మూసీ మంటలు.. కేటీఆర్‌ వర్సెస్‌ శ్రీధర్‌బాబు | KTR vs Minister Sridhar Babu during Question and Answer session | Sakshi
Sakshi News home page

మూసీ మంటలు.. కేటీఆర్‌ వర్సెస్‌ శ్రీధర్‌బాబు

Mar 19 2026 4:21 AM | Updated on Mar 19 2026 4:21 AM

KTR vs Minister Sridhar Babu during Question and Answer session

ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్‌ వర్సెస్‌ మంత్రి శ్రీధర్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌: మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు అంశం బుధవారం శాసనసభను కుదిపేసింది. బీఆర్‌ఎస్‌ సభ్యుడు కేటీఆర్, మంత్రి శ్రీధర్‌బాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్‌ఎస్‌ సభ్యులు కేటీఆర్, సు«దీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డిలు మూసీ పునరుజ్జీవం అంశంపై ప్రశ్నించారు. దాని డీపీఆర్‌ సిద్ధమైందా, ప్రాజెక్టు వ్యయం అంచనా ఎంత, నిర్వాసితుల సంఖ్య, వారి పునరావాస చర్యల గురించి ప్రశ్నించారు. దీనికి మంత్రి శ్రీధర్‌బాబు, ప్రాజెక్టు మొదటి దశకు డీపీఆర్‌ సిద్ధమైందని, మొదటి దశ అంచనా వ్యయం రూ.ఆరున్నర వేల కోట్ల నుంచి రూ.ఏడు వేల కోట్లని, దాదాపు 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశముందని, నిర్వాసిత కుటుంబాలకు టీడీఆర్‌ను జారీ చేస్తామని, 2013 చట్టం ప్రకారం సహాయ పునరావాసాలు ఉంటాయని పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. 

ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రి, మూసీనది అభివృద్ధి సంస్థ ఎండీ భిన్న ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. డీపీఆర్‌ తయారీకి 18 నెలల సమయం అవసరమవుతుందని రెండు నెలల క్రితం ఇదే సభలో ప్రకటించిన శ్రీధర్‌బాబు, ఇప్పుడు డీపీఆర్‌ సిద్ధమైందని చెప్పటం వింతగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ రుణం ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని సభలోనే శ్రీధర్‌బాబు చెప్పారని, కానీ, ఆ బ్యాంకును జనవరి, మార్చి నెలల్లో రెండు పర్యాయాలు సంప్రదిస్తే... తమకు డీపీఆరే అందలేదని, ఎలాంటి లోన్‌ మంజూరు చేయలేదని వెల్లడించినట్టు పేర్కొన్నారు. 

సమాచార లోపం వల్ల ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారా, లేదా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చెబుతున్నారా అంటూ నిలదీశారు. ప్రాజెక్టుకు ముఖ్యమంత్రేమో రూ.లక్షన్నర కోట్లని చెబుతుంటే, ఇప్పుడు మంత్రి శ్రీధర్‌బాబు ఆరేడువేల కోట్లని అంటున్నారని నిలదీశారు. మంత్రి శ్రీధర్‌బాబు 1,400 ఇళ్లు కూలుస్తామని అంటున్నారని, మరి గెజిట్‌లో 10 వేలకుపైగా నిర్మాణాలు ప్రభావితానికి గురవుతాయని ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. బఫర్‌ జోన్‌ విషయంలో 50 మీటర్లని మంత్రి అంటే, అధికారుల మాటల్లో అది చాలా ఎక్కువగా కనిపిస్తోందన్నారు. 

బురద చల్లటం ఆపాలి: మంత్రి శ్రీధర్‌బాబు 
కేటీఆర్‌ మాటలపై మంత్రి శ్రీధర్‌బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతల వైఖరి ముందు నుంచీ మేం బురద చల్లుతాం...మీరు తుడుచుకోండి అన్నట్టుగా ఉంటోందని అసహనం వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్‌లో రూ.6,500 నుంచి రూ.7,000 కోట్లు వ్యయం అవుతుందని తాము స్పష్టంగా చెప్పామన్నారు. కేటీఆర్‌ మాత్రం రూ.లక్షన్నర కోట్ల కుంభకోణం అని అవాస్తవాలతో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. తాము చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుగోడ కట్టాలని ఆ పార్టీ సంకుచిత ఆరోపణలు చేస్తోందని తిప్పికొట్టారు. మూసీకి రెండు వైపులా 50 మీటర్ల బఫర్‌ జోన్‌గా గుర్తిస్తూ 2016 లో అప్పటి ప్రభుత్వం జీఓ ఇచ్చింది నిజం కాదా అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. 

ఇప్పుడేమో ఇళ్లెలా తొలగిస్తారని ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు కోసం డీపీఆర్‌ రూపొందించిన మెయిన్‌ హార్ట్‌ అనే సింగపూర్‌ ఇంజనీరింగ్‌ సంస్థకు ఇటువంటి పనుల్లో అనుభవం ఉందని శ్రీధర్‌బాబు తెలిపారు. కేవలం రెండు నెలల్లో డీపీఆర్‌ ఎలా తయారైందని కేటీఆర్‌ ప్రశ్నించటం విడ్డూరమని, డీపీఆర్‌ తయారీ ఏడాది సమయం పట్టిందన్నారు. రుణం కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకుకు డీపీఆర్‌ ఇచ్చామని, తన తదుపరి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏదైనా కారణం చేత ఆ బ్యాంకుకు సాధ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తామన్నారు.  

బీఆర్‌ఎస్‌కు మూసీ ప్రక్షాళన ఇష్టం లేదా: భట్టి  
బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి తీవ్రంగా స్పందించారు. మూసీ ప్రక్షాళన ఆ పారీ్టకి ఇష్టం లేదోమోనని, దాని పరీవాహక ప్రాంత పేదల జీవితాలు బాగవ్వాలని ఆ పార్టీ కోరుకోవటం లేదేమోనని ఆరోపించారు. మూసి నిర్వాసిత పిల్లల కోసం యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను ఆ ప్రాంతంలోనే నిర్మిస్తామన్నారు. ఈ విషయంలో తమ ప్రశ్నలకు మంత్రి నుంచి సరైన సమాధానాలు రాలేదని, ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్‌ చేస్తున్నామని కేటీఆర్‌ ప్రకటించడంతో ఆ పార్టీ సభ్యులు సభ నుంచి నిష్క్రమించారు.    

Advertisement
 
Advertisement
Advertisement