TG: పదవ తరగతి పరీక్షలు ప్రారంభం | Class 10 Board Exams Begin In Hyderabad, Over 5.28 Lakh Students Appear, More Details Inside | Sakshi
Sakshi News home page

TG: పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

Mar 14 2026 9:05 AM | Updated on Mar 14 2026 10:12 AM

10 th Grade Exams Begin

సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన పరీక్షలు మద్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకూ సాగనున్నాయి.  ఎగ్జామ్స్ సజావుగా సాగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్‌ 16తో ముగుస్తాయి. 

పరీక్షల కోసం 2,676 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్స్‌కు మొత్తంగా 5, 28, 239 మంది హాజరవుతున్నారు. వీరిలో రెగ్యులర్‌గా రాసే విద్యార్థుల సంఖ్య 5,17,727. కాగా 5,329 ప్రభుత్వ స్కూల్స్‌ నుంచి 2,07,573 మంది, 1057 గురుకులాల నుంచి 60,139 మంది, 5,288 ప్రైవేటు, ఎయిడెడ్‌ స్కూల్స్‌ నుంచి 2,50,015 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను తేలికగా తెలుసుకునేందుకు హాల్‌ టికెట్లపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు.

పరీక్షల నేపథ్యంలో పాఠశాల విద్యా డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ శుక్రవారం జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్న పత్రాలను తెరవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా వ్యవస్థ, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతీ కేంద్రానికి సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.

అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ నిఘా సిబ్బంది, పరీక్షల సిబ్బంది విద్యార్థులను ఆందోళనకు గురిచేసేలా వ్యవహరించవద్దన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, పోలీసుల సహకారం తీసుకోవాలని సిబ్బందిని కోరారు. మరో వారం రోజుల్లో ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మూల్యాంకన కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement