హాస్టళ్లు, మెస్‌లపై ఆధారపడినవారి పరిస్థితి అగమ్యగోచరం
దుకాణం మూసివేత దిశగా మెస్‌లు, టిఫిన్ సెంటర్లు
చాలా హాస్టళ్లలో ఇప్పటికే ఒంటి పూట భోజనం..!
ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇండక్షన్ స్టౌలకు ఫుల్ డిమాండ్
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేద్దామంటే ఔట్ ఆఫ్ స్టాక్
సాక్షి,రంగారెడ్డి జిల్లా: బంజారాహిల్స్ పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం నగరంలోని సామాన్యుడిని ఆకలి సెగల్లోకి నెడుతోంది. కమర్షియల్ గ్యాస్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సిలిండర్ల సరఫరా స్తంభించడాన్ని ఆసరాగా చేసుకుని ఉన్న కొద్దిపాటి నిల్వలను దళారులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో హోటళ్లు, హాస్టళ్లు, చిన్న టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు మూతపడుతున్నాయి. తద్వారా రోజువారీ కూలీలు, చిరుద్యోగుల ఆహార అవసరాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. విద్య, ఉద్యోగాలకు వచ్చి హాస్టళ్లు, మెస్‌లపై ఆధారపడుతున్న లక్షలమంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఐటీ కారిడార్ (గచ్చిబౌలి, మాదాపూర్), అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాల్లో 11 వేల హాస్టళ్లున్నాయి. వీటిలో 10 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉంటున్నారని అంచనా. అయితే, నిర్వాహకులు గ్యాస్ వాడకం తగ్గించేందుకు మెనూలో కోత విధిస్తున్నారు. దోశ, పూరీ, చపాతీ వంటివి తొలగించి.. కేవలం ఉప్మా, పొంగల్ వంటి తేలికైన బ్రేక్‌ఫాస్ట్, అన్నం–పప్పుతో సరిపెడుతున్నారు.
⇒ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మధురానగర్, ఫిలింనగర్ ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. వందలాది టీ స్టాల్స్ బంద్ చేశారు. అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, ఫిలింనగర్‌లలో ‘సాక్షి’ పరిశీలించగా.. శనివారం నుంచి హోటళ్లు బంద్ చేస్తామని ఇంకొందరు వ్యాపారులు చెప్పారు. చాలా హాస్టళ్లలో రెండ్రోజుల కిందటే మెనూ కోత పెట్టగా, తాజాగా ఒకపూట భోజనం లేదని చెప్పేస్తున్నారు.
డొమెస్టిక్ గ్యాస్ వినియోగంపై నిఘా
కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడంతో చాలామంది హోటల్ యజమానులు గృహావసరాల సిలిండర్లను వాడుతున్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖ మెరుపుదాడులకు దిగింది. మూడు రోజులుగా వందల సిలిండర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేసింది. కాగా, చిరు వ్యాపారులకు బ్లాక్‌లో కమర్షియల్ సిలిండర్ల ధరలు షాక్ కొడుతున్నాయి. ‘‘మాకు ఎప్పుడూ రూ.1,800కు సిలిండర్ ఇచ్చేవారు. ఇప్పుడు రూ.3,100 తీసుకుంటున్నారు’’ అని ఫిలింనగర్‌కు చెందిన రంజిత్ చెప్పారు. రూ.4 వేలు, ఇంకొన్నిచోట్ల రూ.5 వేలకూ విక్రయిస్తున్నారన్నారు.
ఈ–కుక్కర్లు, ఇండక్షన్ స్టౌలు దొరకట్లే
గ్యాస్ సిలిండర్ల కొరత ఆందోళనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో ఇలా ఆర్డర్ చేస్తే అలా వచ్చేవి. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో కనిపించడం లేదు. ఉత్పత్తి కంపెనీలు సహా వెబ్‌సైట్లలో ఇండక్షన్ స్టవ్‌ల ఫొటోలు, ధరలు పేర్కొంటున్నా, ఆర్డర్‌పై క్లిక్ చేస్తే సారీ చెప్పేస్తున్నాయి. మార్కెట్లో వీటి ధరలను అమాంతం పెంచారు.
ఎలక్ట్రికల్ కుక్కర్ల వినియోగంతో నగరంలో విద్యుత్ వినియోగం మరింత పెరుగుతోంది. నిన్నటివరకు గ్రేటర్‌లో 3300 మెగావాట్లకు మించని వాడకం.. తాజాగా 3500 మెగావాట్లు దాటడం గమనార్హం.
కమర్షియల్‌గా వినియోగిస్తే చర్యలు
గృహపయోగ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇప్పటికే గృహ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నందుకు 233 కేసులు నమోదు చేసి 381 గృహ ఎల్‌పీజీ సిలిండర్లు స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. తగిన నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు.
సర్వర్ డౌన్.. నో స్టాక్..!
బంజారాహిల్స్: గృహావసర వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో కావొచ్చు, స్టాక్‌లో కావొచ్చు సమస్యలు లేవని ఒకవైపు కేంద్రం ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం వందలాది విని యోగదారులు బుకింగ్ కోసం యూసుఫ్‌గూడ గణ పతి కాంప్లెక్స్ దగ్గర ఉన్న బంజారా గ్యాస్ ఏజెన్సీకి వచ్చారు. ఆన్‌లైన్ చేద్దామంటే రావడం లేదని, వాట్సాప్‌లో కూడా బుక్ కావడం లేదని, పేటీఎం, ఫోన్ పే ద్వారా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వినియోగదారులు వాపోయారు. ఏజెన్సీ వద్దకు రాగా.. సర్వర్ బిజీ అంటూ పోస్టర్లు కనిపించాయని చెప్పారు. ఏజెన్సీ ఆఫీస్ మూసి ఉండటంతో ఉసూరుమంటూ వెళ్లిపోయారు.


