సిలిండర్ కోసం 45 రోజుల వేచి.. బ్లాక్‌లో క్షణాల్లో డెలివరీ | Cooking Gas Crisis: Cylinders Sold at 2500 in Rajahmundry Black Market | Sakshi
Sakshi News home page

సిలిండర్ కోసం 45 రోజుల వేచి.. బ్లాక్‌లో క్షణాల్లో డెలివరీ

Apr 1 2026 10:46 AM | Updated on Apr 1 2026 12:16 PM

Cooking Gas Crisis: Cylinders Sold at 2500 in Rajahmundry Black Market

సాక్షి, రాజమహేంద్రవరం:   పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కొందరికి వంటింటి కష్టాలు తెచ్చి పెడుతోంటే.. కొంతమంది గ్యాస్‌ సరఫరా డీలర్లకు కాసులు కురిపిస్తోంది. గ్యాస్‌ కొరతను బూచిగా చూపుతూ సిలిండర్లు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యుల పేరుతో గ్యాస్‌ బుక్‌ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సామాన్యులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. అర్బన్‌ ప్రాంతాల్లో అయితే గ్యాస్‌ బుక్‌ చేసిన 20 రోజుల తర్వాత డెలివరీ ఇస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 45 రోజులకు పైగా సమయం పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

అవసరాన్ని బట్టి ధర 
గృహ వినియోగానికి అవసరమయ్యే ఒక్కో సిలిండర్‌ సాధారణ ధర రూ.900 ఉంటే.. ప్రస్తుతం అవసరాన్ని బట్టి రూ.2,000ల నుంచి రూ.2,500లకు విక్రయిస్తున్నారు. కమర్షియల్‌ సిలిండర్‌ రూ.3,500కు పైగా పలుకుతోంది. అధిక ధరలైనా కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా భావిస్తున్న కొన్ని గ్యాస్‌ ఏజెన్సీలు, సరఫరా డీలర్లు బ్లాక్‌ మార్కెట్‌లో భారీగా దోపిడీ చేస్తున్నారు. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్‌ సరఫరా వ్యవస్థలో కొన్ని ఏజెన్సీలు శాసించే స్థాయికి చేరాయి. ఫలితంగా అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్న ఆరోపణలున్నాయి.  

చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం  
చిన్నపాటి హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు వంటివి నిర్వహించే చిరు వ్యాపారులపై వంట గ్యాస్‌ ప్రభావం తీవ్రంగా పడుతోంది. జిల్లావ్యాప్తంగా పెద్ద కేటరింగ్‌ సంస్థలు 53, చిన్నాపెద్ద హోటళ్లు, కేఫ్‌లు 1.20 లక్షలు ఉంటాయి. వీటిపై సుమారుగా 3 లక్షలకు పైగా శ్రామికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్యాస్‌ కొరత కారణంగా ఇప్పటికే పలు హోటళ్లు మూసివేశారు. మరికొన్ని హోటళ్లు కట్టెలపొయ్యిపై వంటలు చేస్తున్నాయి. వీధి వ్యాపారులు రోజువారీ ఆదాయంతోనే బతుకుబండి లాగుతుంటారు.

 ప్రస్తుతం గ్యాస్‌ లభించకపోవడం, దొరికినా.. అధిక ధర వెచ్చించాల్సి వస్తుండటంతో ఆహార పదార్థాల ధరలను ఆ మేరకు పెంచి విక్రయిస్తున్నారు. గ్యాస్‌ కొరత కారణంగా వ్యాపారాలు ఆపేస్తే పస్తులు ఉండాల్సి వస్తుందన్న ఉద్దేశంతో బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నారు. చిన్న హోటళ్లు, టీస్టాళ్లు గ్యాస్‌ కోసం రోజూ తిరుగుతుంటే పెద్ద హోటళ్లకు మాత్రం దొంగచాటుగా గ్యాస్‌ సరఫరా అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. డబ్బు చెల్లించే వారికి గ్యాస్‌ క్షణాల్లో ప్రత్యక్షం అవుతోంది. సాధారణ బుకింగ్‌ చేసుకున్న వారికి మాత్రం రోజుల సమయం పడుతోందని ఆవేదన చెందుతున్నారు. కొన్ని ఏజెన్సీలు హాస్టళ్లు, ఆస్పత్రులు, ఆలయాలు, ట్రస్టుల పేరుతో గ్యాస్‌ బుకింగ్‌లు పెట్టుకుని బ్లాక్‌లో హోటళ్లకు అమ్ముకుంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.  

మామూళ్ల మత్తులో కొందరు అధికారులు 
గ్యాస్‌ బ్లాక్‌ దందాపై పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని, సిఫారసుల ఆధారంగా వ్యవహారం నడుస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్‌ కొరత, అధిక ధరలు, అక్రమ బుకింగ్‌లు ఇలా అన్ని వైపులా ఇబ్బందులు ఎదురవుతుండటంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌ సరఫరా వ్యవస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. విజిలెన్స్‌ దాడులు కూడా నామమాత్రంగా ఉన్నాయి.  

దొంగ బుకింగ్‌లు 
వినియోగదారుల పేరుతో అక్రమంగా బుకింగ్‌లు చేసి గ్యాస్‌ పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటీపీలు లేకుండానే బుకింగ్‌లు పూర్తి చేసి, సిలిండర్లను ఇతరులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో గ్యాస్‌ సరఫరా దారులు అడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.

23 రోజులుగా అవస్థలు 
జిల్లా వ్యాప్తంగా 22 మండలాలు ఉండగా.. 18.32 లక్షల జనాభా ఉంది. 52 గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా గ్యాస్‌ సరఫరా అవుతోంది. 8.67 లక్షల వివిధ రకాల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. 23 రోజులుగా గ్యాస్‌ కొరత ఏర్పడింది. 

ముందు జాగ్రత్తగా బుకింగ్‌లు 
ఇప్పటికే గ్యాస్‌ కొరత తీవ్రంగా వేధిస్తుండటం.. భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళనతో వినియోగదారులు అవసరానికి మించి గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేస్తున్నారు. అధికారుల గణాంకాల మేరకు సాధారణ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా రోజుకు 11,500 గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ అవుతాయి. యుద్ధం ఆందోళనల నేపథ్యంలో రోజుకు 19,896 నుంచి 22,250 వరకు బుకింగ్‌లు నమోదవుతున్నాయి. ఒక్కో సిలిండర్‌కు సగటున రూ.1,000 అధికంగా వసూలు చేస్తున్నారని భావించినా.. రోజుకు రూ.లక్షల్లో దోపిడీ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రెండు సిలిండర్లు ఉన్న వినియోగదారులు అడ్వాన్స్‌గా బుక్‌ చేసి పెట్టుకుంటున్నారు. సింగిల్‌ సిలిండర్‌ ఉన్న వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో గ్యాస్‌ బుకింగ్‌ ప్రక్రియ క్షణాల్లో ముగిసేది. ప్రస్తుం సర్వర్లు బిజీగా మారిపోవడంతో గంటల తరబడి కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement