐటీ రంగ సదుపాయాలూ వృద్ధి చెందుతాయన్నారు. గ్రీన్‌ఫార్మా పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని కోర్టుకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎంవోయూలపై శ్వేతపత్రం ప్రకటిస్తాం..
‘గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంవోయూలు ఎందుకు చేసుకున్నారని కేటీఆర్ అంటున్నారు. ఎంవోయూలు చేసుకోకపోతే బాగుండుననేది వారి ఆలోచనగా కనపడుతోంది. కేటీఆర్ కూడా దావోస్‌కు వెళ్లారు. ఆయనకు అన్నీ తెలుసు. ఎంవోయూల్లో 30–40 శాతమే సఫలీకృతం అవుతాయని మన సీఎంకు మహారాష్ట్ర సీఎం తెలియజేశారు. త్వరలో వీటిపై శ్వేతపత్రం ప్రకటిస్తాం. మహిళలను లక్షాధికారులను చేస్తామని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి అన్నారు.
దానికి కొనసాగింపుగానే వారిని కోటీశ్వరులను చేయాలని సంకల్పించాం. ఈ విజన్‌ను కూడా హేళనగా, చులకనగా మాట్లాడడం సరికాదు. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు బీఆర్‌ఎస్ వారు ఇక్కడ ఉండేవారా? సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారంలో బీఆర్‌ఎస్‌కు మించిన దిట్ట లేరు. ఐటీ ఉద్యోగాలు తగ్గిన విషయం పరిశీలిస్తాం. ఐటీ ఎగుమతుల విలువలో సంఖ్యాపరంగా తప్పులుంటే సరిచేసుకుంటాం..’ అని మంత్రి అన్నారు.
దళితుడిని సీఎం చేశారా?: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
‘హామీలు అమలు కావడం లేదని ఆరోపించడం సరికాదు. దళితుడిని సీఎం చేస్తామనని..భూమి లేని పేదలకు మూడెకరాల భూమి ఇస్తామని మీ లెక్క హామీలిచ్చి విస్మరించలేదు. మీరు చేసిన అప్పులకు అసలు, వడ్డీలు కడుతూ పథకాలు అమలు చేస్తున్నాం..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆరు గ్యారంటీలతో ఒక్కో కుటుంబానికి రూ.2.5 లక్షల లబ్ధి కలుగుతుందని హామీ ఇచ్చింది వాస్తవమేనని, ఒక్కో కుటుంబానికి ఎన్ని లక్షలు వారి ఖాతాల్లో జమ చేశామో లెక్కలతో సహా వివరిస్తానన్నారు.
53–54లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలుంటే 1.06 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్టు గుర్తుచేశారు. రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా వేశామన్నారు. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కి రూ.500 బోనస్ ఇస్తున్నామని, రూ.12 వేలు రైతు భరోసా, బోనస్ కలిపి ఒక్కో ఎకరానికి రూ.25 వేలు చొప్పున రైతులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు.
మహిళలంటే కోపం ఎందుకు ?: సీతక్క
మహిళలంటే మీకు ఎందుకంత వ్యతిరేకత అని కేటీఆర్‌పై మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. తరతరాలుగా అణచివేతకు గురైన మహిళలు స్వశక్తితో ఎదుగుతుంటే సహకరించాలని హితవు పలికారు. వైఎస్ ప్రభుత్వం తెచ్చిన అభయహస్తం పథకం నిధులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. ‘పదేళ్లలో ఎన్ని ఇళ్లు ఇచ్చారు? ధనిక రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? దళితులకు భూములు ఎందుకు పంచలేదు?’ అని నిలదీశారు.
దళితుడిని సీఎం చేసిందుకా?
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క తెల్లరేషన్‌కార్డు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తామని హామీ ఇచ్చి చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలా? సన్న బియ్యం ఇస్తున్నందుకు, యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం, ఆరీ్టసీలో మహిళలకు ఉచిత ప్రయాణాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టినందుకు తమ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలన్నారు.
మా హక్కులను రక్షించాలి.. తలసాని
కేటీఆర్ మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే జోక్యం చేసుకోవడం సభా మర్యాదలకు భంగం కలిగించడమేనని బీఆర్‌ఎస్ సభ్యుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తమ హక్కులను సభాపతి రక్షించాలని విజ్ఞప్తి చేశారు.
అలా ఎలా సార్?
‘అధ్యక్షా మీరు కూడా.. మాపార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేస్తే ఎలా సార్?, ఆయనను ఆడ కూర్చోబెడితే..’అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం శాసనసభలో ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా పలు అంశాలపై మాట్లాడిన ఆయన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ను ఇటీవల స్పీకర్ కొట్టివేయడాన్ని ప్రస్తావించారు. ‘మీరు నిర్ణయం తీసుకున్నారు. దాంతో మాకు విభేదం లేదు.. నా ప్రార్థన..’అని కేటీఆర్ ఇంకా ఏదో చెప్పబోతుండగా స్పీకర్ అడ్డు తగిలారు.
‘కోర్టులో జడ్జి తీర్పు ఇస్తే నచ్చకపోతే పైకోర్టుకు పోతాం. మీరు కూడా జడ్జిమెంట్ చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసిన్రు. అయినా నేను మీడియా ముందుకు రాలేదు. జడ్జిమెంట్ పూర్తిగా చదివితే మాట్లాడాలి. మీకు చెపుతున్నా..ఈ ప్రశ్నించేదానిని తగ్గించుకుంటే మంచిగుంటది..’అని అన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అయినా ప్రశ్నించే అధికారం సభ్యుడిగా నాకుంటది. మీరు జ్యుడీషియరీ నేను కాదనడం లేదు. ప్రజాస్వామ్యంలో నిలదీయడం, అడగడం మా బాధ్యత..’అని అన్నారు.
మంత్రి పొంగులేటి ఆగ్రహం
కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. ‘జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని, మీ జడ్జిమెంట్‌ను కూడా ప్రశ్నించే స్థాయిలో మాట్లాడుతున్నారంటే..వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో గమనించాలి. అసెంబ్లీ, పార్లమెంటుతో పాటు గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో నాలుగుసార్లు ఎందుకు ఓడిపోయారో ఇప్పటికైనా మీరు గమనించాలి. పార్టీలు మారడాన్ని పోత్సహించిందే మీరు..’అని బీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు.
మంత్రి మాటలకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘హైకోర్టు తీర్పు ఇస్తే సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే రివిజన్‌కు వెళ్లే హక్కు ఉంటుంది. హరియాణలో ఆయారాం గయారాం విధానాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ..’అని చెప్పారు. స్పీకర్ స్థానంలో ఉన్న వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. ‘ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నా, మీరు అడ్డుకోవడం లేదు. మీరు మారాలి. బడివె అని సీఎం అంటే కూడా స్పందించలేదు. గ్రహణం కొన్ని గంటలే ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు..’అని వ్యాఖ్యానించారు.


