HYD: మీరు తినేది అల్లం పేస్ట్ కాదు.. ఏం కలుపుతున్నారంటే? | Hyderabad: Two Adulterated Ginger Garlic Paste Units Busted | Sakshi
Sakshi News home page

HYD: మీరు తినేది అల్లం పేస్ట్ కాదు.. ఏం కలుపుతున్నారంటే?

Mar 17 2026 9:16 PM | Updated on Mar 17 2026 9:32 PM

Hyderabad: Two Adulterated Ginger Garlic Paste Units Busted

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో రెండు కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇరువురిని అరెస్టు చేయగా.. సుమారు రూ.7 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. బోరబండలోని మధురా నగర్‌, టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలైమెట్ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా.. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న కేంద్రాలపై టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో భారీగా కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

బోరబండలోని మధురా నగర్‌లో 'A1 సహారా గోల్డ్ అల్లం వెల్లుల్లి పేస్ట్' పేరుతో ఈ అక్రమ తయారీ సాగుతోంది. టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. రాఘవేందర్ నేతృత్వంలోని బృందం, GHMC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌ జంగారెడ్డితో కలిసి ఈ దాడి నిర్వహించారు.  నిందితుడు మొహమ్మద్ అబ్దుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, దుమ్ము, ఈగలు ముసిరే ప్లాస్టిక్ టబ్బులలో పేస్ట్‌ను నిల్వ చేస్తున్నారు. నాణ్యత లేని ముడిసరుకుతో పాటు అసిటిక్ యాసిడ్, అధిక మొత్తంలో ఉప్పు,  వెల్లుల్లి పొట్టును కలిపి కల్తీ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో తయారైన ఈ ప్రమాదకరమైన పేస్ట్‌ను హోల్‌సేల్ కిరాణా షాపులకు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ నిందితుడు భారీగా లాభాలు గడిస్తున్నట్లు గుర్తించారు.

సుమారు రూ. 4,50,000 విలువైన నిల్వలను, యంత్రాలను సీజ్ చేశారు. 4275 కిలోల వెల్లుల్లి ముడిసరుకు (95 బస్తాలు), 150 కిలోల వెల్లుల్లి పొట్టు, 55 కిలోల విడి అల్లం వెల్లుల్లి పేస్ట్, 800 కిలోల ఉప్పు, పసుపు, ప్యాక్ చేసిన వివిధ పరిమాణాల పౌచ్‌లు, మిక్సర్, గ్రైండర్, పీలింగ్ మెషీన్, ప్యాకింగ్, వెయిట్ మెషీన్లు  స్వాధీనం చేసుకున్నారు.

టప్పాచబుత్రాలో..
టప్పాచబుత్రాలో మరో కేంద్రంపై హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) బృందం దాడి చేసింది. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలైమెట్ ప్రాంతంలో సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. నిందితుడు మొహమ్మద్ జాఫర్ ఆలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో సిట్రిక్ యాసిడ్, అధిక మొత్తంలో ఉప్పు వంటి రసాయనాలను కలిపి కల్తీ చేస్తున్నారు.

ఈ పేస్ట్‌ను దుమ్ము, ఈగలు ముసిరే ప్లాస్టిక్ టబ్బులలో, బహిరంగంగా నిల్వ చేస్తున్నారు. సుమారు రూ. 2,50,000 విలువైన నిల్వలను, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.  ఈ కల్తీ పేస్ట్‌ను నగరంలోని వివిధ హోల్‌సేల్ కిరాణా దుకాణాలు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ నిందితుడు అక్రమంగా లాభాలు గడిస్తున్నాడు. FSSAI లైసెన్స్‌లో పేర్కొన్న చిరునామాకు, ప్రస్తుతం తయారీ సాగుతున్న చిరునామాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement