ఐకమత్యమే అభివృద్ధికి ఇంధనం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy at Iftar Dinner | Sakshi
Sakshi News home page

ఐకమత్యమే అభివృద్ధికి ఇంధనం: సీఎం రేవంత్‌

Mar 16 2026 4:15 AM | Updated on Mar 16 2026 4:15 AM

CM Revanth Reddy at Iftar Dinner

చిన్నారులకు రంజాన్‌ కానుకలు అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి అజహరుద్దీన్‌. చిత్రంలో మంత్రి పొంగులేటి

తెలంగాణలో గంగా–జమునా తెహజీబ్‌ వర్ధిల్లుతోంది 

సంక్షేమ పథకాల్లో మైనారిటీలకు సింహభాగం.. వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఇఫ్తార్‌ విందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గడ్డపై గంగా–జమునా తెహజీబ్‌ వర్ధిల్లుతోందని, అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండటమే రాష్ట్ర అభివృద్ధికి అసలైన ఇంధనమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలో మతపరమైన విభజనలకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ మత సామరస్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడ అశాంతి నెలకొన్నా, మన రాష్ట్రంలో మాత్రం మత సామరస్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన రంజాన్‌ ఇఫ్తార్‌ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 

మైనారిటీలకు పెద్దపీట 
మైనారిటీల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజకీయంగా, పరిపాలనలో పెద్దపీట వేస్తున్నామని సీఎం చెప్పారు. ఎల్బీ స్టేడియంలో క్రికెట్‌ ఆడిన మహమ్మద్‌ అజహరుద్దీన్‌ను మైనారిటీ శాఖ మంత్రిగా నియమించుకున్నామని, అదనంగా 8 మంది మైనారిటీ నేతలకు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా అవకాశం కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. 

దివంగత వైఎస్సార్‌ హయాంలో ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ సేవలను గుర్తిస్తూ ఆయనను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించుకున్నామని తెలిపారు. ఆ 4 శాతం రిజర్వేషన్ల వల్లే వేలాది మంది ముస్లిం యువకులు డాక్టర్లు, ఇంజనీర్లుగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచ వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన క్రికెటర్‌ సిరాజ్, బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌లను డీఎస్పీలుగా నియమించడమే కాకుండా, వారికి భారీగా ఆర్థిక సాయం అందించి అండగా నిలిచామని పేర్కొన్నారు. 

సేవా భావానికి ప్రతీక రంజాన్‌ 
రంజాన్‌ కేవలం పండుగ మాత్రమే కాదు.. అది క్రమశిక్షణ, ఆత్మశుద్ధి మానవతా విలువలను గుర్తు చేసే పవిత్ర మాసం అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఒక నెల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ, తోటి వారికి సహాయం చేయడమే ఈ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని కొనియాడారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకంలో మైనారిటీలకు సింహభాగం దక్కేలా చూస్తున్నామని, తెలంగాణ అభివద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని, మీ దువా (ప్రార్థనలు) రాష్ట్రానికి రక్షణ కవచంలా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజహరుద్దీన్, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాజ్యసభ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, వేలాది మంది మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement