2023 ఎన్నికల్లోనూ బరాబర్ తొక్కుకుంటూ ఇక్కడకు వచ్చాను: సీఎం రేవంత్‌రెడ్డి
2029 ఎన్నికలూ పాసింగ్ క్లౌడ్స్ మాత్రమే... 2034 వరకు ఈ ప్రభుత్వమే ఉంటుంది
ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి తమ సేవకులను నియమించుకుంటారు... ఇప్పటికైనా అది గ్రహించాలి
గత ప్రభుత్వ రూ. 8.11 లక్షల కోట్ల అప్పు, 11 శాతం అధిక వడ్డీ భారం వల్లనే మా ప్రభుత్వానికీ పరిస్థితి
వారసత్వాలతో అధికారం రాదు... చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటామంటే కుదరదు.
ప్రజలు ఆగ్రహిస్తే ఈసారి అది కూడా (ప్రతిపక్ష హోదా) ఉండదు..
కొత్త గవర్నర్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని ప్రజలు ఆశించారు
2014 నుంచి హిల్ట్ పాలసీతో సహా దేనిపై అయినా విచారణకు సిద్ధం
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో ముఖ్యమంత్రి
నేను కష్టజీవిని. తెలియకపొతే నేర్చుకుంటాను. ఇతరులకు నేర్పుతాను. ఇదే పంథాలో ముందుకెళ్లి అనుకున్నవి కచ్చితంగా సాధిస్తాను
⇒ రామాయణంలో రావణాసురునికి పట్టిన గతే ప్రతిపక్ష నేతలకు పడుతుంది. మంచి ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆలోచనలు చేస్తూ పథకాలు అమలు చేస్తుంటే.. రాక్షసుల మాదిరి విఘ్నాలు కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి రాక్షసులకు రామబాణం సమాధానం చెబుతుంది
⇒ మేం ఏం చేసినా కించపరిచేలా, అహంకారంతో మాట్లాడుతున్నారు. అది తమ జన్మహక్కు అని అనుకుంటున్నారు. ప్రజలు ఆగ్రహిస్తే ఈసారి అది కూడా (ప్రతిపక్ష హోదా) ఉండదు. భూకంపంలో కొట్టుకుపోతారు
⇒ టీడీఆర్, హిల్ట్ పాలసీపై విచారణకు లేఖ రాయండి. వెంటనే మా ప్రభుత్వం విచారణ చేపడుతుంది. విచారణకు వెనకాడినా లేదా వెనక్కి తగ్గినా క్షమాపణ చెబుతాం
సాక్షి, హైదరాబాద్: 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిమ్మల్ని మళ్లీ తొక్కుకుంటూ అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ‘2023 ఎన్నికల్లో బరాబర్ మీ నెత్తిపై కాళ్లు పెట్టి తొక్కుకుంటూ ఇక్కడకు వచ్చాను. 2029లో మళ్లీ చూసుకుందాం. మళ్లీ తొక్కకపోతే చూడండి. మీరు ఎట్లా గెలుస్తారో చూస్తాను’అని ఆవేశంగా ప్రకటించారు. బుధవా రం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానమిస్తూ రెండున్నర గంటలకుపైగా సుదీర్ఘంగా సీఎం ప్రసంగించారు. ‘ఇప్పటికైనా మీరు మర్యాదగా ఉండడం నేర్చుకుంటే మంచిది. కనీస మర్యాద దక్కుతుంది’అని హెచ్చరించారు. 2029 ఎన్నికలు కూడా కేవలం పాసింగ్ క్లౌడ్ మాత్రమే.
2034 వరకు ఈ ప్రభుత్వమే ఉంటుంది. అప్పటికే తెలంగాణ ఒక ట్రిలియన్ ఎకానమీగా ఎదుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు’అని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్న హిల్ట్–పి, టీడీఆర్‌లకు సంబంధించి వారు లేఖ రాస్తే ఏ విచారణ కోరినా చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘కొందరు తమను తాము రాజులుగా భావిస్తున్నారు. రాచరిక పోకడలతో ప్రజాతీర్పును అవమానిస్తున్నారు. వారసత్వ రాజకీయాలను నమ్ముకుని అధికారం దక్కలేదనే దుఃఖంతో ఆరోపణలు, దు్రష్పచారంతో సభను తప్పుదోవ పట్టించారు. రాజులు పోయినా రాజ్యాలు పోయినా వారి పోకడలు మారలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి తమ సేవకులను నియమించుకుంటారన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది’అని బీఆర్‌ఎస్ సభ్యులను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వం వల్లనే ఈ దుస్థితి
రాష్ట్ర ఆదాయంపెంచాలి.. పేదలకు పంచాలి అనే పాలసీ తీసుకొస్తే కూడా అభినందించాలనే ఆలోచన ప్రతిపక్షాలకు రాకపోతే వారిని ఏమనాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్ పట్ల సభావేదిక నుంచి వివరించాను. అధికారం పోయిందనే బాధతో ఇది కొందరికి రుచించదు. వారు కక్కిన విషాన్ని శివుడి మాదిరిగా గొంతులోనే పెట్టుకుంటాను’అని అన్నారు. తమపై గత ప్రభుత్వం పదేళ్లలో రూ.8.11 లక్షల కోట్ల అప్పు భారాన్ని, దానికి 11 శాతం అధిక వడ్డీ మోపినందుకు, దానిని భరించడం వల్లనే తమ ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందన్నారు.
తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్‌ను ఆవిష్కరిస్తూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేసిన ప్రసంగం చరిత్రాత్మకమని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘గవర్నర్ ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు. తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళిక’అని రేవంత్ పేర్కొన్నారు.
విపరీత పోకడలకు పోవద్దు
‘కొత్త గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు విపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనిప్రజలు ఆశించారు. సభాసంప్రదాయాలను గౌరవించకపోవడం తెలంగాణకు, ప్రజలకు తీరని మచ్చ’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘వారసత్వాలతో అధికారం రాదు.. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటామంటే కుదరదు. సొంతంగా సత్తా ఉండాలి. ఔరంగజేబుగా మారతామంటే అది దురాశగా మారుతుంది. విపరీత పోకడలు, విధానాలకు పోవద్దు, అధికారం రాలేదని బాధ, దుఃఖం ఉండొద్దు’అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘కొందరు తమను తాము దైవాంశ సంభూతులమని అనుకుంటున్నారు. మీరు (బీఆర్‌ఎస్ నేతలు) దేవుళ్లు కాదు, దోపిడీదారులు.
నోటిఫికేషన్లు, ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేకపోయారు. అసంపూర్తిగా వదిలి వేసిన అసమర్థులు మీరు. మీలాగా గాలికి వచ్చిన వాళ్లం కాదు. ‘నేను కష్టజీవిని. తెలియకపొతే నేర్చుకుంటాను. ఇతరులకు నేర్పుతాను. ఇదే పంథాలో ముందుకు సాగి అనుకున్నవి కచ్చితంగా సాధిస్తాను’అని ఆయన పేర్కొన్నారు. ‘పారిశ్రామిక భూముల బదలాయింపులపై 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు హిల్ట్ పాలసీతో సహా దేనిపై అయినా సీబీఐ, ఈడీ, సిట్, లేదా ఏ అంతర్జాతీయ సంస్థతో విచారణకైనా మేం సిద్ధం. అని బీఆర్‌ఎస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.
కేసీఆర్‌ను ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు..
‘కేసీఆర్ అసెంబ్లీలో ఇదే స్థానం నుంచి తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీకి శాసనసభ కృతజ్ఞతలు చెబుతున్నది, ఆమె దయతోనే తెలంగాణ వచ్చిందన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’అని సీఎం రేవంత్ అన్నారు. తండ్రి బతికి ఉండగానే తద్దినం పెట్టడం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమవుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బావమరుదులు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్నారు. వారిద్దరు అలాగే వ్యవహరిస్తే.. పార్టీ ముక్కలు అవుతుందని, అది కాకుండా చూసుకోవాలని, అధికారంలోకి వచ్చేది కల్ల అని వ్యాఖ్యానించారు.
మేము చేసిన అప్పులు రూ. 3.47,294 కోట్లు
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన మొత్తం అప్పులు రూ. 3,47,294 కోట్లు అయితే.. తాము చెల్లించిన అసలు, వడ్డీ కలుపుకొని రూ. 3,30,570 కోట్లు అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తాము అధికారంలో ఉన్న ఈ రెండున్నరేళ్లలో నికరంగా చేసిన అప్పు కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. 2014 జూన్ 2న అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్)కు అప్పటి వరకున్న అప్పులు కేవలం రూ.69 వేల కోట్లు అయితే.. వారు తమకు 2023 డిసెంబర్‌లో అధికారం అప్పగించే నాటికి అప్పులు రూ. 6,71,757 కోట్లకు తోడు చేతి బదులుగా, కాంట్రాక్టర్లకు బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సినవి కలుపుకొంటే మరో రూ. 1.40 లక్షల కోట్లు ఉన్నాయని మొత్తంగా తమకు వారు అందించిన అప్పులు రూ. 8.11 లక్షల కోట్లు అని రేవంత్ వెల్లడించారు. కమీషన్లకు కక్కుర్తిపడి వారు 11 శాతం వడ్డీకి కూడా రుణాలు తీసుకున్నారని దుయ్యబట్టారు. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను రీస్ట్రక్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని, అలా చేయడం వల్ల వడ్డీ భారం ఏటా దాదాపు రూ. 4000 కోట్లు ఆదా అవుతాయన్నారు.
వైద్యానికి రూ. 4400 కోట్లు వ్యయం చేశాం
పేదల వైద్యం కోసం తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 4,400 కోట్లు వ్యయం చేసిందని సీఎం రేవంత్ చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 2,300 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2046 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పనిచేసిన పీఏలు ఈ సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పేద వారిపేట తీసుకుని వాటిని స్వాహా చేశారని, అలాంటి వారు తమను ప్రశ్నిస్తారా అని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీని బీఆర్‌ఎస్ పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే రూ. 5 లక్షలున్న ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచామని స్పష్టం చేశారు.
