నిబంధనల ప్రకారమే బెయిల్‌ | Bail Granted in Accordance with Regulations | Sakshi
Sakshi News home page

నిబంధనల ప్రకారమే బెయిల్‌

Mar 19 2026 1:48 AM | Updated on Mar 19 2026 1:48 AM

Bail Granted in Accordance with Regulations

రాహుల్‌గాంధీకి పుష్పగుచ్ఛం అందిస్తున్న వేం నరేందర్‌రెడ్డి. చిత్రంలో సీఎం రేవంత్, రోహిణ్‌రెడ్డి, జితేందర్‌ రెడ్డి, సురేశ్‌ షెట్కార్, మహేశ్‌గౌడ్, మల్లు రవి, అనిల్‌ కుమార్‌ యాదవ్, రఘురామి రెడ్డి

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో ప్రభుత్వ ప్రమేయం లేదు 

పూర్తిస్థాయిలో నిజానిజాలునిగ్గుతేల్చేందుకేసిట్‌  –ఢిల్లీలో సీఎంరేవంత్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ :  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంపీ పుట్టా మహేశ్‌తో పాటు ఇతర నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ లభించడం నిబంధనల ప్రకారం జరిగిందే తప్ప అందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని అన్నారు. బుధవారం పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో ముచ్చటించారు. 

‘మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో కొందరు స్టేషన్‌ బెయిల్‌ పొందారు. డ్రగ్స్‌ కేసుల్లో పట్టుబడిన వారు తాము బాధితులమని చెబుతున్నారు. ఈ కేసుల్లో బాధితులుగా ఉన్నవారికి స్టేషన్‌ బెయిల్‌ పొందే అవకాశం చట్టరీత్యా ఉంటుంది. ఇందులో ప్రభుత్వం గానీ, మరెవరు గానీ చేసేదేమీ లేదు..’అని ముఖ్యమంత్రి అన్నారు. కేసును పక్కదారి పట్టనివ్వకుండా పూర్తిస్థాయిలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకే ప్రతేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని చెప్పారు.  

ముందస్తు ముచ్చటే లేదు... 
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం తోసిపుచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారమే అంటే 2029లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ‘2028లో ఎన్నికలు జరుగుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం ముందుగా జాతీయ జనగణన పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలవుతుంది. 

ఇవన్నీ జరగడానికి సమయం పడుతుంది..’రేవంత్‌ వివరించారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, అది మంచి పరిణామమని సీఎం వ్యాఖ్యానించారు.  

రాహుల్, ప్రియాంకతో భేటీలు 
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాం«దీ, కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాం«దీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. పార్టీ తరఫున ఇటీవల రాజ్యసభకు ఎంపికైన వేం నరేందర్‌రెడ్డిని వారికి పరిచయం చేశారు. కాగా వేం నరేందర్‌రెడ్డిని రాహుల్, ప్రియాంక అభినందించారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించినందుకు రాహుల్, ప్రియాంకలకు వేం నరేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, సురేశ్‌ షెట్కార్, రామసహాయం రఘురామిరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత రోహిణ్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ఏపీ మాజీ మంత్రి రోజాకు పలకరింపు 
పార్లమెంటు ఆవరణలో వైఎస్సార్సీపీకి చెందిన ఏపీ మాజీ మంత్రి రోజాను ముఖ్యమంత్రి పలకరించారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి రోజా పార్లమెంటుకు వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఎదురుకావడంతో ఒకరినొకరు మర్యాద పూర్వకంగా పలకరించుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement