gas cilinders
-
సిలిండర్ కోసం 45 రోజుల వేచి.. బ్లాక్‌లో క్షణాల్లో డెలివరీ
సాక్షి, రాజమహేంద్రవరం: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కొందరికి వంటింటి కష్టాలు తెచ్చి పెడుతోంటే.. కొంతమంది గ్యాస్ సరఫరా డీలర్లకు కాసులు కురిపిస్తోంది. గ్యాస్ కొరతను బూచిగా చూపుతూ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యుల పేరుతో గ్యాస్ బుక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సామాన్యులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. అర్బన్ ప్రాంతాల్లో అయితే గ్యాస్ బుక్ చేసిన 20 రోజుల తర్వాత డెలివరీ ఇస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 45 రోజులకు పైగా సమయం పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరాన్ని బట్టి ధర గృహ వినియోగానికి అవసరమయ్యే ఒక్కో సిలిండర్ సాధారణ ధర రూ.900 ఉంటే.. ప్రస్తుతం అవసరాన్ని బట్టి రూ.2,000ల నుంచి రూ.2,500లకు విక్రయిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ రూ.3,500కు పైగా పలుకుతోంది. అధిక ధరలైనా కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా భావిస్తున్న కొన్ని గ్యాస్ ఏజెన్సీలు, సరఫరా డీలర్లు బ్లాక్ మార్కెట్లో భారీగా దోపిడీ చేస్తున్నారు. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సరఫరా వ్యవస్థలో కొన్ని ఏజెన్సీలు శాసించే స్థాయికి చేరాయి. ఫలితంగా అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్న ఆరోపణలున్నాయి. చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చిన్నపాటి హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు వంటివి నిర్వహించే చిరు వ్యాపారులపై వంట గ్యాస్ ప్రభావం తీవ్రంగా పడుతోంది. జిల్లావ్యాప్తంగా పెద్ద కేటరింగ్ సంస్థలు 53, చిన్నాపెద్ద హోటళ్లు, కేఫ్‌లు 1.20 లక్షలు ఉంటాయి. వీటిపై సుమారుగా 3 లక్షలకు పైగా శ్రామికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే పలు హోటళ్లు మూసివేశారు. మరికొన్ని హోటళ్లు కట్టెలపొయ్యిపై వంటలు చేస్తున్నాయి. వీధి వ్యాపారులు రోజువారీ ఆదాయంతోనే బతుకుబండి లాగుతుంటారు. ప్రస్తుతం గ్యాస్ లభించకపోవడం, దొరికినా.. అధిక ధర వెచ్చించాల్సి వస్తుండటంతో ఆహార పదార్థాల ధరలను ఆ మేరకు పెంచి విక్రయిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా వ్యాపారాలు ఆపేస్తే పస్తులు ఉండాల్సి వస్తుందన్న ఉద్దేశంతో బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నారు. చిన్న హోటళ్లు, టీస్టాళ్లు గ్యాస్ కోసం రోజూ తిరుగుతుంటే పెద్ద హోటళ్లకు మాత్రం దొంగచాటుగా గ్యాస్ సరఫరా అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. డబ్బు చెల్లించే వారికి గ్యాస్ క్షణాల్లో ప్రత్యక్షం అవుతోంది. సాధారణ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం రోజుల సమయం పడుతోందని ఆవేదన చెందుతున్నారు. కొన్ని ఏజెన్సీలు హాస్టళ్లు, ఆస్పత్రులు, ఆలయాలు, ట్రస్టుల పేరుతో గ్యాస్ బుకింగ్‌లు పెట్టుకుని బ్లాక్‌లో హోటళ్లకు అమ్ముకుంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో కొందరు అధికారులు గ్యాస్ బ్లాక్ దందాపై పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని, సిఫారసుల ఆధారంగా వ్యవహారం నడుస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ కొరత, అధిక ధరలు, అక్రమ బుకింగ్‌లు ఇలా అన్ని వైపులా ఇబ్బందులు ఎదురవుతుండటంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరా వ్యవస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజిలెన్స్ దాడులు కూడా నామమాత్రంగా ఉన్నాయి. దొంగ బుకింగ్‌లు వినియోగదారుల పేరుతో అక్రమంగా బుకింగ్‌లు చేసి గ్యాస్ పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటీపీలు లేకుండానే బుకింగ్‌లు పూర్తి చేసి, సిలిండర్లను ఇతరులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో గ్యాస్ సరఫరా దారులు అడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.23 రోజులుగా అవస్థలు జిల్లా వ్యాప్తంగా 22 మండలాలు ఉండగా.. 18.32 లక్షల జనాభా ఉంది. 52 గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా అవుతోంది. 8.67 లక్షల వివిధ రకాల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 23 రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడింది. ముందు జాగ్రత్తగా బుకింగ్‌లు ఇప్పటికే గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తుండటం.. భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళనతో వినియోగదారులు అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నారు. అధికారుల గణాంకాల మేరకు సాధారణ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా రోజుకు 11,500 గ్యాస్ సిలిండర్లు బుక్ అవుతాయి. యుద్ధం ఆందోళనల నేపథ్యంలో రోజుకు 19,896 నుంచి 22,250 వరకు బుకింగ్‌లు నమోదవుతున్నాయి. ఒక్కో సిలిండర్‌కు సగటున రూ.1,000 అధికంగా వసూలు చేస్తున్నారని భావించినా.. రోజుకు రూ.లక్షల్లో దోపిడీ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రెండు సిలిండర్లు ఉన్న వినియోగదారులు అడ్వాన్స్‌గా బుక్ చేసి పెట్టుకుంటున్నారు. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో గ్యాస్ బుకింగ్ ప్రక్రియ క్షణాల్లో ముగిసేది. ప్రస్తుం సర్వర్లు బిజీగా మారిపోవడంతో గంటల తరబడి కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
భర్త గ్యాస్ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లా: భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురావడం లేదని మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు ప్రయతి్నంచింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా.. తొండపాడులో హరికృష్ణ, మహాలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో సిలిండర్ తేవాలని మహాలక్ష్మి మూడు నెలలుగా భర్తకు చెబుతోంది. డబ్బులు లేవన్న కారణంతో అతను సిలిండర్ తీసుకురాలేదు. కట్టెల పొయ్యిపై వంట చేస్తోంది. అయితే డబ్బులు అందడంతో హరికృష్ణ గ్యాస్ కోసం గుత్తి పట్టణానికి వెళ్లాడు. అక్కడ సిలిండర్ దొరకలేదు. తాను ఎంత చెప్పినా భర్త గ్యాస్ సిలిండర్ తేవడం లేదన్న మనస్తాపంతో మహాలక్ష్మి ఆదివారం ఇంట్లో ఫినాయిల్ తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భర్త, కుటుంబసభ్యులు గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి నిలకడగా ఉంది. -
Hyderabad: టిఫిన్ బిల్లులో 5 శాతం గ్యాస్ చార్జీలు
సికింద్రాబాద్‌లోని ఓ ఉడిపి హోటల్ నోటీసు ఇలా.. ‘‘ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ ధరలు, ముడి పదార్థాల ఖర్చులు పెరిగిన కారణంగా మా ధరలను 5 శాతం పెంచాల్సి వచ్చినట్లు తెలియజేస్తున్నాం. మీ సహకారానికి నిరంతర, హృదయపూర్వక కృతజ్ఞతలు. మద్దతుకు మా ధన్యవాదాలు’’.సాక్షి, హైదరాబాద్: అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం సెగ భాగ్యనగరంలోని హోటల్ కంచానికి తాకింది. గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని హోటళ్లు ’గ్యాస్ చార్జీల’పేరిట అదనపు బాదుడు మొదలుపెట్టాయి. బెంగళూరు, చెన్నై బాటలోనే ఇక్కడ కూడా బిల్లులపై అదనపు చార్జీలు వసూలు చేస్తూ వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే హోటల్ ఫుడ్ బిల్లులో జీఎస్టీ, సీజీఎస్టీ 2.5 శాతం చొప్పున మొత్తం 5 శాతం పన్ను చెల్లిస్తున్న వినియోగదారులపై ‘గ్యాస్ సర్‌చార్జీల రూపంలో మరో 5 శాతం అదనపు భారం పడుతోంది. ఆహార పదార్థాలకు రూ.500 బిల్లు అయ్యే చోట, పన్నులన్నీ కలిపి ఇప్పుడు కస్టమర్ దాదాపు రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వారం రోజుల్లోనే టిఫిన్లు నుంచి భోజనం వరకు ప్రతి ఆహార పదార్థంపై రూ.10 నుంచి రూ.30 వరకు ధరలు పెరిగాయి. ముఖ్యంగా ఎక్కువ గ్యాస్ వినియోగించే వంటకాల ధరలు ఎగబాగాయి. తగ్గిన వాణిజ్య సిలిండర్ల లభ్యత కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల మేరకు గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై గణనీయంగా కోత విధించాయి. దీంతో హోటళ్లకు సిలిండర్ల లభ్యత పడిపోయింది. ఇది కూడా అధికారిక కనెక్షన్లు ఉన్న వాటి సంగతి. మరోవైపు రూ.2,105 ఉండాల్సిన వాణిజ్య సిలిండర్ ధర బ్లాక్‌లో రూ.4,500 నుంచి రూ.5,500 వరకు పలుకుతోంది. గ్యాస్ కోతకు తోడు బొగ్గు, కట్టెల ధరలు కూడా పెరగడంతో బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు కొనాల్సి వస్తోందని, ఆ భారాన్ని భరించలేక బిల్లుపై డైరెక్ట్‌గా 5 శాతం ‘గ్యాస్ చార్జీ’వేస్తున్నామని హోటల్ యజమానులు సమరి్థంచుకుంటున్నారు. -
అక్రమాలకు ‘గ్యాసో’హం
వైరా : పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసే ‘డొమెస్టిక్’ సిలిండర్లను యథేచ్ఛగా కొందరు వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు. దీనిని ఓ దందాగా మార్చేసి దండుకుంటున్నారు. పేదల సిలిండర్ల మార్పిడి తంతును నిర్వహిస్తున్నారు. కొన్ని గ్యాస్ ఏజెన్సీల్లో ఒక్కో సిలిండర్‌పై అదనంగా వసూలు చేస్తూ.. సబ్సిడీ గ్యాస్‌ను పక్కదారి పట్టిస్తూ అక్రమ దందా సాగిస్తున్నాయి. దమ్ముంటే కాసుకోండి.. పట్టుకోండి అన్నట్లు అధికారులకు సవాల్ విసురుతున్నట్లుగా మారుతోంది ఈ గ్యాస్ దందా పరిస్థితి. జిల్లాలో ‘డొమెస్టిక్’ గ్యాస్ సిలిండర్ల దందా ‘కమర్షియల్’గా సాగుతోంది. ఈ వ్యాపారం ప్రధానంగా మండల కేంద్రాల్లో జోరుగా నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లలో ఇంటి సిలిండర్లను దొంగచాటున వినియోగిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతోపాటు కొందరు ఏజెన్సీదారులకు తెరచాటున ఇదొక వ్యాపారంగా మారింది. అధికంగా సిలిండర్లు వినియోగించే ప్రధాన పట్టణాల్లో తనిఖీల ఊసే లేదు. అయితే హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర వ్యాపారాలకు కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వినియోగించాలని ప్రభుత్వ నిబంధనలులున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో పాటించట్లేదు. 19 కిలోలు గల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,460. అదే గృహావసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 14.6 కిలోలు ఉండి.. దాని విలువ రూ.750 నుంచి రూ.800 వరకు ఉంటుంది. ఈ లెక్కన కమర్షియల్ సిలిండర్‌కు వెచ్చించే డబ్బులతో రెండు డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేయొచ్చు. పైగా గ్యాస్ కూడా ఎక్కువ వస్తుంది. దీంతో అనేక హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల నిర్వాహకులు డొమెస్టిక్ గ్యాస్‌ను వినియోగించడానికి మచ్చిక చేసుకుని డొమెస్టిక్ సిలిండర్లను సబ్సిడీ లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇటు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు కూడా ఒక్కో సిలిండర్‌పై రూ.200 వరకు అదనంగా వసూలు చేస్తూ.. దందాను జోరుగా నడిపిస్తున్నారు. తనిఖీలు కరువు.. జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సింగిల్ కనెక్షన్ 2.80 లక్షలు, డబుల్ కనెక్షన్ 1.75 లక్షలు, దీపం కనెక్షన్లు 1.10 లక్షలు, సీఎస్ఆర్ కనెక్షన్లు 1.75 లక్షలు ఉన్నాయి. సిలిండర్లను సరఫరా చేయడానికి ఇండియన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ కంపెనీలు కలిపి గ్యాస్ ఏజెన్సీలు 350 ఉన్నాయి. కమర్షియల్ సిలిండర్లు మాత్రం 3వేల వరకు మాత్రమే ఉన్నాయి. పట్టణాల్లో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లు ఇతర వ్యాపారాలు వేలల్లో ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల వినియోగం అధికం. హోటల్‌ను బట్టి కొన్నింటికి వారంలో ఒకటి నుంచి రెండు సిలిండర్లు పడతాయి. మరికొన్నింట్లో నెలకు ఐదు వరకు వినియోగిస్తున్నారు. ఒక కమర్షియల్ సిలిండర్‌పై వెళ్లదీయడం సాధ్యం కాని పని. గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండడంతో కమర్షియల్ సిలిండర్లు కాకుండా కాకుండా డొమెస్టిస్ సిలిండర్లను దొంగచాటున వినియోగి స్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డీడీలు కూడా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లపై పూర్తిస్థాయిలో తనిఖీలు చేయట్లేదని, సబ్సిడీ గ్యాస్‌ను పక్కదారి పట్టిస్తున్న కొన్ని గ్యాస్ ఏజెన్సీల బాధ్యులపై చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారమిస్తే సీజ్ చేస్తాం.. నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లలో వినియోగించడం నేరం. పట్టణాల్లో నిబంధనలను మరిచి వ్యాపారాలకు వినియోగిస్తే మాకు సమాచారం అందించండి. మేం వెంటనే సీజ్ చేస్తాం. వ్యాపారస్తులు కమర్షియల్ సిలిండర్లే వాడాలి. – కోటా రవికుమార్, తహసీల్దార్, వైరా -
తప్పిన పెను ప్రమాదం
పిడుగురాళ్ల టౌన్ (గుంటూరు) : వంట గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న ఆటో బోల్తా కొట్టిన ఘటన మండల పరిధిలోని ఎర్రవాగు బ్రిడ్జి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. గ్యాస్ గోదాము నుంచి సిలిండర్లతో ఆటో బయలుదేరి చుట్టుపక్కల గ్రామాలకు వెళుతుంది. ఈ క్రమంలో బ్రిడ్జి వద్దకు ఆటో వచ్చేసరికి గుంటూరు వైపు వెళుతున్న లారీ ఆటోని ఒక పక్కగా తగిలి ఆపకుండానే వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆటో బోల్లా కొట్టి సిలిండర్లన్నీ రహదారిపై పడిపోయాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా వాహనదారులంతా ఎక్కడివారక్కడే ఆగిపోయి పరుగులు తీశారు. సిలిండర్లు పేలతాయోమోనని భయాందోళన చెందారు. కొద్ది సేపటి తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకొని ప్రమాద స్థలం వద్దకు చేరుకొని ఊపిరిపీల్చుకున్నారు. రోడ్డుపై ఉన్న సిలిండర్లన్నీ ఒక పక్కకు చేర్చారు. పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ భావించారు.


