నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 11:45 గంటలకు షురూ
తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శుక్లా ప్రసంగం
తొలుత అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
సోమవారమే బీఏసీ..ఎజెండా ఖరారు
20న 2026–27 బడ్జెట్ పద్దును ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం
ఈ నెలాఖరు వరకు సమావేశాలు
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం
సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్న బీఆర్‌ఎస్
బడ్జెట్ భేటీకి ఏర్పాట్లపై స్పీకర్, చైర్మన్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందనుంది. ఉదయం 11:45 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా.. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడనుంది. తర్వాత శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది.
ఇందులో సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు. ఈ నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని సమాచారం. ఈ నెల 20న బడ్జెట్‌ను ప్రవేశ పెడతారని, 30 లేదా 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తెలుపుతుందని తెలుస్తోంది. కాగా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శుక్లా సోమవారం ఆవిష్కరించనున్నారు. ఉదయం 11:27 నుంచి 11.37 నిమిషాల మధ్య ఈ కార్యక్రమం ఉంటుందని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి.
ఉగాది, రంజాన్ రోజుల్లో సెలవు
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో చర్చను ప్రతిపాదించనుంది. మంగళ, బుధవారాల్లో చర్చ అనంతరం తీర్మానాన్ని ఆమోదించనున్నారు. మరుసటి రోజు ఉగాది కారణంగా సభ జరగదు. మళ్లీ 20న ఉభయ సభలు సమావేశం కానుండగా, అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఆ తర్వాతి రోజు రంజాన్ కావడంతో మళ్లీ 23న సభ ప్రారంభమై వారం రోజుల పాటు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన సోమవారం జరిగే బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరగాలి? బిల్లుల ప్రతిపాదన లాంటి అంశాలతో కూడిన ఎజెండా ఖరారు కానుంది. ఇలావుండగా సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది.
తొలిసారి ఒకే ప్రాంగణంలో..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఒకే ప్రాంగణంలో కొలువు దీరనున్నాయి. ఇప్పటివరకు జూబ్లీహాల్ వేదికగా జరుగుతున్న మండలి సమావేశాలు ఈసారి పునరుద్ధరించిన పాత అసెంబ్లీ భవనంలో జరగనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఈ భవనాన్ని ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం కేటాయించగా, ఏపీ అసెంబ్లీ అమరావతికి వెళ్లిన తర్వాత ఆ భవనం ఖాళీగా ఉంటోంది. దీంతో ఈ భవనాన్ని పునరుద్ధరించి అందులో మండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో ఈ భవనంలో మండలి సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ప్రజల ముందుకు అభివృద్ధి, ప్రణాళికలు
బడ్జెట్ సమావేశాలు ఈసారి వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు వచ్చే ఏడాదికి సంబంధించిన తమ ప్రణాళికలను ప్రజల ముందుంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వీలును బట్టి మూసీ పునరుజ్జీవంతో పాటు తెలంగాణ ఉద్యమకారుల అంశంపై చర్చ జరపాలని యోచిస్తోంది. మరోవైపు పలు బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది.
కేసీఆర్ హాజరయ్యే అవకాశం
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్.. పలు అంశాలపై ప్రభుత్వాన్ని తూర్పారబట్టేందుకు సిద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాలకు ఆ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం. తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత కేసులో అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుపై బీఆర్‌ఎస్ తీవ్ర అసహనంతో ఉంది. సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదనే భావనలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం.. ఈ సమావేశాల్లో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
అయితే బలం సరిపోతుందా లేదా అన్న దానిపై ఊగిసలాడుతున్నట్టు సమాచారం. దీంతో ఇందుకు సంబంధించిన నిబంధనలు మార్చి, అవిశ్వాసం ప్రతిపాదించే సభ్యుల సంఖ్యను తగ్గించాలని కోరుతూ ప్రైవేటు మెంబర్ బిల్లును పెట్టాలని బీఆర్‌ఎస్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ బిల్లు పెట్టేందుకు 12 మంది సభ్యులు సరిపోతారని తెలుస్తోంది. అయితే ఈ బిల్లును సభలో ప్రతిపాదించి చర్చ చేసే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉండడంతో ఏం చేయాలన్న దానిపై బీఆర్‌ఎస్ నేతలు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలావుండగా గత రెండేళ్ల కాలంలో జరిగిన బడ్జెట్ కేటాయింపులు, వాటి ఖర్చులో డొల్లతనంతో పాటు ఆరు గ్యారంటీల అమలు, రైతు భరోసా, కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగం, కృష్ణా నదీజలాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, మూసీ పునరుద్ధరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది.
ప్రభుత్వ వైఫల్యాలే బీజేపీ ఎజెండా
బీజేపీ కూడా అధికార పక్షాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు నేతృత్వంలో ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. హైడ్రాతో పాటు మూసీ పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి వర్గాల ఇళ్లను కూల్చివేయడంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. పలు కీలకాంశాలను ప్రస్తావించాలని, రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను, వారి ఆకాంక్షలను అధికార పక్షం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు ఎంఐఎం, సీపీఐ కూడా ఈ సమావేశాల్లో తమ వాణిని విన్పించేందుకు సిద్ధమయ్యాయి.
నిర్వహణ, భద్రత, వసతులపై సమీక్ష
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశాల నిర్వహణ, కల్పించాల్సిన వసతులు, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. గతంలో మాదరిగానే ఈ సమావేశాలకూ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకరించాలని స్పీకర్ కోరారు. సభ లోపల, బయట ప్రశాంత వాతావరణం ఉండేలా, అనుకోని ఘటనలు, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలకు అవకాశం ఇవ్వకూడదని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని, సభ్యులు అడిగిన ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాచారం ఇవ్వాలని కోరారు.
మండలి చైర్మన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ, మండలి ఒకే ప్రాంగణంలో జరుగుతున్నందున అవసరమైన అదనపు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సభ సజావుగా జరగడానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను ప్రభుత్వం పక్షాన అందిస్తామని చెప్పారు. సమన్వయం కోసం ప్రతి శాఖ నుంచి ఓ ప్రత్యేక అధికారిని నియమించనున్నట్టు తెలిపారు. కాగా ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ కె.రామకృష్ణారావు, మండలి కార్యదర్శి వి.నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


