డ్రగ్స్‌ టెస్ట్‌కు సీఎం వస్తారు... మీ నేతలను తీసుకురండి | Mahesh Kumar Goud comments over brs party | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ టెస్ట్‌కు సీఎం వస్తారు... మీ నేతలను తీసుకురండి

Mar 18 2026 4:43 AM | Updated on Mar 18 2026 4:43 AM

Mahesh Kumar Goud comments over brs party

బీ ఫాం తీసుకుని పోటీ చేసిన ప్రతి ఒక్కరికీ డ్రగ్స్‌ టెస్ట్‌ చేయిస్తాం 

బీఆర్‌ఎస్‌ పాలన రాష్ట్రాన్ని మత్తుమయం చేసింది 

ప్రజాప్రభుత్వం డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఈగల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసింది 

మండలిలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌  

సాక్షి, హైదరాబాద్‌: పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చాక్లెట్ల రూపంలో కొకైన్‌ ఎక్కడపడితే అక్కడ దొరికిందని ఆరోపించారు. డ్రగ్స్‌తో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చేశారని, చిన్నపిల్లలు కూడా మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారని, తల్లిదండ్రులు పిల్లలను రక్షించుకునేందుకు ఎంతో ఆందోళన చెందారన్నారు. 

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ చేసిన ప్రసంగంపై మంగళవారం శాసనమండలిలో కృతజ్ఞత తీర్మానాన్ని మహేశ్‌ గౌడ్‌ ప్రవేశపెట్టారు. మరో సభ్యుడు అద్దంకి దయాకర్‌ ఈ తీర్మానాన్ని బలపర్చారు. ఈ సందర్భంగా మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు పూర్తిస్థాయిలో అమలయ్యాయని, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. మరో మూడేళ్ల సమయం ఉందని, ఈ లోపు ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు తగ్గకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  

ముహూర్తం ఖరారు చేస్తా..  
ఇటీవల మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌­లో పరిస్థితి చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా కనిపించిందని మహేశ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా చట్టసభలకు ఎన్నికైన వాళ్లే మాదకద్రవ్యాలు వాడుతూ బహిరంగంగా దొరకడం సిగ్గుచేటన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటుంటే బీఆర్‌ఎస్‌ నాయకులు సోషల్‌ మీడియాలో విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. బాధ్యత గల ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తి బహిరంగంగా డ్రగ్స్‌ తీసుకోవడంతో సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. 

ఇంత ఘోరం జరిగినా ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇంతలో బీఆర్‌ఎస్‌ సభ్యులు కలగజేసుకునే ప్రయత్నం చేయగా, మహేశ్‌ గౌడ్‌ తీవ్రంగా స్పందించారు. బీఆర్‌ఎస్‌ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్‌ను, యువనేత కేటీఆర్‌ను అసెంబ్లీకి తీసుకొచ్చి డ్రగ్స్‌ టెస్టు చేయించాలని డిమాండ్‌ చేశారు. రేపే ముహూర్తం ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన వస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒప్పించి పరీక్ష చేయిస్తామన్నారు. 

అంతేకాకుండా బీఆర్‌ఎస్‌ బీఫామ్‌పై పోటీ చేసిన వాళ్లందరికీ డ్రగ్స్‌ టెస్టు చేయించాలని, కాంగ్రెస్‌ సభ్యులంతా కూడా ఈ పరీక్షలు చేయించుకుంటారని సవాలు విసిరారు. రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా చేశారని, అందుకే రేవంత్‌రెడ్డి డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఈగల్‌ టీమ్‌ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చివేశారని ఆగ్రహించారు.  

ప్రజలను మోసం చేశారు: మధుసూదనాచారి 
అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసిందని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. రెండేళ్లు గడిచినా హామీల అమలును దాటవేస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. మహిళలకు రూ.2,500, కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అంటూ కామారెడ్డి డిక్లరేషన్, రైతులకు ఇచ్చిన హామీలు ఇలా అన్నింటా కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 

స్వయం ఉపాధి రుణాలు అంటూ గతేడాది చేసిన ఆర్భాటం ఇప్పుడు జాడలేదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని చెప్పి చేతులెత్తేసిందన్నారు. యూరియా కోసం రైతులు కిలోమీటర్ల కొద్దీ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయని, ఏవర్గం కూడా సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement