Hyderabad: 2 వేల హోటళ్లు మూత! | Hyderabad Hotels Hit By Commercial Gas Shortage, Restaurants Closing Reduce Menus And Shift To Alternatives | Sakshi
Sakshi News home page

Hyderabad: 2 వేల హోటళ్లు మూత!

Mar 18 2026 9:13 AM | Updated on Mar 18 2026 9:39 AM

hyderabad hotels hit by commercial gas shortage restaurants closing

సాక్షి,హైదరాబాద్‌: నగర హోటళ్లకు గడ్డుకాలం దాపురించింది. టిఫిన్‌ సెంటర్లు, తోపుడుబండ్ల పరిస్థితి మరీ దారుణం. వాణిజ్య సిలిండర్‌ సరఫరాలో కోత విధించడమే దీనికి కారణం. హోటల్‌ పరిశ్రమకు అందాల్సిన గ్యాస్‌లో మెజారిటీ వాటాను ఆసుపత్రులు, పాఠశాలలు వంటి అత్యవసర విభాగాలకు అధికారులు మళ్లిస్తున్నారు. దీంతో వాణిజ్య సిలిండర్ల డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీ అగాధం ఏర్పడింది. 

నగరంలో 70 వేల నుంచి 80 వేల వరకు రెస్టారెంట్లు, టిఫిన్స్ సెంటర్లు ఉండగా, వారం రోజుల్లో 1,500 నుంచి 2 వేల వరకు మధ్య, చిన్న తరహా హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, తోపుడు బండ్లు మూతపడ్డాయి. చాలా హోటళ్లలో మెనూ కుదించారు. ఎక్కువ సమయం ఉడికించాల్సిన వంటకాలను మెనూ నుంచి తొలగిస్తున్నారు. చాలా హోటళ్లు ఇండక్షన్‌ స్టౌలు, కట్టెల పొయ్యిల వైపు మళ్లుతున్నాయి. భారీ వంటకాలకు విద్యుత్‌ స్టౌలు సరిపోక సమస్య తలెత్తుతోంది. 

గృహ, రవాణాకు పూర్తిగా..
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో గ్యాస్‌ సరఫరాలో ప్రాధాన్యతలు మారాయి. వాణిజ్య అవసరాలకు (హోటళ్లు, రెస్టారెంట్లు) గ్యాస్‌ సరఫరాను కనిష్ట స్థాయికి తగ్గించారు. ప్రథమ ప్రాధాన్యం కింద సరఫరా గృహ అవసరాలకు, రవాణా రంగానికి పూర్తిస్థాయిలో గ్యాస్‌ కేటాయిస్తున్నారు. రెండో ప్రాధాన్యత కింద ఆసుపత్రులు, పాఠశాలలు (మిడ్‌ డే మీల్స్‌), అనాథ శరణాలయాలు, విద్యాసంస్థల హాస్టళ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. పెట్రో కెమికల్‌ పరిశ్రమలకు సరఫరాను పూర్తిగా నిలిపివేసి, గృహ అవసరాలకు మళ్లిస్తున్నారు. 

దీని ప్రభావం హోటల్‌ రంగంపై పడింది. హోటల్‌ రంగానికి రోజుకు సుమారు 18 వేల నుంచి 23 వేల వాణిజ్య సిలిండర్ల అవసరం ఉండగా, 6,200 సిలిండర్లకు మించి సరఫరా కావడంలేదు. వచ్చే 15 రోజులు అత్యంత కీలకం మారాయి. గ్యాస్‌ కొరత ఇలాగే కొనసాగితే హైదరాబాద్‌ హోటల్‌ రంగం భారీగానే నష్టపోయే ప్రమాదముందని హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు. సామాన్యుడికి బయట భోజనం భారం కావడమే కాకుండా, హోటల్‌ రంగంపై ఆధారపడిన సుమారు 5 లక్షల మంది కారి్మకుల ఉపాధి ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యకం చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement