ఏళ్లుగా అడవుల్లో సేఫ్‌గా ఉన్న మేం అర్బన్‌లో రెండు రోజులకే పట్టుబడ్డాం
మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని తెలంగాణ సీఎం ద్వారా కేంద్రాన్ని కోరాం
నిషేధం ఎత్తివేస్తే పీఎల్జీఏ సహా మావోలంతా ఆయుధాలు వదిలి లొంగిపోయేలా కృషి చేస్తాం
మల్లోజుల, ఆశన్న పార్టీకి ద్రోహం చేసి మాలో చీలిక తెచ్చారు
అరెస్టయిన మావోయిస్టులను రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు దేవ్‌జీ
సాక్షి, హైదరాబాద్: ‘షెల్టర్‌లో ఉన్నప్పుడు పోలీసులు అరెస్టు చేశారే తప్ప.. మేం లొంగిపోలేదు. అలా అనివార్య పరిస్థితుల్లో బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నాం. మేం ఆయుధాలు వీడినా, మావోయిస్టు సిద్ధాంతాలను వదల్లేదు. ప్రజా జీవితంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తాం’అని ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు దేవ్‌జీ అలియాస్ తిప్పరి తిరుపతి వెల్లడించారు. ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లో షెల్టర్‌లో ఉన్నప్పుడు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారన్నారు. అంతకు రెండు రోజుల ముందే అడవుల నుంచి బయటకు వచ్చామని, ఏళ్లపాటు అడవుల్లో మేం సేఫ్‌గా ఉన్నామని... కానీ అర్బన్‌లో రెండు రోజులకే పట్టుబడ్టట్టు చెప్పారు.
దండకారణ్యంలో ప్రతి క్షణం తూటాల మధ్యే ఉద్యమం చేశామని వెల్లడించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర హామీ ఇచ్చినట్టుగా ఇకపై బహిరంగ జీవితంలోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని రేవంత్‌రెడ్డి ద్వారా కేంద్రాన్ని కోరామని చెప్పారు. నిషేధం ఎత్తివేస్తే పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) సహా మావోయిస్టులు అంతా ఆయుధాలు వదిలి లొంగిపోయేలా కృషి చేస్తామన్నారు. త్వరలోనే మావోయిస్టు అమరుల కుటుంబాలను కలిసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ తనకు తెలియదని, చివరి సారిగా 2024లో చూసినట్టు తెలిపారు. శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దేవ్‌జీ అనేక అంశాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
మీరు ఎత్తివేస్తే.. మేం రద్దు చేస్తాం అని చెప్పాం
మేం ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి చట్టబద్ధంగా ఒక రాజకీయ పార్టీగా గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే.. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులంతా ఆయుధాలు అప్పగించి లొంగిపోతారని, అవసరమైతే పీఎల్జీఏను కూడా రద్దు చేస్తామని చెప్పాం. అయితే మేమే మావోయిస్టు పార్టీని రద్దు చేస్తామన్నట్టుగా తప్పుగా ప్రచారమైంది. సీఎంతో చర్చలో రెండో ముఖ్యమైన అంశం... మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారని కేసులు పెట్టి, జైళ్లలో ఉంచిన వారందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడుదల చేయాలని కోరాం. ఆ విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారు.
పార్టీ దెబ్బతిన్నది.. విప్లవ ఉద్యమం దెబ్బతిన్నదని ఒప్పుకోక తప్పదు
ప్రస్తుతం అజ్ఞాతంలో ఇంకా కొందరు ఉన్నారు. అయితే, పార్టీ దెబ్బతిన్నది.. విప్లవోద్యమం దెబ్బతిన్నదని ఒప్పుకోక తప్పదు. అయితే మేం అనుసరించిన విధానం, సిద్ధాంతం తప్పని కాదు. ప్రజలను సంఘటితం చేసే వరకు పార్లమెంటరీ పార్టీ విధానంలో ఎన్నికలకు పోయేది లేదు.
ఆ ఇద్దరూ పార్టీలో చీలిక తెచ్చారు
పార్టీ కార్యదర్శి పదవి విషయంలో మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోనుకు నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఆ మాటకొస్తే కుల, వర్గ, ప్రాంత వివక్ష, లింగబేధాలకు తావులేనిది మావోయిస్టు పార్టీలోనే. అయితే, బసవరాజు బతికుండగానే సరెండర్ అవుదామని ప్రతిపాదన పెట్టిన వ్యక్తి మల్లోజుల. మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఈ స్థితికి రావడానికి ప్రధాన కారణంగా సోను, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నలే. వారే పార్టీని చీల్చారు. ఆయుధాలు తీసుకెళ్లవద్దంటే ఆయుధాలతో వెళ్లి లొంగిపోయారు. ఆ తర్వాత లొంగుబాట్లను మేం నియంత్రించలేని స్థితికి పరిస్థితి వెళ్లింది. వారు శత్రువుతో చేతులు కలిపారు. మా తప్పు వల్లే పార్టీ నష్టపోయిందని ఒప్పుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అప్పుడే వారితో కలిసి పనిచేసేందుకు ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది.
మా దగ్గర రూ. కోట్ల డబ్బు..
కిలోల కొద్దీ బంగారం అన్నది ఉత్త ప్రచారమే మీడియాలో వార్తలు వచ్చినట్టుగా మావోయిస్టు పార్టీ దగ్గర వందల కోట్ల రూపాయల డబ్బు, కిలోల కొద్ది బంగారం లేదు. అదంతా పూర్తి అవాస్తవం. అయితే పార్టీ నడిపేందుకు, జనతన సర్కార్ నడిపేందుకు కొన్ని ఖర్చులు తప్పవు. అందుకు తగ్గట్టుగా బడ్జెట్ పెట్టుకొని ఆ మేరకే కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేస్తాం. నా దగ్గర డబ్బు ఎప్పుడూ లేదు.
అర్బన్ నక్సలిజం అన్న పదమే చట్ట విరుద్ధం
ప్రజల తరఫున పోరాడే వారి గొంతు నొక్కడానికి, రాసే వారిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు పెట్టిన పదమే అర్బన్ నక్సలిజం. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని రాజ్యాంగంలో చెబుతూనే ప్రభుత్వ వ్యతిరేకంగా స్వేచ్ఛగా మాట్లాడితే అర్బన్ నక్సలిజం అంటున్నారు. ఆ పదమే తప్పు. మార్చి 31 తర్వాత మావోయిజం అంతం సాధ్యం కాదు. కానీ, మేం పెట్టిన డిమాండ్లకు ప్రభుత్వాలు ఒప్పుకుంటే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన వారు ఆయుధాలతో బయటికి వచ్చేలా మేం కృషి చేస్తాం.
అమరుల కుటుంబాలకు అండగా నిలబడతాం
మావోయిస్టు ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు మేం అండగా ఉన్నామని చెప్పేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడతాం. వారంతా ఒంటరివారు కాదు.. మేం ఉన్నామన్న భావన వారిలో కల్పించేలా అందరినీ కలవాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇందులో ప్రజలను భాగస్వాములను చేసి వారి ద్వారా ఆరి్థక సాయం అందేలా చేస్తాం. సివిల్ సొసైటీలో పెద్దల ద్వారా వారికి ఆ ఆర్థిక సాయం అందేలా చూస్తాం. ఇదొక దీర్ఘకాలిక కార్యక్రమంగా పెట్టుకుంటాం. తొలుత తెలంగాణలో ప్రారంభించి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాం.