నా కాలి గోటికి సరిపోవు...
‘వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తి (హరీశ్‌రావు)ని మంత్రిగా చేసింది దివంగత నేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. కనీసం కృతజ్ఞతా భావం ఉండాలి కదా? చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా (కేటీఆర్) గెలిచారు. నేను స్వశక్తితో జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాతే రాజకీయ పారీ్టలోకి వచ్చాను. నాతో నీకు పోలిక ఏమిటి? నాతో పోటీ ఏమిటి? నా కాలిగోటికి కూడా సరిపోవు’ అని సీఎం రేవంత్ అన్నారు. ‘2009లో పొత్తుధర్మంలో భాగంగా పాలమూరు బిడ్డలం కేసీఆర్‌ను భుజాన వేసుకుని ఎంపీగా గెలిపించాం. అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఏదైనా పూర్తిచేశారా?’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
విధులకు హాజరుకాకుండా జీతాలా?
‘2023 డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్ష నేత రూ.1,06,56,674 జీతభత్యాలు పొందారు. విధులకు హాజరుకాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఉద్యోగులైనా రాజకీయ నేతలైనా కూడా చర్యలు తీసుకోవాలి’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు విజ్ఞప్తి... సభకు రండి, చర్చలో పాల్గొనండి.. మాజీ సీఎంకు ఆహ్వానం పలుకుతున్నాం. గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు వస్తా యని ఆశించాను. ఆశించిన మేర ప్రధాన ప్రతిపక్షం వ్యవహారశైలి లేదు’ అని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని, వస్తారని ఆశిస్తున్నామన్నారు.
ఏఐ సునామీ రాబోతుంది...
భవిష్యత్‌లో ఏఐ సునామీ రాబోతుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘దీనిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించిన ఒక పాలసీ డాక్యుమెంట్‌ను గవర్నర్ ప్రసంగంలో వివరించారు. రాబోయే రోజుల్లో వైట్‌కాలర్ జాబ్‌లు పోయి బ్లూకాలర్ జాబ్‌లు రానున్నాయి. ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌ను కనీసం చూశారా? గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించకపోతే తరువాతి తరాలు మనల్ని క్షమించవు. అన్ని రంగాల మేధావులతో సమన్వయం చేసుకుని 2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించుకున్నాం. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించుకున్నాం’ అని సీఎం వివరించారు.
మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువ...
గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలపై సభలో సీఎంగా కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మాట్లాడిన మాటలను ట్యాబ్ ద్వారా సభలో సభ్యులకు సీఎం వినిపించారు. ‘వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయాలని మాట్లాడారు. అప్పుడు సక్రమమని చెప్పిన వాళ్లకు ఇప్పుడు అక్రమం ఎలా అయింది? మీరు మాట్లాడిన మాటలను ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకున్నారా? మూసీ ఉప్పల్ భగాయత్‌లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూద్దాం రండి. ఎవరెవరు ఎక్కడ ఆక్రమించుకున్నారో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువగా ఉంది. బుల్డోజర్లతో కొట్టేయమని చెప్పింది అప్పుడే మరిచిపోయారా’ అని పేర్కొన్నారు.
ఈవీ వాహనాలకు పన్ను మినహాయింపు
కాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయించామని సీఎం తెలిపారు. త్వరలో క్యూర్ పరిధిలోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నట్టు ప్రకటించారు. ‘క్యూర్ ప్రాంతంలో ప్రక్షాళన చేస్తాం. 3 వేలకు పైగా డీజిల్‌తో నడుపుతున్న ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో ప్రత్యామ్నాయం చేశాం. డీజిల్, కిరోసిన్‌తో నడిచే ఆటోలను రెట్రోఫిటింగ్‌తో ప్రత్యామ్నాయం చేస్తాం. కాలుష్య నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. హైదరాబాద్‌ను పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి మెట్రో విస్తరించాలని నిర్ణయించాం.
అందులో భాగంగా రూ.25 వేల కోట్ల విలువైన మెట్రోను రూ.15 వేల కోట్లకు కొంటున్నాం. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటుంటే.. మేం మాత్రం ప్రైవేట్ సంస్థను కొనుగోలు చేస్తున్నాం. 76 కి.మీ. మెట్రోకు మేం కేంద్రానికి ప్రతిపాదనలను పంపాం’ అని చెప్పారు. చైనా నుంచి నేర్చుకుని ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ‘కొంగరకలాన్ రోడ్డుకు టాటా దిగ్గజం రతన్ టాటా పేరు పెడితే అడ్డం పడుకుంటున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీతో మార్పు తీసుకురావాలని చూస్తే పాలకుండలో విషం చుక్కలాగా ప్రవర్తిస్తున్నారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి’ అని సీఎం రేవంత్ చెప్పారు.


