కొత్తగా.. ఓ మెట్టు ‘ఎత్తు’గా! | New buses hitting the road with new standards | Sakshi
Sakshi News home page

కొత్తగా.. ఓ మెట్టు ‘ఎత్తు’గా!

Mar 18 2026 4:52 AM | Updated on Mar 18 2026 4:52 AM

New buses hitting the road with new standards

ఆర్టీసీ బస్సు ఫ్లోర్‌ ఎత్తు పెంపు 

ఇక కొత్తగా తయారయ్యే బస్సులన్నీ ఎత్తు బస్సులే 

టైర్లు ఉండే సీట్లలోని ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం డిజైన్‌ మార్పు 

ఇక నుంచి ప్రతి బస్సులో రూఫ్‌ హాచ్‌ అత్యవసర మార్గం తప్పనిసరి 

పొగను గుర్తించి అలారం మోగే వ్యవస్థ ఏర్పాటు 

కొత్త ప్రమాణాలతో రోడ్డెక్కుతున్న కొత్త బస్సులు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సులు ఉన్నట్టుండి ఎత్తు పెరిగాయి. కొత్తగా తయారై రోడ్డెక్కుతున్న బస్సులు, సాధారణ బస్సుల కంటే చాలా ఎత్తుగా కనిపిస్తున్నాయి. దీంతో వాటి ముందుభాగం కలరింగులో కూడా స్వల్పంగా మార్పు చేసి ప్రత్యేకతను చాటేలా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. సాధారణ బస్సుల్లో ఐదు మెట్లు ఉండగా, బస్సు ఫ్లోర్‌ ఎత్తు పెరగడంతో ఇందులో ఆరు మెట్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా రెండు తలుపుల వద్ద ఫ్లోర్‌ సగం మేర మెట్టుగా మారింది. 

పాత తరహా బస్సుల ఫ్లోర్‌ అలవాటుతో వచ్చే ప్రయాణికులకు ఇది కొంత కొత్తగా, ఏమరపాటుగా ఉంటే ప్రమాదకరంగా మారింది. ప్రయాణికులు ప్రమాదాలకు గురికాకుండా వెంటనే, మెట్లు ఎత్తుగా మారిన విషయం గుర్తించేలా ఆర్టీసీ వాటికి పసుపు రంగు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసింది.  మరి ఇంతకూ ఉన్నట్టుండి బస్సులు ఎత్తుగా ఎందుకు మారాయంటే...! 

ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ ప్రమాణాల మార్పుతో... 
ఇటీవల కేంద్రప్రభుత్వం ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ ప్రమాణాలను సవరించింది. బస్సు బాడీకి సంబంధించిన ఏఐఎస్‌–153 నిబంధనను సవరించింది. ఇది బస్‌బాడీ నిర్మాణంలో అదనపు అవసరాలకు సంబంధించింది. దీని ప్రకారం బస్సు ఫ్లోర్‌లో చక్రాలుండే చోట వేరుగా ఉంటుంది. ఆ ప్రాంతంలో వీల్‌ డోమ్‌ ఉంటుంది. మిగతా ఫ్లోర్‌ అంతా సమంగా ఉండగా, వీల్‌ డోమ్‌ మాత్రం అరడుగు మేర ఎత్తుగా ఉంటుంది. అక్కడి సీటులో కూర్చుండే వారికి ఈ ఎత్తు చాలా అసౌకర్యంగా ఉంటుంది. కాళ్లు ముడుచుకుని కూర్చోవాల్సిందే. 

ఇక టైర్‌ పేలినప్పుడు ఆ డోమ్‌ ఒక్కసారిగా ఒత్తిడితో లేచిపోయి అక్కడి ప్రయాణికులను గాయపరుస్తుంది. కొన్ని ప్రమాదాల్లో చనిపోయిన వారూ ఉన్నారు. దీంతో ఆ సీట్లలో కూర్చునే ప్రయాణికులు ప్రమాదాలకు గురి కాకుండా, అసౌకర్యానికి గురికాకుండా ఉండాలంటే ఫ్లోర్‌ అంతా సమంగా ఉండాలన్నది కొత్త నిర్ణయం. దీంతో వీల్‌ డోమ్‌ ఎంత ఎత్తుంటుందో... ఫ్లోర్‌ను అంత ఎత్తుకు పెంచి బస్సంతా సమాంతరంగా ఫ్లోర్‌ ఉండేలా మార్చారు. ఫలితంగా బస్సు ఫ్లోర్‌ ఎత్తు పెరిగి యావత్తు బస్సు బాడీ ఎత్తుగా మారింది. ఫలితంగా ఒక అదనపు మెట్టు వచ్చి చేరింది. ఇక కొత్తగా తయారయ్యే బస్సులన్నీ ఎత్తు బస్సులే. ఇలాంటి 300 కొత్త బస్సులు తాజాగా రోడ్డెక్కాయి.  

ప్రతి బస్సుకు రూఫ్‌ హాచ్‌.. 
ప్రీమియం కేటగిరీ బస్సుల్లో రూఫ్‌కు ప్రత్యేక హాచ్‌ (పైకి తెరుచుకునే భాగం) ఉంటుంది. లోనికి గాలి రావడానికి దాన్ని తెరిచి పెడుతుంటారు. కానీ, నిజానికి అది అత్యవసర ద్వారం. బస్సు ప్రమాదానికి గురైనప్పుడు తలుపు ఉండేవైపు ఒరిగితే... నేలకు తగిలి ద్వారాలు మూసుకుపోయి ప్రయాణికులు అత్యవసర సమయంలో తప్పించుకోవడం కష్టంగా మారుతుంది. అలాంటి సందర్భాల్లో రూఫ్‌కు ఉండే అత్యవసర ద్వారం నుంచి వెలుపలికి వచ్చే వీలుంటుంది. 

తాజా మార్పుల మేరకు, ఇక నుంచి ప్రతి బస్సులో రూఫ్‌ హాచ్‌ తప్పనిసరి. ప్రీమియం కేటగిరీ బస్సు నుంచి పల్లెవెలుగు బస్సు వరకు అన్నింటా ఇది ఉండాల్సిందే. కాగా, తరచూ బస్సులు అగి్నప్రమాదాలకు గురవుతుంటాయి. మంట వచ్చేముందు పొగ రాగానే గుర్తించగలిగితే చాలా మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకునే వీలుంటుంది. ఇందుకోసం పొగను గుర్తించి అలారం మోగే వ్యవస్థ ఉండాలి. ఈ వ్యవస్థ కూడా ఇప్పుడు ప్రతి బస్సులో తప్పనిసరి చేశారు. కొత్త బస్సుల్లో ఈ వ్యవస్థ కూడా ఏర్పాటవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement