జీఎస్‌టీకి తోడు అదనంగా 5 శాతం బాదుడు
బెంగళూరు, చెన్నై బాటలోనే సిటీ హోటళ్లు
వినియోగదారుల జేబులకు చిల్లు
సికింద్రాబాద్‌లోని ఓ ఉడిపి హోటల్ నోటీసు ఇలా..
‘‘ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ ధరలు, ముడి పదార్థాల ఖర్చులు పెరిగిన కారణంగా మా ధరలను 5 శాతం పెంచాల్సి వచ్చినట్లు తెలియజేస్తున్నాం. మీ సహకారానికి నిరంతర, హృదయపూర్వక కృతజ్ఞతలు. మద్దతుకు మా ధన్యవాదాలు’’.
సాక్షి, హైదరాబాద్: అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం సెగ భాగ్యనగరంలోని హోటల్ కంచానికి తాకింది. గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని హోటళ్లు ’గ్యాస్ చార్జీల’పేరిట అదనపు బాదుడు మొదలుపెట్టాయి. బెంగళూరు, చెన్నై బాటలోనే ఇక్కడ కూడా బిల్లులపై అదనపు చార్జీలు వసూలు చేస్తూ వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే హోటల్ ఫుడ్ బిల్లులో జీఎస్‌టీ, సీజీఎస్‌టీ 2.5 శాతం చొప్పున మొత్తం 5 శాతం పన్ను చెల్లిస్తున్న వినియోగదారులపై ‘గ్యాస్ సర్‌చార్జీల రూపంలో మరో 5 శాతం అదనపు భారం పడుతోంది. ఆహార పదార్థాలకు రూ.500 బిల్లు అయ్యే చోట, పన్నులన్నీ కలిపి ఇప్పుడు కస్టమర్ దాదాపు రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వారం రోజుల్లోనే టిఫిన్లు నుంచి భోజనం వరకు ప్రతి ఆహార పదార్థంపై రూ.10 నుంచి రూ.30 వరకు ధరలు పెరిగాయి. ముఖ్యంగా ఎక్కువ గ్యాస్ వినియోగించే వంటకాల ధరలు ఎగబాగాయి.
తగ్గిన వాణిజ్య సిలిండర్ల లభ్యత
కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల మేరకు గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై గణనీయంగా కోత విధించాయి. దీంతో హోటళ్లకు సిలిండర్ల లభ్యత పడిపోయింది. ఇది కూడా అధికారిక కనెక్షన్లు ఉన్న వాటి సంగతి. మరోవైపు రూ.2,105 ఉండాల్సిన వాణిజ్య సిలిండర్ ధర బ్లాక్‌లో రూ.4,500 నుంచి రూ.5,500 వరకు పలుకుతోంది. గ్యాస్ కోతకు తోడు బొగ్గు, కట్టెల ధరలు కూడా పెరగడంతో బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లు కొనాల్సి వస్తోందని, ఆ భారాన్ని భరించలేక బిల్లుపై డైరెక్ట్‌గా 5 శాతం ‘గ్యాస్ చార్జీ’వేస్తున్నామని హోటల్ యజమానులు సమరి్థంచుకుంటున్నారు.



